
మాట్లాడుతున్న ఆర్థికమంత్రి బుగ్గన, మంత్రి శంకరనారాయణ, చిత్రంలో ప్రభుత్వ విప్ కాపు, ఎమ్మెల్యే అనంత, ఆలూరి, కలెక్టర్,ఎస్పీ
సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లాలోని 32 క్వారంటైన్ కేంద్రాల్లో బయో డిస్పోజబుల్ బెడ్‌షీట్‌లను మాత్రమే వాడాలి. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. ప్రజారోగ్య సంరక్షణతో పాటు వైద్యుల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కోవిడ్ అడ్డుకట్టకు జిల్లాలో చేపట్టిన చర్యలపై మంత్రి శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో ఎన్ని శాంపిల్ టెస్టింగ్ టీమ్‌లు ఉన్నాయి? మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారా? లేదా. ఆయా కేంద్రాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుమానితుల నుంచి సేకరించిన శాంపిల్స్ టెస్టింగ్ పర్యవేక్షణకు అదనపు డీఎంహెచ్‌ఓను నియమించాలని ఆదేశించారు. జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనులు పూర్తి చేసి కోవిడ్ పాజిటివ్ కేసుల చికిత్సకు సిద్ధం చేయాలన్నారు. చదవండి: భౌతిక దూరం పాటించండి
నోడల్ ఆఫీసర్‌ను నియమించండి
క్వారంటైన్ కేంద్రాల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. కేంద్రాల్లో ఉపయోగించే బయో డిస్పోజబుల్ బెడ్‌షీట్లు, ఇతర డిస్పోజబుల్ మెడికల్ వృథా సామగ్రిని డిస్పోజ్ చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి ద్వారా డిస్పోజ్ చేసే ప్రాంతాన్ని తనిఖీ చేయించాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లోని వారికి భోజనం అందించేందుకు ఏజెన్సీని గుర్తించాలని ఆదేశించారు. మొబైల్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు కలిగిన వారికి పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటి పర్యవేక్షణకు అధికారులను నియమించాలన్నారు. అనంతపురం, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని టెస్టింగ్ ల్యాబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి మరింత శిక్షణ ఇవ్వాలన్నారు. ల్యాబ్‌లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. చదవండి: కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు
వైద్య సిబ్బందికి వసతి సౌకర్యాలు
వైద్య సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గ్రేడ్ల ఆధారంగా హోటల్ లేదా ల్యాడ్జీల్లో గదులు కేటాయించాలన్నారు. ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో సాధారణ ఓపీని వేరుగా, కోవిడ్–19 ఓపీ వేరుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జీజీహెచ్, డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌ఓ పరిధిలోని ఆస్పత్రుల్లో అవసరమయ్యే పీపీఈలు, ఎన్–95 మాస్క్‌లు ఎంతమేర అవసరమో గుర్తించి, అందుకు అదనంగా 20 శాతం ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, జేసీ డిల్లీరావు, ఎస్పీ సత్యయేసుబాబు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, జేసీ–2 రామమూర్తి, డీఆర్‌ఓ గాయత్రి దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment