విలేకరులతో మాట్లాడుతున్న రాజధాని ప్రాంత రైతులు
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంత ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకు మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో ఏరోజూ ఈ ప్రాంత రైతులను పట్టించుకోని బాబు.. ఇప్పుడు తమపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ నెల 28వ తేదీన పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఆ ప్రాంత రైతులంతా తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం సమీపంలో 29 గ్రామాల రైతులు సోమవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని పేరుతో టీడీపీ నాయకులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ఈ ప్రాంతంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాదల మహీంద్ర, బుర్రా వెంకటశివా రెడ్డి, ఆలూరి శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, అలోకం సురేష్, కొయ్యగార వినోద్, బెజ్జం రాంబాబు,అరెపల్లి జోజి, రెహా్మన్, అక్కల లక్ష్మణరాయన రెడ్డి, మువ్వల కోటేశ్వరరావు, జొన్నల గడ్డ కిషోర్, చనుమోలు రామారావు, మేకల రవి, సవరం సురేంద్ర, అన్నూరు జక్కరయ్య తదితరులు పాల్గొన్నారు.
కమీషన్ల రాజధాని
రాజధానిని తమ కమీషన్లకు అడ్డాగా చంద్రబాబు, ఆయన మంత్రులు మలుచుకున్నారు. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకే భవన, రోడ్ల అభివృద్ధి పనులు అప్పగించారు. నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసి కమీషన్లు కాజేశారు.
– మేకల రవి, నెక్కళ్లు
రైతుల ప్లాట్లను పట్టించుకున్నారా?
టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడి భూములు ఇచ్చిన రైతుల్లో ఏ ఒక్కరినైనా పట్టించుకున్నారా? సకల సౌకర్యాలు కల్పించిన తర్వాత ప్లాట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. 34 వేల మంది రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్కటి అయినా అభివృద్ధి చేశారా? – రమణారెడ్డి, రైతు, శాఖమూరు
అభివృద్ధి ఎక్కడ.?
రాజధాని పరిధిలోని మూడు మండలాల్లోని 29 గ్రామాల్లో అసైన్డ్ భూములను కారుచౌకగా ఎవరు కొనుగోలు చేశారో అందరికీ తెలుసు. దళితులను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. నాలుగేళ్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడి వేల కోట్లు దోచుకున్నారు. – కొండేపాటి సతీష్‌చంద్ర, రైతు, మందడం
Comments
Please login to add a commentAdd a comment