నేరాల సంఖ్య తగ్గించేలా పీడీ యాక్ట్ చట్ట సవరణ
దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరికి చోటు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
అమరావతి పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు
మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చే విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానాన్ని తిరిగి తీసుకొస్తేనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవడంతో దాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం బయటకు వెల్లడించే అవకాశంలేకపోవడంతో వాటిని అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..
» రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు పీడీ చట్టాన్ని పటిష్టం చేసేలా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు.
» లోకాయుక్త చట్టాన్ని సవరించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. లోకాయుక్తను నియమించే సమయంలో ప్రతిపక్ష నేత ఉండాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేని పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఇలాంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయించారు.
» ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం.
» దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు.
» కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం..
» యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపి దానికి ఈగల్ అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
» ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు.
» అమరావతిలో నిర్మాణ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
» నూతన క్రీడలు, పర్యాటక విధానాలకు ఆమోదం తెలిపారు.
అధికారులు చెప్పింది చెప్పినట్లుగా బయటకు చెప్పొద్దు..
ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో స్థానికంగా ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అది సురక్షితంగా ఉండేలా చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చ జరిగింది.
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రులు సీరియస్‌గా ఉండాలని అధికారులు చెప్పే విషయాలను సరిచూసుకోవాలని వారు చెప్పింది చెప్పినట్లు బయటకు చెప్పకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment