చేపలతో శరీర సౌందర్యానికి సంబంధించిన క్యాప్సూల్స్
మత్స్య ఉత్పత్తులతో మంచి ఆరోగ్యమే లక్ష్యంగా సీఐఎఫ్‌టీ ఉత్పత్తుల తయారీ
జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా పరిశోధనలు
దేశవిదేశాల్లో మంచి ఆదరణ
ఏయూ క్యాంపస్: సముద్రపు నాచుతో బిస్కెట్లు.. నత్తల పొడితో సూప్.. చేపల నూనెతో శరీర సౌందర్య సంబంధిత క్యాప్సూల్స్.. ఇలా ఎన్నో సముద్ర ఆధారిత ఉత్పత్తులను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) ప్రపంచానికి పరిచయం చేస్తోంది. సముద్ర జీవులపై పరిశోధనలు చేస్తూ.. వాటిలోని ప్రతీ భాగాన్ని వినియోగిస్తూ కొత్తకొత్త ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది.
సముద్రంలో లభించే ప్రతి జీవి నుంచి ఆహార, ఆరోగ్య ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. సీఐఎఫ్‌టీ అభివృద్ధి చేసిన సముద్ర ఆధారిత ఉత్పత్తులు దేశవిదేశాల్లో సైతం మన్ననలు పొందుతున్నాయి.
చేపలోని ప్రతి భాగాన్నీ ఉపయోగిస్తూ ఉత్పత్తులు..
జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. చర్మం సహా చేపలోని ప్రతీ భాగాన్ని ఉపయోగిస్తూ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను సైలేజ్‌గా మార్చి మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. చేపల్లోని నూనెను సేకరించి.. క్యాప్సూల్స్‌ను అభివృద్ధి చేశారు.
ఇవి ఎలాంటి వాసన రాకుండా.. అందరూ వినియోగించే విధంగా అందుబాటులోకి తెచ్చారు. అలాగే ఇమ్యూన్ బూస్టర్లు, శరీర సౌందర్యాన్ని కాపాడే ఉత్పత్తులు, న్యూట్రా సూటికల్స్‌ను తయారు చేస్తున్నారు. రొయ్య పొట్టు నుంచి తయారు చేసిన కాప్సూల్స్.. భోజనానికి ముందు తీసుకుంటే ఆహారంలోని నూనెను సంగ్రహించి బయటకు పంపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుందని వెల్లడించారు.
అలాగే చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, తాజాగా కనిపించడానికి ఉపయోగించే ఫార్మలిన్ రసాయనాన్ని సులభంగా గుర్తించే కిట్‌ను కూడా శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీరు అభివృద్ధి చేసిన చిన్నపాటి పేపర్‌ను.. చేపపై రుద్దాల్సి ఉంటుంది. చేప రంగు మారిపోతే ఫార్మలిన్‌ను ఉపయోగించారని అర్థం. అలాగే చిన్న చేపలను పొడి చేసి పోషకాల సమాహారంగా తయారు చేశారు. దీనిని ఇప్పటికే ఒడిశాలోని పాఠశాలల్లో, ఆదివాసీ ప్రాంతాల పిల్లలకు పోషకాహారంగా అందిస్తున్నారు.
చేపల పొలుసు నుంచి డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్‌ను తయారు చేశారు. సముద్రపు నాచు నుంచి తయారుచేసిన బిస్కెట్లతో పాటు చేపలు, రొయ్యల పచ్చళ్లు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు నిల్వ ఉండే రెడీ టు ఈట్ ఫిష్ కర్రీ ప్రత్యేకమైన మూడు పొరల ప్యాకింగ్‌లలో లభిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలకు ఇక్కడి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.. భవిష్యత్‌లో వీటి సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.
సముద్రంలోని ప్రతి జీవి నుంచీఆరోగ్య ఉత్పత్తులే లక్ష్యం..
జీరో వేస్ట్ ప్రాసెసింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇంకా కొన్ని అంశాలపై పరిశోధనలు జరగాల్సి ఉంది. సముద్రంలో లభించే ప్రతి జీవి నుంచి పూర్తిస్థాయిలో ఆహార, ఆరోగ్య ఉత్పత్తులు తయారు చేయడమే లక్ష్యం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఐఎఫ్‌టీ
సాంకేతికతను బదలాయిస్తున్నాం
సీఐఎఫ్‌టీ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఇతర సంస్థలకు, వ్యక్తులకు కూడా బదలాయిస్తున్నాం. వారు ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. – డాక్టర్ పి.విజ్జి, సీనియర్ సైంటిస్ట్, సీఐఎఫ్‌టీ
Comments
Please login to add a commentAdd a comment