క్రిస్మస్ అందరిదీ. క్వీన్ ఎలిజబెత్ అందరివారు. యేసుక్రీస్తును విశ్వసించేవారు ప్రపంచమంతటా ఉన్నట్లే, క్వీన్ ఎలిజబెత్‌ను అభిమానించే ప్రజలు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. ఎలిజబెత్–2, తన 26వ యేట 1952లో బ్రిటన్ మహారాణి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్ 25న తన తొలి క్రిస్మస్ సందేశాన్ని బి.బి.సి. రేడియోలో ప్రపంచానికి వినిపించారు. అపూర్వమైన ఆ సందేశానికి నేటికి 65 ఏళ్లు! ‘‘ప్రతి క్రిస్మస్‌కి నాన్నగారు మీతో మాట్లాడేవారు. ఈ క్రిస్మస్‌కి నేను మాట్లాడుతున్నాను. మీరిప్పుడు నా ప్రజలు..’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు క్వీన్ ఎలిజబెత్. ఇంగ్లండ్‌లోని శాండ్రింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకు ప్రసంగం మొదలైంది.
ఎలిజబెత్ తండ్రి ఆరవ కింగ్ జార్జి, ఆయన తండ్రి ఐదవ కింగ్ జార్జి ఏటా క్రిస్మస్‌కి ఎక్కడైతే కూర్చొని ప్రజలకు సందేశం ఇచ్చేవారో, సరిగ్గా అదే బల్ల ముందు, అదే కుర్చీలో కూర్చొని తన తొలి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు ఎలిజబెత్. అప్పటికింకా ఆమె పట్టాభిషేకం జరగలేదు. తండ్రి మరణించడంతో ఆపద్ధర్మంగా రాణి అయ్యారు కానీ, అధికారికంగా కాలేదు. ఆలోపే క్రిస్మస్ వచ్చింది. ‘‘మా నాన్నగారు మీతో మాట్లాడిన విధంగానే నేను మా ఇంట్లో నుంచి, నా కుటుంబ సభ్యులతో క్రిస్మస్‌ను జరుపుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. ఈ క్షణాన కుటుంబ సభ్యులకు దూరంగా బ్రిటన్‌కు సేవలు అందిస్తున్న సైనికుల్ని కూడా ఇవాళ నేను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నాను.
ఇళ్లలో ఉన్నవారికి; మంచులో, సూర్యరశ్మిలో ఉన్నవారికి.. అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ హృదయపూర్వక శుభాకాంక్షలు. పది నెలల క్రితం నేను సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుండీ మీరు చూపుతున్న విధేయతకు, అందిస్తున్న ఆత్మీయతకు నా ధన్యవాదాలు’’ అని తన చిన్నపాటి ప్రసంగాన్ని ముగించారు ఎలిజబెత్. ముగించడానికి ముందు, త్వరలో పట్టాభిషిక్తురాలు కాబోతున్న తనని ఆశీర్వదించమని ప్రజల్నీ కోరారు. ఆమె కోరిన విధంగానే బ్రిటన్ ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ల కోరిక మేరకే అరవై ఐదేళ్లుగా క్వీన్ ఎలిజబెత్ పాలన సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment