సీఎంను కలసిన నారాయణ
⇒ వికలాంగుల పింఛన్, రూ.2 లక్షల లోన్ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ
⇒ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన నారాయణ
తుళ్లూరు: వైకల్యాన్ని లెక్కచేయకుండా వారం రోజుల పాటు పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం క్యాంప్ కార్యాలయం, సచివాలయం, సీఎం నివాసాల చుట్టూ తిరిగిన బత్తుల నారాయణ ఎట్టకేలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తన గోడు వినిపించారు. ఈ విషయాన్ని మంగళవారం సాక్షితి తెలిపారు. ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్న తాను ముగ్గురు ఆడపిల్లలను పోషించుకోవాల్సి ఉందని సీఎంకు వివరించినట్లు చెప్పారు.
వికలాంగుల పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని సీఎంకు తెలిపానన్నారు. దుకాణం పెట్టుకోవడానికి ఎంతకావాలని సీఎం అడిగారని, రూ.రెండు లక్షలు బ్యాంక్ రుణం ఇస్తే అంతా బతుకుతామని చెప్పగా వెంటనే సీఎం తన పీఏకు తన బాధ్యతను అప్పగించారన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తనకు మేలు జరిగేలా చూస్తానని, పూర్తి వివరాలు ఫోన్‌కు మెసేజ్ పంపుతామని పీఏ తెలిపినట్లు నారాయణ వివరించారు. తనకు తోడుగా కొండంత అండగా నిలిచిన సాక్షికి ఈ సందర్భంగా నారాయణ కృతజ్ఞతలు చెప్పారు.