వికలాంగుడి ఆత్మహత్యాయత్నం
సీఎంను కలిసేందుకు సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం
తాడేపల్లి రూరల్ (గుంటూరు): ఇచ్చిన హామీ అమలుకాలేదనే విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పాలని వచ్చిన ఓ వికలాంగుడిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందే అతను ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఒంగోలుకు చెందిన నారాయణ తనకు జీవనోపాధికి రుణం ఇప్పించాలంటూ ఇటీవల వెలగపూడి సచివాలయంలో సీఎంను కలసి తన బాధను వివరించాడు. రెండ్రోజుల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. పది రోజులు గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో సీఎంను కలిసేందుకు నారాయణ మళ్లీ ఉండవల్లి వచ్చాడు.
సెక్యూరిటీ సిబ్బంది సీఎం నిద్రలేవలేదు, తర్వాత పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. మరో రెండు గంటల తర్వాత కూడా అదే సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన వికలాంగుడు దగ్గర్లో ఉన్న ఖాళీ మద్యం బాటిల్‌తో తలపై బాదుకున్నాడు. గమనించిన సిబ్బంది నారాయణను మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ‘ఒంగోలు జిల్లా అధికారులతో సీఎం పేషీ నుంచి మాట్లాడాం. నీకు న్యాయం చేస్తారు. ఇక వెళ్లు’ అంటూ అధికారులు బాధితుడిని ఒంగోలు పంపించివేశారు.