velagapudi secretariat
-
కాంట్రాక్టర్లకు మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చే విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానాన్ని తిరిగి తీసుకొస్తేనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవడంతో దాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం బయటకు వెల్లడించే అవకాశంలేకపోవడంతో వాటిని అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..» రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు పీడీ చట్టాన్ని పటిష్టం చేసేలా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. » లోకాయుక్త చట్టాన్ని సవరించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. లోకాయుక్తను నియమించే సమయంలో ప్రతిపక్ష నేత ఉండాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేని పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఇలాంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయించారు. » ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. » దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు. » కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం.. » యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపి దానికి ఈగల్ అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. » ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. » అమరావతిలో నిర్మాణ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. » నూతన క్రీడలు, పర్యాటక విధానాలకు ఆమోదం తెలిపారు. అధికారులు చెప్పింది చెప్పినట్లుగా బయటకు చెప్పొద్దు..ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో స్థానికంగా ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అది సురక్షితంగా ఉండేలా చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రులు సీరియస్‌గా ఉండాలని అధికారులు చెప్పే విషయాలను సరిచూసుకోవాలని వారు చెప్పింది చెప్పినట్లు బయటకు చెప్పకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. -
ఏబీపై క్రమశిక్షణ కొరడా!
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి సస్పెండై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులపై బహిరంగ ఆరోపణలకు దిగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్ బ్యాచ్ 1989)పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు విచారణకు హాజరైన అనంతరం సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిర్గతం చేశారు. ఈ నెల 4న వెలగపూడిలోని సెక్రటేరియెట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పలువురు అధికారులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేశారు. అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు రాజకీయంగా, బయటి వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదన్న నిబంధనలను అతిక్రమించారు. అఖిల భారత సర్వీసు (క్రమశిక్షణ–అప్పీల్) నియమాలు–1969, అఖిల భారత సర్వీస్(ప్రవర్తన) నియమాలు–1968 ప్రకారం నిబంధనలను అతిక్రమించిన ఏబీ వెంకటేశ్వరరావును వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత అధికారి వద్ద ఆయన స్వయంగా హాజరై రాతపూర్వకంగా 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. సర్వీసు రూల్స్ అతిక్రమించి దుష్ప్రవర్తన(మిస్ కాండక్ట్)కు పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు గడువులోగా సహేతుకమైన వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఏబీవీ అక్రమాలపై విచారణ తుది దశకు
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడం ద్వారా దేశ ద్రోహానికి ఒడిగట్టారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)పై విచారణ తుది దశకు చేరింది. సెలవు రోజైన ఆదివారం కూడా వెలగపూడి సచివాలయంలో ఈ విచారణ కొనసాగింది. ఏబీవీ అక్రమాలపై శాఖాపరమైన విచారణను గత నెల 18న కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సిసోసియా చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 22 నుంచి రోజూ కొనసాగింది. 14 రోజులపాటు సాగిన ఈ విచారణలో 21 మందికి పైగా సాక్షులను విచారించి వారిచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. తనపై వచ్చిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు ఏబీవీ రోజువారీగా హాజరు కాగా, మాజీ డీజీపీలు, పలువురు ఐపీఎస్‌లు హాజరై సాక్ష్యం ఇచ్చారు. సాక్షులుగా మాజీ డీజీపీలు జేవీ రాముడు, నండూరి సాంబశివరావు, ఎం.మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎన్వీ సురేంద్రబాబు, సీహెచ్ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్ అయ్యన్నార్ తదితరులూ హాజరయ్యారు. కాగా, ఏబీవీపై శాఖాపరమైన విచారణను ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజువారీ విచారణను చేపట్టి మే 3లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీవీ కోరారు. కానీ, జ్యూడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. ఈ నెలాఖరు నాటికి నివేదిక సిద్ధంకానుంది. మే 3లోగా దానిని సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సాక్షులను నేను క్రాస్ ఎగ్జామిన్ చేశా : ఏబీవీ కాగా, సచివాలయంలో ఆదివారం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణకు హాజరైన ఏబీవీ.. తర్వాత మీడియాతో మాట్లాడారు. తనపై జరిగినా విచారణలో 21 మంది సాక్షులను తానే క్రాస్ ఎగ్జామిన్ చేశానన్నారు. అల్పులు, అథములు, కుక్కమూతి పిందెలు, చట్టాలు తెలియని వాళ్లు తనపై ఆరోపణలు చేశారని.. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించి తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఏబీవీ ఆరోపించారు. -
18న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకులోని కేబినెట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అజెండా అంశాలను త్వరగా పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. ఈనెల 15 నాటికి నివర్ తుపాను నష్టాలపై తుది నివేదిక అందనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) విడుదలతోపాటు వివిధ ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. -
నిన్ను నమ్మం బాబు
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంత ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో ఏరోజూ ఈ ప్రాంత రైతులను పట్టించుకోని బాబు.. ఇప్పుడు తమపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ నెల 28వ తేదీన పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఆ ప్రాంత రైతులంతా తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం సమీపంలో 29 గ్రామాల రైతులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని పేరుతో టీడీపీ నాయకులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాదల మహీంద్ర, బుర్రా వెంకటశివా రెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, అలోకం సురేష్, కొయ్యగార వినోద్, బెజ్జం రాంబాబు,అరెపల్లి జోజి, రెహా్మన్, అక్కల లక్ష్మణరాయన రెడ్డి, మువ్వల కోటేశ్వరరావు, జొన్నల గడ్డ కిషోర్, చనుమోలు రామారావు, మేకల రవి, సవరం సురేంద్ర, అన్నూరు జక్కరయ్య తదితరులు పాల్గొన్నారు. కమీషన్ల రాజధాని రాజధానిని తమ కమీషన్లకు అడ్డాగా చంద్రబాబు, ఆయన మంత్రులు మలుచుకున్నారు. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకే భవన, రోడ్ల అభివృద్ధి పనులు అప్పగించారు. నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసి కమీషన్లు కాజేశారు. – మేకల రవి, నెక్కళ్లు రైతుల ప్లాట్లను పట్టించుకున్నారా? టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడి భూములు ఇచ్చిన రైతుల్లో ఏ ఒక్కరినైనా పట్టించుకున్నారా? సకల సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్లాట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. 34 వేల మంది రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్కటి అయినా అభివృద్ధి చేశారా? – రమణారెడ్డి, రైతు, శాఖమూరు అభివృద్ధి ఎక్కడ.? రాజధాని పరిధిలోని మూడు మండలాల్లోని 29 గ్రామాల్లో అసైన్డ్ భూములను కారుచౌకగా ఎవరు కొనుగోలు చేశారో అందరికీ తెలుసు. దళితులను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. నాలుగేళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడి వేల కోట్లు దోచుకున్నారు. – కొండేపాటి సతీష్‌చంద్ర, రైతు, మందడం -
అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ షోరూమ్‌లో ఉన్న శాసన సభ ఫర్నిచర్‌ను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకుని వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. 2017లో అనుమతులు లేకుండా వెలగపూడి, హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ను గుంటూరులో ఉన్న తన కుమారుడికి చెందిన గౌతమ్ షోరూమ్‌కు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తరలించిన విషయం విదితమే. ఎటువంటి అనుమతులూ లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్‌ను గౌతమ్ షోరూమ్‌కు తరలించిన కోడెల శివప్రసాదరావు, ఆ ఫర్నిచర్‌ను వినియోగిస్తున్న అతని కుమారుడు శివరామ్‌పై అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈ శ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ ఫర్నిచర్‌ను సోమవారం రాత్రి రెండు లారీల్లో వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. -
‘తాత్కాలిక సచివాలయం వైపు వెళ్లటం ప్రమాదకరం’
సాక్షి, అమరావతి : చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కాంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా అంటూ సీఎం చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం అని మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? అంటూ నిప్పులు చెరిగారు. ఈదురుగాలులు వీస్తున్నందువల్ల తాత్కాలిక సచివాలయం వైపు వెళ్లటం అత్యంత ప్రమాదకరం అంటూ సెటైరిగ్గా ఉన్న ఓ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/bWRqFSnEjN — Vijayasai Reddy V (@VSReddy_MP) May 8, 2019 భారీ వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. బలమైన గాలులతో కూడిన వర్షం రావడంతో రాజధానిలో నిర్మాణ దశలో ఉన్న భవనాల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలైంది. తాత్కాలిక సచివాలయం వద్ద రూ.25 లక్షల వ్యయంతో ఇటీవలే ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్ గాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సచివాలయంలోని బ్లాకులపై ఏర్పాటు చేసిన రేకులు ఎగిరిపోయాయి. సచివాలయం ప్రవేశ మార్గం వద్ద పోలీసుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లు నేలకూలాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పోల్స్ కూడా నేలకొరిగాయి. కేవలం పది నిమిషాల పాటు కురిసిన గాలివానకే తాత్కాలిక సచివాలయం వద్ద భారీగా ఆస్తినష్టం వాటిల్లడం గమనార్హం. మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఎమ్మెల్యేలను కొంటారా!? : చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘కర్ణాటకలో బీజేపీ వారు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం ఏమిటి? నీతి, నిజాయితీ అని చెప్పి విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొనే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం? గవర్నర్‌ను ఉపయోగించుకుని పది మంది బీజేపీ నాయకులు బేరసారాలు జరిపారు. ఊరూరా తిరిగారు, మా ప్రభుత్వంలోకి వస్తే వందరెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చని రమ్మన్నారు. ఇంత వింతపోకడ నేనెప్పుడూ చూడలేదు’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంతోపాటు పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు గతం కంటే ఈసారి ఎక్కువగా బలోపేతమయ్యాయని చెప్పారు. తాను అందరిలా కుప్పిగంతులు వేయనని తృతీయ ఫ్రంట్‌పై కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ప్రధాని మోడీని కలుస్తారా అని ఓ విలేకరి అడగ్గా.. నువ్వు రాయబారం వహిస్తావా అని ఎదురు ప్రశ్నించి మీడియాను 40 ఏళ్లుగా డీల్ చేస్తున్నానని, ఇప్పుడు కూడా చేస్తానని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఎందుకు ఆమోదింలేదని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేస్తున్న ప్రజలు రేపటి ఎన్నికల్లో ఓట్లు వేస్తారా అని అడిగినప్పుడు ఆలోచిస్తామని చెబుతున్నారే తప్ప ఓటు వేస్తామని చెప్పడంలేదని చంద్రబాబు నిస్పృహ వ్యక్తం చేశారు. మరో కార్యక్రమంలో చంద్రన్న బీమాకు సంబంధించిన ప్రీమియం చెక్‌ను ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ ఎం. జగన్నాథంకు సీఎం అందించారు. నేడు నవనిర్మాణ దీక్ష కాగా, నవ నిర్మాణ దీక్ష శనివారం ఉ.9 గంటలకు ప్రారంభమవుతుందని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ దీనికి మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఏడు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా ప్రజల్లో పాలనపై సంతృప్తి స్థాయిని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 2న గాంధీ జయంతి నాటికి రాష్ట్రమంతా ‘భూదార్’ అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జరిగిన సమీక్షలో.. వచ్చే నెల 1 నుంచి 12 జిల్లాల్లోని 12 మండలాలు, 12 మున్సిపాలిటీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ‘భూసేవ’ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు మున్సిపాలిటీలో పైలెట్ ప్రాజెక్టుగా భూసేవ ప్రారంభించారు. అలాగే, రంజాన్ మాసం సందర్భంగా అన్ని జిల్లాల్లో మసీదుల మరమ్మతులు, ఇఫ్తార్ నిర్వహణకు రూ.5 కోట్లు విడుదల చేశామని చంద్రబాబు చెప్పారు. -
స్మార్టు సైకిళ్లను ప్రారంభించిన సీఎం
సాక్షి, అమరావతి : వెలగపూడి సచివాలయంలో తొలిసారి ప్రయోగాత్మకంగా జపాన్ నుంచి తెప్పించిన స్మార్టు సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. నేటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయం ఆవరణలో రెండు, వెలుపల వాహనాల పార్కింగ్ వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి స్టేషన్లో పది సైకిళ్ల చొప్పున అందుబాటులో ఉంచారు. సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా స్వైపింగ్ కార్డు, పాస్వర్డ్ ఇస్తారు. సచివాలయానికి వచ్చిన వారు వీటిని ఉచితంగా పొంది పని ముగించుకున్న తర్వాత మూడు స్టేషన్లలో ఎక్కడైనా అప్పజెప్పి వెళ్లొచ్చు. -
నాకు ఓటేయకపోతే ప్రజలే సిగ్గుపడాలి: సీఎం
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాము చేసిన పనులకు ప్రజలు ఆటోమేటిక్‌గా అన్ని సీట్లు గెలిపించాలన్నారు. ఒకవేళ ఒకటి, రెండు సీట్లు గెలిపించకపోతే ఎందుకు గెలిపించలేదో వాళ్లే ఆలోచించుకోవాలన్నారు. తాము తప్పుచేశామని ప్రజలు సిగ్గుపడే పరిస్థితి రావాలన్నారు. ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అన్నీ చేసిన తర్వాత తనకు ఎందుకు ఓటేయరని, ఇంకా ఏం కావాలని ప్రజలను ప్రశ్నించారు. ఇదంతా తన కష్టమని, తన కష్టానికి కూలి ఇవ్వాలన్నారు. వంశధార దగ్గర నుంచి సోమశిల వరకూ నదుల అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ నుంచి ప్రాజెక్టుల పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లున్నాయి. ఈ కేంద్రానికి అనుబంధంగా వివిధ జిల్లాల్లో పది కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రాలున్నాయి. త్వరలో ఏర్పాటయ్యే స్టేట్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కార్యాలయం(ఇంటిగ్రేటెడ్ డేటా బేస్ ఫర్ రియల్ గవర్నెన్స్) కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది. -
సమయం రెండేళ్లే..సహకరించండి
జిల్లా కలెక్టర్లను కోరిన సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్లే సమయం ఉందని, సహకరించాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని పరోక్షంగా వారికి సూచించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పనితీరు ఉండాలని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉదయం ఆయన కలెక్టర్లతో అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై కలెక్టర్లకు తన మనసులోని మాట చెప్పి అందుకనుగుణంగా పని చేయాలని బాబు కోరినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని, వారితో సర్దుకుపోతూ పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. లోకేశ్‌తో సహా అమెరికా పర్యటనకు బాబు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌తో సహా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమె రికాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్‌ప్రా న్సిస్కో, చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. యుఎస్ఐబీసీ వార్షిక వెస్ట్ కోస్ట్ సదస్సు అండ్ టైకాన్–2017 సదస్సులో పాల్గొం టారు. పదిహేడు మంది ఉన్న ఈ బృందంలో మంత్రులు, అధికారులు ఉన్నారు.ఈ బృందం పర్యటనకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
వికలాంగుడి ఆత్మహత్యాయత్నం
సీఎంను కలిసేందుకు సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం తాడేపల్లి రూరల్ (గుంటూరు): ఇచ్చిన హామీ అమలుకాలేదనే విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పాలని వచ్చిన ఓ వికలాంగుడిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందే అతను ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఒంగోలుకు చెందిన నారాయణ తనకు జీవనోపాధికి రుణం ఇప్పించాలంటూ ఇటీవల వెలగపూడి సచివాలయంలో సీఎంను కలసి తన బాధను వివరించాడు. రెండ్రోజుల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. పది రోజులు గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో సీఎంను కలిసేందుకు నారాయణ మళ్లీ ఉండవల్లి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సీఎం నిద్రలేవలేదు, తర్వాత పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. మరో రెండు గంటల తర్వాత కూడా అదే సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన వికలాంగుడు దగ్గర్లో ఉన్న ఖాళీ మద్యం బాటిల్‌తో తలపై బాదుకున్నాడు. గమనించిన సిబ్బంది నారాయణను మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ‘ఒంగోలు జిల్లా అధికారులతో సీఎం పేషీ నుంచి మాట్లాడాం. నీకు న్యాయం చేస్తారు. ఇక వెళ్లు’ అంటూ అధికారులు బాధితుడిని ఒంగోలు పంపించివేశారు. -
సీఎంను కలసిన నారాయణ
⇒ వికలాంగుల పింఛన్, రూ.2 లక్షల లోన్ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ⇒ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన నారాయణ తుళ్లూరు: వైకల్యాన్ని లెక్కచేయకుండా వారం రోజుల పాటు పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం, సీఎం నివాసాల చుట్టూ తిరిగిన బత్తుల నారాయణ ఎట్టకేలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తన గోడు వినిపించారు. ఈ విషయాన్ని మంగళవారం సాక్షితి తెలిపారు. ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్న తాను ముగ్గురు ఆడపిల్లలను పోషించుకోవాల్సి ఉందని సీఎంకు వివరించినట్లు చెప్పారు. వికలాంగుల పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని సీఎంకు తెలిపానన్నారు. దుకాణం పెట్టుకోవడానికి ఎంతకావాలని సీఎం అడిగారని, రూ.రెండు లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే అంతా బతుకుతామని చెప్పగా వెంటనే సీఎం తన పీఏకు తన బాధ్యతను అప్పగించారన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తనకు మేలు జరిగేలా చూస్తానని, పూర్తి వివరాలు ఫోన్‌కు మెసేజ్ పంపుతామని పీఏ తెలిపినట్లు నారాయణ వివరించారు. తనకు తోడుగా కొండంత అండగా నిలిచిన సాక్షికి ఈ సందర్భంగా నారాయణ కృతజ్ఞతలు చెప్పారు. -
వెయ్యి కోట్లకు బాండ్ల జారీ
-
వెయ్యి కోట్లకు బాండ్ల జారీ
రాజధానిలోని మూడు జోన్ల లేఅవుట్లలో వసతులకు రూ.2,981 కోట్లు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకోసం తొలివిడతగా రూ.వెయ్యికోట్ల మేర బాండ్లను జారీ చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అథారిటీ నిర్ణయించింది. రాజధానికోసం భూములిచ్చిన రైతులకు సంబంధించి.. తొలిదశలో మూడు జోన్లలోని 8 గ్రామాలకు చెందిన భూసమీకరణ స్థలాల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన డిజైన్లకు ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,981 కోట్లు ఖర్చవుతుందని అంచనా. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆమోదించిన అంశాలివీ.. ► మూడు జోన్లకుగాను భూసమీకరణ లేఅవుట్లలో వసతుల కల్పనకు కన్సల్టెంట్లు జీఐఐసీ–ఆర్వీ అసోసియేట్స్ ఇచ్చిన డిజైన్లకు ఆమోదం. 29 రాజధాని గ్రామాల్ని 13 జోన్లుగా విభజించి వసతుల కల్పనకు ప్రణాళిక రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థలు. ► 3జోన్లలోని 5.5 లక్షల నివాసాలు, 1.2 లక్షల వాణిజ్య అవసరాలకోసం ప్రతిరోజూ 107 ఎంఎల్డీ నీటి సరఫరాకు ప్రణాళిక. ► 250 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అవసరమైన కేబుళ్లను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు చిన్న విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణా నికి అనుమతి. వరదనీటి పారుదలకోసం 278 కి.మి మేర కాలువల నిర్మాణం. ► భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అభివృద్ధి చేసి అందించే ప్రతి ప్లాటుకు ప్రభుత్వమే స్టాంపు డ్యూటీ, రిజి స్ట్రేషన్ ఖర్చు భరించాలని నిర్ణయం. ► స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి పరిధిలోని 6.84 చ కిలోమీటర్ల విస్తీర్ణంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఆమోదం. ► అమరావతిలో ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేటు వర్సిటీల్లో కొన్నింటిని విశాఖ, తిరుపతిలో పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయం. ► ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో తాత్కాలిక సచివాలయాన్ని ట్రాన్సిట్ సచివాలయంగా పిలవాలని నిర్ణయం. ► సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న ఒకటో బ్లాకులో మరో అంతస్తు నిర్మాణానికి అనుమతి. అందులో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు. ఆ ‘మెట్రో’లు మంజూరు కాలేదు: కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను ఇంకా మంజూరు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టుల స్థితిగతులపై ఎంపీలు కొత్తపల్లి గీత, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎస్ రాజేంద్రన్, హరి మాంజీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విజయవాడ మెట్రోకు భూసేకరణ ఖర్చుతో పాటు మొత్తం రూ. 6,823 కోట్లు అంచనా వ్యయం అవుతుందని వివరించారు. ఇక విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 9,736 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్నారు. -
ఎంఓయూలన్నీ వాస్తవ రూపం దాల్చాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల ద్వారా 15 శాతం వృద్దిరేటు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో కుదిరిన అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)ను కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖ సీఐఐ సదస్సులో కుదిరిన 664 ఎంఓయూలను అమల్లోకి తీసుకురావడానికి అధికారులంతా కృషి చేయాలన్నారు. ఈ ఒప్పందాలపై ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎకనామిక్ సిటీకి 5,000 ఎకరాలు: రాష్ట్రంలో మరో భారీ భూసమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.అమరావతి రింగ్‌రోడ్డు సమీపంలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల పరిసరాల్లో 5వేల ఎకరాలకు భూసమీకరణ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అక్కడ ఎకనామిక్ సిటీని అభివృద్ధి చేయవచ్చన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై చంద్రబాబు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. -
పురుష ఉద్యోగుల మానసిక క్షోభ
ఊరిస్తున్న ఆరు నెలల ఉచిత వసతి సౌకర్యం ఒక వైపు.. అష్టకష్టాలు పడి వెతుక్కున్న అద్దె ఇళ్లు, అడ్వాన్స్ వదులుకోలేని పరిస్థితి మరో వైపు తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. గత అక్టోబర్‌లో ‘హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందే’ అని హుకూం జారీ చేసిన ప్రభుత్వం కొత్త ప్రాంతంలో వారి ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు, విజయవాడ నగరాల్లో రోడ్ల వెంట తిరిగి.. తిరిగి అద్దె ఇళ్లు వెతుక్కొని, అడ్వాన్స్‌లు చెల్లించి మూడు నెలలుగా నివాసముంటున్నారు. ఇప్పటికి కానీ పాలకులు కళ్లు తెరవలేదు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తాం.. వస్తారా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అమరావతి : వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పనిచేసే పురుష ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే ఉచిత నివాస వసతి సౌకర్యంపై కొంత ఇష్టం.. కొంత కష్టం అన్న పరిస్థితి కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి మూడు నెలల క్రితమే తరలివచ్చి అద్దె నివాసాల వెతుక్కొనేందుకు పురుష ఉద్యోగులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. తీరా ఇళ్లు వెతుక్కొని మూడు నెలలు ఇంటి అద్దెలు అడ్వాన్స్ రూపంలో చెల్లించి ఉంటున్నారు. ఇంత కాలానికి ప్రభుత్వం ఆరు నెలల ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తామని చెప్పడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. అదేదో ఉద్యోగులు వచ్చే సమయంలో ఉచిత వసతి సౌకర్యం కల్పించి ఉంటే అద్దె ఇళ్లు వెతుకులాట తప్పేదని వారు వాపోతున్నారు. మూడు నెలలుగా కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులపై ప్రేమ పుట్టికొచ్చి ఆరు నెలలు ఉచిత వసతి కల్పిస్తామని చెప్పడంపై వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఒకవేళ అడ్వాన్స్ నగదు వదులు కొని ప్రభుత్వం కల్పించే వసతికి వెళ్లితే ఆరు నెలల తరువాత తమ నివాస పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్‌లో వస్తే.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోకి ఉద్యోగులు అందరూ తరలిరావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పెట్టేబేడా సర్దుకొని అమరావతి రాజధాని ప్రాంతంలోకి తరలివచ్చారు. çసచివాలయంలోని అన్ని విభాగాల్లో పనిచేసే సుమారు 8 వందల మంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరు పరిధిలో అద్దె ఇళ్లు వెతుక్కొని మూడు నెలలుగా వసతి ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా ఉండడంతో యజమానులు అద్దెలు కూడా పెంచేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.12 వేలకు పైమాటే ఈ క్రమంలో ఇళ్లు దొరకడం కష్టంగా ఉండడంతో అద్దె ఎక్కువయినా తప్పని పరిస్థితుల్లో మూడు నెలలు అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నారు. మూడు నెలలుగా ఉద్యోగుల వసతి గుర్తుకురాని ప్రభుత్వం తాజాగా ఆరు నెలలు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వసతి ఏర్పాటు ముందుగా చేస్తే ఈ అవస్థలు తప్పేవికదా? అంటున్నారు. ఆరు నెలల తరువాత అద్దె ఇళ్లు దొరుకుతాయా..? రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించడం మంచిదే అయినా ఆరు నెలల తరువాత అప్పటికప్పుడు అద్దె ఇళ్లు మళ్లీ దొరకుతాయా? అనేది ప్రశ్నార్థకరంగా మారింది. అద్దె ఇళ్లు డిమాండ్ నేపథ్యంలో నివాసముంటున్న ఇళ్లు ఖాళీ చేస్తే ఆ తరువాత మళ్లీ వెతుక్కోవటం కష్టంగా ఉంటుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అద్దె ఇళ్లకు అడ్వాన్స్ రూపంలో చెల్లించిన మూడు నెలల నగదు యజమానులు ఇస్తారా..? లేదా? అనే సందేహం ఉద్యోగుల్లో నెలకొంది. బస్ పాసుల విషయంలో.. సచివాలయ ఉద్యోగులకు బస్సు పాసుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. హైదరాబాద్‌లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు నగరంలో రాయితీ పాసులు ఇచ్చేవారు. అదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో బస్సు పాసులు ఇస్తారని మూడు నెలలుగా ఉద్యోగులు ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులందరూ తమ కష్టాలను ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యతో మాట్లాడి ఉద్యోగులకు బస్సు పాసులు ఇప్పించేలా చేశారు. ఉచిత వసతి ఏడాదికి ఇవ్వాలి ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచిత వసతి కల్పించడం ఆనందమే. కానీ మూడు నెలల క్రితమే అద్దె ఇళ్లకు మూడు నెలల అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నాం. ఇంటి యజమాని అడ్వాన్స్ తిరిగి ఇస్తాడన్న నమ్మకం లేదు. ఒకవేళ అద్దె ఇంటిని వదులుకొని వస్తే ఆరు నెలల తరువాత మా పరిస్థితి ఏమిటి?. మహిళా ఉద్యోగులకు ఇచ్చినట్లు వసతి సౌకర్యం ముందే కల్పించి ఉంటే బావుండేది. ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యం ఏడాదికి పెంచాలి. – కె.రాఘవయ్య, ఇండస్ట్రీస్ విభాగాధికారి, సచివాలయం -
నల్లధనాన్ని నిరోధించాలి
• దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నా • సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు • మావాళ్లు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారు • అమెరికా ఎన్నికలకు నేను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు • వెలగపూడిలో సీఎం కార్యాలయం ప్రారంభం సాక్షి, అమరావతి: ఐదేళ్లు పడుకుని ఎన్నికల్లో నిద్రలేచి రూ.వెయ్యి నోటు ఇస్తే సరిపోతుందనుకుంటున్నారు... కొందరు మొన్న ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారు, మళ్లీ ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారు... అందుకే ఎమ్మెల్యేలు డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టి, అందుకోసం పోటీలు పడుతున్నారు... తమ పార్టీ వాళ్లు కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టాలంటున్నారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఆయన శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... బ్లాక్‌మనీ సంపాదించే వారికి రాజకీయం షెల్టర్‌గా మారిపోయిందన్నారు. కొంతమంది బ్లాక్ మనీని సంపాదించి ఎన్నికల్లో పంచుతుండడంతో తమ పరిస్థితి ఏమిటని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పారు. తాము ఐదేళ్లు ప్రజలకు కరెంటు, గ్యాస్, పెన్షన్ వంటివన్నీ ఇస్తే చివర్లో ఎన్నికలప్పుడు ఎవరైనా రూ.500 ఇస్తే వారికి ఓట్లేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్‌లో మొత్తం రూ.13 వేల కోట్ల నల్లధనాన్ని స్వచ్ఛంద ఆదాయం వెల్లడి పథకం కింద తెల్లధనంగా మార్చుకున్నారని, అందులో ఒకే వ్యక్తిది పది వేల కోట్లుందని తెలిపారు. అంత డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడితే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన వాళ్లు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని నివారించాలంటే బ్లాక్‌మనీని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా నగదు రహిత లావాదేవీలు జరపాలని చెప్పారు. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మోదీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ప్యాకేజీ తీసుకుంటే తప్పేంటీ? ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇస్తానంటే ప్యాకేజీ ఎందుకు తీసుకోకూడదని చంద్రబాబు ప్రశ్నించారు. అగ్రదేశమైన అమెరికాలోనూ నాయకత్వ లేమి ఉందన్నారు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ట్రంప్‌కు నాలుగో భార్య అనుకుంటా అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ట్రంప్ మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడాడని విమర్శించారు. అమెరికా ఎన్నికలకు తాను వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. చందాలు తీసుకుని రాజకీయాలు..: సచివాలయంలో తన కార్యాలయంలోకి అడుగు పెట్టడంతో నూతక శకం ప్రారంభమైందని బాబు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ.2,500 కోట్లు విడుదల చేసే ఫైలుపై తొలి సంతకం చేశానన్నారు. దీనిపై వడ్డీ కూడా రూ.1200 కోట్లు ఇస్తున్నామన్నారు. ఓట్లు, సీట్లు రాకపోయినా.. కొన్ని పార్టీలు చందాలు తీసుకుని రాజకీయాలు చేస్తున్నాయని వామపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. -
ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్!
హైదరాబాద్: ఏపీ సెక్రటేరియట్ తరలింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం నుంచి పనిచేయడానికి ఇక పది రోజులు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని అన్ని శాఖలు కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్‌ల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో మున్సిపల్. ఆర్థిక శాఖ ముందంజలో ఉన్నాయి. సచివాలయంలోని మున్సిపల్ శాఖ మంత్రి కార్యాలయంతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులకు చెందిన కంప్యూటర్లను ఇప్పటికే వెలగపూడికి తరలించేశారు. మరో పక్క కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫైళ్ల ప్యాకింగ్‌ను ఆర్థిక శాఖ శుక్రవారమే పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో కంప్యూటర్లను వెలగపూడి సచివాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫర్నీచర్‌తో పాటు కొన్ని రకాల ఫైళ్లను శాఖాధిపతులు కార్యాలయాలున్న ఇబ్రహీంపట్నం తరలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర కంప్యూటర్లు, ఫర్నీచర్ ప్యాకింగ్ ప్రక్రియను స్వయంగా సెక్షన్లకు వెళ్లి పర్యవేక్షించారు. వెలగపూడిలో ఆర్థిక శాఖకు కేటాయించిన భవనాల్లో ఇంటర్నెట్ కనక్షన్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడి తరలివెళ్లే కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను అక్కడ దింపుకుని, ఎవరి కంప్యూటర్లను వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఉద్యోగులకు అప్పగిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్లు వారీగా కంప్యూటర్లు వారి వారి స్థానాల్లో అమర్చే బాధ్యతలను ఆయా ఉద్యోగులకు అప్పగించారు. కంప్యూటర్లను, ఫర్నీచర్ ప్యాకింగ్ పూర్తి చేయడంతో ఆర్థిక శాఖకు చెందిన కార్యకలాపాలు శనివారం నుంచి హైదరాబాద్ సచివాలయంలో నిలిచిపోనున్నాయి. మరో పక్క ఉద్యోగులు, అధికారులు శనివారం నుంచి కుటంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు సెలవులు తీసుకోనున్నారు. ఈ తరలింపునకు ప్రత్యేకంగా సెలవులను పరిగణించనున్నారు.