పురుష ఉద్యోగుల మానసిక క్షోభ
ఊరిస్తున్న ఆరు నెలల ఉచిత వసతి సౌకర్యం ఒక వైపు.. అష్టకష్టాలు పడి వెతుక్కున్న అద్దె ఇళ్లు, అడ్వాన్స్ వదులుకోలేని పరిస్థితి మరో వైపు తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. గత అక్టోబర్‌లో ‘హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందే’ అని హుకూం జారీ చేసిన ప్రభుత్వం కొత్త ప్రాంతంలో వారి ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోలేదు. గుంటూరు, విజయవాడ నగరాల్లో రోడ్ల వెంట తిరిగి.. తిరిగి అద్దె ఇళ్లు వెతుక్కొని, అడ్వాన్స్‌లు చెల్లించి మూడు నెలలుగా నివాసముంటున్నారు. ఇప్పటికి కానీ పాలకులు కళ్లు తెరవలేదు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తాం.. వస్తారా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
అమరావతి : వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పనిచేసే పురుష ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే ఉచిత నివాస వసతి సౌకర్యంపై కొంత ఇష్టం.. కొంత కష్టం అన్న పరిస్థితి కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి మూడు నెలల క్రితమే తరలివచ్చి అద్దె నివాసాల వెతుక్కొనేందుకు పురుష ఉద్యోగులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. తీరా ఇళ్లు వెతుక్కొని మూడు నెలలు ఇంటి అద్దెలు అడ్వాన్స్ రూపంలో చెల్లించి ఉంటున్నారు. ఇంత కాలానికి ప్రభుత్వం ఆరు నెలల ఉచిత నివాస సౌకర్యం కల్పిస్తామని చెప్పడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
అదేదో ఉద్యోగులు వచ్చే సమయంలో ఉచిత వసతి సౌకర్యం కల్పించి ఉంటే అద్దె ఇళ్లు వెతుకులాట తప్పేదని వారు వాపోతున్నారు. మూడు నెలలుగా కనీస వసతి సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులపై ప్రేమ పుట్టికొచ్చి ఆరు నెలలు ఉచిత వసతి కల్పిస్తామని చెప్పడంపై వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఒకవేళ అడ్వాన్స్ నగదు వదులు కొని ప్రభుత్వం కల్పించే వసతికి వెళ్లితే ఆరు నెలల తరువాత తమ నివాస పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అక్టోబర్‌లో వస్తే..
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోకి ఉద్యోగులు అందరూ తరలిరావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పెట్టేబేడా సర్దుకొని అమరావతి రాజధాని ప్రాంతంలోకి తరలివచ్చారు. çసచివాలయంలోని అన్ని విభాగాల్లో పనిచేసే సుమారు 8 వందల మంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరు పరిధిలో అద్దె ఇళ్లు వెతుక్కొని మూడు నెలలుగా వసతి ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా ఉండడంతో యజమానులు అద్దెలు కూడా పెంచేశారు. డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.12 వేలకు పైమాటే ఈ క్రమంలో ఇళ్లు దొరకడం కష్టంగా ఉండడంతో అద్దె ఎక్కువయినా తప్పని పరిస్థితుల్లో మూడు నెలలు అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నారు. మూడు నెలలుగా ఉద్యోగుల వసతి గుర్తుకురాని ప్రభుత్వం తాజాగా ఆరు నెలలు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వసతి ఏర్పాటు ముందుగా చేస్తే ఈ అవస్థలు తప్పేవికదా? అంటున్నారు.
ఆరు నెలల తరువాత అద్దె ఇళ్లు దొరుకుతాయా..?
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించడం మంచిదే అయినా ఆరు నెలల తరువాత అప్పటికప్పుడు అద్దె ఇళ్లు మళ్లీ దొరకుతాయా? అనేది ప్రశ్నార్థకరంగా మారింది. అద్దె ఇళ్లు డిమాండ్ నేపథ్యంలో నివాసముంటున్న ఇళ్లు ఖాళీ చేస్తే ఆ తరువాత మళ్లీ వెతుక్కోవటం కష్టంగా ఉంటుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అద్దె ఇళ్లకు అడ్వాన్స్ రూపంలో చెల్లించిన మూడు నెలల నగదు యజమానులు ఇస్తారా..? లేదా? అనే సందేహం ఉద్యోగుల్లో నెలకొంది.
బస్ పాసుల విషయంలో..
సచివాలయ ఉద్యోగులకు బస్సు పాసుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. హైదరాబాద్‌లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు నగరంలో రాయితీ పాసులు ఇచ్చేవారు. అదే తరహాలో సీఆర్‌డీఏ పరిధిలో బస్సు పాసులు ఇస్తారని మూడు నెలలుగా ఉద్యోగులు ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులందరూ తమ కష్టాలను ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యతో మాట్లాడి ఉద్యోగులకు బస్సు పాసులు ఇప్పించేలా చేశారు.
ఉచిత వసతి ఏడాదికి ఇవ్వాలి
ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచిత వసతి కల్పించడం ఆనందమే. కానీ మూడు నెలల క్రితమే అద్దె ఇళ్లకు మూడు నెలల అడ్వాన్స్ చెల్లించి తీసుకున్నాం. ఇంటి యజమాని అడ్వాన్స్ తిరిగి ఇస్తాడన్న నమ్మకం లేదు. ఒకవేళ అద్దె ఇంటిని వదులుకొని వస్తే ఆరు నెలల తరువాత మా పరిస్థితి ఏమిటి?. మహిళా ఉద్యోగులకు ఇచ్చినట్లు వసతి సౌకర్యం ముందే కల్పించి ఉంటే బావుండేది. ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యం ఏడాదికి పెంచాలి. – కె.రాఘవయ్య, ఇండస్ట్రీస్ విభాగాధికారి, సచివాలయం