నువ్వేనా! నేను చేసుకోలేనా?!
నెల క్రితం మధ్యప్రదేశ్‌లో ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగిన తగాదా ఇది! నెల క్రితం అయితే ఇప్పుడెందుకు? నెల తర్వాత బయటపడింది కాబట్టి. ఎక్కడో మధ్యప్రదేశ్‌లో బయటపడితే ఇక్కడ మనకెందుకు? మన దగ్గర కూడా అప్పుడప్పుడు మగవాళ్లు గరిటెను గదలా భుజంపై వేసుకుని వంటగదిలోకి ప్రవేశిస్తుంటారు కాబట్టి.
విషయంలోకి వస్తే...
జితేంద్రపటేల్ (30), ఉమా పటేల్ (27) భార్యాభర్తలు. చూడచక్కని జంట. రెండేళ్లు ప్రేమించుకుని 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. దంపతుల మధ్య చక్కటి అవగాహన ఉంది. అన్యోన్యం అంటారే... అలాంటి దాంపత్యం.అయితే మే 4న వారిద్దరి మధ్య చిన్న తగాదా జరిగింది. పిల్లలు మధ్యలోకి వచ్చేయడంతో అప్పటికి వారు మౌనంగా ఉండి పోయారు. మర్నాడు ఉదయం జితేంద్ర, ‘‘త్వరగా టిఫిన్ చేస్తే, తినేసి వెళ్తాను’’ అన్నాడు.
ఉమ మాట్లాడలేదు. మౌనాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంది. ‘‘ప్లీజ్’’ అన్నాడు. ఉమ ఉలకలేదు. ఇంకోసారి ‘‘ప్లీజ్’’ అంటే కరిగిపోయేదేమో కానీ, జితేంత్ర సడెన్‌గా కిచెన్‌లోకి వెళ్లిపోయాడు. ‘‘నువ్వు చెయ్యకపోతే, నాకు చేసుకోవడం రాదనుకున్నావా?’’ అని గిన్నెలు, గరిటెలు అందుకున్నాడు. అప్పుడొచ్చింది ఉమకు కోపం. తన టిఫిన్ తనే చేసుకుంటానని జితేంద్ర అన్నందుకు కాదు ఆమెకు కోపం వచ్చింది. భర్త వంటగదిలోకి వెళ్లినందుకు!
‘‘సిగ్గుందా నీకు?’’ అంటూ వెంటనే అతడి మీద పడి ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలుపెట్టింది. ఆ సమయంలో అతడి నడుము చుట్టూ టవల్ మాత్రమే ఉంది. అది ఊడిపోయింది! ఉమ కోపం తగ్గలేదు. ఎక్కడ కొడుతున్నదో చూసుకోకుండా, కొట్టరాని చోట భర్తని కొట్టేసింది! నిజానికి ఆమె కొట్టలేదు. ఒళ్లు తెలియని కోపంలో కొరికింది.సత్నా జిల్లాలోని పగ్రా గ్రామంలో మే 5న జరిగిన ఈ దురదృష్టకర సంఘటన దాదాపు నెల తర్వాత జూన్ 2న జితేంద్ర జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినప్పుడు మాత్రమే బయటపడింది. అంతవరకు అతడు తన స్నేహితుల సలహాపై నాటు మందులు వాడుతున్నాడు. కానీ వాపు తగ్గలేదు. నొప్పి కూడా ఎక్కువైంది. సెప్టిక్ కూడా అయింది. అప్పుడు కూడా అతడు ఆసుపత్రికి వెళ్లకపోయేవాడే కానీ, ఓ అంతరంగిక స్నేహితుడు తన మిడిమిడి జ్ఞానంతో, పురుషాహంకారంతో అతడికో భయం పెట్టాడు.
‘‘ఆడవాళ్ల దంతాలలో విషం ఉంటుంది. ఆ విషం క్రమక్రమంగా ఒళ్లంతా వ్యాపిస్తే ప్రాణాలకే పమాదం’’ అని చెప్పాడు. దాంతో పరువు కన్నా ప్రాణం ముఖ్యం అనుకున్న జితేంద్ర జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరిన తగాదా కేసులు పోలీస్‌స్టేషన్‌కు చేరకుండా ఉంటాయా! కానీ అంతకంటే ముందే ఉమ తన వల్ల తన భర్తకు జరిగిన గాయం విషయం గురించి పోలీసులకు చెప్పింది. పిచ్చి ఆవేశంలో అలా చేశానని ఉన్న విషయం చెప్పడంతో ఆమెకు బెయిలు కూడా వచ్చింది. ఇప్పుడు బాధపడుతూ భర్త పక్కనే కూర్చొని సపర్యలు చేస్తోంది. జితేంద్రకు డాక్టర్లు చిన్న సర్జరీ చేసి అతడిని గట్టెక్కించారు. కానీ అతడిక ఎప్పటికీ వంటగదిలోకి వెళ్లే సాహసం చేయలేకపోవచ్చు.