ఏడు రోజులు...ఏడు రంగులు
- ఆసుపత్రుల్లో రోజుకో రంగు బెడ్‌షీట్
- పరిశుభ్రత కోసం ప్రతీ రోజూ మార్చేలా ఈ విధానం
- రాష్ట్రంలో 20 వేల పడకలకు రెండు సెట్ల రంగు రంగు దుప్పట్లు
- టెండర్ల ప్రకియ మొదలు... చర్లపల్లి జైలు ఖైదీల నుంచీ కొనుగోలు
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలపై ఇక నుంచి రంగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం తెల్లరంగు బెడ్‌షీట్లు మాత్రమే వాడుతుండగా... ఇకనుంచి వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లూ కనిపించనున్నాయి. ఆసుపత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇతర రోగులు వాడిన దుప్పట్లనే మరో రోగి వాడుతోన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటు వ్యాధులకు గురవుతున్నారు.
ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ రోజూ ఆసుపత్రుల్లోని పడకలపై బెడ్‌షీట్లను మార్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని ఆయన ఆదేశించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు వాడితే తప్పనిసరిగా దుప్పట్లను ఉతికి ఆరేస్తారని... రోజుకో రంగు దుప్పటి వాడాలన్న నిర్ణయం వల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారంలో ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే ఆసుపత్రి సిబ్బంది దుప్పట్లను ప్రతీ రోజూ మార్చుతూ... మార్చిన వాటిని ఉతికేయించి మరో వారానికి సిద్ధంగా ఉంచుతారు. 20 వేల పడకలకు రంగు రంగుల దుప్పట్లు... కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ విధానాన్ని దేశంలోని 19 ప్రధాన ఆసుపత్రుల్లో అమలు చేస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఛండీఘర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకే షన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ ఈ విధానం అమలవుతోంది.
ఆయా ఆసుపత్రుల్లో సోమవారం తెల్ల దుప్పటి, మంగళవారం గులాబీ, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం ఊదా లేదా మరో రెండు రంగులు, శనివారం నీలం, ఆదివారం లేత బూడిదరంగు లేదా మరో రంగును వాడుతున్నారు. కొద్దిపాటి మార్పులు చేసి ఆ ప్రకారమే రాష్ట్రంలోనూ అమలుచేస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్, సరోజినీ దేవి వంటి పెద్దాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏకంగా 8,374 పడకలున్నాయి.
అందులో ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే 1168, నిమ్స్‌లో 1500 పడకలున్నాయి. జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 1900 పడకలున్నాయి. 750 వరకు ప్రాథమిక ఆసుపత్రులుండగా... వాటిల్లో కొన్నింటినీ 30 పడకల వరకు పెంచుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ రంగు రంగుల బెడ్‌షీట్లు రానున్నాయి. టెండర్ల ప్రక్రియ మొదలు... అన్ని ఆసుపత్రుల్లోనూ ఏడు రోజులు ఏడు రంగుల బెడ్‌షీట్లను రెండు సెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఒక సెట్టు ఎప్పుడూ రిజర్వులో ఉంచుతారు. రంగు బెడ్‌షీట్లను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. తక్కువ కోట్ చేసిన కంపెనీ నుంచి బెడ్‌షీట్లను కొనుగోలు చేస్తారు. చర్లపల్లి జైలులో ఖైదీలు బెడ్‌షీట్లు తయారు చేస్తున్నందున వారి నుంచి ఎన్ని వీలైతే అన్ని కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పడకకు ఏడు దుప్పట్లు రెండు సెట్ల చొప్పున 20 వేల పడకలకు 2.80 లక్షల రంగు దుప్పట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.