Seaweed
-
సీవీడ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
సీవీడ్ అనేది ఒకరకమైన సముద్రపు నాచు. దీని సుషీ లేదా నోరి అని పిలుస్తారు. దీని వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరగాయాలు, గుడ్లు, చేపలు వంటి వాటితో కలిపి దీన్ని రకరకాల రెసీపీలు చేస్తారు. ఇది జపాన్‌కి చెందింది. ప్రస్తుతం భారత్‌లో కూడా అత్యంత ప్రజాధరణ పొందిన వంటకంగా మారింది. దీన్ని ప్రాసీస్ చేసిన తర్వాత ఆకుపచ్చ షీట్లా కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి. అలాంటి సుపీని ఆహారంలో చేర్చుకోవడంలో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దాం.పోషకాల గని..సీవీడ్‌లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్కి మంచి మూలం. అలాగే, ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్లు ఎ, సి, ఇ, కె ఉన్నాయి. బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉనికి..సీవీడ్‌లో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి భూమిలోని కూరగాయలలో కనిపించవు. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేగాదు ఇది క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంచడంలో..నోరి లేదా సీవీడ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సీవీడ్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.గుండె ఆరోగ్యంసీవీడ్లో పొటాషియం, మెగ్నీషియం హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని ఎదుర్కొనడమే గాక రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అయోడిన్ మూలంథైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్ సమృద్దిగా లభించే వాటిలో సీవీడ్ ఒకటి. ఇది థైరాయిడ్ జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధికి ముఖ్యమైన హార్మోన్ల పనితీరును నియంత్రిస్తుంది. బరువు నిర్వహణలో..సీవీడ్‌లో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే..?ఇది సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం క్యాలరీలను తీసుకోవడం తగ్గించి ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.ఆరోగ్యకరమైన చర్మంసీవీడ్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది.అలాగే దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి కొల్లాజెన్ ఉత్పత్తి తోడ్పతాయి. ఇది చర్మ మరమ్మత్తులో ప్రభావవంతంగా పనిచేస్తుంది.యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలుసీవీడ్ యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఇవి వైరస్లు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. (చదవండి: వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..) -
ఆరోగ్యాన్నిచ్చే సముద్రపు నాచు.. ఎన్నెన్నో పోషకాలు.. ఏపీకి సదావకాశం
సీవీడ్.. శతాబ్దాలుగా పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన పేరిది. దశాబ్ద కాలంగా దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీని ప్రత్యేకతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సముద్రపు నాచుగా పిలిచే సీవీడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ సమ్మేళనాల్లో ఉంటాయి. శతాబ్దాలుగా చైనా, జపాన్, కొరియా, మెక్సికో వంటి కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సముద్రపు నాచును సంప్రదాయ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఐరోపా వంటకాల్లో సముద్రపు నాచును చేర్చేందుకు ఫ్రాన్స్‌లో పెద్దఎత్తున ప్రయత్నాలు చేసి కొంతమేర విజయం సాధించారు. జపాన్ దేశీయులు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, హవాయి వంటి ప్రాంతాల్లో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్లలో ఇది సాధారణంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఆస్ట్రియా, జర్మనీలలో సముద్రపు నాచును అత్యంత విలువైన బ్రెడ్–అల్టెన్బ్రోట్ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌లో బారామోర్ లేదా బ్రెడ్ ఆఫ్ సీ తయారీకి ఉపయోగిస్తున్నారు. తృణ ధాన్యాల మిశ్రమం సీవీడ్ తృణధాన్యాల మిశ్రమం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు మానవ వినియోగం కోసం ప్రత్యేకంగా సముద్రపు నాచును పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ జనాభా పెరుగుదల, పరిమిత భూమి, విలువైన సహజ వనరుల ప్రాముఖ్యత దీనిపై పరిశోధనలకు కారణమైంది. జపాన్, చైనా వంటి కొన్ని దేశాల్లో వీటి పెంపకం పరిశ్రమ స్థాయికి చేరుకుంది. జపాన్, చైనా, కొరియా, మెక్సికో, అమెరికన్ దేశాల్లో శతాబ్దాలుగా దాదాపు 66 శాతం ఆల్గే (సముద్రపు నాచు) జాతులను రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని గుర్తించారు. ఏపీకి అందివచ్చిన అవకాశం సువిశాల సముద్ర తీరం గల ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ఇప్పుడు మెగా మిషన్‌ను ప్రారంభించింది. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు శ్రీకాకుళం జిల్లా బారువ, విశాఖపట్నం భీమిలి బీచ్‌కు వెళ్లే దారిలో మంగమారిపేట, బాపట్ల జిల్లా సూర్యలంక, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పైలట్ ప్రాతిపదికన సీవీడ్ సాగును ప్రారంభించారు. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో 49 ప్రదేశాలు దీని సాగుకు అనువైనవిగా గుర్తించారు. మన దేశంలో సముద్రపు నాచును మందులు, వస్త్రాలు, ఎరువులు, పశువుల దాణా, జీవ ఇంధన పరిశ్రమల్లోనూ వినియోగిస్తున్నారు. సీవీడ్ ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఉంటుంది. అత్యధికంగా సాగు చేస్తున్న సీవీడ్ రకాలు కప్పాఫైకస్ ఆల్వారెజి, గ్రాసిలేరియా, సాచరినా జపోనికా, ఫైరోపియా, సర్గస్సమ్ ప్యూసిఫార్మ్. ప్రభుత్వ ప్రోత్సాహం సీవీడ్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి సాగును ప్రోత్సహిస్తోంది. ఏపీలో 10 వేల సీవీడ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. మత్స్యకారులు, మత్స్యకార మహిళా సొసైటీలు, ఎస్సీ, ఎస్టీ కో–ఆపరేటివ్ సొసైటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడిలో 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రానికి ఈ ఏడాది 7,200 యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.12 కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా రూ.74.40 లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ♦ సీవీడ్ సాగుకు అయ్యే వ్యయం అత్యల్పం. శ్రమశక్తి వినియోగం కూడా స్వల్పమే. ♦ ఒకసారి విత్తనాలు కొని తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పునరుత్పత్తి అయ్యే విత్తనాలే వాడుకోవచ్చు. ♦ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వేయాల్సిన అవసరం లేదు. ♦కొద్దిపాటి శిక్షణతో మహిళలు, నిరక్షరాస్యులు సైతం పెద్దఎత్తున సాగు చేయవచ్చు. ♦రెండు నెలల వ్యవధిలోనే ఉత్పత్తులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ♦దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో పాటు ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. ♦ సముద్రపు నాచులో అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ♦ రొయ్యలు, చేపల పెంపకంలో నాణ్యమైన ఫీడ్‌గా, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ♦అధిక పోషకాలు ఉన్నందున ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ♦ నీటిని శుభ్రపరిచే గుణం దీనికి ఉంది. సముద్రంలో చేరే మురుగు, ఇతర వ్యర్థాలను శోషించుకుని నీటిని స్వచ్ఛంగా ఉంచేందుకు నాచు సహాయ పడుతుంది. సాగు ఇలా.. సముద్రంలో అలలు తక్కువగా ఉండే ప్రదేశాలు, బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతాల్లో సీవీడ్ సాగు చేసుకోవచ్చు. అలల ఉధృతి అధికంగా ఉంటే నాచు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదముంది. ఏడాదిలో ఏడెనిమిది నెలలు దీని సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సీవీడ్ విత్తనాలను కిలో రూ.50 చొప్పున తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. అధిక సాంద్రత కలిగిన పాలీవినైల్ పైప్స్ లేదా ట్యూబ్ నెట్ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. సీఎంఎఫ్ఆర్ఐ, పీఎంఎంఎస్వై ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తాయి. విత్తనాలను వలల్లో అమర్చి ఆ వలలను కర్రలు లేదా పైపులకు కడతారు. కెరటాల అలజడి లేని తీర ప్రాంతాల్లో వాటిని తెప్పల్లా అమర్చుతారు. 2 రోజులకోసారి వాటిని పరిశీలిస్తుంటారు. 45–60 రోజుల్లో మొక్కలు పెరుగుతాయి. వాటిని ఎండబెట్టి విక్రయిస్తారు. – సురేష్, మత్స్యశాఖ జేడీ, బాపట్ల జిల్లా -
Seaweed: సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం! ఇక గ్రేసిలేరియా అయితే..
Organic Seaweed- Amazing Health Benefits: సీవీడ్స్.. అంటే సముద్రపు నీటిలో పెరిగే నాచు వంటి మొక్కలు. వాటి విలువ తెలియని కాలంలో ‘వీడ్స్’ అని పిలిచి ఉంటారు. పౌష్టిక విలువేమిటో తెలిసిన తర్వాత ఇప్పుడు ‘సీ ప్లాంట్స్’ అని, ‘సీ వెజిటబుల్స్’ అంటూ నెత్తినపెట్టుకుంటున్నారు. ఆకుపచ్చగా ఉండే ఉల్వా రకం సీవీడ్‌ను ‘సముద్రపు పాలకూర’ అని కూడా పిలుస్తున్నారు. చైనా, జపాన్ తదితర ఆసియా దేశాల్లో తరతరాలుగా వీటిని సముద్రం నీటిలో సహజసిద్ధంగా పెరిగే సీవీడ్స్‌ను సేకరించి తినే అలవాటుంది. అమెరికా, కెనడాల్లో కొన్ని కంపెనీలు చెరువుల్లో పెంచటం ప్రారంభించాయి. ఇజ్రాయిల్ కంపెనీ మరో ముందడుగేసింది. సేంద్రియ సీ వెజిటబుల్స్ సాగు చేసే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆహారోత్పత్తులకు అదనపు పోషకాలు జోడించడానికి, ఔషధాల తయారీలో సీవీడ్స్‌ను విరివిగా వాడుతున్నారు. సేంద్రియ సీ వీడ్స్ సాగు అంటే ఏమిటి? సీ వీడ్స్ సాధారణంగా సముద్రపు నీటిలో సహజసిద్ధంగా పెరుగుతూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులును బట్టి కొన్ని సీజన్లలోనే అందుబాటులో ఉంటాయి. కాలక్రమంలో వీటిని తీరం వెంబడి సముద్రపు నీటిలో కేజెస్లలో సాగు చేయటం ప్రారంభమైంది. తీరప్రాంతాల్లో నేలపై నిర్మించిన కృత్రిమ చెరువుల్లో సముద్రపు నీటిని తోడి సాగు చేయటం అమెరికా, కెనడా దేశాల్లోని తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు ప్రారంభించాయి. ఇప్పుడు ఇజ్రేల్‌కు చెందిన ‘సీకురా’ అనే కంపెనీ మరో ముందుకు వేసి సేంద్రియ సీ వీడ్స్ సాగు చేయనారంభించటం విశేషం. సాధారణ సముద్ర జలాల్లో భారఖనిజాలు, ఇతర కాలుష్యాలు అంటకుండా సముద్ర గర్భం నుంచి శుద్ధమైన నీటిని తోడి తెచ్చి తీరానికి దగ్గర్లో నేలపై కృత్రిమ ఉప్పునీటి చెరువుల్లో సాగు చేసే విధానమే ‘సేంద్రియ సీవీడ్స్ సాగు’ పద్ధతి అని ఈ సంస్థ చెబుతోంది. నీటి ఉష్ణోగ్రతను, కాంతిని నియంత్రించడం ద్వారా ఏడాది పొడవునా సేంద్రియ సీవీడ్స్ సాగును నిరంతరాయంగా చేపట్టవచ్చని ఈ సంస్థ చెబుతోంది. పెరుగుతున్న జనాభాకు పౌష్టిక విలువలున్న ఆహారోత్పత్తులను అందించడానికి తగినంత పరిమాణంలో స్థిరమైన దిగుబడి పొందడానికి తమ సాంకేతికత ఉపకరిస్తుందని ఈ కంపెనీ చెప్తోంది. సీవీడ్స్ సాగులో 3 దశలు సేంద్రియ సీవీడ్స్ సాగుకు సముద్రగర్భం నుంచి తోడిన నీటిని భారఖనిజాలు, ఇతర కలుషితాలు లేకుండా శుద్ధి చేసిన నీటిని వాడుతారు. సీవీడ్ల ముక్కలు వేస్తే కొద్ది రోజుల్లో అవి పెరుగుతాయి. పెరుగుదల క్రమంలో వయసును బట్టి 3 దశలుంటాయి. ఒక్కో దశకు వేర్వేరు చెరువుల వ్యవస్థను డిజైన్ చేశారు. సముద్రపు నీటిలోని సహజ పోషకాలు, బాక్టీరియా ఆధారంగా సీవీడ్స్ వేగంగా పెరుగుతాయి. సాగు పూర్తయి సీవీడ్స్‌ను పట్టుబడి చేసిన తర్వాత నీటిని ఆక్వా సాగుకు వాడొచ్చు లేదా తిరిగి సముద్రంలోకి వదిలేయవచ్చు. కాలుష్యం అనే మాటే ఉండదు అని నిపుణులు చెబుతున్నారు. ‘బీచ్‌లో కాళ్ళకు చుట్టుకొని చికాకుపెట్టే వాటిగానే సీవీడ్స్‌ను ఇజ్రేల్ ప్రజలు భావించేవారు. తినడానికి పనికొచ్చేదని మొన్నటి వరకూ తెలీదు. ఇప్పుడు అది ఎంత ఆరోగ్యకరమైనదో, ఎంత రుచిగా ఉంటుందో గ్రహించారు అంటున్నారు ఓజ్. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రెండు రకాల సీవీడ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఓజ్ అంటున్నారు. సేంద్రియ సీవీడ్ సాగుపై మన శాస్త్రవేత్తలు దృష్టిపెడితే.. రొయ్యలు, చేపలు, స్పిరులినా మాదిరిగా చెరువుల్లో సీవీడ్స్ సేంద్రియ సాగు చేసి అమెరికా, కెనడా తదితర దేశాల్లో మార్కెట్లను భారత్ చేజిక్కించుకునే పరిస్థితులొస్తాయని ఆశించవచ్చు. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం సీ వీడ్స్ రకాలు వేలాదిగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా కలిగి ఉండే రెండు రకాలను ఎంపిక చేసుకొని తాము సాగు చేస్తున్నామని సీకురా సీఈఓ ఓజ్ చెప్పారు. మాంసం (25 గ్రా.), చికెన్ (21.7 గ్రా.), కోడిగుడ్డు (12 గ్రా.)తో పోలిస్తే తాము సాగు చేసే ఉల్వా, గ్రేసిలేరియా రకాల సీవీడ్స్‌లో 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుందన్నారు. ఉల్వా రకం పచ్చని ఆకుల మాదిరిగా ఆకుపచ్చని రంగులో ఉంటుంది. అందుకే దీన్ని ‘సముద్రపు పాలకూర’ అని కూడా పిలుస్తారు. రెండోది గ్రేసిలేరియా ఇది ముదురు ఎరుపు రంగు సున్నితమైన కాడలతో కూడిన మొక్క మాదిరిగా ఉంటుంది. వీటిని ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వీటిల్లో ఏ మేరకున్నాయో నిర్ధారించడానికి కంపెనీ జన్యు పరీక్షలు నిర్వహించింది. ఇతర సూపర్ ఫుడ్స్‌లో కన్నా మిన్నగానే డైటరీ ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ముఖ్యంగా అధిక అయోడిన్ వీటిల్లో కాలే, చియా, స్పిరులినా వంటి ఇతర సూపర్ ఫుడ్స్‌లో కన్నా మిన్నగానే ఉన్నాయి. అయోడిన్ లోపం నేడు ప్రపంచంలోని ప్రధాన పోషకాహార లోపాల్లో ఒకటి. గాయిటర్, గర్భధారణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యల నివారణలో అధిక పోషకాలున్న ఉల్వా, గ్రేసిలేరియా సీవీడ్స్ సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఉంది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ చదవండి: Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే