సాండ్విచ్‌ బిస్కెట్స్‌ | Sandwich Biscuits | Sakshi
Sakshi News home page

సాండ్విచ్‌ బిస్కెట్స్‌

Published Sat, Dec 23 2017 12:25 AM | Last Updated on Sat, Dec 23 2017 12:25 AM

Sandwich Biscuits - Sakshi

బిస్కెట్‌ మీద బిస్కెట్‌ పెట్టి.. మధ్యలో ఇంత క్రీమ్‌ కొట్టి.. కట్టండి తియ్యటి బంధాలు. ఈ క్రిస్మస్‌ సీజన్‌లో కుటుంబ సభ్యులందరూ తియ్యటి బంధంలో సాండ్విచ్‌ బిస్కెట్స్‌ ఆస్వాదించండి

హనీ యోగర్ట్‌ బిస్కెట్స్‌
కావలసినవి: మైదా – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – టీ స్పూను; సాదా పెరుగు – ఒకటింపావు కప్పులు
తయారి:  ఒకపాత్రలో మైదాపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పెరుగు జత చేసి ఫోర్క్‌తో ముద్దలా అయ్యేవరకు కలపాలి
వెడల్పాటి గిన్నెలో పిండిని పొడిపొడిగా చల్లాలి. 
తయారుచేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అర అంగుళం మందంగా వేసి మధ్యకు మడచాలి
 మరోసారి పొడి పిండి చల్లి మళ్లీ మధ్యకు మడచాలి
 మౌల్డ్‌తో క్రిస్మస్‌ ట్రీలా కట్‌ చేసి సన్నని పుల్లతో డిజైన్‌ గీయాలి
వీటిని పాత్రలో ఉంచి ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి  మంట బాగా తగ్గించాలి
 సుమారు పావు గంట తరవాత స్టౌ ఆపేయాలి
 అరగంట తరవాత కుకర్‌ మూత తీసి తయారయిన బిస్కెట్లను మరో ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తరవాత, గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి.
క్రీమ్‌ ... ఒక పాత్రలో తేనె, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరోపాత్రలో బటర్, పంచదార పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లలో మొదటి బిస్కెట్‌ మీద తేనె, కొబ్బరి పొడి మిశ్రమం, రెండో బిస్కెట్‌ మీద బటర్‌ పంచదార పొడి మిశ్రమం వేసి పైన మరో బిస్కెట్‌ ఉంచితే, డబుల్‌ డెక్కర్‌ బిస్కెట్లు రెడీ.


చాకొలేట్‌ అండ్‌ బటర్‌ బిస్కెట్స్‌
కావలసినవి: బటర్‌ – 120 గ్రా; పంచదార పొడి – 50 గ్రా; వెనిలా ఎసెన్స్‌ – 2 చుక్కలు; మైదా పిండి – 180 గ్రా; నీళ్లు – 3 టేబుల్‌ స్పూన్లు; డార్క్‌ చాకొలేట్‌/ మిల్క్‌ చాకొలేట్‌ – 300 గ్రా.
తయారి:  ఒక పాత్రలో మెత్తటి బటర్, పంచదార పొడి వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి
 వెనిలా ఎసెన్స్, మైదా పిండి జత చేసి మరోమారు బాగా కలిపి, ఎక్కడా పగుళ్లు లేకుండా చూసి మూత పెట్టి గంటసేపు ఉంచాలి
చేతికి అంటకుండా కొద్దిగా మైదా పిండి అద్ది కొద్దిగా మందంగా ఉండేలా చేతితో అదమాలి
కటర్‌తో కావలసిన ఆకారంలో బిస్కెట్లుగా కట్‌ చేయాలి
సన్నని సూదితో రంధ్రాలు చేయాలి ∙ప్లేట్‌కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో దూరం దూరంగా అమర్చి, ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి, 20 నిమిషాల తరవాత దించేయాలి
బాగా చల్లారిన తరవాత ప్లేట్‌లోకి తీసుకుని, మరో పావుగంట తరవాత డార్క్‌ చాకొలేట్‌ లేదా మిల్క్‌ చాకొలేట్‌ను ఉంచి పైన మరో బిస్కెట్‌ ఉంచి సర్వ్‌ చేయాలి.
క్రీమ్‌... మొదటి బిస్కెట్‌ మీద డార్క్‌ చాకొలేట్‌ వేసి, పైన మరో బిస్కెట్‌ పెట్టి, దానిమీద మిల్క్‌ చాకొలేట్‌ వేసి, పైన మరో బిస్కెట్‌ ఉంచి అందించాలి.


రాగి బిస్కెట్స్‌
కావలసినవి: రాగి పిండి – అరకప్పు; గోధుమ పిండి – అర కప్పు; బటర్‌ – అర కప్పు; పంచదార పొడి – అర కప్పు; పెరుగు – టేబుల్‌ స్పూను; బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూను; ఏలకుల పొడి – టీ స్పూను; వెనిలా ఎసెన్స్‌ – టీ స్పూను
తయారి: ఒక పాత్రలో రాగి పిండి, గోధుమపిండి వేసి దోరగా వేయించి, తీసే, చల్లారనివ్వాలి
మరొక పాత్రలో బటర్, పంచదార పొడి వేసి మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలకొట్టాలి
చల్లారిన రాగి పిండి, గోధుమపిండి మిశ్రమాన్ని జత చేసి మరోమారు బాగా కలపాలి
పెరుగులో బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, వెనిలా ఎసెన్స్‌ వేసి మరోమారు కలపాలి
అన్ని పదార్థాలను కలిపి, చపాతీ పిండిలా చేయాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా అదమాలి.  
క్రీమ్‌... పంచదార పొడి, తాజా క్రీమ్, ఏలకుల పొడి, బాదం తరుగు, కుంకుమపువ్వు, చాకొలేట్‌ సిరప్‌లను ఒక పాత్రలో వేసి బాగా కలిపి, క్రీమీగా తయారుచేయాలి. తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్ల మధ్య ఉంచి తింటే రుచిగా ఉంటాయి.


గమనిక: అవెన్‌ బదులుగా ప్రెజర్‌ కుకర్‌లో బిస్కెట్లు తయారుచేయడానికి ప్రెజర్‌ కుకర్‌ లేదా మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకుని, అంగుళం మందంలో రాళ్ల ఉప్పు లేదా ఇసుక వేయాలి. దాని మీద స్టాండు లేదా ప్లేట్‌ ఉంచాలి. ముందుగా కుకర్‌ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి. ఆ తరవాత బిస్కెట్ల తయారీకి ఉపయోగించాలి. పాత కుకర్‌ని ఉపయోగించడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement