queen elizabeth
-
తరతరాలుగా అందరివారు.. ప్రముఖులతో క్వీన్ ఎలిజబెత్-2 (ఫొటోలు)
-
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్‌కు ‘నైట్‌హుడ్’
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్‌హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై టోనీ బ్లెయిర్ను ‘సర్ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్‌కు ప్రధానిగా సేవలందించారు. బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్‌హుడ్ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు. -
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఫోన్ ఎవరిదంటే..
Queen Elizabeth II Uses Phone And Facebook: ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ‘స్మార్ట్‌ఫోన్ డాటా థ్రెట్’. ఫోన్ ఎంతటి అప్డేట్ వెర్షన్ అయినప్పటికీ.. డాటాను చోరీ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు హ్యాకర్లు. ఈ క్రమంలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా తమ చేత వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మాత్రం ఈ విషయంలో మినహాయింపు కలిగి ఉన్నారట! ఈ భూమ్మీద అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌ను క్వీన్ ఎలిజబెత్ II వాడుతున్నారట!. బకింగ్హమ్ ప్యాలెస్‌లో క్వీన్ ఛాంబర్లో ఇప్పటికీ సంప్రదాయ ల్యాండ్ లైన్ ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ దేశాల నేతలు ఫోన్ చేసినా ఆమె ఆ ఫోన్‌తో మాత్రమే మాట్లాడతారు. అలాంటిది రాజవంశంలో మొట్టమొదటిసారి పాలించే ఓ వ్యక్తి.. వ్యక్తిగతంగా ఫోన్ ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. న్యూస్ ఏజెన్సీ స్ఫుతినిక్ ప్రకారం.. క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించే మొబైల్ హైసెక్యూరిటీ వ్యవస్థను కలిగి ఉందట. బ్రిటిష్ నిఘా విభాగం ఎం16 రూపొందించిన ఈ వ్యవస్థ హ్యాకర్లకు చిక్కదని, పైగా ఆ ఫోన్లో ఫేస్బుక్ సైతం ఆమె ఉపయోగిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది. ఇక ఫేస్బుక్ మెసేజ్‌లు ఇంకా ఎన్క్రిప్షన్కు(సెండర్- రీడర్ మాత్రమే చూడగలిగే సెక్యూరిటీ) నోచుకోని విషయం తెలిసిందే. యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లపైనే పట్టొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. కానీ, ఎలిజబెత్ రాణి వాడుతున్న ఫోన్లో మాత్రం ఎం16 రూపొందించిన యాంటీ హ్యాకర్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందని, అందువల్ల ఆ ఫోన్లో ఉండే ఫేస్బుక్ మాత్రమే కాదు.. ఫోన్లోని ఇతర డాటా మొత్తం చాలా భద్రంగా ఉంటుందని యూకేపాడ్కాస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. ఇంతకీ ఫోన్ కంపెనీ ఏంటంటే.. శాంసంగ్. కెమెరాతో కూడిన ఈ అల్ట్రా స్లిమ్ ఫోన్‌ను ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోన్‌గా పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ను చూసుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మనుషులు ఉన్నారట! వాళ్లు ఎప్పుడూ ఆ ఫోన్ ఛార్జ్ డౌన్ కాకుండా చూసుకుంటారట. అంతేకాదు ఆ ఫోన్లో ఆమె ఇద్దరితో ఎక్కువగా ఛాటింగ్ చేస్తోందని(ప్రైవసీ వల్ల వివరాలు వెల్లడించలేదు), ఆమె స్పందించనప్పుడు ఆమె ఫోన్‌ను హ్యాండిల్ చేసే వీలు ఇద్దరికి మాత్రమే ఉందని(ఒకరు ఆమె కూతురు యువరాణి అన్నె, రాణి మేనేజర్ జాన్ వారెన్) స్పుత్నిక్ సారాంశం. సీక్రెట్ ఫేస్బుక్ అకౌంట్ అమెరికా మెటా (ఒకప్పుడు ఫేస్బుక్) అందించే ఫేస్బుక్ మీద యూకేలో వ్యతిరేకత ఉంటుందన్నది తెలిసిందే. కానీ, బ్రిటన్ రాణి ఫోన్లో ఒక రహస్య ఫేస్బుక్ అకౌంట్ ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇందులో ఆమె ఎక్కువగా వీడియోస్ చూస్తూ సమయం గడుపుతున్నారట. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్.. అదీ 95 ఏళ్ల బ్రిటన్ మహరాణి వాడుతున్నారనే స్టింగ్ ఆపరేషన్ కథనాలు టెక్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పుడు. కరోనా పరిస్థితుల తర్వాత వీడియో కాల్స్ ఉద్దేశంతో ఆమె ఈ ఫోన్‌ను వాడుతున్నారని తెలుస్తోంది. -
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. ఆందోళనలో ప్రజలు
Queen Elizabeth Purple Hands: సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి అయితే ప్రతీది నెట్టింట చక్కర్లు కొట్టడం సహజం. ఒక్కోసారి ఫేక్ వార్తలకు వాళ్లే స్వయంగా బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా క్విన్ ఎలిజబెత్ చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 19 న లండన్‌లోని విండ్సర్ కాస్టిల్లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌తో ఏదో విషయమై క్వీన్ ఎలిజబెత్ భేటీ అయ్యారు. ఆ సమయంలో వారిద్దరిని ఓ ఫోటో తీయగా, దాన్ని బకింగ్హమ్ ప్యాలెస్ విడుదల చేసింది. వయసు కారణంగా ఇటీవల కొంత కాలంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్విన్ ఎలిజబెత్ చేతులు రంగు మారి కనిపించడంతో ఇంకా తనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే.. ఆ ఫోటోపై రకరకాల అభిప్రాయాలు రావడంతో షేక్స్పియర్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జై వర్మ స్పందిస్తూ.. రెనాడ్స్ అనే వ్యాధి వల్ల అయి ఉండొచ్చు లేదంటే చేతులు చల్లగా అవడం వల్ల ఇలా మారుండచ్చు. జాన్ హోప్కిన్స్ మెడిసిన్ సైట్ ప్రకారం.. కోల్డ్ లేదా స్ట్రెస్ వల్ల చేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అలా చేతులు రంగు మారడం సహజమని తెలిపారు. నేషనల్ హెల్త్ సర్వీస్, యూకే ప్రకారం.. అది పెద్దగా సీరియస్ కండిషన్ కాదు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. శరీరానికి కాస్త వేడి తాకితే.. ఆ కండిషన్ మారుతుంది.. అని స్పష్టం చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటజన్లు తమకు తోచినట్లుగా కామెంట్లు పెట్టడంతో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. The Queen now has zombie hands… wonder why?#boostershot https://t.co/RRVDj31TSd — Matthew Scarsbrook (@mgscarsbrook) November 17, 2021 చదవండి: Pet Dog: కుక్క హెయిర్ డైకి లక్షలు ఖర్చు చేసిన మోడల్, నెటిజన్ల ఆగ్రహం -
కట్టలు తెగిన ప్రజాగ్రహం.. నేలకూలిన విగ్రహాలు
తమ పిల్లలపై జరిగిన మారణ హోమం పట్ల అక్కడి జనాలు రగిలిపోతున్నారు. సంబురంగా జరపాల్సిన పూర్తి స్వాతంత్రోత్సవ వేడుకల్ని.. నిరసన దినంగా పాటించారు. వలస పాలనతో ఆ మారణహోమాలకు కారకులంటూ రాణుల విగ్రహాలను కూల్చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యావత్ ప్రపంచం నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒట్టావా: నారింజ దుస్తుల్లో రోడ్డెక్కిన నిరసనకారులు.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, కూలిన రాణుల విగ్రహాలు.. ఇది కెనడా డే నాడు కనిపించిన దృశ్యాలు. జులై 1న కెనడా డే వేడుకలపై ‘కరోనా’ ప్రభావం కనిపించింది. సంబురాలు భారీగా జరుపలేదు అక్కడి జనం. పైగా ఈ మధ్యకాలంలో స్కూళ్ల నుంచి వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాల అవశేషాలు భారీగా బయటపడడం వాళ్లలో తీవ్ర విషాదం నింపింది. అందుకే నిరసన దినం పాటించారు. అయితే బ్రిటిష్ పాలనలో జరిగిన ఆ మారణహోమాలను గుర్తు చేసుకుంటూ.. కనిపించిన రాణుల విగ్రహాలను కూల్చేశారు. తాళ్లతో లాగేసి మరీ.. కెనడా వ్యాప్తంగా ఆరెంజ్ దుస్తుల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. విన్నిపెగ్‌లో క్వీన్ విక్టోరియా విగ్రహం దగ్గర తొలుత ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ రాచరికపు గుర్తులు కెనడా గడ్డపై ఉండకూడదని అరుస్తూ ఆపై విగ్రహాన్ని కూల్చిపడేశారు. విగ్రహంపైకి ఎక్కి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆపై అక్కడున్న శిలాఫలకంపై ఎర్ర చేతి గుర్తులు వేశారు. ఇక ఆ దగ్గర్లోనే ఉన్న క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని కూడా తాళ్లతో లాగి కిందపడేశారు. రాణి కాదు.. రాక్షసి అంటూ అభ్యంతరకర నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఒట్టవాలో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇక ఈ ఘటనలను బ్రిటన్ ఖండించిది. ‘‘కెనడాలో జరిగిన విషాదాలకు మేం బాధపడుతున్నాం.ఈ వ్యవహారంలో కెనడాతో విచారణకు మేం సహకరిస్తాం. కానీ, విగ్రహాలు కూల్చేయడం సరికాదు’’ అని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆరువేల మందికిపైనే.. బ్రిటీష్ కొలంబియా, సస్కట్చేవాన్ లో క్యాథలిక్ చర్చల ద్వారా నడిచే స్కూళ్లలో భారీగా పిల్లల అస్థిపంజరాలు బయటపడడం తెలిసిందే. కెనడా దాదాపు 165 ఏళ్లపాటు బ్రిటిష్ కాలనీ పాలనలో ఉంది. ఆ టైంలో సంప్రదాయ మారణహోమం పెద్ద ఎత్తున్న జరిగిందని 2015లో ఓ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బలవంతపు మతమార్పిళ్లు.. వినని వాళ్లపై వేధింపులు జరిగేవని తెలుస్తోంది. సుమారు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు ఆరువేల మంది పిల్లలు చనిపోగా.. వాళ్లను అక్కడే ఖననం చేశారు. ఆ అస్థిపంజరాలే ఇప్పుడు బయటపడుతున్నాయి. చదవండి: మూసేసిన స్కూల్లో వందల అస్థిపంజరాలు మతం, మాతృభాష ఆ పిల్లల పాలిట శాపం! -
తల్లిదండ్రులైన హ్యారీ దంపతులు.. బుజ్జాయి పేరేమిటంటే!
కాలిఫోర్నియా: రాచరికాన్ని వదులుకుని సామాన్య జీవితం గడుపుతున్న ప్రిన్స్ హ్యారీస్, మేఘన్ మార్కెల్ దంపతులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. చుట్టుముట్టిన కష్టాల నడుమ వారింట్లో బోసి నవ్వులు విరబూశాయి. మేఘన్-హ్యారీ దంపతులు ముద్దులొలికే పసిపాపకి తల్లిదండ్రులయ్యారు . జూన్ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్ హాస్పటిల్‌లో మేఘన్ మార్కెట్ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు. వారి పేర్ల కలయికతో హ్యారీ, మేఘన్ జీవితాల్లోకి వచ్చిన చిన్నారికి లిల్లీ డయానా అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్. అలాగే రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్ డయాన మౌంట్‌బాటెన్ విండ్సర్ గా పేరు పెట్టారు. హ్యారీ- మేఘన్‌లకు ఇంతకు ముందు ఆర్చీ అనే కొడుకు 2019లో జన్మించాడు. -
రాణిగారి కన్నా ఏం తక్కువ
సుధామూర్తి నవ్వుకునే ఉంటారు కూతురు అక్షతను క్వీన్‌తో పోటీకి తెచ్చింది మరి బ్రిటన్ మీడియా! ఎలిజబెత్ రాణి గారి కంటే.. వెయ్యికోట్లు ఎక్కువేనట అక్షత సంపద! నిజమే కావచ్చు కానీ.. ఇప్పటికీ ఆమె.. తల్లిని పాకెట్ మనీ అడిగే కూతురిలానే జీవిస్తున్నారన్నదీ నిజం. నిరాడంబరంగా.. సంపన్నతను ప్రదర్శించని రాణిగా! తల్లి పెంపకంలోని గొప్పతనం అది. ఇన్ఫోసిస్ దంపతులు సుధ, నారాయణమూర్తిల గుర్తింపు ఎన్నేళ్లు గడిచినా, వాళ్ల కంపెనీ ఎన్ని కోట్లు గడిచినా ఎప్పటికీ మారనిదీ, ఒకేవిధమైనదీ! ‘సంపన్నులైన నిరాడంబరులు’ అనేదే ఆ గుర్తింపు. వారిద్దరి నిరాడంబరత్వం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు తమ ఇద్దరు పిల్లల్ని వాళ్లెలా పెంచారన్నదే సరైన కొలమానం అవుతుంది. మూర్తి దంపతులకు మొదట కుమార్తె. తర్వాత కొడుకు. కుమార్తె అక్షత బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కొడుకు రోహన్ ఇండియాలోనే ‘హార్వర్డ్ సొసైటీ ఆఫ్ ఫెలోస్’కి టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ అయిన డెబ్బై ఏళ్ల సుధామూర్తి సోషల్ వర్కర్. కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్ భాషలలో పుస్తకాలు రాశారు. ఒకప్పుడు ఆమె ఇంజినీరింగ్ టీచర్. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌కి ప్రస్తుతం ఎమెరిటస్ చైర్మన్. పదవీ విరమణానంతర బాధ్యతల్ని నిర్వహించి వెళుతుంటారు. కోట్లల్లో ఆస్తులు ఉన్నా, సింపుల్‌గా ఉంటారు. ఉండకూడదని కాదు. ఈ దంపతుల ఆసక్తులు, అభిరుచులు.. ఆస్తుల సంపాదనకు పూర్తి భిన్నమైనవి. అందుకే ఎప్పుడు వీళ్ల ప్రస్తావన వచ్చినా ‘నిరాడంబరత్వం’ వీరి సుసంపన్నతగా కనిపిస్తుంది. అందుకే వీళ్లమ్మాయి అక్షత ఇప్పుడు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కన్నా ధనికురాలన్న గుర్తింపు పొందడం పెద్ద విశేషం అయింది. ∙∙ అక్షత (40) పదకొండేళ్ల క్రితం రిషీ సునక్‌ను వివాహమాడి బ్రిటన్ వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో వాళ్లిద్దరూ క్లాస్మేట్స్. ఆ పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. రిషి బ్రిటన్‌లోనే పుట్టారు. 2014లో ప్రజా రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం యు.కె.లో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ ఆయన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఛాన్స్లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్’ అయ్యారు. అంటే ఆర్థికమంత్రి. ఇద్దరు కూతుళ్లు. కృష్ణ, అనౌష్క. ఆర్థికమంత్రి అయినవారు కుటుంబ వివరాలతోపాటు ఆస్తుల లెక్కల్నీ, వాటి విలువను వెల్లడించాలి. బ్రిటన్ పార్లమెంటుకు కూడా ఆ ఆనవాయితీ ఉంది. ఇటీవల రుషీ తన ఆర్థిక పత్రాలను సమర్పించినప్పుడు యు.కె.లో ఆయన భార్య అక్షత నిర్వహిస్తున్న సొంత వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘క్యాటమరాన్ వెంచర్స్’ ఆస్తులు, ఇన్ఫోసిస్ లో ఆమెకు ఉన్న షేర్లు కలుపుకుని ఆమె సంపద విలువ 480 మిలియన్ పౌండ్లు ఉన్నట్లు బహిర్గతం అయింది. అదేమీ దాచి ఉంచిన సంగతి కానప్పటికీ ‘ది గార్డియన్’ పత్రిక సంపన్నత విషయంలో అక్షత క్వీన్ ఎలిజబెత్‌ను దాటిపోయారని రాయడంలో ప్రపంచ ప్రజల ఆసక్తికి అక్షత ఒక కేంద్రబిందువు అయ్యారు. బహుశా ఈ కేంద్రబిందువును చూసి సుధామూర్తి దంపతులు మురిసిపోయే ఉంటారు. క్వీన్ ఎలిజబెత్ దగ్గర ప్రస్తుతం ఉన్నది 350 మిలియన్ పౌండ్లయితే, అక్షత దగ్గరున్నవి 450 పౌండ్లు. మన కరెన్సీలోమనమ్మాయి దగ్గర రాణి గారి దగ్గర ఉన్న డబ్బు కంటే సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నట్లు. అక్షతకు ఇంకా అమెజాన్ ఇండియాలో, బ్రిటన్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ∙∙ ‘రాణిగారి గారి కన్నా అక్షత సంపన్నురాలు’ అనే మాట వినేందుకు గొప్పగా ఉన్నా ఇంకా తల్లిదండ్రులను పాకెట్ మనీ అడిగే అమ్మాయిలానే సాధారణంగా ఉంటారు అక్షత! ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కనుక ఆ సహకారాన్ని తిరిగి నువ్వు సమాజానికి ఇచ్చేయాలి’ అని తను టాటా ఉద్యోగిగా ఉన్నప్పుడు జేఆర్డీ టాటా చెప్పిన మాటను సుధామూర్తి గుర్తుంచుకుని పాటించారు. తన పిల్లలకూ నేర్పించారు. ఆమె జీవితంలోని రెండు సందర్భాలు కూడా అక్షతను, రోహన్‌ను నిరాడంబరంగా పెంచేందుకు ప్రేరణ అయ్యాయి. తెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా.. ‘వానా వానా వల్లప్ప’ అని పాడుకుంటూ సంతోషంతో నృత్యం చేసిన ఒక నిరుపేద కుటుంబం, తమిళనాడు స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన ఒక పూజారి తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసుకుని ‘అంత డబ్బు తనకు అక్కర్లేదు’ అని తిరిగి ఇచ్చేస్తూ, ఐదు పావలా బిళ్లలను మాత్రమే అడిగి తీసుకోవడం సుధామూర్తిని ఆశ్చర్యంలో ముంచెత్తిన సందర్భాలు ఆ రెండూ. కొడుకు బడికి వెళ్తున్నప్పుడు చాలాకాలం పాటు ఆమె ఇచ్చిన పాకెట్ మనీ 5 రూపాయలు! ‘అయిదా!’ అని రోహన్ మూతి బిగిస్తే, ‘ఇది కూడా లేని వాళ్లు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు’ అని సుధామూర్తి చెప్పేవారట. తగ్గట్లే ఇద్దరు పిల్లలూ ఎంత ఆస్తిపరులైనా, అమ్మానాన్న పిల్లల్లానే ఉన్నారు. రాణిగారి కంటే ధనికురాలిగా ఊహించని కొత్త గుర్తింపు పొందిన అక్షత.. తల్లి పెంపకంలో చిన్నప్పటి నుంచీ సంపన్నతను ప్రదర్శించని రాణిగానే పెరిగారు. -
ఆ వార్తని కొట్టిపడేసిన హ్యారీ, విలియమ్స్
లండన్ : రాజ కుటుంబంలో విభేదాలు అంటూ ఓ ఇంగ్లాండ్ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియమ్స్ స్పందించారు. ఆ వార్తా కథనంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రిన్స్ ఆఫ్ ససెక్స్( హ్యారీ), ప్రిన్స్ ఆఫ్ కేంబ్రిడ్జ్(విలియమ్స్) బంధంపై ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కనబర్చుకునే అన్నదమ్ముల గురించి చెడు వార్తలు రాయటం నేరం, ప్రమాదమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రిన్స్ విలియమ్స్ మోసపూరిత బుద్ధి కారణంగానే రాజ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, విలియమ్స్ చేష్టల కారణంగానే హ్యారీ కుటుంబానికి దూరమవుతున్నాడని సదరు పత్రిక కొద్దిరోజుల క్రితం ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. చదవండి : వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్ హ్యారీ మేఘన్ మార్కెల్ కొత్త అవతారం -
మేఘన్ మార్కెల్ కొత్త అవతారం
లండన్ : ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రటిన్ రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ అప్పుడే ఆ పనిలో పడినట్టు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని మేఘన్ తిరిగి చేపట్టారు. ఇందుకోసం డిస్నీ లండన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీనియర్ రాయల్స్ పదవి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని వెల్లడించిన మేఘన్ డిస్నీ లండన్‌తో వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు వారాల విరామం కోసం కెనడాకు బయలుదేరే ముందే నవంబర్‌లో ఆమె వాయిస్ఓవర్ను రికార్డ్ చేశారట. 2017లో హ్యారీతో నిశ్చితార్థం తరువాత నటనకు గుడ్ బై చెప్పిన మాజీ నటి మేఘన్ తాజాగా డిస్నీతో ఒప్పందం చేసుకున్నారు. ఎనుగుల పరిరక్షణకు, వేటగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన పరిరక్షణా బృందం ‘ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా స్టూడియోతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. కాగా బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే సమయంలో రాణికి (ఎలిజిబెత్-2)సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్‌కు అవగాహన కల్పించడంతోపాటు, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించే వీలవుతుందని చెప్పారు. మరోవైపు హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్‌హాం ప్యాలస్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆయన 20 కోట్లు వదులుకుంటారా!?
బ్రిటీష్ రాచరిక వ్యవస్థ నుంచి తప్పుకొని ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన ప్రిన్స్ హ్యారీ దంపతులు అందుకు కట్టుబడి జీవిస్తారా? అన్న సంశయం ఇప్పుడు ప్రిన్స్ విలియమ్స్ దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు కలుగుతోంది. ఇప్పటి వరకు హ్యారీ దంపతుల కోసం ఏటా 8.3 కోట్ల రూపాయలను, వారి ప్రయాణాలకు 5.5 కోట్ల రూపాయలను, వారి వసతులకు 16.5 కోట్ల రూపాయలను ఎస్టేట్ చెల్లిస్తోంది. అంటే ఏటా వారికి 20 కోట్ల రూపాయలపైనే ఖర్చు అవుతోంది. ఇవి కాకుండా దుస్తులు, ఇతర అవసరాల కోసం చేస్తే ఖర్చులు కూడా రాచరిక వ్యవస్థ నుంచే వస్తాయి. ఇదంతా కూడా బ్రిటీష్ పౌరులు పన్నుల పేరిట రాచరిక వ్యవస్థకు చెల్లిస్తున్న సొమ్మే. (చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!) ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆర్థికంగా స్వతంత్రంగా బతకడం అంటే ఈ సొమ్మును పూర్తిగా వదులు కోవాల్సి ఉంటోంది. ఆ దేశ పౌరులు ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రజల పన్ను డబ్బులను వదులుకోవాలని కోరుతున్నారు. ప్రిన్స్ విలియమ్స్ మాత్రం హ్యారీ దంపతులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. రాచరిక హోదాను వదులు కోవడం వల్ల హ్యారీ తల్లి డయానా, కారు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యిందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లి చేసిన తప్పు చేయరాదంటూ నచ్చ చెబుతున్నారు. అన్నా వదినల కారణంగా రాచరిక కుటుంబానికి హ్యారీ దంపతులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారుకానీ, డబ్బులు తెచ్చే హోదాకు దూరంగా ఉండాలని కాదని హ్యారీ సన్నిహితులు చెబుతున్నారు. హ్యారీ రాచరిక పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారుకానీ, రాచరిక హోదాను కాదని వారంటున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!
బ్రిటీష్ రాచరిక కుటుంబం జీవితం నుంచి విడిపోయి తాము స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కే ప్రకటించి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. హ్యారీ దంపతులు తమ కుమారుడితో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియాలో నీటి ఒడ్డునున్న ప్యాలెస్ లాంటి బంగ్లాలో గడిపారు. ఇక ముందు జీవితం ఆ బంగ్లాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. దాదాపు 18 మిలియన్ డాలర్లు విలువచేసే ఆ బంగ్లాను వారు రష్యాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి హ్యారీ దంపతులు, వారి ప్రతినిధి నిరాకరించారు. ఆ రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్లో షేర్ హోల్డర్ అవడం వల్ల కంట్రీ క్లబ్ పేరుతో ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కొత్త చట్టం ప్రకారం ఆస్తులు అమ్మినప్పుడు కచ్చితంగా దాని వెల ఎంతో ప్రకటించి అంత మొత్తానికి పన్ను చెల్లించాలి. ఆ పన్నును తప్పించుకునేందుకే రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్ ద్వారా ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం 11,416 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రధాన బంగ్లాలో ఐదు బెడ్ రూమ్‌లు, ఎనిమిది బాత్ రూమ్‌లు, ఓ హాలు, కిచెన్ ఉన్నాయి. దానికి వెలుపల అతిథుల కోసం 2,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్ రూమ్‌లు, రెండు బాత్ రూములు గల చిన్న భవనం ఒకటి ఉంది. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు..
ఇరాన్లో యుద్ధ మేఘాలు. ఇండియాలో పౌరసత్వ నిరసనలు. అగ్రరాజ్యాల్లో పర్యావరణ ఉద్యమాలు. ఒక్కోదేశం ఒక్కో సమస్యతో సతమతమౌతోందిప్పుడు. బ్రిటన్ ప్రజలు మాత్రం వీటన్నిటికీ భిన్నమైన ఒక హటాత్పరిణామంతో నివ్వెర పోయి రెండు రోజులుగా రాజప్రాసాదం వైపే చూస్తున్నారు. మనవడు ప్రిన్స్ హ్యారీ తన నానమ్మ క్వీన్ ఎలిజబెత్‌తో ఓ మాటైనా చెప్పకుండా భార్యతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. స్వాతంత్య్రం కోసం ఎన్నో దేశాలు బ్రిటన్‌పై పోరాడి స్వేచ్ఛను సాధించుకు న్నట్లే.. స్వతంత్రంగా జీవించడం కోసం ప్రిన్స్ హ్యారీ.. రాయల్ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నారా?! ఊరంతా తెలిశాక మనకు తెలిసే విషయం ఒకటి ఉంటుంది. మన ఇంటి విషయం! అబ్బాయి బయటేదో ఘనకార్యం చేసి ఉంటాడు. కాలనీ అంతా తెలిశాకే మనకు తెలుస్తుంది. అమ్మాయి ఎవర్నో ప్రేమిస్తుంటుంది. పొరుగూళ్లో బంధువులందరికీ తెలిశాకే, ఆ కబురు మన ఊళ్లో బస్ దిగి, మన ఇంటికి వస్తుంది. నమ్మకం మనకు మన అబ్బాయి మీద, అమ్మాయి మీద. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి కావచ్చు.. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు విషయాన్ని దాచి ఉంచీ ఉంచీ ఇక చెప్పకపోతే నమ్మకద్రోహం చేసినట్లవుతుందని మనకు చెప్పేస్తుంటారు. ఇళ్లన్నీ ఒక్కటే. రాజుగారి ఇల్లయినా, పేదవాడి ఇల్లయినా! మనుషులంతా ఒక్కటే. గ్రేట్ బ్రిటన్‌లో ఉన్నా, పూర్ కంట్రీలో ఉన్నా! అందుకే.. మనవడు హ్యారీ, అతడి భార్య.. ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ తెలిశాక ఆఖర్న గానీ ఎలిజబెత్ రాణిగారికి తెలియలేదు. అప్పట్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. నేనేం తక్కువ చేశాను అని ఆమె విలపిస్తున్నారు తప్పితే, వాళ్లేం ఎక్కువ కోరుకుంటున్నారోనని ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. వెళ్లిపోతున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఇదే ఆమె హృదయాన్ని పిండేస్తోంది. బుధవారం సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. క్రిస్మస్ వేడుకల కోసం వారం ముందే శాండ్రింగ్ హామ్ ఎస్టేట్‌కి వెళ్లిన రాణిగారు మూడు వారాలు గడిచిపోతున్నా అక్కడే ఉండిపోడానికి కారణాలు ఏమైనా.. ఇప్పుడామె హుటాహుటిన బకింగ్‌హామ్ రాజప్రాసాదానికి తిరిగి వచ్చే ఏర్పాట్లలో ఉన్నారు. రాయల్ ఫ్యామిలీలోంచి వెళ్లిపోవాలని మనవడు హ్యారీ, అతడి భార్య కలిసి తీసుకున్న నిర్ణయంగా బ్రిటన్ పత్రికల్లో వస్తున్న వార్తలు.. తిరుగు ముఖానికి ఆమెను తొందర పెడుతున్నాయి. ‘కనీసం వాళ్లు రాణిగారికి చెప్పనైనా లేదు’ (దే డిడిన్ట్ ఈవెన్ టెల్ ద క్వీన్) అని ‘డైలీ మిర్రర్’ తన మొదటి పేజీ నిండా పెట్టిన హెడ్డింగ్ ఆమెను మరింతగా బాధిస్తుండవచ్చు. ప్యాలెస్ తలుపులు తెరుచుకోగానే గుమ్మం ముందు పడి కనిపించే అనేక తుంటరి పత్రికల్లో అదీ ఒకటి. ఈ భార్యాభర్తలిద్దరూ తాము ఇల్లొదిలి వెళ్లిపోతున్నట్లు రాణిగారికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం నిజమే. పైగా ఆ విషయాన్ని వాళ్లు తామిద్దరూ కొత్తగా ప్రారంభించిన వెబ్సైట్ లో బహిరంగ పరచడం ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత అలసటకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ‘హ్యారీ మొన్న క్రిస్మస్కి కూడా పొడిపొడిగానే మాట్లాడాడు. అది కూడా ఫోన్లో. అప్పుడైనా నేను అతడి అంతరంగాన్ని గ్రహించ వలసింది’’ అని రాణిగారు పొడి బారుతున్న గొంతుతో అన్నట్లు.. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత సంరక్షకులు ఒకరు.. తనను పట్టి పీడిస్తున్న మీడియా ప్రతినిధులకు తప్పనిసరై వెల్లడించారు. భార్య మేఘన్ మార్కెల్‌తో ప్రిన్స్ హ్యారీ ‘‘మా కాళ్లపై మేము నిలబడాలని భావిస్తున్నాం. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నాం. మాకొక గుర్తింపు కోసం ఆశపడుతున్నాం. మేము బయటికి రావడం వల్ల రాచ కుటుంబం నుంచి వారసత్వంగా మాకు సంక్రమించవలసిన వాటన్నిటినీ కోల్పోతామని తెలుసు. అయినా అందుకు సిద్ధపడుతున్నాం’’ అని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ కలసి చేసిన ఆ ప్రకటన ఎలిజబెత్ రాణి మనసులోనే కాదు, బ్రిటన్ ప్రజల్లోనూ కలవరం రేపుతోంది. ‘కలిసి ఉన్న ఒక గొప్ప కుటుంబం ముక్కలు కాబోతోందే! ఈ విలయాన్ని, విపత్తును నివారించలేకపోతున్నామే.. ఎలా దేవుడా..’ అని ఆ కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే వారు విలవిలలాడుతున్నారు. వారిలో కొందరైతే తమ మనసులో ఉన్న దానిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ‘‘ఈ దుస్థితికి మూల కారణం హ్యారీ భార్య మేఘన్. ఆ మహాతల్లి వల్లే ఇదంతా జరుగుతోంది. హ్యారీ భార్యా విధేయుడైపోయి, కుటుంబాన్ని కాదనుకున్నాడు. కనీసం రాణి గారికి కూడా చెప్పి చేయడం లేదంటే ఏమనుకోవాలి?’’ అని తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం తప్పయినా ఒప్పయినా.. ఇంటికి పెద్దయిన రాణిగారికి చెప్పకపోవడం మాత్రం తప్పే. ప్రస్తుతం రాణిగారు, రాణిగారి భర్త; రాణిగారి కొడుకు, కూతురు; కొడుకు సంతానం, కూతురి సంతానం; వారి జీవిత భాగస్వాములు; వారి సంతానంలో కొందరు.. మొత్తం 24 మంది ‘రాయల్’ టైటిల్ ఉన్నవాళ్లున్నారు. మిగతా ఇంకా ఉన్నారు కానీ, వాళ్లంతా టైటిల్స్ లేనివాళ్లు. ఇప్పుడు బయటికి వెళ్లిపోతున్న హ్యారీ, మేఘన్ సొంతంగా బతకడం కోసం రాయల్ టైటిల్‌ని కూడా వదులుకోబోతున్నారు. బ్రిటన్‌లోని విండ్సర్‌లో ఫ్రాగ్మోర్ కాటేజ్ హ్యారీ పేరు మీద ఉంది. దాన్ని మాత్రం ఉంచుకుంటారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి పోతుండటానికి. ఇకనుంచీ ఈ దంపతులు ఉండటమైతే బ్రిటన్ కాదు. కెనడా. 2018 మే లో హ్యారీ, మేఘన్‌ల వివాహం జరిగింది. వారికిప్పుడు ఎనిమిది నెలల కొడుకు. పేరు మౌంట్‌బ్యాటన్. సింహాసనాన్ని అధిష్టించే వారసత్వపు వరసలో అతడిది ఏడవ స్థానం. అంతఃపురంలో తమ స్థానాలన్నిటినీ వదులుకుని వెళ్తున్న ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఆ కుటుంబ సభ్యుల హృదయాలలో మాత్రం స్థానం ఎప్పటికీ ఉంటుంది. అది కాదనుకున్నా పోయేది కాదు. కాదని వెళ్లిపోయినా విడిచి పెట్టేదీ కాదు. గతంలో! కింగ్ ఎడ్వర్డ్ VIII వాలిస్ సింప్సన్‌తో ఎనిమిదవ ఎడ్వర్డ్ ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ బయటికి వెళ్తున్నట్లే.. బ్రిటన్ రాజ కుటుంబపు పూర్వీకుడైన ఎనిమిదవ ఎడ్వర్డ్ మహారాజు కూడా తను ప్రేమించిన యువతి కోసం ప్యాలెస్‌ను వదులుకున్నవారే! ప్యాలెస్‌తో పాటు తన సింహాసనాన్ని కూడా! అమెరికన్ వితంతువు అయిన వాలిస్ సింప్సన్‌ను ప్రేమించిన ఎడ్వర్డ్.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నందుకు కిరీటాన్ని సైతం కాదనుకున్నారు. ‘‘నేనీ భారాన్ని మోయలేకపోతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి సహాయం, సహకారం లేకుండా ఈ రాజ్యాధికారానికి న్యాయం చేకూర్చలేను’’ అని రాజైన కొద్ది నెలలకే బహిరంగంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నారు. ఆ మర్నాడే ఎడ్వర్డ్ తమ్ముడు ప్రిన్స్ ఆల్బర్ట్ బ్రిటన్‌కు రాజయ్యాడు. ప్రిన్స్ ఫిలిప్ ఎలిజబెత్ (ప్రస్తుత రాణి)తో ప్రిన్స్ ఫిలిప్ రెండవ ఎలిజబెత్ రాణి (హ్యారీ నానమ్మ) భర్త ఫిలిప్‌ది కూడా ఇలాంటి పరిత్యాగ ప్రేమ కథే. అయితే రివర్స్‌లో. అతడిది గ్రీసు, డెన్మార్క్‌ల రాచ కుటుంబం. ఎలిజబెత్‌ను చేసుకోవడం కోసం తన సొంత రాజ్యాన్ని వదులుకుని బ్రిటన్ కుటుంబంలో సభ్యుడు అయ్యారు. -
రాణి గారి వర్క్ రిపోర్ట్
రాజైనా పేదైనా పని చెయ్యాలి. పని చేస్తేనే గౌరవం. రాజు పెద్ద కావచ్చు. పేద చిన్న కావచ్చు. పనిలో మాత్రం చిన్నా పెద్ద తేడాలు ఉండవు. బ్రిటన్‌లో ప్రతి ఏడాది చివరా.. రాజ కుటుంబం ఆ ఏడాది ఎన్ని రోజులు పని చేసిందనే దానిపై లెక్కలు విడుదలౌతాయి! ఆ లెక్కల ప్రకారం.. 2019లో ఆ కుటుంబం మొత్తం పని చేసిన రోజులు సగటున 84.5. ఎలిజబెత్ రాణి గారు పని చేసిన రోజులు 67 కాగా, రాణి గారి కుమార్తె ప్రిన్సెస్ యాన్ పని చేసిన రోజులు 167. ఆ కుటుంబంలో ఎక్కువ రోజులు పని చేసింది ఈవిడే. రాణి గారి కుమారుడు ప్రిన్స్ చార్లెస్ పని చేసిన రోజులు 125. ఇంతకీ తక్కువ పని చేశారా, ఎక్కువ పని చేశారా? తక్కువ ఎక్కువల్ని పక్కన పెడితే.. బ్రిటన్‌లో గత ఏడాది పని దినాల సంఖ్య 253.ఇంతకీ రాచకుటుంబానికి ఏం పని ఉంటుంది అనేనా మీ సందేహం. అధికారిక పత్రాలపై సంతకం పెట్టడం కూడా పనే కదా! -
క్వీన్ ఎలిజబెత్ భర్తకు తప్పిన ప్రమాదం
లండన్ : బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్(97) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పు ఇంగ్లండ్‌లోని సాండ్రిన్గామ్ వద్ద ఫిలిప్ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రిన్స్ ఫిలిప్నకు ఎటువంటి గాయాలు కాలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ప్యాలెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘ ప్రిన్స్ ఫిలిప్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించడంతో నార్ఫోక్ కంట్రీలోని క్వీన్ ఎలిజబెత్ నివాసంలో వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా క్వీన్ ఎలిజబెత్, మాజీ నేవీ అధికారి ప్రిన్స్ ఫిలిప్‌ల వివాహం 1947లో జరిగింది. ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ ఫిలిప్ 2017లో అధికారిక రాజ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. గతేడాది జరిగిన మేజర్ సర్జరీ(హిప్ రీప్లేస్మెంట్) తర్వాత కూడా రాజ కుటుంబం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక డ్రైవింగ్‌ను ఎంతగానో ఇష్టపడే ప్రిన్స్ ఫిలిప్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా బ్రిటన్ పర్యటనకు వచ్చిన సమయంలో స్వయంగా కారు నడుపుతూ వారిని లంచ్‌కు తీసుకువెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆయనే స్వయంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌కు పరిమిత వయస్సు ఏమీ ఉండదు గానీ, 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ప్రతీ మూడేళ్లకొకసారి లైసెన్స్‌ను రిన్యువల్ చేసుకోవాలి. -
‘దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి’
లండన్ : తనకి, తన కూతురికి మధ్య ఏర్పడిన ‘అగాథాన్ని’పూడ్చేందుకు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ చొరవ తీసుకోవాలని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ అభ్యర్థించారు. హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఈ క్రమంలో మేఘన్ పెళ్లైన నాటి నుంచి ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేఘన్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూశాను. తనకు ఎన్నోసార్లు మెసేజ్ కూడా చేశాను. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేదు. దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి. త్వరలోనే బుల్లి మేఘన్ లేదా బుల్లి హ్యారీ రాబోతున్నారు. కాబట్టి ఇటువంటి సంతోష సమయంలో నేను తనని కలవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే రాణీగారు. కుటుంబంలో తలెత్తిన సమస్యలను క్వీన్ ఎలిజబెత్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. రాజ కుటుంబంలోనైనా, సాధారణ కుటుంబాల్లోనైనా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటేనే సంతోషం కదా. నా బాధను అర్థం చేసుకోండి’ అంటూ థామస్ మార్కెల్ సోమవారం ఎలిజబెత్‌కు విన్నవించారు. కాగా యువరాణి హోదా పొందిన నాటి నుంచి తన కూతురి మోముపై చిరునవ్వు మాయమైందంటూ థామస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక ‘మేఘన్‌కు వివాహం అయిన నాటి నుంచి ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. ఇక ఈ విషయంపై క్వీన్ ఎలిజబెత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
పాకిస్థాన్ గురించి ఐదు ఆసక్తికరమైన అంశాలు!
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ దేశానికి సంబంధించి ఐదు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అవి అందరికి తెలియక పోవచ్చు. పాకిస్థాన్‌కు మొదటి రాణి క్వీన్ ఎలిజబెత్. ఆమె 1956 వరకు పాక్‌కు రాణిగా ఉన్నారు. 1. భారత్, పాక్‌కు స్వాతంత్య్రానికి ముందు నుంచి ఎలిజబెత్ రాణి తండ్రి జార్జి–6 ఇరు దేశాలకు రాజుగా ఉన్నారు. 1950లో భారత్ రిపబ్లిక్‌గా మారడంతో ఆయన రాజరికం భారత్‌లో అంతరించింది. కానీ పాకిస్థాన్‌లో కొనసాగింది. 1952లో రాజు జార్జి–6 మరణించారు. ఆయన స్థానంలో బ్రిటీష్ రాణిగా పట్టాభిషక్తులైన ఆయన కూతురు రెండో ఎలిజబెత్ పాకిస్థాన్‌కు రాణిగా 1956 వరకు కొనసాగారు. అయితే రాణి పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా లాంఛనంగా మాత్రమే ఆ దేశపు రాణిగా కూడా కొనసాగారు. 1956లో పాకిస్థాన్ కూడా రిపబ్లిక్ అవడంతో ఆమె రాచరికం అక్కడ కూడా రద్దయింది. 2. పాకిస్థాన్ జాతీయ పానీయం చెరకు రసం. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఈ పానీయం అత్యంత ఇష్టం. ముఖ్యంగా వేసవిలో ఈ చెరకు రసం లేకుండా ఆయన ఉండలేరు. 3. హరప్ప నాగరికతగా ప్రసిద్ధి చెందిన సింధూ నాగరికతకు పాకిస్థాన్ పుట్టినిల్లు. ఈశాన్య అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా ఆగ్నేయ భారత్ ప్రాంతానికి ఈ నాగరికత విస్తరించి ఉంది. 4. ప్రపంచంలో సగం ఫుట్‌బాల్స్ ఇక్కడే తయారయితాయి. పాకిస్థాన్‌లోని సియాల్కోట్ అందుకు ప్రసిద్ధి. అన్ని ప్రపంచకప్ సాకర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వీటినే ఎక్కువగా వాడుతారు. చేతితో తయారుచేసే ఈ ఫుట్‌బాల్స్‌ను ఏటా ఆరు కోట్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. 5. ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలో గ్రౌండ్, ఎత్తయిన అంతర్జాతీయ రహదారి పాక్‌లోనే ఉన్నాయి. ‘రూఫ్ ఆఫ్ ది వరల్డ్’గా ప్రసిద్ధి చెందిన గిల్గిట్ పర్వతాల్లో షాండూర్ టాప్ ఉంది. 12,200 అడుగులు (3,700 మీటర్ల) ఎత్తులో ఉండే షాండూర్ టాప్‌లో 1936 నుంచి ఫ్రీ సై్టల్ పోలో ఆడుతున్నారు. ఇక పాకిస్థాన్‌ను చైనాను కలిపే అంటే కారకోరం పర్వత శ్రేణి నుంచి చైనాలోని కుంజేరబ్ పాస్‌ను కలిపే కారకోరం అంతర్జాతీయ రహదారి 15,397 అడుగులు (4,693 అడుగులు) ఎత్తులో ఈ రహదారి వెళుతుంది. దీని పొడువు 800 మైళ్లు. -
కామన్వెల్త్ చీఫ్‌గా చార్లెస్
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్(69) నియామకానికి 53 కూటమి దేశాల అధినేతలు ఆమోద ముద్ర వేశారు. కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సులో భాగంగా శుక్రవారం విండ్సర్ కోటలో రహస్యంగా జరిగిన భేటీలో చార్లెస్‌ను కామన్వెల్త్ చీఫ్‌గా నియమించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. చోగమ్ ముగింపు సందర్భంగా అధికారిక ప్రకటనలో ఈ విషయం చెప్పారు. చార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్ నుంచి కామన్వెల్త్ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు. ప్రిన్స్ చార్లెస్ చీఫ్ కావాలన్నది తన ఆకాంక్షని, దీన్ని సభ్యులందరూ ఆమోదించాలని ప్రారంభ ఉపన్యాసంలో గురువారం ఎలిజబె™Œ కోరింది. ఎలాంటి ముందస్తు అజెండా లేకుండా విండ్సర్ కోటలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీసహా 52 దేశాల అధినేతలు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోస భేటీకి హాజరుకాలేదు. తదుపరి కామన్వెల్త్ చీఫ్‌పై ఏకాభిప్రాయంతో పాటు, కూటమి భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించారు. ప్రిన్స్ చార్లెస్ ఎంపికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత్ ముందుగానే ప్రకటించింది. కాగా భారత్ మద్దతు కూడగట్టేందుకు ప్రిన్స్ చార్లెస్ గట్టిగానే కృషి చేశారు. గతేడాది భారత్ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసి లండన్ సదస్సుకు రావాలని వ్యక్తిగతంగా కోరారు. మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద భారతదేశ జాతీయ జెండాను అపవిత్రం చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ‘మేం చర్యలు ఆశిస్తున్నాం. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, రెచ్చగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలి’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. కామన్వెల్త్ ఫండ్‌కు సాయం రెండింతలు ప్రజాస్వామ్యం బలోపేతం, చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, వాతావరణం, కామన్వెల్త్ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై చోగమ్ సదస్సులో చర్చించారు. అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి(పశ్చిమ) ఘనశ్యామ్ తెలిపారు. కామన్వెల్త్లో భాగంగా ఉన్న చిన్న దేశాలు, ద్వీపాల్లో సామర్థ్యం పెంచాలని, సాంకేతిక సహకారం కోసం కామన్వెల్త్ ఫండ్‌కు సాయాన్ని రెండింతలు చేస్తామని మోదీ ప్రకటించారన్నారు. భారత్‌కు తిరుగుపయనం: బ్రిటన్ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి జర్మనీ చేరుకున్నారు. రాజధాని బెర్లిన్‌లో కొద్ది గంటలు గడిపిన ఆయన జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం ఐదురోజుల విదేశీ పర్యటన ముగించి భారత్‌కు బయల్దేరారు. -
కామన్వెల్త్ చీఫ్‌గా ప్రిన్స్ చార్లెస్!
లండన్: కామన్వెల్త్ చీఫ్‌గా తన కొడుకు ప్రిన్స్ చార్లెస్ పేరును క్వీన్ ఎలిజబెత్ ప్రతిపాదించారు. లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల(చోగమ్)ను ఆమె గురువారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 91 ఏళ్ల రాణి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రిన్స్ చార్లెస్ తన వారసుడిగా కామన్వెల్త్కు చీఫ్ కావాల న్నది తన ఆకాంక్ష అని.. దీన్ని సభ్యులం దరూ ఆమోదించాలని కోరారు. కామన్వెల్త్ చీఫ్ పదవి వారసత్వంగా సంక్రమించేది కాదు.. రాణి మరణించిన తర్వాత ఆటో మేటిగ్గా ప్రిన్స్ చార్లెస్‌ను ఆ పదవి వరించదు. 53 కామన్వెల్త్ సభ్య దేశాల అధినేతలు శుక్రవారం సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజవం శీకుల ప్రభావం నుంచి కామన్వెల్త్ను దూరంగా ఉంచేందుకు ఇదో అవకాశమని.. చీఫ్‌గా వేరేవారిని పెడితే బాగుంటుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. కామన్వెల్త్ అధినేతగా ప్రిన్స్ చార్లెస్‌ను ఎన్నుకోవాలన్న విషయమై సభ్యులందరిలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది. -
కొలవలేని శబ్దాలు
నిస్పృహకూ ఒక ధ్వని ఉంటుంది. అది మన లోపలి నుంచి వచ్చే శబ్దం. ఆ శబ్దాన్ని మన ముఖంపై కనిపించే భావాలతో ఈ లోకాన్ని కొలవనివ్వకూడదు. క్వీన్ ఎలిజబెత్ చెట్లను ప్రేమిస్తారు. రాణిగారికి ఉన్న ఈ చెట్ల ప్రేమపై ప్రకృతివేత్త (నేచురలిస్ట్) డేవిడ్ ఎటెన్‌బరో ‘ది క్వీన్స్ గ్రీన్ ప్లానెట్’ అనే డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఆ పని మీదే మంగళవారం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని పూలవనంలో ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. రాణిగారు అతడికి ఏదో చెప్పబోతుంటే పైన వెళుతున్న హెలికాప్టర్ చెప్పనివ్వడం లేదు! అట్నుంచటు, ఇట్నుంచటు మాటలకు అసౌకర్యం కలిగించే పెద్ద ధ్వనితో తిరుగుతూనే ఉంది. రాణిగారికి చికాకు వేసింది. పైగా ఈ తొంభై రెండేళ్ల వయసులో చెప్పిందే చెప్పడం ఎవరివల్ల మాత్రం అవుతుంది? ‘‘ఏదైనా మాట్లాడుతున్నప్పుడే ఈ హెలికాప్టర్లు ట్రంప్లాగో, ఒబామాలాగో రొదపెడతాయెందుకో?’’ అని ఆమె నిస్పృహ చెందారు. రాణిగారిలోని ఈ ‘సెన్సాఫ్ హ్యూమర్’ను ఉత్తర, దక్షిణార్థ గోళాలు రెండూ ఉదయపు వేళ తేనీటి కప్పులతో చక్కగా ఆస్వాదించాయి. రొద పెట్టేవారు నిత్య జీవితంలో మన చుట్టూ ఉంటారు. వారు మనల్ని మాట్లాడనివ్వరు, ఆలోచించనివ్వరు. నేరుగా వచ్చి ఏమీ వారు మన ధ్యాసను మరల్చరు కానీ వారి ధోరణిలో వారు డబడబమని ‘శబ్దాలు’ చేస్తూనే ఉంటారు. శబ్దాన్ని డెసిబెల్స్‌లో కొలుస్తారు. అయితే వీళ్లు చేసే శబ్దాలను దేనితోనూ కొలవలేం.. మన నిస్పృహతో తప్ప! సదస్సులు, సమావేశాలు, సంభాషణలు, ఆఖరికి.. కుటుంబంలో కూడా నిత్యం ఈ కొలవలేని శబ్దాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. చెప్పేది వినరు. వినకపోవడం శబ్దం. చెబుతున్నది చెప్పనివ్వరు. చెప్పనివ్వకపోవడం శబ్దం. నొసలు విరుపు, పెదవి బిగింపు.. ఇవీ శబ్దాలే. మన కోసమని లోకం చప్పుడు చెయ్యకుండా ఉండదు. తన లోకంలో తను ఉంటుంది. తనకు తెలీకుండానే మన లోకంలోకి వచ్చి వెళుతుంది.. రాణిగారి తలపై తిరిగిన హెలికాప్టర్లా! అప్పుడు రాణిగారైనా, సాధారణ మనుషులైనా నిస్పృహ చెందడం సహజమే. అయితే నిస్పృహకూ ఒక ధ్వని ఉంటుంది. అది మన లోపలి నుంచి వచ్చే శబ్దం. ఆ శబ్దాన్ని మన ముఖంపై కనిపించే భావాలతో ఈ లోకాన్ని కొలవనివ్వకూడదు. అమెరికా అధ్యక్షులపై బ్రిటన్ రాజమాత వేసిన సున్నితమైన సెటైర్లో కనిపిస్తున్న అందమైన జీవిత సత్యం ఇది. చికాకులపై ఇంత సాల్ట్ వేసుకుంటే అవీ రుచిగానే ఉంటాయి. – మాధవ్ శింగరాజు -
లెజండరీ ఫ్యాషన్ డిజైనర్ కన్నుమూత
‘లిటిల్ బ్లాక్ డ్రెస్’ తో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించిన ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ హుబెర్ట్ డి గివెన్చీ(91) శనివారం పారిస్‌లో కన్నుమూశారు. 1950వ దశకంలో క్వీన్ ఎలిజబెత్‌తో పాటు, పలువురు చైనీస్ సోషలైట్స్కు డ్రెస్ డిజైనింగ్ చేయటం ద్వారా ప్రఖ్యాతిగాంచారు. అమెరికా మాజీ మొదటి మహిళ జాక్వలిన్ కెన్నెడీ దుస్తులను డిజైన్ చేసేందుకు హుబెర్ట్ను డిజైనర్‌గా నియమించుకున్నారు. తన అధికార పర్యటనల్లో భాగంగా ఆమె ఎల్లప్పుడూ హుబెర్ట్ డిజైన్ చేసిన దుస్తులనే ధరించేవారు. ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచిన హుబెర్ట్ మరణించారని ఆయన భాగస్వామి ఫిలిప్ వెనెట్ తెలిపారు. -
మీరిప్పుడు నా ప్రజలు
క్రిస్మస్ అందరిదీ. క్వీన్ ఎలిజబెత్ అందరివారు. యేసుక్రీస్తును విశ్వసించేవారు ప్రపంచమంతటా ఉన్నట్లే, క్వీన్ ఎలిజబెత్‌ను అభిమానించే ప్రజలు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. ఎలిజబెత్–2, తన 26వ యేట 1952లో బ్రిటన్ మహారాణి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్ 25న తన తొలి క్రిస్మస్ సందేశాన్ని బి.బి.సి. రేడియోలో ప్రపంచానికి వినిపించారు. అపూర్వమైన ఆ సందేశానికి నేటికి 65 ఏళ్లు! ‘‘ప్రతి క్రిస్మస్కి నాన్నగారు మీతో మాట్లాడేవారు. ఈ క్రిస్మస్కి నేను మాట్లాడుతున్నాను. మీరిప్పుడు నా ప్రజలు..’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు క్వీన్ ఎలిజబెత్. ఇంగ్లండ్‌లోని శాండ్రింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకు ప్రసంగం మొదలైంది. ఎలిజబెత్ తండ్రి ఆరవ కింగ్ జార్జి, ఆయన తండ్రి ఐదవ కింగ్ జార్జి ఏటా క్రిస్మస్కి ఎక్కడైతే కూర్చొని ప్రజలకు సందేశం ఇచ్చేవారో, సరిగ్గా అదే బల్ల ముందు, అదే కుర్చీలో కూర్చొని తన తొలి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు ఎలిజబెత్. అప్పటికింకా ఆమె పట్టాభిషేకం జరగలేదు. తండ్రి మరణించడంతో ఆపద్ధర్మంగా రాణి అయ్యారు కానీ, అధికారికంగా కాలేదు. ఆలోపే క్రిస్మస్ వచ్చింది. ‘‘మా నాన్నగారు మీతో మాట్లాడిన విధంగానే నేను మా ఇంట్లో నుంచి, నా కుటుంబ సభ్యులతో క్రిస్మస్ను జరుపుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. ఈ క్షణాన కుటుంబ సభ్యులకు దూరంగా బ్రిటన్‌కు సేవలు అందిస్తున్న సైనికుల్ని కూడా ఇవాళ నేను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నాను. ఇళ్లలో ఉన్నవారికి; మంచులో, సూర్యరశ్మిలో ఉన్నవారికి.. అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ హృదయపూర్వక శుభాకాంక్షలు. పది నెలల క్రితం నేను సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుండీ మీరు చూపుతున్న విధేయతకు, అందిస్తున్న ఆత్మీయతకు నా ధన్యవాదాలు’’ అని తన చిన్నపాటి ప్రసంగాన్ని ముగించారు ఎలిజబెత్. ముగించడానికి ముందు, త్వరలో పట్టాభిషిక్తురాలు కాబోతున్న తనని ఆశీర్వదించమని ప్రజల్నీ కోరారు. ఆమె కోరిన విధంగానే బ్రిటన్ ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ల కోరిక మేరకే అరవై ఐదేళ్లుగా క్వీన్ ఎలిజబెత్ పాలన సాగిస్తున్నారు. -
‘డియర్ రాణిగారు.. మీతో చాలా మాట్లాడాలి’
లండన్: ప్రియమైన రాణిగారు, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా గుర్రాలు, విమానాలు, పేద చిన్నారుల గురించి’ ..ఇదేదో రాయబారి రాసిన దౌత్యసంబంధాలకు సంబంధించిన లేఖ కాదు. నాలుగేళ్ల బాలుడి ఆకాంక్ష. తన పుట్టిన రోజుకు ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2ను ఆహ్వానిస్తూ భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల బాలుడు ఈ లేఖ రాశాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడి లేఖను చూసిన రాణిగారు ప్రత్యుత్తరాన్ని పంపించారు. నాలుగేళ్ల షాన్ దులే అనే భారతీయ సంతతి బాలుడు జూన్ 25న తన పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ వేడుకలకు రాణిని పిలవాలని తన తల్లి బలిజిందర్కు చెప్పగా ఆమె బహుశా లండన్‌లో చాలా బిజీగా ఉంటారని చెప్పింది. ఏమో రావచ్చేమో అని ఆశాభావంతో ఆ బాలుడు బ్రిటన్ రాణికి లేఖ రాశారు. అందులో ఏం పేర్కొన్నాడంటే.. ప్రియమైన రాణి ఎలిజెబెత్.. ప్రపంచంలో మీరే ఉత్తమ రాణి అని నేను అనుకుంటున్నాను. మీ కిరీటం, మీరు దరించే రోడ్ క్లాక్ నాకు చాలా ఇష్టం. అది సూపర్ హీరోలా ఉంటుంది. నేను మీతో గుర్రాలు, విమానాలు, పేద బాలల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను’ అంటూ మార్చి 13న లేఖ రాశాడు. అయితే, తన లేఖకు బదులు రాదని ఆశ వదులుకున్నాడు. కానీ, మే 3న బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అతడి లేఖ వచ్చింది. అందులో బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా అతడి ఆహ్వానం ప్రకారం రాలేకపోతున్నారని, వారిని ఆహ్వానించిందుకు రాజు, రాణి చాలా సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జూన్ 25న అతడి పుట్టిన రోజు వేడుకను చాలా ఘనంగా జరుపుకోవాలని వారు ఆశించినట్లు అందులో పేర్కొన్నారు. ఆ లేఖ చూసి ఆ బాలుడు ఇప్పుడు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నట్లు అతడి తల్లి చెప్పింది. -
నిరాడంబరంగా బ్రిటన్ రాణి పుట్టినరోజు వేడుకలు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 తన 91వ పుట్టినరోజును శుక్రవారం ఎలాంటి ఆర్భాటం లేకుండా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అధికార నివాసం బకింగ్‌హాం ప్యాలెస్ 1926 మే నాటి 10 రోజుల చిన్నారి ఎలిజబెత్ ఫొటోను విడుదల చేసింది. ఆమెకు నామకరణం చేస్తున్నపుడు తీసిన ఈ నలుపు, తెలుపు ఫొటోలో ఎలిజబెత్ తన తల్లిదండ్రుల చేతుల్లో కనినిస్తున్నారు. వేల్స్ రాజకుమారుడు క్లారెన్స్ హౌస్, ఆయన భార్య కామిల్లా 1952 నాటి యువకురాలైన రాణి, ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో ఫొటోను ట్వీటర్లో పంచుకున్నారు. రాణికి గౌరవ సూచకంగా హైడ్ పార్క్‌లో 41 తుపాకులతో, టవర్ ఆఫ్ లండన్‌లో 62 తుపాకులతో, విండ్సార్ క్యాపిటల్‌లో 21 తుపాకులతో సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. థాయ్‌లాండ్ రాజు భూమిబల్ మరణంతో, సుదీర్ఘకారం రాచరిక విధుల్లో కొనసాగుతున్న, అత్యంత వయస్కురాలైన పరిపాలకురాలిగా ఎలిజబెత్ ఖ్యాతి గడించారు. 1926, ఏప్రిల్ 21న అప్పటి యార్క్ యువరాజు, యువరాణికి ఎలిజబెత్ తొలి సంతానంగా జన్మించారు. 1952, ఫిబ్రవరి 6న బ్రిటన్‌కు రాణి అయిన ఎలిజబెత్ ఈ ఏడాది అదే రోజుకి ఈ పదవిలో 65 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి బ్రిటన్ పరిపాలకురాలు ఈమెనే కావడం విశేషం. అయితే రాణి తన అధికారిక పుట్టిన రోజును మాత్రం జూన్ 17న జరుపుకుంటారు. ఈ సందర్భంగా యూకే వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ముందే బాహుబలి-2 చూడనున్న బ్రిటన్‌రాణి!
హైదరాబాద్: విడుదలకు ముందే బాహుబలి-2 గొప్ప ఖ్యాతిని దక్కించుకోనుంది. ఈ చిత్రాన్ని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ వీక్షించనున్నారు. అది కూడా మనందరికంటే ముందుగా.. ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన విడుదల తేది ఏప్రిల్ 28కంటే ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 27నే ఆమె ఈ సినిమాను చూసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో బ్రిటన్-భారత్‌ల మధ్య కొన్ని కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగాంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ భారతీయ చిత్రాలను ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రదర్శించనుంది. అందులో బాహుబలి: ది కన్‌క్లూజన్ కూడా చేర్చారట. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. అయితే, ఏప్రిల్ 27నే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోగా అక్కడ ప్రదర్శించనున్నారంట. ఆ రోజు ఈ చిత్రాన్ని బ్రిటన్ రాణి ఎలిజెబెత్తోపాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా వీక్షిస్తారని ఓ మీడియా వర్గాల సమాచారం. అయితే, చిత్ర నిర్మాణ వ్యక్తులు, సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ వార్తను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ జరగలేదు. చిత్ర విడుదలకు ముందే దాదాపు రూ.500 కోట్ల బిజినెస్‌ను బాహుబలి-2చేసినట్లు చిత్ర వర్గాల అంచనా. తొలి పార్ట్ కంటే గొప్పగా ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే టాలీవుడ్లో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.