సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి సస్పెండై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులపై బహిరంగ ఆరోపణలకు దిగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్ బ్యాచ్ 1989)పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు విచారణకు హాజరైన అనంతరం సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిర్గతం చేశారు.
ఈ నెల 4న వెలగపూడిలోని సెక్రటేరియెట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పలువురు అధికారులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేశారు. అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు రాజకీయంగా, బయటి వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదన్న నిబంధనలను అతిక్రమించారు. అఖిల భారత సర్వీసు (క్రమశిక్షణ–అప్పీల్) నియమాలు–1969, అఖిల భారత సర్వీస్(ప్రవర్తన) నియమాలు–1968 ప్రకారం నిబంధనలను అతిక్రమించిన ఏబీ వెంకటేశ్వరరావును వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత అధికారి వద్ద ఆయన స్వయంగా హాజరై రాతపూర్వకంగా 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. సర్వీసు రూల్స్ అతిక్రమించి దుష్ప్రవర్తన(మిస్ కాండక్ట్)కు పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు గడువులోగా సహేతుకమైన వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏబీపై క్రమశిక్షణ కొరడా!
Published Mon, Apr 19 2021 3:02 AM | Last Updated on Mon, Apr 19 2021 3:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment