christmass
-
క్రిస్మస్ వేడుకలలో వైఎస్ కుటుంబసభ్యులు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలలో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొని ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డితోపాటు ఇతర కుటుంబసభ్యులు ఫాదర్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వైఎస్సార్ సోదరి విమలమ్మ క్రీస్తు సందేశాన్ని వివరించారు. అనంతరం వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ప్రజలందరికి ఈ సందర్భంగా వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్ మేనత్త కమలమ్మ, పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వారి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ అందరి పండుగ
పటమట (విజయవాడ తూర్పు): ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే క్రిస్మస్ అందరి పండుగని, దేవుడు మనిషి రూపంలో వచ్చి ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవటం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయ వాడలోని పటమట సెయింట్ పాల్స్ కథెడ్రెల్ చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బైబిల్లోని 121వ వచనంలోని 1–8వ వచనం వరకు చదివి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. క్రైస్తవ సంస్థలు, చర్చిలు, ఎన్జీవోలు పేదరిక నిర్మూలన కోసమే పనిచేస్తు న్నాయని.. విద్యా, వైద్యం, సేవా రంగాల్లో క్రైస్తవ మిషనరీల త్యాగం ఎనలేనిదన్నారు. కాగా, ఇప్పటివరకు చర్చిల నిర్మాణానికి కేటాయింపులను రూ.5లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. అంతకు ముందు విజయవాడ కథోలిక్ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు కథోలిక పీఠం గురించి, క్రైస్తవ మిషనరీల సేవా కార్యక్రమాల గురించి వివరించారు. -
చిన్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు
లండన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుని బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. 15్ఠ20 మైక్రో మీటర్ల వైశాల్యం గల ఈ కార్డుని శక్తిమంతమైన మైక్రోస్కోపు ద్వారానే చూడొచ్చు. ఒక్క పోస్టేజీ స్టాంపుపై 200 మిలియన్ గ్రీటింగ్‌కార్డులు పడతాయి. నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ వినూత్న గ్రీటింగ్‌కార్డుని రూపొందించారు. ప్లాటినం పూతగల సిలికాన్ నైట్రెడ్తో ఈ కార్డును తయారు చేశామని శాస్త్రవేత్తల్లో ఒకరైన కెన్ మిన్గార్డు తెలిపారు. ఈ కార్డు కొత్త పరికరాల రూపకల్పనలో ఉపయోగపడుతుందన్నారు. ఇంతకుముందు రికార్డుల్లో ఉన్న దాని కంటే ఈ గ్రీటింగ్ కార్డు పది రెట్లు చిన్నదని వెల్లడించారు. -
మీరిప్పుడు నా ప్రజలు
క్రిస్మస్ అందరిదీ. క్వీన్ ఎలిజబెత్ అందరివారు. యేసుక్రీస్తును విశ్వసించేవారు ప్రపంచమంతటా ఉన్నట్లే, క్వీన్ ఎలిజబెత్‌ను అభిమానించే ప్రజలు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. ఎలిజబెత్–2, తన 26వ యేట 1952లో బ్రిటన్ మహారాణి అయ్యారు. అదే ఏడాది డిసెంబర్ 25న తన తొలి క్రిస్మస్ సందేశాన్ని బి.బి.సి. రేడియోలో ప్రపంచానికి వినిపించారు. అపూర్వమైన ఆ సందేశానికి నేటికి 65 ఏళ్లు! ‘‘ప్రతి క్రిస్మస్కి నాన్నగారు మీతో మాట్లాడేవారు. ఈ క్రిస్మస్కి నేను మాట్లాడుతున్నాను. మీరిప్పుడు నా ప్రజలు..’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు క్వీన్ ఎలిజబెత్. ఇంగ్లండ్‌లోని శాండ్రింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకు ప్రసంగం మొదలైంది. ఎలిజబెత్ తండ్రి ఆరవ కింగ్ జార్జి, ఆయన తండ్రి ఐదవ కింగ్ జార్జి ఏటా క్రిస్మస్కి ఎక్కడైతే కూర్చొని ప్రజలకు సందేశం ఇచ్చేవారో, సరిగ్గా అదే బల్ల ముందు, అదే కుర్చీలో కూర్చొని తన తొలి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు ఎలిజబెత్. అప్పటికింకా ఆమె పట్టాభిషేకం జరగలేదు. తండ్రి మరణించడంతో ఆపద్ధర్మంగా రాణి అయ్యారు కానీ, అధికారికంగా కాలేదు. ఆలోపే క్రిస్మస్ వచ్చింది. ‘‘మా నాన్నగారు మీతో మాట్లాడిన విధంగానే నేను మా ఇంట్లో నుంచి, నా కుటుంబ సభ్యులతో క్రిస్మస్ను జరుపుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. ఈ క్షణాన కుటుంబ సభ్యులకు దూరంగా బ్రిటన్‌కు సేవలు అందిస్తున్న సైనికుల్ని కూడా ఇవాళ నేను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నాను. ఇళ్లలో ఉన్నవారికి; మంచులో, సూర్యరశ్మిలో ఉన్నవారికి.. అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ హృదయపూర్వక శుభాకాంక్షలు. పది నెలల క్రితం నేను సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుండీ మీరు చూపుతున్న విధేయతకు, అందిస్తున్న ఆత్మీయతకు నా ధన్యవాదాలు’’ అని తన చిన్నపాటి ప్రసంగాన్ని ముగించారు ఎలిజబెత్. ముగించడానికి ముందు, త్వరలో పట్టాభిషిక్తురాలు కాబోతున్న తనని ఆశీర్వదించమని ప్రజల్నీ కోరారు. ఆమె కోరిన విధంగానే బ్రిటన్ ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ల కోరిక మేరకే అరవై ఐదేళ్లుగా క్వీన్ ఎలిజబెత్ పాలన సాగిస్తున్నారు. -
నింగిలో వెలుగు నేలను చేరిన సుదినం
ఆకాశంలో వెలుగు బెత్లెహేము ఊరి వెలుపల పొలంలో రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా హఠాత్తుగా గొప్ప వెలుగు ఆవరించింది. ఆకాశం నుంచి మాటలు వినిపించాయి.. ‘‘ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త నేడు మీకు తెలుపుతున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. పశువుల పాకలో ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి, పశువుల తొట్టిలో పరుండి ఉండడం మీరు చూస్తారు’’ప్రకటన అయిన వెంటనే గగనం నిండిన దేవదూతల సమూహాలు, పాటల ప్రతిధ్వనులు ‘సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ.... ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద శాంతి, సమాధానం కలుగును గాక..!’’ నింగి, నేల ప్రతిధ్వనించిన ఆ సంతోష శుభవర్తమానాలు, సంగీత నాదాలు, వెలుగుల వైభవ కాంతులు స్వర్గలోకపు స్తుతిపాటలు ఆకాశంలో వెలుగులను విరబూశాయి. దివిలోని దూతల సమూహాలు, భువిలోని గొర్రెల కాపరులు కలిసి కబుర్లాడుకున్న అపూర్వ.. అపురూప సన్నివేశానికి కారణం పతనమైన మానవజాతిని ఉద్ధరించి, రక్షించి, నిత్యానంద సంతోషాన్నిచ్చే రక్షకుని, ప్రభుని జననం.. క్రిస్మస్! క్రీస్తుకు అర్పిస్తున్న ఆరాధన! ‘‘ఆశ్చర్యకరుడు... ఆలోచన కర్త.. బలవంతుడయిన దేవుడు... నిత్యుడగు తండ్రి... సమాధానకర్త అయిన అధిపతి... ఆయన భుజము మీద రాజ్యభారముంటుంది...’’ వందలు, వేల సంవత్సరాలకు ముందు ప్రవచించబడ్డ ప్రవక్తల మాటలు పొల్లుపోకుండా అక్షరమక్షరం శరీర రూపుదాల్చాయి! తల్లిదండ్రులు దైవదూత ఆశించినట్టే ‘యేసు’ అనే పేరు పెట్టారు. సృష్టికర్తగా పరమందు ఉండి మనిషి హృదయంలోని అవకతవకలను ఎలా చెక్కుతూ సరి చేస్తున్నాడో, ఈ లోకంలోని తండ్రి ఇంట కూడా అదే చేశాడు. కట్టెలను, కొయ్యలను కోసి, చెక్కి, ఉపయోగకరమైన అందమైన వస్తువులను చేసే వడ్రంగి పనిని యోసేపునకిచ్చి– అతనని తనను పెంచే తండ్రిగా ఎంచుకున్నాడు. ఆ పనిలోని సులువులను, నైపుణ్యాలను తండ్రికి నేర్పించాడు. అతి తక్కువకాలంలో చరిత్రను మార్చే ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చుననే కాలం విలువను, పనిపట్ల అంకితత్వాన్ని ప్రజలకు నేర్పించాడు! మనిషి నీతిగా బతికితేనే శాంతి సొంతమవుతుందని ప్రకటించాడు. ప్రకృతిని శాసించాడు. మరణించిన వారిని పునర్జీవుతులను చేశాడు. సత్యాలను, విలువలను బోధించాడు! ‘‘యేసుక్రీస్తు గురించి, ఆయన చేసిన ఇంకా ఎన్నో కార్యాల గురించి రాస్తే– అలా రాయబడే గ్రంథాలకు ఈ భూలోకం చాలదు’’అని ఆయన శిష్యుడు యోహాను అన్న మాటల్ని నిజం చేస్తూ, ప్రపంచ సాహిత్యంలో తొంభైశాతం క్రీస్తు ప్రేమతో ప్రభావితమౌ రాయబడినదే! ఆయన పలికిన మాటలు లక్షల గ్రంథాలకు రూపునిచ్చాయి. ఆయన సందేశం కోట్లాది ప్రజల జీవితాలను మార్చివేసింది. ఆయా దేశాల పాలనా విధానాలను తీర్చిదిద్దింది. ప్రభుత్వాల రాజ్యాంగాలు, చట్టాలు మానవత్వంతో పరిమళించేందుకు ‘నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న వెలుగు రేఖ ప్రామాణికమయ్యింది. మానవీయ విలువలను బోధించే క్రీస్తు ప్రభువు మాటలను అందరూ ఆచరించగలిగితే మన దేశంలో శాంతి సౌభాగ్యం సమృద్ధిగా ఉండేవి కాని, కొట్టు, నరుకు, చంపు అనే పదాలనే నిరంతరం వినే సమాజం బాలలు వాటినే నినదిస్తారు తప్ప– ప్రేమించు, ఆదరించు, క్షమించు, సహించు అనే భావాలను ఎలా అలవరచుకోగలరు? అధికారం, అహంకారం, అసమానతల విద్వేషాలతో సాగుతున్న వ్యవస్థలో ప్రేమ, దయ, కరుణ ఉప్పొంగే యేసు ప్రభువు మాటలు గాఢాంధకారంలో వెలుగు కిరణాలుగా ప్రసరించాయి. కఠినాత్ములను కరుణామూర్తులను చేశాయి. దీనులను, హీనులను ఆత్మస్థైర్యంతో నింపి, తామూ ఇతరులతో సమానమే అన్న నమ్మకాన్ని, జీవితం మీద ఆశను రగిలించాయి. మహారక్షకుడిగా అభిషిక్తుడైన ఆ ప్రభువు జననం చీకట్లను ఛేదించిన వెలుగు కిరణాల గానం! గుండె గుండెలో నినదించే సుమధుర సునాదాల సంరంభం!! అదే క్రిస్మస్ మహా పర్వదినం! క్రిస్మస్ చెట్టు ఆవిర్భావానికి కథ ఒకటి చెప్తారు. ఆ కథేంటంటే... ’’చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడికి ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో పైసా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబో తన ఇంటిముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి, ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా అందరూ క్రిస్మస్ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారట!’’ – ఝాన్సీ కె.వి.కుమారి -
సాండ్విచ్ బిస్కెట్స్
బిస్కెట్ మీద బిస్కెట్ పెట్టి.. మధ్యలో ఇంత క్రీమ్ కొట్టి.. కట్టండి తియ్యటి బంధాలు. ఈ క్రిస్మస్ సీజన్లో కుటుంబ సభ్యులందరూ తియ్యటి బంధంలో సాండ్విచ్ బిస్కెట్స్ ఆస్వాదించండి హనీ యోగర్ట్ బిస్కెట్స్ కావలసినవి: మైదా – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – టీ స్పూను; సాదా పెరుగు – ఒకటింపావు కప్పులు తయారి: ♦ ఒకపాత్రలో మైదాపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పెరుగు జత చేసి ఫోర్క్‌తో ముద్దలా అయ్యేవరకు కలపాలి ♦ వెడల్పాటి గిన్నెలో పిండిని పొడిపొడిగా చల్లాలి. ♦ తయారుచేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అర అంగుళం మందంగా వేసి మధ్యకు మడచాలి ♦ మరోసారి పొడి పిండి చల్లి మళ్లీ మధ్యకు మడచాలి ♦ మౌల్డ్‌తో క్రిస్మస్ ట్రీలా కట్ చేసి సన్నని పుల్లతో డిజైన్ గీయాలి ♦ వీటిని పాత్రలో ఉంచి ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి మంట బాగా తగ్గించాలి ♦ సుమారు పావు గంట తరవాత స్టౌ ఆపేయాలి ♦ అరగంట తరవాత కుకర్ మూత తీసి తయారయిన బిస్కెట్లను మరో ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తరవాత, గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. క్రీమ్ ... ఒక పాత్రలో తేనె, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరోపాత్రలో బటర్, పంచదార పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లలో మొదటి బిస్కెట్ మీద తేనె, కొబ్బరి పొడి మిశ్రమం, రెండో బిస్కెట్ మీద బటర్ పంచదార పొడి మిశ్రమం వేసి పైన మరో బిస్కెట్ ఉంచితే, డబుల్ డెక్కర్ బిస్కెట్లు రెడీ. చాకొలేట్ అండ్ బటర్ బిస్కెట్స్ కావలసినవి: బటర్ – 120 గ్రా; పంచదార పొడి – 50 గ్రా; వెనిలా ఎసెన్స్ – 2 చుక్కలు; మైదా పిండి – 180 గ్రా; నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; డార్క్ చాకొలేట్/ మిల్క్ చాకొలేట్ – 300 గ్రా. తయారి: ♦ ఒక పాత్రలో మెత్తటి బటర్, పంచదార పొడి వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి ♦ వెనిలా ఎసెన్స్, మైదా పిండి జత చేసి మరోమారు బాగా కలిపి, ఎక్కడా పగుళ్లు లేకుండా చూసి మూత పెట్టి గంటసేపు ఉంచాలి ♦ చేతికి అంటకుండా కొద్దిగా మైదా పిండి అద్ది కొద్దిగా మందంగా ఉండేలా చేతితో అదమాలి ♦ కటర్‌తో కావలసిన ఆకారంలో బిస్కెట్లుగా కట్ చేయాలి ♦ సన్నని సూదితో రంధ్రాలు చేయాలి ∙ప్లేట్‌కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో దూరం దూరంగా అమర్చి, ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి, 20 నిమిషాల తరవాత దించేయాలి ♦ బాగా చల్లారిన తరవాత ప్లేట్లోకి తీసుకుని, మరో పావుగంట తరవాత డార్క్ చాకొలేట్ లేదా మిల్క్ చాకొలేట్‌ను ఉంచి పైన మరో బిస్కెట్ ఉంచి సర్వ్ చేయాలి. క్రీమ్... మొదటి బిస్కెట్ మీద డార్క్ చాకొలేట్ వేసి, పైన మరో బిస్కెట్ పెట్టి, దానిమీద మిల్క్ చాకొలేట్ వేసి, పైన మరో బిస్కెట్ ఉంచి అందించాలి. రాగి బిస్కెట్స్ కావలసినవి: రాగి పిండి – అరకప్పు; గోధుమ పిండి – అర కప్పు; బటర్ – అర కప్పు; పంచదార పొడి – అర కప్పు; పెరుగు – టేబుల్ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; ఏలకుల పొడి – టీ స్పూను; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను తయారి: ♦ ఒక పాత్రలో రాగి పిండి, గోధుమపిండి వేసి దోరగా వేయించి, తీసే, చల్లారనివ్వాలి ♦ మరొక పాత్రలో బటర్, పంచదార పొడి వేసి మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలకొట్టాలి ♦ చల్లారిన రాగి పిండి, గోధుమపిండి మిశ్రమాన్ని జత చేసి మరోమారు బాగా కలపాలి ♦ పెరుగులో బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి మరోమారు కలపాలి ♦ అన్ని పదార్థాలను కలిపి, చపాతీ పిండిలా చేయాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా అదమాలి. క్రీమ్... పంచదార పొడి, తాజా క్రీమ్, ఏలకుల పొడి, బాదం తరుగు, కుంకుమపువ్వు, చాకొలేట్ సిరప్‌లను ఒక పాత్రలో వేసి బాగా కలిపి, క్రీమీగా తయారుచేయాలి. తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్ల మధ్య ఉంచి తింటే రుచిగా ఉంటాయి. గమనిక: అవెన్ బదులుగా ప్రెజర్ కుకర్‌లో బిస్కెట్లు తయారుచేయడానికి ప్రెజర్ కుకర్ లేదా మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకుని, అంగుళం మందంలో రాళ్ల ఉప్పు లేదా ఇసుక వేయాలి. దాని మీద స్టాండు లేదా ప్లేట్ ఉంచాలి. ముందుగా కుకర్‌ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి. ఆ తరవాత బిస్కెట్ల తయారీకి ఉపయోగించాలి. పాత కుకర్ని ఉపయోగించడం మంచిది. -
త్రిష ఒడిలో జూనియర్!
ఆల్మోస్ట్ 15 డేస్ ఉంది. క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అవ్వడానికి. కానీ తమిళ పొన్ను (అమ్మాయి) త్రిష ఇంట్లో ఇప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అవ్వడం ఏంటీ? ఆల్రెడీ గిఫ్ట్స్ కూడా వచ్చేస్తుంటేనూ! ఈ సెలబ్రేషన్స్‌ను త్రిషతో పాటు జోయా, జోరో అండ్ కడు జూనియర్ అనే ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు. వారికి, త్రిషకు సంబంధం ఏంటీ అని తెగ థింక్ చేయకండి. ఓసారి ఇన్సెట్లో ఉన్న ఫొటో చూశారా? చూడగానే ఆ ముగ్గురూ ఎవరో అర్థమైంది కదూ! త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ పేర్లే జోయా, జోరో అండ్ కడు జూనియర్. త్రిష ఒడిలో కూర్చున్నది కడు జూనియరే. ‘‘క్రిస్మస్ సెలబ్రేషన్స్ సార్టయ్యాయి. మై లవ్స్ జోయా, జోరో, కడు జూనియర్’’ అంటూ త్రిష ట్విట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. -
20న హైటీ ప్రోగ్రామ్
కడప ఎడ్యుకేషన్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొత్త కలెక్టరేట్లోని సభాభవనంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హైటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఖాదర్‌బాషా తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు, పాస్టర్లు, చర్చి పెద్దలు తదితరులు హాజరు కావాలని కోరారు. 15లోగా వివరాలు పంపాలి జిల్లాలో పదవ తరగతిలో అగ్ర స్థానంలో ఉత్తీర్ణులైన ముగ్గురు క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు, ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ల పేర్లను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయానికి ఈనెల 15వ తేదీలోపు పంపాలని జిల్లా మైనార్టీ అధికారి ఖాదర్‌బాషా కోరారు. హైటీ ప్రోగ్రాంలో వీరికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు.