Public hospital
-
ఈ తండ్రి నాకొద్దు!
జమ్మికుంట: కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కర్కశత్వంగా మారాడు. తాగుడుకు బానిసై.. విచక్షణ కోల్పోయి శరీరం కమిలిపోయేలా చిత్రహింసలకు గురిచేశాడు. తండ్రి అనే మమకారం లేకుండా పసి హృదయాన్ని గాయపరిచాడు. తండ్రి బాధలు భరించలేక 11 ఏళ్ల బాలుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. ‘ఈ తండ్రి నాకొద్దు.. జైల్లో పెట్టండి’అని ఫిర్యాదు చేశాడు. జమ్మికుంట నగర పంచాయతీ పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన మొలుగూరు శ్రీనివాస్ తాగుడుకు బానిసగా మారాడు. మేస్త్రీ పని చేస్తూ చేతికి వచ్చిన డబ్బులతో తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, కుమారుడిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం శ్రీనివాస్ భార్య రమ్య, పట్టణంలోని ఓ రెస్టారెంట్లో కూలి పని చేసేందుకు వెళ్లింది. కుమారుడు శశికుమార్ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికే నిషాలో ఉన్న తండ్రి.. కొడుకును చూసి కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న రూ.3 వేలు తీశావా అంటూ కర్రకు కారం రాసి విపరీతంగా చితక్కొట్టాడు. దీంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. తాను డబ్బులు తీయలేదని కొడుకు ఎంత చెప్పినా వినకుండా తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతున్న శశికుమార్‌ను పెద్దమ్మ వచ్చి విడిపించింది. రాత్రి ఇంటికొచ్చిన తల్లికి విషయం విలపించాడు. అనంతరం జమ్మికుంట పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. మా నాన్నతో ఎప్పటికైనా అమ్మకు, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. తాగి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటామని విలపిస్తూ చెప్పాడు. పోలీసులు బాలుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి చలించిపోయారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తన అక్క శ్వేత కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతోందని, తానూ అక్కడే ఉండి చదువుకుంటానని శశికుమార్ చెప్పాడు. కాగా, నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. -
అందరికీ ఆదర్శం .. కలెక్టర్ మురళి
-
వికలాంగుడి ఆత్మహత్యాయత్నం
సీఎంను కలిసేందుకు సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం తాడేపల్లి రూరల్ (గుంటూరు): ఇచ్చిన హామీ అమలుకాలేదనే విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పాలని వచ్చిన ఓ వికలాంగుడిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందే అతను ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఒంగోలుకు చెందిన నారాయణ తనకు జీవనోపాధికి రుణం ఇప్పించాలంటూ ఇటీవల వెలగపూడి సచివాలయంలో సీఎంను కలసి తన బాధను వివరించాడు. రెండ్రోజుల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. పది రోజులు గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో సీఎంను కలిసేందుకు నారాయణ మళ్లీ ఉండవల్లి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సీఎం నిద్రలేవలేదు, తర్వాత పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. మరో రెండు గంటల తర్వాత కూడా అదే సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన వికలాంగుడు దగ్గర్లో ఉన్న ఖాళీ మద్యం బాటిల్‌తో తలపై బాదుకున్నాడు. గమనించిన సిబ్బంది నారాయణను మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ‘ఒంగోలు జిల్లా అధికారులతో సీఎం పేషీ నుంచి మాట్లాడాం. నీకు న్యాయం చేస్తారు. ఇక వెళ్లు’ అంటూ అధికారులు బాధితుడిని ఒంగోలు పంపించివేశారు. -
మెరుగైన వైద్యమే లక్ష్యం
► అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ► కలెక్టర్ ఇలంబరిది ► భైంసా ఆస్పత్రి తనిఖీ భైంసా : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ ఇలంబరిది అన్నారు. శుక్రవారం భైంసా ఏరియా ఆస్పత్రిని ఆయ న తనిఖీ చేశారు. నిర్మల్ ఎంసీహెచ్, భైంసా ఏరియా ఆస్పత్రుల్లో ఏటా 300లకు పైగానే ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో డెలవరీ రూంలను మరింత విస్తరించి సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ఏరియా ఆస్పత్రికి అవసరమైన కొత్త మంచాలు, ఇస్తామని తెలిపారు. ఐసీయూలో అవసరం ఉండే పరికరాలను మంజూనే చేయిస్తామన్నారు. పేదల వైద్యం కోసం అవసరమయ్యే స్కానింగ్, వైద్య పరికరాలు మంజూరయ్యేలా చూస్తామని చెప్పా రు. భైంసా, నిర్మల్ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. భైంసాలో నాలుగు, నిర్మల్‌లో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసే విషయంపై దృష్టిసారిస్తామని వివరించారు. ఏరియా ఆస్పత్రికి వచ్చే వారికి మె రుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది కి సూచించారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో వార్డులు, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. ఆస్పత్రి వెనుకాల ఉన్న పరిసరాలను చూశారు. సెక్యూరిటీని పెంచుతామని తెలిపారు. అలాగే భైంసా, నిర్మల్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందే వైద్యం తదితర విషయాల ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. సి బ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించా రు. అత్యవసర సమయాల్లో అందరూ ఉండి అయినసరే మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, సేవలు అందించే వైద్యు లు, నర్సులతో ఈ సందర్భంగా సమావేశమయ్యారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ సురేశ్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోమురళీకృష్ణ ఉన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు నిర్మల్ టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలంబరిది పేర్కొన్నారు. నిర్మల్ ప్రభుత్వ ప్రసూతి వైద్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రసూతి వైద్య కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాలు, కొత్త లేబర్ వార్డులో బెడ్లు, సిజేరియన్ థియేటర్లో ఎయిర్ కండీషన్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్, వైద్యులు పాల్గొన్నారు. -
ఖైదీ నాటకం
రిమాండ్ ఖైదీ పరార్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి.. కడుపు నొప్పి అంటూ డ్రామా.. హెడ్ కానిస్టేబుల్‌ను బాత్రూంలో బంధించి.. నిజామాబాద్ క్రైం: ఆటోడ్రైవర్ హత్య కేసులో పట్టుబడిన రిమాండ్ ఖైదీ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. డ్యూటీలోని హెడ్ కానిస్టేబుల్‌ను బాత్రూమ్లోకి తోసి మరీ తప్పించుకు పోయిన ఘటన పోలీసు వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. విధుల్లో నలుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండటంతో ఖైదీ సులభంగా తప్పించుకుని పారిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యం, ఖైదీ పరారీపై జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నీరడి అరుణ్ బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన మంగలి హన్మాండ్లు, నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రాజ్‌కుమార్ పాత స్నేహితులు. అరుణ్ ఇటీవల తన మకాన్ని నిజామాబాద్‌కు మార్చాడు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్ షేక్ మహమూద్తో పరిచయం ఏర్పడింది. గల్ఫ్ నుంచి వచ్చిన అరుణ్ వద్ద డబ్బులు లేక పోవటంతో షేక్ మహమూద్‌ను హతమార్చి ఆటోను అమ్మి సొమ్ము చేసుకునేందుకు స్నేహితులు హన్మండ్లు, రాజ్‌కుమార్‌లతో కలిసి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 5న విందు పేరుతో ముగ్గురు కలిసి మహమూద్‌ను జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం మహమూద్‌పై దాడిచేసి హతమార్చారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పెర్కిట్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై పారవేశారు. ఈ నెల 14న ఆటోడ్రైవర్‌ను హత్యచేసిన ముగ్గురు ఆటోను నిర్మల్‌లో విక్రయించేందుకు బయలుదేరారు. ఆర్మూర్ పోలీసులు మామిడిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఆటోను ఆపి రిజిస్ట్రేషన్ పత్రాలు అడుగగా చూపించక పోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ హత్య వెలుగు చూసింది. పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా కోర్టు రిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా సారంగపూర్ జిల్లా జైలులో ఉన్న ప్రధాన నిందితుడు అరుణ్ ఈ నెల 15న తనకు ఆరోగ్యం బాగా లేదని జైలు అధికారులకు తెలిపాడు. దాంతో వారు ఎస్కార్ట్ పోలీసులతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఖైదీల వార్డుకు తరలించారు. ఆదివారం ఉదయం విధుల్లో హెడ్‌కానిస్టేబుల్ పాపారావు ఉన్నారు. వార్డుకు కాపాలగా హెడ్‌కానిస్టేబుల్ ఒక్కరే ఉండడం గమనించిన అరుణ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తనకు కడుపునొప్పి తీవ్రంగా ఉందంటూ డ్రామా ఆడాడు. అరుణ్‌ను హెడ్‌కానిస్టేబుల్ బాతూరూంకు తీసుకువెళ్లాడు. బాత్రూంలోకి వెళ్లిన అరుణ్ అందులో నీళ్లు రావటంలేదని చెప్పటంతో హెడ్‌కానిస్టేబుల్ బాత్రూంలోకి వెళ్లి పరిశీలిస్తుండగా అతడిని ఒక్కసారిగా లోపలకు తోసి బయట నుంచి గొళ్లెం పెట్టేశాడు. నైట్‌ప్యాంట్ ధరించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్ వార్డు ఇనుప డోర్‌కు వేసిన తాళాం చెవిని బెంచ్‌పై పెట్టాడు. ఆ తాళం చెవితో డోర్ తీసుకుని అరుణ్ తాపీగా పారిపోయాడు. వార్డులో ఉన్న మరోఖైదీ యాదయ్య అరుస్తూ అతనికి కేటాయించిన మంచానికి చేతికి గొలుసుతో తాళం వేసి ఉన్నప్పటికీ మంచంతో పాటు బాత్రూం వద్దకు వచ్చి గొళ్లెల తీశాడు. బాత్రూం నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ ఆస్పత్రి పరిసరాలలో గాలించినప్పటికీ అప్పటికే అరుణ్ పారిపోయాడు. ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అప్రమత్తపై గాలింపు చర్చలు చేపట్టారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అరుణ్ పారిపోయిన చిత్రాలు సరిగ్గా రికార్డు కాలేదు. దాంతో వన్‌టౌన్ పోలీసులు ప్రధాన చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. విధుల్లో ఒక్కరే.. ఆస్పత్రిలో ఖైదీ వార్డుల బందోబస్తు కోసం ఏఆర్ విభాగానికి చెందిన వారిని నియమిస్తారు. ఏఆర్ ఏఎస్సై గులాం దస్తాగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు నాగేశ్వర్, గోవింద్, ప్రసాద్‌లు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పాపారావు ఒక్కరే విధుల్లో ఉండటంతో ఖైదీ గమనించి పారిపోయాడు. నలుగురి సస్పెన్షన్ నిజామాబాద్ క్రైం : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పారిపోయిన ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందిపై జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ సస్పెన్షన్ వేటు వేశారు. సారంగాపూర్ జిల్లా జైలులో హత్యనేరంపై రిమాండ్‌లో ఉన్న ఖైదీ అరుణ్‌ను ఈ నెల 15న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. జైల్ నుంచి అరుణ్‌ను ఏఆర్ ఏఎస్సై గులాం దస్తగిరి, హెడ్‌కానిస్టేబుళ్లు పాపారావు, ప్రసాద్, నాగేశ్వరరావులు వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం విధి నిర్వహణలో పాపారావు ఒక్కరే ఉండటంతో పథకం ప్రకారం హెడ్‌కానిస్టేబుల్‌ను బాత్రూంలోకి తోసి పారిపోయాడు. ఆ సమయంలో ఖైదీల గది మెయిన్ డోర్‌కు తాళం వేయాలి కాని, పాపారావు తాళం వేయకుండా నిర్లక్ష్యం వహించాడు. దాంతో ఖైదీ పారిపోయాడు. మిగతా సిబ్బంది ముగ్గురు విధులకు గైర్హాజరు కావటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మొత్తం నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. పారిపోయిన ఖైదీపై అండర్ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విధులను నిర్వర్తించే క్రమంలో ఎవరైనా అలసత్వం కాని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
ఏడు రోజులు...ఏడు రంగులు
- ఆసుపత్రుల్లో రోజుకో రంగు బెడ్‌షీట్ - పరిశుభ్రత కోసం ప్రతీ రోజూ మార్చేలా ఈ విధానం - రాష్ట్రంలో 20 వేల పడకలకు రెండు సెట్ల రంగు రంగు దుప్పట్లు - టెండర్ల ప్రకియ మొదలు... చర్లపల్లి జైలు ఖైదీల నుంచీ కొనుగోలు సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలపై ఇక నుంచి రంగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం తెల్లరంగు బెడ్షీట్లు మాత్రమే వాడుతుండగా... ఇకనుంచి వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లూ కనిపించనున్నాయి. ఆసుపత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇతర రోగులు వాడిన దుప్పట్లనే మరో రోగి వాడుతోన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటు వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ రోజూ ఆసుపత్రుల్లోని పడకలపై బెడ్షీట్లను మార్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని ఆయన ఆదేశించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు వాడితే తప్పనిసరిగా దుప్పట్లను ఉతికి ఆరేస్తారని... రోజుకో రంగు దుప్పటి వాడాలన్న నిర్ణయం వల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారంలో ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే ఆసుపత్రి సిబ్బంది దుప్పట్లను ప్రతీ రోజూ మార్చుతూ... మార్చిన వాటిని ఉతికేయించి మరో వారానికి సిద్ధంగా ఉంచుతారు. 20 వేల పడకలకు రంగు రంగుల దుప్పట్లు... కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ విధానాన్ని దేశంలోని 19 ప్రధాన ఆసుపత్రుల్లో అమలు చేస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఛండీఘర్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకే షన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ ఈ విధానం అమలవుతోంది. ఆయా ఆసుపత్రుల్లో సోమవారం తెల్ల దుప్పటి, మంగళవారం గులాబీ, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం ఊదా లేదా మరో రెండు రంగులు, శనివారం నీలం, ఆదివారం లేత బూడిదరంగు లేదా మరో రంగును వాడుతున్నారు. కొద్దిపాటి మార్పులు చేసి ఆ ప్రకారమే రాష్ట్రంలోనూ అమలుచేస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్, సరోజినీ దేవి వంటి పెద్దాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏకంగా 8,374 పడకలున్నాయి. అందులో ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే 1168, నిమ్స్‌లో 1500 పడకలున్నాయి. జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 1900 పడకలున్నాయి. 750 వరకు ప్రాథమిక ఆసుపత్రులుండగా... వాటిల్లో కొన్నింటినీ 30 పడకల వరకు పెంచుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ రంగు రంగుల బెడ్షీట్లు రానున్నాయి. టెండర్ల ప్రక్రియ మొదలు... అన్ని ఆసుపత్రుల్లోనూ ఏడు రోజులు ఏడు రంగుల బెడ్షీట్లను రెండు సెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఒక సెట్టు ఎప్పుడూ రిజర్వులో ఉంచుతారు. రంగు బెడ్షీట్లను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. తక్కువ కోట్ చేసిన కంపెనీ నుంచి బెడ్షీట్లను కొనుగోలు చేస్తారు. చర్లపల్లి జైలులో ఖైదీలు బెడ్షీట్లు తయారు చేస్తున్నందున వారి నుంచి ఎన్ని వీలైతే అన్ని కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పడకకు ఏడు దుప్పట్లు రెండు సెట్ల చొప్పున 20 వేల పడకలకు 2.80 లక్షల రంగు దుప్పట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. వైద్యుల నిరసన
అధికార పార్టీ నేతల జులుం పెచ్చుమీరుతోంది. వారి దౌర్జన్యానికి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఘటన వివరాలివీ... అధికార పార్టీకి చెందిన ఎంపీపీ దాసరి రామక్క, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో చైర్మన్ బోడా నాగభూషణం తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్యులను, సిబ్బందిని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దుర్భాషలాడుతున్నారు. వారి ధాటికి తాళలేక శుక్రవారం వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించి, ధర్నాకు దిగారు. ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని, కో చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా ప్రతిరోజూ రెండు గంటలపాటు నిరసన తెలుపుతామని వారు వెల్లడించారు. -
రూపురేఖలు మార్చేస్తా
ప్రభుత్వ ఆస్పత్రులపై లక్ష్మారెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పా రు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టపర్చే కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నామన్నారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శిం చారు. సుమారు 8 గంటలపాటు ఆస్పత్రిలో ఉన్న మంత్రి అక్కడి లోటుపాట్లను తెలుసుకు న్నారు. వైద్యసేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది, ఆరోగ్యశ్రీ సీఈవో, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం బడ్జెట్లో రూ.5966కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలంగాణకు రెండు కళ్లుగా ఉన్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి లో నూతన భవన సముదాయాల నిర్మాణాలకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రూ.600 కోట్లతో రాష్ట్రంలోని ల్యాబోరేటరీలను పటిష్ట పరుస్తామన్నారు. కో ఆర్డినేషన్ ఆఫీసర్ల నియామకం.. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఎంజేఎం వంటి పెద్ద ఆస్పత్రుల్లో కోఆర్డినేషన్ ఆఫీసర్లను నియమించే ఆలోచన ఉందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ ఆఫీసర్లు ఆయా ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల వంటి అంశాలను తన దృష్టికి తెస్తారన్నారు. కాగా, రాష్ట్రంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి మోత
ఇబ్బందిపడ్డ రోగులు.. ఇద్దరు అధికారుల తొలగింపు బలరాంపూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని బలంద్‌షహర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం రాత్రి నిర్వహించిన ఓ డీజే కార్యక్రమం తో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రికి సంబంధించిన అధికారి కుటుంబానికి చెందిన ఓ పెళ్లి నేపథ్యంలో ఈ ఆటాపాటా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పెద్దశబ్దాలతో డీజేతో సంగీత కార్యక్రమం నిర్వహించారు. నిశ్శబ్దంగా ఉండాల్సిన ఆస్పత్రిలో పెళ్లిభాజాలు మోగడంతో ఆస్పత్రిలోని రోగులు విసిగిపోయారు. ఆస్పత్రి ఘటన తెలిసి చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్లను తొలగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎస్పీ యాదవ్ ఉన్నతాధికారులున ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో పెళ్లికి కారకులైన అందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. -
పెద్ద మాయ !
⇒ బిడ్డలు అదృశ్యమవుతున్నా తీరుమారని జీజీహెచ్ ⇒ తాజాగా తొమ్మిదినెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ ⇒ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో తరచూ ఘటనలు ⇒ ఆసుపత్రిలో పనిచేయని సీసీ కెమెరాలు ⇒ అధికారులు, సిబ్బంది తీరుతో రోగుల్లో భయాందోళనలు నవ్యాంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి...కోస్తాంధ్ర జిల్లాలకు ఆరోగ్య ప్రదాయిని...గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగులుస్తోంది. ఎలుకలు పసికందుల ప్రాణాలు తీస్తున్నా, పసిబిడ్డలు మాయమవుతున్నా ఇక్కడి అధికారులు, సిబ్బంది తీరు మారకపోవడం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా బుధవారం మరో బిడ్డ మాయమయ్యాడు .. గుంటూరు : రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామానికి చెందిన గోసి రమణకు తొమ్మిది నెలల క్రితం మగబిడ్డ పుట్టాడు. అనారోగ్యంగా ఉండడంతో అమ్మమ్మ హుస్సేనమ్మ ఆ బిడ్డను తీసుకువచ్చి జీజీహెచ్‌లోని పిలల్ల వార్డులో చేర్చింది. మూడు రోజులుగా ఆ వార్డులో తిరుగుతున్న ఓ మహిళ బాబును ఎత్తుకుని ఆడిస్తూ బుధవారం హుస్సేనమ్మ కళ్లుగప్పి బిడ్డతో సహా పరారైంది. దీంతో లబోదిబోమన్న అమ్మమ్మ జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఆసుపత్రిలోని అన్ని వార్డులకూ పాకడంతో తీవ్ర కలకలం రేగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆసుపత్రి భద్రతలో డొల్లతనం బయటపడుతున్నా సరిదిద్దే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. ఇక్కడే ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యులను చేస్తూ పారిశుధ్య, భద్రత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. అతనికి రెట్టింపు పారితోషికం ఇచ్చి అధికార పార్టీ ఎంపీ అనుయాయులకు కాంట్రాక్ట్ అప్పగించారు. అయినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పదిహేను రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇద్దరు పసికందులను ఎత్తుకెళ్ళిన సంఘటన లు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాలు పని చేయడం లేదు. గేట్‌పాస్‌లు, విజిటింగ్, స్టేపాస్ల పేరుతో హడావిడి చేసే ఆసుపత్రి అధికారులు, భద్రతా సిబ్బంది పసికందులు ఆసుపత్రి నుంచి అదృశ్యం అవుతుంటే ఏం చేస్తున్నారంటూ రోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల వద్ద ఆందోళన కలిగించే ఘటనలు ... జీజీహెచ్ ప్రసూతి వైద్య విభాగం వద్ద తరచూ ఇబ్బందికర ఘటనలు జరుగుతుండడంతో రోగులు, వారి బంధువులు హడలిపోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఐదుగురు శిశువులను అపహరించుకు వెళ్ళిన ఘటనలు జరిగాయి. ముగ్గురు వెంటనే దొరికినప్పటికీ ఇద్దరు తల్లులకు మాత్రం గర్భశోకం తప్పలేదు. తల్లులు ఆదమరిచి ఉన్న సమయంలో పసికందులను ఎత్తుకెళుతు న్నా అక్కడి భద్రతా సిబ్బంది పట్టుకోలేకపోవడం, కనీసం సీసీ కెమెరాలు సైతం పనిచేయకపోవడంతో దొంగలు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది. గత ఏడాది ప్రత్తిపాడుకు చెందిన ఓ గర్భిణి జీజీహెచ్‌లో ప్రసవించగా పసికందును ఓ మహిళ ఎత్తుకెళ్ళింది. కొత్తపేట పోలీసులు అతి కష్టం మీద పట్టుకున్నారు. పది రోజుల క్రితం తాడికొండకు చెందిన ఓ మహిళకు ఆడ శిశువు పుట్టగా, అమ్మమ్మ ఆ శిశువును ఆసుపత్రి నుంచి తీసుకెళ్ళి సమీపంలోని బ్రిడ్జికింద వదిలి వెళ్తుండగా స్థానికులు పట్టుకుని ఆసుపత్రికి చేర్చారు. ఏదీ భరోసా..? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఆసుపత్రి ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా విచారణలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నగరం కానున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల దయనీయ పరిస్థితిని మార్చే వారే లేకుండా పోయారు. -
కల్తీ కల్లు దొరక్క ముగ్గురి మృతి
కల్తీ కల్లు లభించక ముగ్గురు వ్యక్తులు గురువారం మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కల్తీ కల్లుకు బానిసలై వింత వింతగా ప్రవర్తిస్తూ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు బాధితులు మరణించారు. మరో 25 మంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. జిల్లాలో కల్తీ కల్లుకు బానిసలై.. అదిదొరక్క మతిస్థిమితం తప్పుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. -
ధర్మాసుపత్రిలో పందికొక్కులు కరిచేశాయ్
♦ మహిళ కాలికి గాయం ♦ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘటన గుంతకల్లు: గుంటూరు ఆసుపత్రిలో ఇటీవలే మూషికాల దాడిలో ఓ పసిగుడ్డు బలైంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించింది. పాలకుల్లో ఇసుమంతైనా చలనం రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు శునకాలు, పందికొక్కులు, ఎలుకలు, పాములకు నిలయంగా మారుతున్నా, రోగులపై దాడులు చేస్తున్నా వారికి చీమకుట్టినట్లయినా లేదు. గుంటూరు ఘటనను మరిచిపోకముందే అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళను పందికొక్కు కరిచి, గాయపర్చింది. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మీ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం ఉదయం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. లక్ష్మీకి సహాయకురాలుగా ఆమె తల్లి ఎర్రమ్మ (55) వచ్చింది. ఆసుపత్రిలోని కాన్పుల వార్డులో లక్ష్మీ పక్కనే నిద్రించింది. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య పాప ఏడ్చింది. దీంతో ఎర్రమ్మ లేచి పాపను ఊయలలో వేసి నిద్రపుచ్చింది. తనూ నిద్రపోయింది. కొద్దిసేపటికి పందికొక్కులు కాన్పుల వార్డులోకి ప్రవేశించాయి. ఎర్రమ్మ కాలును ఓ పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడి లేచిన ఆమె బిగ్గరగా కేకలు పెట్టింది. కాలిపై పందికొక్కు పంటిగాట్లు కన్పించాయి. తీవ్ర రక్తస్రావమైంది. వార్డులోని వారంతా నిద్ర లేచారు. పందికొక్కులను తరిమారు. అవి మరుగుదొడ్లలోని బొరియల్లోకి వెళ్లిపోయాయి. గాయపడిన ఎర్రమ్మకు ఆస్పత్రిలోని నర్సులు వైద్యం చేసి కాలుకు కట్టుకట్టారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే.. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే.. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే లక్ష్మికి సహాయకురాలుగా వచ్చిన తల్లి ఎర్రమ్మ (55) ను ఆదివారం రాత్రి పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడిన ఎర్రమ్మ నిద్ర నుంచి మేల్కొని చూస్తే.. వార్డులో పందికొక్కులు కనిపించాయి. గాయపడిన ఎర్రమ్మకు నర్సులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపించడం వల్ల పందికొక్కులు, ఎలుకలు ఎక్కువయ్యాయని.. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే.. ప్రాణాలే పోయే పరిస్థితి ఎదురైతోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆసుపత్రిలో పాములు.. పరుగో పరుగు..
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాములు డాక్టర్లను, పేషంట్లను పరుగు పెట్టించాయి. పట్టణంలోని మిట్టూరులో ఉన్నప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీ విభాగంలోకి ఉదయం ఓపీ సెంటర్ తెరిచి వైద్యులు సేవలు ప్రారంభించారు.. ఇంతలోనే రోగుల మధ్యలోంచి రెండు నాగుపాములు లోపలికి వచ్చాయి. వీటిని గమనించిన డాక్టర్లు, సిబ్బంది పరుగందుకున్నారు. సిబ్బంది పాములు పట్టే వారికి కబురు చేశారు. పాములు పట్టేవారు రెండు పాములను తీసుకు వెళ్లినా.. రోగులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఘటనతో పక్కనే ఉన్న ఇన్ పేషంట్ విభాగంలో తలుపులు, కిటికీలు మూసేశారు. -
సర్కారు వైద్యం.. ఇదేమి చోద్యం
ధర్మాసుపత్రికెళితే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం సామాన్యుడిలో సన్నగిల్లుతోంది. వేళకు రాని వైద్యులు.. పనిచేయని పరికరాలు.. మందుల కొరతతో ఇబ్బందులు.. వైద్య నిపుణులు లేక అవస్థలు.. వీటికితోడు కనీస మౌలిక వసతులు మృగ్యం. ఇన్ని సమస్యల నడుమ సగటు రోగికి సరైన వైద్యం అందడం దుర్లభంగా మారుతోంది. జన సంక్షేమం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు పేదల ఆస్పత్రుల వైపు ఓ సారి దృష్టి సారించడం అవసరం. సాక్షి, కడప : దేవుడి తర్వాత అంతటి పేరున్నది వైద్యులకే. అందుకే వైద్యోనారాయణోహరి అన్నారు. కానీ కాలక్రమంలో ఈ నానుడికి అర్థం మారిపోతోంది. నేడు ధర్మాసుపత్రుల్లో రోగుల నాడిపట్టి చూసే నాథుడే కరువయ్యాడు. జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో వైద్యులు తూతూ మంత్రంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రొద్దుటూరు పెద్దాస్పత్రికి అనారోగ్యం జిల్లా ఆస్పత్రిగా గుర్తింపు పొందిన ప్రొద్దుటూరు ఆస్పత్రిని గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. అలాగే ఇతర డాక్టర్ల సమస్య కూడా ఉంది. సీటీ స్కాన్ చేసేందుకు అవసరమైన యూనిట్ లేకపోవడంతో చాలా చోట్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎక్స్‌రే ప్లాంట్ పెద్దది పనిచేయకపోవడంతో కూడా రోగులకు సమస్యలు తప్పడం లేదు. ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది రోగులు వస్తుంటారు. పైగా జిల్లాలోని అతి పెద్ద ఆస్పత్రిగా పేరొందిన ప్రొద్దుటూరులో అన్ని శస్త్ర చికిత్సలు జరిగేలా నిపుణులతోపాటు యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేరుకే 24 గంటలు.. పనిచేసేది ఐదారు గంటలే! మారుమూల ప్రాంతాల్లో నిత్యం వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 24 గంటల ఆస్పత్రులు పడకేశాయి. ప్రత్యేకంగా ఆస్పత్రులకు సొంత భవనాలతోపాటు క్వార్టర్స్‌ను కూడా ప్రభుత్వం నిర్మించినా చాలా ఆస్పత్రుల్లో వైద్యులు ఉండడం లేదు. రకరకాల సాకులు చూపుతూ పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. 24 గంటల ఆస్పత్రులున్న ప్రాంతాల నుంచి కూడా రోగులు చిన్న సమస్యకే పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారంటే అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో స్పష్టమవుతోంది. కనీసం 24 గంటల ఆస్పత్రిగా గుర్తింపు ఉన్న చోట కూడా డాక్టర్లు కేవలం ఐదారు గంటలకు మించి ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఏదైనా జరిగినా ఇతర ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఆస్పత్రులను వేధిస్తున్న వైద్యుల కొరత జిల్లాలోని పులివెందుల, కమలాపురం, రాజంపేట, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, వేంపల్లె, రాయచోటి, బద్వేలు తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. ఇటు ఏరియా ఆస్పత్రులతోపాటు అటు పీహెచ్‌సీల్లో కూడా ఇదే సమస్య ఉంది. జిల్లాలో 166 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, దాదాపు 20 మందికి పైగా డాక్టర్లు ఇతర ప్రాంతాలకు పీజీ కోర్సుల నిమిత్తం వెళ్లారు. అంతేకాకుండా పులివెందుల ఏరియా ఆస్పత్రిలో 18 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరిగినా నేరుగా కడపకు సిఫార్సు చేయడం తప్ప స్థానికంగా శస్త్ర చికిత్సలు చేసే పరిస్థితి లేదు. జిల్లాలోని ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తుండడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వంద మందికిపైగా ఏఎన్ఎంల కొరత ఉంది. 84 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో మందుల కొరతతో రోగుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగాా ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులే నిరుపేద రోగులకు దిక్కుగా మారాయి. డాక్టర్లు సూచించే మందులు చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండకపోవడంతో రోగులు ఆర్థిక భారమైనా తప్పనిసరి పరిస్థితిలో మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
మింగ మాత్రలేదు
సాక్షి, గుంటూరు : ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయించే రోగులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. స్వైన్ ఫ్లూ, కంఠసర్పి వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం మందులు సరఫరా చేయలేక వైద్య ఆరోగ్యశాఖ చేతులెత్తేస్తోంది. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక, బహిరంగ మార్కెట్లో మందులు కొనలేక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కావటం, జిల్లాలో ఓ మహిళ, పొరుగున ప్రకాశం జిల్లాలో మరో యువకుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో మృతిచెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాధిపట్ల జిల్లా వాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జిల్లా మహిళ స్వైన్‌ఫ్లూతో చనిపోలేదని అధికారులు నిర్ధారించినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం పోలేదు. ఈ వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితే ముందుగా చికిత్స చేసే వైద్య సిబ్బందికి టామిఫ్లూ వ్యాక్సిన్‌ను వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుంటూరు జ్వరాల ఆసుపత్రిలో ఉన్న కొద్దిపాటి వ్యాక్సిన్ సిబ్బందికే సరిపోయే పరిస్థితి లేదు. ఇంక రోగులకు వేయడానికి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి తేవాలో అధికారులకే తెలియాలి. ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే సరఫరా చేయాలని బహిరంగ మార్కెట్లో అమ్మకూడదన్న నింబధనలతో మరింత ఇబ్బందిగా మారింది. కంఠసర్పి నివారణా మందులూ లేవు.. చిన్న పిల్లల్లో అధికంగా వచ్చే ప్రాణాంతక కంఠసర్పి వ్యాధికి కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు లేవు. ఈ వ్యాధి సోకిన పిల్లలకు బరువు ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది డోస్‌లు యాంటి డిఫ్తీరియల్ సీరమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఒక్కో డోస్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.10వేల వరకు ఉంది. అంత ఖరీదైన మందులు కొనుగోలు చేసే శక్తి లేకపోవడం పేద ప్రజలకు సమస్యగా మారింది. పిచ్చికుక్క కరిచినప్పుడు బ్రేక్-3 బైట్స్‌కు ఇమ్మినో గ్లోబిన్ వ్యాక్సిన్‌ను ఏడు నుంచి ఎనిమిది డోసులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో కొరతగానే ఉంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీర్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
మెదక్ మున్సిపాలిటీ: వైద్యులు నిస్వార్థంగా పని చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం శూన్యమని డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ రాహుల్ బొజ్జాతో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఆస్పత్రి వై ద్యులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీల్లో ఉన్న సమస్యలతో పాటు వైద్యుల పని తీరుపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వైద్యులదేనన్నారు. చాలా చోట్ల వైద్యులు మొక్కుబడిగా పని చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రామాయం పేట పీహెచ్సీ పని తీరు రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యులను వెంటనే బదిలీ చేయాలని అక్కడే ఉన్న డీఎంహెచ్ఓకు సూచించారు. వైద్యులు పని తీరు మెరు గు పరుచుకోవాలని లేనిపక్షంలో చర్య లు తప్పవన్నారు. పలు పీహెచ్‌సీల్లో ఓపీ రోగులను చూడకపోయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో వస్తున్నట్లు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు. మెదక్ ఏరియా ఆస్ప త్రి పని తీరు గతంలో కన్నా కొంత మెరుగైనప్పటికీ రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో అంబులెన్స్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్యవృత్తి పవిత్రమైందన్నారు. మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు కింది సిబ్బందిని తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. వైద్యులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు సాధిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాలన్నారు. త్వరలో మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఒక చిన్న పిల్లల వైద్యుడు, జనరల్ ఫిజిషియన్, అనస్థీషియా నిపుణుడిని నియమించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, డీసీఏహెచ్ నరేంద్ర బాబు, ఎన్ఆర్హెచ్ఎం డీపీఓ జగన్నాథం, ఈఈ రఘు, డిప్యూటీ ఈఈ రమేశ్, ఆర్డీఓ నగేశ్ గౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ లావణ్య రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, వివిధ ఆస్పత్రుల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అర్హులందరికి అసరా వర్తింపు చిన్నశంకరంపేట: ‘ఆసరా’ పథకం కింద అర్హులందరికీ పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలం శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో పేర్లు లేనంత మాత్రాన ఆందోళన చెందవద్దన్నారు. మరో సారి దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు అందించేందుకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 15 వందలు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని అసరా పథకం కింద పింఛన్ అందించి ఆదుకుంటామన్నారు. నియోజకవర్గలో రూ.125 కోట్లతో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ నగేష్, ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరుప, శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల సర్పంచ్‌లు మూర్తి పెద్దులు, సిద్దాగౌడ్, ఎంపీటీసీలు యాదమ్మ సత్యగౌడ్, పెంటమ్మ, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ మోహన్, సర్పంచ్‌లు రంగారావు, సత్యనారాయణ,నాగరాజ్, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వికటించిన కు.ని.
ఎల్కతుర్తి : ‘నాభార్య రానన్నా పదిసార్లు ఫోన్ చేశారు. చిన్న ఆపరేషనే అని చెప్పారు. బలవంతంగా తీసుకెళ్లి ఆపరేషన్ చేరుుంచారు. ఇప్పుడు పెద్ద ప్రాణాలే పోయూరుు. నా పిల్లలకు ఎవరు దిక్కు’ అంటూ ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి లలిత భర్త లక్ష్మణ్ రోదించాడు. కు.ని. ఆపరేషన్ వికటించి ఆదివారం లలిత చనిపోగా బంధువులు హుజూరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబం, గ్రామస్తుల కథనం ప్రకారం... మండలంలోని సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి లలిత(28), లక్ష్మణ్ దంపతులకు అంజలి(5), కార్తీక్(ఒకటిన్నర ఏళ్లు) ఉన్నారు. ఈ క్రమంలో గ్రామ ఆశ కార్యకర్త శారద కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది. అందుకు లలిత ఒప్పుకోకపోరుునా ఆశ కార్యకర్త మాత్రం ఈ నెల 21న హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ కరీంనగర్ నుంచి వచ్చిన వైద్యులు కు.ని. ఆపరేషన్ చేశారు. లలిత ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని ఆశ కార్యకర్తకు తెలుపగా ఆమె రాలేదు సరికదా ఏఎన్ఎం, వైద్యాధికారికి సమాచారం ఇవ్వలేదు. దీంతో లలిత పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం మూత్రవిసర్జన కోసం లేచే ప్రయత్నం చేయగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మర్గమధ్యలోనే మృతి చెందింది. ఈవిషయమై బాధితులు వైద్య సి బ్బంది, ఆశ కార్యకర్తపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇందులో ఏఎన్ఎం హుజూరాబాద్ వైద్య సిబ్బందికి ఫోన్ చేయగా తాము రూ.25 వేలు ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేసేందుకు మృతదేహంతో హుజూ రాబాద్‌కు తరలి వెళ్లారు. ఈ విషయమై స్థానిక మండల వైద్యాధికారి లతను వివరణ కోరేం దుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. మృతదేహంతో రాస్తారోకో హుజూరాబాద్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చెల్పూరి లలిత(28) మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆదివారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మృతదేహంతో రాస్తారోకో చేశారు. ఎల్కతుర్తి మండలం సూరారానికి చెందిన చెల్పూరి లలిత శుక్రవారం హుజూరాబాద్ సివిల్ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంది. ఆపరేషన్ తర్వాత వాంతులు, విరోచనాలు అయ్యాయని, పరిస్థితి విషమించడంతో ఆదివారం హన్మకొండకు తరలిస్తుంటే మార్గమధ్యలో మృతిచెందిందని మృతురాలి భర్త లక్ష్మణ్ విలపించాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ భీంశర్మ, ఎస్సైలు జగదీశ్, రాజేందర్ అక్కడికి వచ్చి ఆందోళన విరమింపజేశారు. -
స్టాఫ్‌నర్స్ అనుమానాస్పద మృతి
భర్త వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ చిట్వేలి: మండల కేంద్రమైన చిట్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న రమ్యశ్రీ(31) మంగళవారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు...శ్రీకాళహస్తికి చెందిన రమ్యశ్రీ చక్రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తూ ఒకటిన్నర సంవత్సరం కిందట బదిలీపై చిట్వేలికి వచ్చింది. స్థానిక క్వార్టర్స్‌లోనే నివాసం ఉండేది. తల్లిదండ్రులు రాజేశ్వరి(కాళహస్తిలో హెల్త్‌సూపర్‌వైజర్), బత్తినయ్యలు తమ కుమార్తె రమ్యశ్రీని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్‌టెక్నిషియన్‌గా పని చేస్తున్న నరసింహరావుతో 2009ఆగస్టు 15వ తేదీన వివాహం జరిపిం చారు. రమ్యశ్రీ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన చిట్వేలికి చేరుకున్నారు. తమ కుమార్తె మృతికి భర్త వేధిం పులే కారణమని ఆరోపించారు. వివాహ సమయంలో ఇరవై తులాల బంగారు, రూ.2లక్షల నగదు వరకట్నంగా ఇచ్చామన్నారు. అయినా చీటికి మాటికి తమ కుమార్తెను వేధిస్తూ పలు ఇబ్బందులకు గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం తమ కుమార్తె తమకు ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని, మీరు రావాలని కోరినట్లు చెప్పారు. మంగళవారం వస్తాములే అని చెప్పామని, అంతలోనే తమ కుమార్తె శవమై మిగిలిందని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే ఏదో ఒక రూపంలో హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ఈ విషయమై చుట్టు పక్కల వారిని విచారించగా తరచూ భార్యభర్తలు గొడవ పడే వారని, గొడవ అనంతరం తిరిగి బాగా కలసిమెలసి ఉండేవారని తెలిపారు. మృతురాలి భర్త నరసింహరావుకు మంగళవారం తెల్లవారుజామున భార్య కాఫీ ఇచ్చిందని, అనంతరం తాను బాత్రూములోకి వెళ్లగా భార్య వాం తులు చేసుకుంటూ కిందపడిపోవడంతో ఇరుగు పొరుగు వారిని పిలిచి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చామని తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించేలోపు మృతి చెం దినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా రమ్యశ్రీ పిల్లలు మురారి(4), ఉషాకిరణ్మయి(2)లు మాత్రం అమాయకంగా ఆడుకుంటుంటుండగా చుట్టుపక్కల వారు అయ్యో పాపం, ఇక వారి ఆలనా, పాలనా ఎవరు చూసుకుంటారోనని బాధపడ్డారు. -
ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోండి
జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి రాజంపేట రూరల్: జిల్లాలోని అర్హులైన రోగులు ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ టీ.వెంకటరమణారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారిని పిలిపించి వారికి కల్పించిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీని వినియోగించే రోగులకు ఖర్చులు రూ.2 లక్షలు నుంచి రూ.2.50లక్షలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన ఆరోగ్యశ్రీ ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి 2014సెప్టెంబర్ 18వ తేదీ వరకు 80వేల మంది రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందారన్నారు. వీరికి సుమారు రూ.20,029కోట్లు ఖర్చు అయిందన్నారు. ఆరోగ్యశ్రీని జిల్లాలోని వారు కడప, తిరుపతి ఆసుపత్రుల్లో చికిత్సలు పొందవచ్చునన్నారు. కడపలోని రిమ్స్ వైద్యశాలలో అన్ని స్పెషాలిటీ కేసులను చూస్తారన్నారు. హిమాలయ హాస్పిటల్లో ప్రమాదగాయాలు, శస్త్రచికిత్సలు, గర్భకోశ వ్యాధులు, యూరాలజీ, న్యూరాలజీ సమస్యలు, అదే విధంగా వీటితో పాటు భారతి హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు, తిరుమల హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరీక్షలు నిర్వహించుకోవచ్చునన్నారు. ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటల్లో చిన్నపిల్లల జబ్బులు అదనంగా చూస్తారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20వేల మంది రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందారన్నారు. వీరికి సుమారు రూ.45కోట్లు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ టీమ్ లీడర్ ఎస్ఎం తాజుద్దిన్, ఆరోగ్య మిత్ర కో-ఆర్డినేటర్ డీసీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కల్పించండి
విజయవాడ : ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌ను పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు (జూడాలు) కోరారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు వస్తే వైద్యం చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని వివరించారు. ప్రభుత్వాస్పత్రిలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం జరుగుతుండగా జూడాలు కాంత్రి, స్నిగ్ధ, మనోజ్, తనోజ్ తదితరులు మంత్రి వద్దకు వెళ్లి ఆస్పత్రిలోని సమస్యలను ఏకరువు పెట్టారు. రోగి ప్రాణాపాయస్థితిలో వస్తే వైద్యం చేసేందుకు పరికరాలు లేవని, ఏడు వెంటిలేటర్లు ఉంటే ఒక్కటే పనిచేస్తోందని, అత్యవసర మందులు సైతం అందుబాటులో లేవని, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు లేరని, వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రాంగణంలో డ్రెయినేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వివరించారు. స్పందించిన మంత్రి కామినేని ఈ విషయంలో తానేమీ మాట్లాడలేకపోతున్నానని, ఇన్ని సమస్యలు ఉంటే ఏమి చేస్తున్నారని బాధ్యులను ప్రశ్నించారు. వాటిని పరిష్కరించేందుకు రూ.10 కోట్లు అవసరమని ఏపీహెచ్‌ఎండీసీ ఇంజినీర్లు తెలపగా, తక్షణమే రూ.కోటి వెచ్చించి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కూడా ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, సివిల్‌సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ సావిత్రమ్మ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరసిజాక్షి, ఏపీహెచ్‌ఎండీసీ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ నాంచారయ్య, జిల్లాలోని క్లస్టర్ అధికారులు, వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు. -
108కూ నిర్లక్ష్యం జబ్బు
చిత్తూరు(సిటీ): రోగులు, క్షతగాత్రుకు ప్రాణంపోసే 108 సిబ్బందిలోనూ నిర్లక్ష్యం జబ్బు పట్టుకుంటోంది. వింతవ్యాధితో బాధపడుతున్న ఓరోగిని అత్యవసరంగా తిరుపతి రుయా వైద్యశాలకు తీసుకెళ్లాలని, లేని పక్షంలో ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు చెప్పినా కాణిపాకం 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనం...వివరాలలోకి వెళ్లితే... నగర పరిధిలోని శ్రీలంక కాలనీకి చెందిన సోమనాథం, ఒరిస్సాకు చెందిన కీర్తన ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తన నాలుగు నెలల క్రితం ఒరిస్సాలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు పుట్టినప్పటి నుంచి కీర్తన వింత వ్యాధితో బాధపడుతోంది. దీంతో కీర్తనను చికిత్స నిమిత్తం మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేర్పించారు. అయితే ఆమె పరిశీలించిన వైద్యులు, రోగి స్థితి సీరియస్‌గా ఉందని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకుపోవాలని సిఫార్సు చేశారు. రోగిని తిరుపతికి తరలించడానికి డబ్బు లేక అల్లాడుతున్న నిరుపేద ముత్తు పరిస్థితిని చూసి చలించిన డాక్టర్ 108కు ఫోన్ చేశారు. అప్పటికే వైద్యశాలలో ఉన్న కాణిపాకం రూట్ వాహనంలో రోగిని తీసుకెళ్లేందుకు ఉపక్రమించారు. అయితే తమ వాహనంలో రోగిని తిరుపతికి తీసుకెళ్లేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ, అ వాహ నం సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి చూసి స్పందించారు. డాక్టర్లతో చర్చించడంతో పాటు, కొంత ఆర్థిక సహాయం చేసి, చిత్తూరు వైద్యశాల అంబులెన్స్‌లో తిరుపతికి తరలింపజేశారు. -
నువ్వేనా! నేను చేసుకోలేనా?!
నెల క్రితం మధ్యప్రదేశ్‌లో ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగిన తగాదా ఇది! నెల క్రితం అయితే ఇప్పుడెందుకు? నెల తర్వాత బయటపడింది కాబట్టి. ఎక్కడో మధ్యప్రదేశ్‌లో బయటపడితే ఇక్కడ మనకెందుకు? మన దగ్గర కూడా అప్పుడప్పుడు మగవాళ్లు గరిటెను గదలా భుజంపై వేసుకుని వంటగదిలోకి ప్రవేశిస్తుంటారు కాబట్టి. విషయంలోకి వస్తే... జితేంద్రపటేల్ (30), ఉమా పటేల్ (27) భార్యాభర్తలు. చూడచక్కని జంట. రెండేళ్లు ప్రేమించుకుని 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. దంపతుల మధ్య చక్కటి అవగాహన ఉంది. అన్యోన్యం అంటారే... అలాంటి దాంపత్యం.అయితే మే 4న వారిద్దరి మధ్య చిన్న తగాదా జరిగింది. పిల్లలు మధ్యలోకి వచ్చేయడంతో అప్పటికి వారు మౌనంగా ఉండి పోయారు. మర్నాడు ఉదయం జితేంద్ర, ‘‘త్వరగా టిఫిన్ చేస్తే, తినేసి వెళ్తాను’’ అన్నాడు. ఉమ మాట్లాడలేదు. మౌనాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంది. ‘‘ప్లీజ్’’ అన్నాడు. ఉమ ఉలకలేదు. ఇంకోసారి ‘‘ప్లీజ్’’ అంటే కరిగిపోయేదేమో కానీ, జితేంత్ర సడెన్‌గా కిచెన్‌లోకి వెళ్లిపోయాడు. ‘‘నువ్వు చెయ్యకపోతే, నాకు చేసుకోవడం రాదనుకున్నావా?’’ అని గిన్నెలు, గరిటెలు అందుకున్నాడు. అప్పుడొచ్చింది ఉమకు కోపం. తన టిఫిన్ తనే చేసుకుంటానని జితేంద్ర అన్నందుకు కాదు ఆమెకు కోపం వచ్చింది. భర్త వంటగదిలోకి వెళ్లినందుకు! ‘‘సిగ్గుందా నీకు?’’ అంటూ వెంటనే అతడి మీద పడి ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అతడి నడుము చుట్టూ టవల్ మాత్రమే ఉంది. అది ఊడిపోయింది! ఉమ కోపం తగ్గలేదు. ఎక్కడ కొడుతున్నదో చూసుకోకుండా, కొట్టరాని చోట భర్తని కొట్టేసింది! నిజానికి ఆమె కొట్టలేదు. ఒళ్లు తెలియని కోపంలో కొరికింది.సత్నా జిల్లాలోని పగ్రా గ్రామంలో మే 5న జరిగిన ఈ దురదృష్టకర సంఘటన దాదాపు నెల తర్వాత జూన్ 2న జితేంద్ర జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు మాత్రమే బయటపడింది. అంతవరకు అతడు తన స్నేహితుల సలహాపై నాటు మందులు వాడుతున్నాడు. కానీ వాపు తగ్గలేదు. నొప్పి కూడా ఎక్కువైంది. సెప్టిక్ కూడా అయింది. అప్పుడు కూడా అతడు ఆసుపత్రికి వెళ్లకపోయేవాడే కానీ, ఓ అంతరంగిక స్నేహితుడు తన మిడిమిడి జ్ఞానంతో, పురుషాహంకారంతో అతడికో భయం పెట్టాడు. ‘‘ఆడవాళ్ల దంతాలలో విషం ఉంటుంది. ఆ విషం క్రమక్రమంగా ఒళ్లంతా వ్యాపిస్తే ప్రాణాలకే పమాదం’’ అని చెప్పాడు. దాంతో పరువు కన్నా ప్రాణం ముఖ్యం అనుకున్న జితేంద్ర జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరిన తగాదా కేసులు పోలీస్‌స్టేషన్‌కు చేరకుండా ఉంటాయా! కానీ అంతకంటే ముందే ఉమ తన వల్ల తన భర్తకు జరిగిన గాయం విషయం గురించి పోలీసులకు చెప్పింది. పిచ్చి ఆవేశంలో అలా చేశానని ఉన్న విషయం చెప్పడంతో ఆమెకు బెయిలు కూడా వచ్చింది. ఇప్పుడు బాధపడుతూ భర్త పక్కనే కూర్చొని సపర్యలు చేస్తోంది. జితేంద్రకు డాక్టర్లు చిన్న సర్జరీ చేసి అతడిని గట్టెక్కించారు. కానీ అతడిక ఎప్పటికీ వంటగదిలోకి వెళ్లే సాహసం చేయలేకపోవచ్చు. -
ప్రభుత్వాసుపత్రుల్లో ఇద్దరి మృతి
కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ :కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, సకాలంలో వైద్యం అందించలేదని బం ధువులు ఆరోపించారు. మృతురాలి కుమారు డు రమేష్ కథనం ప్రకారం.. ఎల్కతుర్తి మం డలం జీల్గులకు చెందిన పంజాల సమ్మక్క (55) తీవ్ర జ్వరంతో సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించి ఐడీ వార్డులో చేర్చుకున్నారు. అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడం తో వరండాలో మంచం కేటాయించారు. ప్రిస్క్రిప్షన్ ప్రకారం.. సిబ్బంది ఇంజిక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించారు. సాయంత్రమైనా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో బంధువులు మరోమారు డాక్టర్‌కు సమాచారమందించారు. తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశాడు. ఆస్పత్రి సిబ్బంది సమ్మక్కకు వెంటిలేటర్ అమర్చారు. రాత్రి ఏడు గంటల నుంచి దాహందాహం అంటూ అరుస్తూనే ఉంది. మంగళవారం వేకువజామున 15 గ్లాసుల నీరు తాగించారు. వెంటిలేటర్ ఉన్నా శ్వాస తీసుకోలేక కొట్టుకుంటూనే ఉంది. విషయాన్ని డ్యూటీ డాక్టర్‌కు తెలపగా.. మరో రెండు ఇంజిక్షన్లు ఇచ్చారు. జనరల్ వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ప్రాణాలు కాపాడాలని డాక్టర్‌ను వేడుకున్నా.. అక్కడ బెడ్లు ఖాళీగా లేవంటూ వెళ్లిపోయాడు. పరిస్థితి విషమించి మధ్యాహ్నం ఒంటి గంటకు సమ్మక్క మృతిచెందింది. వైద్యమందక సమ్మక్క కొట్టుకుంటున్నా డాక్టర్లు పట్టించుకోలేదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లినా తన తల్లి ప్రాణాలు దక్కేవని రమేష్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కొండల్‌రెడ్డిని వివరణ కోరగా.. సమ్మక్క గుండె జబ్బుతోపాటు తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని, వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పినా బంధువులు పట్టిం చుకోలేదని, వైద్యుల తప్పులేదని అన్నారు. కోల్‌సిటీ, న్యూస్‌లైన్ :గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జాడి మల్లయ్య(65) మంగళవారం రాత్రి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రామగుండం మండలం తక్కల్లపల్లికి చెందిన మల్లయ్య మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు అందుబాటులో లేరని, నర్సులే చికిత్స అందించారని, డాక్టర్ పర్యవేక్షణ లేకపోడంతో తన తండ్రి మృతి చెందాడని కుమారుడు వెంకటేష్ ఆరోపించాడు. వన్‌టౌన్ ఎస్సై వలీబాబా డ్యూటీ డాక్టర్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తీసుకుపోవాలని బంధువులకు చెప్పినట్లు డ్యూటీ డాక్టర్ వెల్లడించారు. ఇందులో వైద్యం నిర్లక్ష్యం లేదని, తను చెప్పడంతోనే నర్సింగ్ సిబ్బంది చికిత్స అందించారని డాక్టర్ వివరించారు. అందుబాటులో లేని డాక్టర్‌పై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు పేర్కొన్నారు. చివరికి ఎస్సై జోక్యంతో కుటంబసభ్యులు శాంతించారు.