bed sheets
-
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు
సాక్షి, అమరావతి: మానవ విజ్ఞానం క్షణానికో సరికొత్త ఆవిష్కరణతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది. ప్రస్తుతం విద్యుత్ యుగం నడుస్తోంది. మోటార్లు, స్కూటర్లు, ఏసీలు, మొబైళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల విద్యుత్‌తో పనిచేసే పరికరాలు మనుషులకు అందుబాటులో ఉన్నాయి. బొగ్గుతోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యంపై ఆందోళన మొదలై కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కూడా ఖర్చుతో కూడుకున్నదే కావడంతో అసలు విద్యుత్ అవసరమే లేకుండా పనులు జరిగిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కొన్ని దేశాల్లో శాస్త్రవేత్తలను కొత్త ప్రయోగాలకు పురిగొల్పింది. దేశ, విదేశాల్లో వెలుగుచూస్తున్న అలాంటి సరికొత్త ఆవిష్కరణల్లో కొన్ని ఇవి. కూలింగ్ దుప్పట్లు మంచంపై వేసే దుప్పటి సరైనది కాకపోతే ఉక్కపోతకు గురికావాల్సి వస్తుంది. వెంటనే ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. కానీ కరెంట్ లేకుండానే, ఏసీ వేయకుండానే మనల్ని అచ్చం ఏసీలా కూల్ చేసే బెడ్ షీట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బెడ్‌షీట్‌ను చాలా తక్కువ ధరకు ఆన్లైన్, ఆఫ్లైన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.1,500. కొన్ని ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో రూ. 699కే లభిస్తోంది. ఇది జెల్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. దీనిని ఉపయోగించిన నిమిషాల్లోనే మనకు చల్లదనాన్ని అందిస్తుంది. మురికిగా అయితే, దానిని పొడి గుడ్డతో సులువుగా శుభ్రం చేయవచ్చు. ఏసీ లేకుండానే ఇల్లు కూల్ విద్యుత్ బిల్లులకు భయపడి ఏసీలకు దూరంగా ఉండే సామాన్యుల కోసం గువహటి ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనిపెట్టారు. రేడియేటివ్ కూలర్ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా ఇంటి మొత్తానికీ చల్లదనం అందిస్తుందని వారు చెబుతున్నారు. ఇలాంటి విధానాలను ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’ అని పిలుస్తున్నారు. పరిసరాల్లోని వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేసే సాంకేతికత ఇందులో ఉంటుంది. ఈ రేడియేటివ్ కూలర్ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయట. కరెంటు అక్కర్లేని ఏసీ ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని ప్రస్తుతం నాలుగు గోడల మధ్య వినియోగిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో వినియోగించేందుకు టవర్ కూలర్లు ఉన్నప్పటికీ వాటికి చాలా విద్యుత్ అవసరం. ఆరుబయట విద్యుత్ అవసరం లేకుండా ఏసీ పెట్టుకుని పరిసరాలను చల్లగా మార్చవచ్చంటోంది ఇజ్రాయెల్‌కు చెందిన కెన్షో కంపెనీ. ఈ కంపెనీ లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీని అభివృద్ధి చేసింది. ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో ద్రవ నత్రజని –196 డిగ్రీల వద్ద ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది. ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది. ఈ ఏసీలకు ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయట. -
సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే!
శరీరారోగ్యానికి సుఖనిద్ర ఎంతో అవసరం. మరి సుఖ నిద్ర కావాలంటే సరైన పడక కూడా అవసరమే! కేవలం సుఖ నిద్రకే కాకుండా, ఆరోగ్యానికి సైతం పడక పరిశుభత్ర అవసరమన్నది నిపుణుల మాట. కానీ కొంతమంది మాత్రమే పడకను పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటుతో ఉంటారు. చాలామందికి, ముఖ్యంగా యువతలో ఈ పడక పరిశ్రుభత చాలా తక్కువ. తల్లితండ్రులకు దూరంగా ఉండే యువతలో బెడ్ హైజిన్‌పై అవగాహన, ఆసక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగిన బట్టలతో అలాగే పడుకోవడం, లేవగానే కనీసం బెడ్‌షీట్, దుప్పట్లను మడత పెట్టకుండా ఉండ చుట్టి పెట్టుకోవడం, దిండ్లను ఇష్టారీతిన నలిపి వాటి కవర్లను అపరిశుభ్రంగా ఉంచుకోవడం, పడుకునే పరుపు లేదా బొంతను ఎన్నాళ్లున్నా కనీసం దులపకపోవడం. అదే విధంగా బెడ్‌పైనే తినడం, తాగడం చేయడం, పడక దగ్గర రకరకాల వాసనలు వస్తున్నా క్లీన్ చేయకపోవడం.. వంటివన్నీ అనారోగ్యాలకు దారి తీసే అంశాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడకను చెత్తకుప్పలాగా మార్చడం ప్రమాదకరమన్నది నిపుణుల మాట. ప్రతిరోజూ నిద్రపోయిలేవగానే బెడ్‌పై మనిషి తాలుకా లాలాజలం, చెమట, చుండ్రు, మృత చర్మ కణాల్లాంటివి పడుతూ ఉంటాయి. వీటివల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బెడ్‌పై ఆవాసం ఏర్పరుచుకునే వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పడకను శుభ్రంగా ఉంచుకోకపోతే కోరి రోగాలు తెచ్చుకున్నట్లే! బ్యాక్టీరియా బాంబులు పలు రకాల బ్యాక్టీరియా జాతులకు మన పడకలు ఆవాసాలుగా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఉదాహరణకు స్టెఫైలోకోకస్ రకం బ్యాక్టీరియా పడకల్లో నివాసమేర్పురుచుకుంటుంది. ఇవి నిజానికి హానికారకమైనవి కావు, కానీ మనిషి శరీరంపైన ఏదైనా గాయం ద్వారా రక్తప్రసారంలోకి చేరితే మాత్రం తీవ్ర అనారోగ్యం కలిగిస్తాయి. స్టెఫైలోకోకస్ ఆరియస్ బ్యాక్టీరియా పడకపై చేరితే చర్మ సంబంధ వ్యాధులు, న్యుమోనియా, ఎన్నటికీ తగ్గని మొటిమలు వస్తుంటాయి. వీటిలో కొన్ని ప్రజాతులు యాంటిబయాటిక్స్‌కు కూడా తొందరగా లొంగనంతగా బలపడుతుంటాయి. ఇకోలి బ్యాక్టీరియా సైతం బెడ్‌పై కనిపిస్తుంది. ఇవి మనిషి పేగుల్లో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా. కానీ కొన్ని ప్రజాతులు మనిషిలో తీవ్రమైన మూత్రసంబంధిత వ్యాధులు, డయేరియా, మెనింజైటిస్ కలిగిస్తాయి. అందుకే నిద్రపోతున్నవారు మూత్రవిసర్జనకు మేల్కొంటే, తిరిగి పడుకోబోయేముందు కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. స్టెఫైలోకోకస్ కానీ, ఇ కోలి కానీ పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని బెడ్‌పైకి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలి. బాబోయ్ బెడ్ బగ్స్ మనిషి ప్రతిరోజు నిద్రలో దాదాపు 50 కోట్ల మృత చర్మ కణాలను రాలుస్తాడు. పడకల్లో దాగుండే నల్లులు, బెడ్బగ్స్కు ఈ మృతకణాలు మంచి ఆహారం. వీటివల్ల తక్షణ చర్మ సమస్యలు, అలెర్జీలు, ఆస్తమా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరోక్షంగా యాంక్జైటీ, ఇ¯Œ సోమ్నియాకు కూడా ఇవి కారణాలవుతాయన్నారు. బ్యాక్టీరియాల కన్నా పెద్దవైనా ఇవి మాములు కంటికి తొందరగా కనిపించవు. ఒక పడక నుంచి ఇంకో పడకకు కుటుంబ సభ్యుల ద్వారా ఇవి వ్యాపిస్తుంటాయి. పసిపిల్లల పడకలో ఇవి చేరితే మరింత ప్రమాదం. వారు కనీసం ఏం జరుగుతుందో కూడా అర్దం చేసుకోలేరు, బయటకు చెప్పలేరు. అందువల్ల ఈ బగ్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బాత్రూమ్ టవల్స్‌ను ఉండ చుట్టి బెడ్‌పై వేయడం వంటి అలవాట్లు పడకను పాడు చేస్తాయి. బ్యాక్టీరియా, బెడ్బగ్స్తో పాటు వైరస్‌లకు కూడా పడకలు నివాసాలుగా మారుతుంటాయి. వాక్సీనా లాంటి కొన్ని వైరస్‌లైతే శుభ్రం చేయని పడకల్లో 14 వారాలపాటు ఓపిగ్గా హోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏం చేయాలి? ► వ్యక్తిగత పరిశుభ్రత... అంటే ఎప్పటికప్పుడు కాళ్లు చేతులు కడుక్కోవడం, పొడిగా తుడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ∙పసిపిల్లల పడకలను రోజుకు రెండు మార్లు పూర్తిగా మార్చడం, వారికి వాడే దుప్పట్లు, కవర్లను జాగత్త్రగా పరిశీలించడం ఎంతో అవసరం. ►ప్రతిరోజూ పడకను శుభ్రపరుచుకోవాలి. బెడ్ షీట్ మార్చడం, బెడ్‌ను దులపడం, దుప్పట్లు మార్చడం, పిల్లో కవర్లు తాజాగా ఉంచుకోవడం చేస్తుండాలి. పడకపై వాడే దుప్పట్లు, కవర్లు రెండు మూడురోజులకొకసారి ఎండలో వేయాలి. చాప వాడే అలవాటుంటే దాన్ని సైతం ఎండలో ఆరవేయాలి. ► తడి కాళ్లతో పడకపైకి చేరడమంటే సూక్ష్మజీవులకు ఆహ్వానం పంపినట్లేనని గుర్తించాలి. ► పెద్ద పరుపులు, చాపలను ఉతకలేము కాబట్టి వాటికి సరిపడా కవర్లను వాడడం, ఆ కవర్లను తరచూ మారుస్తుండడం, వీలైనప్పుడు వీటిని ఎండలో వేయడం మరవకూడదు. ►వాక్యూమ్ క్లీనర్ ఉన్నవాళ్లు చాపలు, బెడ్స్‌ను వాక్యూమ్ చేయడం బెటర్. ► పెంపుడు జంతువులున్నవాళ్లు సాధ్యమైనంత వరకు వాటిని పడకలపై చేరకుండా జాగ్రత్త వహించాలి. ► మరీ పాతపడిపోయిన పరుపులు, చాపలు, దుప్పట్లు వాడకుండా కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవాలి. ► వీలైనప్పుడు కవర్లు, దుప్పట్లు బాగా మరిగించిన నీటిలో వేసి శుభ్రం చేయాలి. ► బయట నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా పడకెక్కడం, మేకప్ ఉంచుకొని పడుకోవడం, సరైన గాలిరాని ప్రదేశాల్లో పడక ఏర్పాటు చేసుకోవడం, బెడ్‌పై తినడం, తాగడం వంటి అలవాట్లు వెంటనే వదులుకోవాలి. ► శరీరం అలసిపోతే ఎక్కడైనా నిద్రవస్తుంది, అందుకని పడక పరిశుభ్రతపై అవగాహన అవసరం లేదని భావించకూడదు. బెడ్ హైజిన్ లోపిస్తే జరిగే అనర్ధాలు వెంటనే అర్దం కావు, అందువల్ల పడక పరిశుభ్రతపై పట్టింపు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డి. శాయి ప్రమోద్ -
కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో..
బ్రిస్బేన్ : క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేని ఓ వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. బెడ్ షీట్లను తాడుగా చేసి, నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి జంప్ అయ్యాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి గత సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాకు వచ్చాడు. అయితే, కరోనా నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. సదరు వ్యక్తి 48 గంటల్లోగా పశ్చిమ ఆస్ట్రేలియాను వదిలి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. అతడ్ని హుటాహుటిన క్వారంటైన్ హోటల్‌కు పంపారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికి క్వారంటైన్‌లోనే ఉంచారు. క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేని ఆ వ్యక్తి బయటకు వెళ్లటానికి ఓ ప్లాన్ వేసుకున్నాడు. బెడ్ షీట్ సహాయంతో ఓ తాడు తయారు చేసుకున్నాడు. తనుంటున్న నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి పారిపోయాడు. కానీ, మంగళవారం ఉదయం పోలీసులు అతడ్ని వెతికి పట్టుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చాడని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. -
క్వారంటైన్ కేంద్రాల్లో బయో డిస్పోజబుల్ బెడ్షీట్లు
సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లాలోని 32 క్వారంటైన్ కేంద్రాల్లో బయో డిస్పోజబుల్ బెడ్షీట్లను మాత్రమే వాడాలి. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. ప్రజారోగ్య సంరక్షణతో పాటు వైద్యుల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కోవిడ్ అడ్డుకట్టకు జిల్లాలో చేపట్టిన చర్యలపై మంత్రి శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎన్ని శాంపిల్ టెస్టింగ్ టీమ్‌లు ఉన్నాయి? మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారా? లేదా. ఆయా కేంద్రాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుమానితుల నుంచి సేకరించిన శాంపిల్స్ టెస్టింగ్ పర్యవేక్షణకు అదనపు డీఎంహెచ్ఓను నియమించాలని ఆదేశించారు. జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనులు పూర్తి చేసి కోవిడ్ పాజిటివ్ కేసుల చికిత్సకు సిద్ధం చేయాలన్నారు. చదవండి: భౌతిక దూరం పాటించండి నోడల్ ఆఫీసర్‌ను నియమించండి క్వారంటైన్ కేంద్రాల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. కేంద్రాల్లో ఉపయోగించే బయో డిస్పోజబుల్ బెడ్షీట్లు, ఇతర డిస్పోజబుల్ మెడికల్ వృథా సామగ్రిని డిస్పోజ్ చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి ద్వారా డిస్పోజ్ చేసే ప్రాంతాన్ని తనిఖీ చేయించాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లోని వారికి భోజనం అందించేందుకు ఏజెన్సీని గుర్తించాలని ఆదేశించారు. మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటి పర్యవేక్షణకు అధికారులను నియమించాలన్నారు. అనంతపురం, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని టెస్టింగ్ ల్యాబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి మరింత శిక్షణ ఇవ్వాలన్నారు. ల్యాబ్‌లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. చదవండి: కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు వైద్య సిబ్బందికి వసతి సౌకర్యాలు వైద్య సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గ్రేడ్ల ఆధారంగా హోటల్ లేదా ల్యాడ్జీల్లో గదులు కేటాయించాలన్నారు. ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్సీలలో సాధారణ ఓపీని వేరుగా, కోవిడ్–19 ఓపీ వేరుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జీజీహెచ్, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓ పరిధిలోని ఆస్పత్రుల్లో అవసరమయ్యే పీపీఈలు, ఎన్–95 మాస్క్‌లు ఎంతమేర అవసరమో గుర్తించి, అందుకు అదనంగా 20 శాతం ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, జేసీ డిల్లీరావు, ఎస్పీ సత్యయేసుబాబు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, జేసీ–2 రామమూర్తి, డీఆర్ఓ గాయత్రి దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైళ్లలో కాదేదీ చోరీకి అనర్హం!
న్యూఢిల్లీ: 1.95 లక్షల టవళ్లు, 81736 దుప్పట్లు, 55, 573 తలదిండు కవర్లు..ఇవేవో వరద బాధితులకు పంపిస్తున్న సామగ్రి కాదు. ఏడాది కాలంలో మన రైళ్లలో దొంగతనానికి గురైన వస్తువులు. ఇటీవల పశ్చిమ రైల్వే విడుదల చేసిన నివేదికలో విస్తుగొలిపుతున్న ఈ విషయాలు ఉన్నాయి. దొంగతనానికి కాదేదీ అనర్హం అన్నట్లు..ప్రయాణికులకు అందుబాటులో ఉంచిన వస్తువులు ఇంత భారీస్థాయిలో చోరీకి గురవడం రైల్వే శాఖ ఆదాయంపై కూడా ప్రభావం చూపింది. చివరకు 200 టాయిలెట్ మగ్గులు, వేయి ట్యాప్‌లు, 300కు పైగా ఫ్లష్ పైపులు, స్నానంచేసే షవర్లు కూడా దొంగతనానికి గురైన జాబితాలో ఉన్నాయి. వీటిలో సుమారు రూ. 3 కోట్ల విలువైన వస్తువులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. -
ఏడు రోజులు...ఏడు రంగులు
- ఆసుపత్రుల్లో రోజుకో రంగు బెడ్‌షీట్ - పరిశుభ్రత కోసం ప్రతీ రోజూ మార్చేలా ఈ విధానం - రాష్ట్రంలో 20 వేల పడకలకు రెండు సెట్ల రంగు రంగు దుప్పట్లు - టెండర్ల ప్రకియ మొదలు... చర్లపల్లి జైలు ఖైదీల నుంచీ కొనుగోలు సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలపై ఇక నుంచి రంగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం తెల్లరంగు బెడ్షీట్లు మాత్రమే వాడుతుండగా... ఇకనుంచి వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లూ కనిపించనున్నాయి. ఆసుపత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇతర రోగులు వాడిన దుప్పట్లనే మరో రోగి వాడుతోన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటు వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ రోజూ ఆసుపత్రుల్లోని పడకలపై బెడ్షీట్లను మార్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని ఆయన ఆదేశించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు వాడితే తప్పనిసరిగా దుప్పట్లను ఉతికి ఆరేస్తారని... రోజుకో రంగు దుప్పటి వాడాలన్న నిర్ణయం వల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారంలో ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే ఆసుపత్రి సిబ్బంది దుప్పట్లను ప్రతీ రోజూ మార్చుతూ... మార్చిన వాటిని ఉతికేయించి మరో వారానికి సిద్ధంగా ఉంచుతారు. 20 వేల పడకలకు రంగు రంగుల దుప్పట్లు... కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ విధానాన్ని దేశంలోని 19 ప్రధాన ఆసుపత్రుల్లో అమలు చేస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఛండీఘర్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకే షన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ ఈ విధానం అమలవుతోంది. ఆయా ఆసుపత్రుల్లో సోమవారం తెల్ల దుప్పటి, మంగళవారం గులాబీ, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం ఊదా లేదా మరో రెండు రంగులు, శనివారం నీలం, ఆదివారం లేత బూడిదరంగు లేదా మరో రంగును వాడుతున్నారు. కొద్దిపాటి మార్పులు చేసి ఆ ప్రకారమే రాష్ట్రంలోనూ అమలుచేస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్, సరోజినీ దేవి వంటి పెద్దాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏకంగా 8,374 పడకలున్నాయి. అందులో ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే 1168, నిమ్స్‌లో 1500 పడకలున్నాయి. జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 1900 పడకలున్నాయి. 750 వరకు ప్రాథమిక ఆసుపత్రులుండగా... వాటిల్లో కొన్నింటినీ 30 పడకల వరకు పెంచుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ రంగు రంగుల బెడ్షీట్లు రానున్నాయి. టెండర్ల ప్రక్రియ మొదలు... అన్ని ఆసుపత్రుల్లోనూ ఏడు రోజులు ఏడు రంగుల బెడ్షీట్లను రెండు సెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఒక సెట్టు ఎప్పుడూ రిజర్వులో ఉంచుతారు. రంగు బెడ్షీట్లను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. తక్కువ కోట్ చేసిన కంపెనీ నుంచి బెడ్షీట్లను కొనుగోలు చేస్తారు. చర్లపల్లి జైలులో ఖైదీలు బెడ్షీట్లు తయారు చేస్తున్నందున వారి నుంచి ఎన్ని వీలైతే అన్ని కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పడకకు ఏడు దుప్పట్లు రెండు సెట్ల చొప్పున 20 వేల పడకలకు 2.80 లక్షల రంగు దుప్పట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. -
దుప్పట్ల కోసం స్ధానికుల తొక్కిసలాట
-
ఆప్కో..తీస్కోదేం?
రామన్నపేట, న్యూస్‌లైన్ : చేనేత వస్త్రాల ఉత్పత్తికి జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ తయారైన డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, మెర్స్రైజ్డ్(మస్స్) చీరలు, దోవతులు ప్రపంచ వ్యాప్త్తంగా ప్రాచుర్యం పొందాయి. పోచంపల్లి చీరలు జిల్లాకే తలమానికంగా నిలిచాయి. అలాంటి చేనేత పరిశ్రమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆప్కో ఆరునెలల నుంచి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చేనేత సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు మూలుగుతున్నాయి. గత జూన్‌లో కొనుగోలు చేసిన వస్త్రాలకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో 42 కాటన్, 30 సిల్క్చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 25వేల మంది సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సహకార రంగంలో 13వేలు, సహకారేతర రంగంలో 10వేలకుపైగా మగ్గాలు నడుస్తున్నాయి. కార్మికులు నేసిన వస్త్రాలను సొసైటీలు కొనుగోలు చేసి ఆప్కో ద్వారా విక్రయిస్తారు. రూ.ఏడుకోట్లకు పైగా విలువైన వస ్తన్రిల్వలు జూన్, జూలై మాసాల్లో ఆప్కో వారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆరు నెలలుగా కొనుగోళ్లు జరపకపోవడంతో కేవలం చేనేత సహకార సంఘాల్లోనే రూ.7కోట్ల మేర వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోచంపల్లి, కొయ్యలగూడంలలో రూ.కోటి, సిరిపురంలో రూ.90లక్షలు, చౌటుప్పల్‌లో రూ.50 లక్షలు. గట్టుప్పల్‌లో రూ.70లక్షలు, బోగారంలో రూ.10లక్షలు, వెల్లంకిలోరూ. 20లక్షలు, కుంట్లగూడెంలో రూ.25లక్షలు, వెలువర్తిలో రూ.10లక్షలు, గుండాలలో రూ.20లక్షలు, మోత్కూరులో రూ.20లక్షలు, పల్లెర్లలో రూ.30లక్షలు, నకిరేకల్లోరూ.10లక్షల విలువైన వస్త్ర నిల్వఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్న నేతన్నలు బిల్లులు సకాలంలో రాకపోవడంతో నేతకార్మికులు అప్పులపాలవుతున్నారు. వస్త్రాల ఉత్పత్తికి అవసరమయ్యే నూలు, రంగులు కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. కుటుంబ పోషణ కోసం, పెట్టుబడుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వస్త్రాలు కొనుగోలు చేయాలి : అప్పం రామేశ్వరం, అధ్యక్షుడు, సిరిపురం చేనేతసహకారసంఘం చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ఆప్కోవారు వెంటనే కొనుగోలు చేయాలి. గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలి. లేకుంటే కార్మికులు, సహకార సంఘాలు అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది.