
రాణీగారి జీతం పెంపు ఎంతో తెలుసా?
బ్రిటన్ రాణి ఎలిజబెత్ జీతం పెరిగింది. ఒకవైపు బ్రెగ్జిట్ ప్రభావంతో ఆర్థికవ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నా, రాణీగారి జీతానికి మాత్రం ఎక్కడా ఢోకా లేదు. ఆమె జీతం నెలకు దాదాపు రూ. 2 కోట్లు పెరిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్లోనే అత్యంత ధనవంతులైన రియల్ ఎస్టేట్ ఓనర్లు క్రౌన్ ఎస్టేట్ ఆదాయంలో శాతానికి అనుగుణంగా రాణీగారి జీతాన్ని నిర్ణయిస్తారట. గడిచిన సంవత్సరంలో క్రౌన్ ఎస్టేట్ దాదాపు 2,711 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు అందించింది. రాయల్ ఎస్టేట్ చెల్లించిన మిగులు మొత్తంలో 15శాతాన్ని రాణీగారికి చెల్లిస్తారు. ముగ్గురు రాయల్ ట్రస్టీలు, ప్రధానమంత్రి, ఖజానా ఛాన్స్లర్ మాత్రమే రాణీగారి జీతాన్ని మార్చగలరు.
2017-18 సంవత్సరానికి రాణీగారి సంపాదన ఎంత ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టమని బకింగ్హామ్ ప్యాలెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2015-16 సంవత్సరంలో 5.35 కోట్ల డాలర్ల సంపాదన రాగా, అందులో దాదాపు 2 కోట్ల డాలర్లను బకింగ్హామ్ ప్యాలెస్, విండ్సర్ కేజిల్, ఇతర రాజభవనాల నిర్వహణకే ఖర్చుపెట్టారట. రాణీగారు, ఆమె కుటుంబ సభ్యుల ప్రయాణాలకు దాదాపు 54 లక్షల డాలర్లు ఖర్చయింది.