రామన్నపేట, న్యూస్‌లైన్ : చేనేత వస్త్రాల ఉత్పత్తికి జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ తయారైన డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్లు, మెర్స్‌రైజ్డ్(మస్స్) చీరలు, దోవతులు ప్రపంచ వ్యాప్త్తంగా ప్రాచుర్యం పొందాయి. పోచంపల్లి చీరలు జిల్లాకే తలమానికంగా నిలిచాయి. అలాంటి చేనేత పరిశ్రమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
ఆప్కో ఆరునెలల నుంచి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చేనేత సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు మూలుగుతున్నాయి. గత జూన్‌లో కొనుగోలు చేసిన వస్త్రాలకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో 42 కాటన్, 30 సిల్క్‌చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 25వేల మంది సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సహకార రంగంలో 13వేలు, సహకారేతర రంగంలో 10వేలకుపైగా మగ్గాలు నడుస్తున్నాయి. కార్మికులు నేసిన వస్త్రాలను సొసైటీలు కొనుగోలు చేసి ఆప్కో ద్వారా విక్రయిస్తారు.
రూ.ఏడుకోట్లకు పైగా విలువైన వస ్తన్రిల్వలు
జూన్, జూలై మాసాల్లో ఆప్కో వారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆరు నెలలుగా కొనుగోళ్లు జరపకపోవడంతో కేవలం చేనేత సహకార సంఘాల్లోనే రూ.7కోట్ల మేర వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోచంపల్లి, కొయ్యలగూడంలలో రూ.కోటి, సిరిపురంలో రూ.90లక్షలు, చౌటుప్పల్‌లో రూ.50 లక్షలు. గట్టుప్పల్‌లో రూ.70లక్షలు, బోగారంలో రూ.10లక్షలు, వెల్లంకిలోరూ. 20లక్షలు, కుంట్లగూడెంలో రూ.25లక్షలు, వెలువర్తిలో రూ.10లక్షలు, గుండాలలో రూ.20లక్షలు, మోత్కూరులో రూ.20లక్షలు, పల్లెర్లలో రూ.30లక్షలు, నకిరేకల్‌లోరూ.10లక్షల విలువైన వస్త్ర నిల్వఉన్నాయి.
అప్పుల్లో కూరుకుపోతున్న నేతన్నలు
బిల్లులు సకాలంలో రాకపోవడంతో నేతకార్మికులు అప్పులపాలవుతున్నారు. వస్త్రాల ఉత్పత్తికి అవసరమయ్యే నూలు, రంగులు కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. కుటుంబ పోషణ కోసం, పెట్టుబడుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
వస్త్రాలు కొనుగోలు చేయాలి :
అప్పం రామేశ్వరం, అధ్యక్షుడు, సిరిపురం చేనేతసహకారసంఘం
చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ఆప్కోవారు వెంటనే కొనుగోలు చేయాలి. గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలి. లేకుంటే కార్మికులు, సహకార సంఘాలు అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది.
ఆప్కో..తీస్కోదేం?
Published Thu, Dec 19 2013 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement