![UK to drop self-isolation rule in living with Covid plan - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/21/britan.jpg.webp?itok=Z_ko-IyX)
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు.
బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు.
ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది.
క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్‌హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment