సీవీడ్.. శతాబ్దాలుగా పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన పేరిది. దశాబ్ద కాలంగా దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీని ప్రత్యేకతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సముద్రపు నాచుగా పిలిచే సీవీడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ సమ్మేళనాల్లో ఉంటాయి. శతాబ్దాలుగా చైనా, జపాన్, కొరియా, మెక్సికో వంటి కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సముద్రపు నాచును సంప్రదాయ ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
ఇటీవల ఐరోపా వంటకాల్లో సముద్రపు నాచును చేర్చేందుకు ఫ్రాన్స్‌లో పెద్దఎత్తున ప్రయత్నాలు చేసి కొంతమేర విజయం సాధించారు. జపాన్ దేశీయులు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, హవాయి వంటి ప్రాంతాల్లో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్లలో ఇది సాధారణంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఆస్ట్రియా, జర్మనీలలో సముద్రపు నాచును అత్యంత విలువైన బ్రెడ్–అల్టెన్‌బ్రోట్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌లో బారామోర్ లేదా బ్రెడ్ ఆఫ్ సీ తయారీకి ఉపయోగిస్తున్నారు.
తృణ ధాన్యాల మిశ్రమం
సీవీడ్ తృణధాన్యాల మిశ్రమం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు మానవ వినియోగం కోసం ప్రత్యేకంగా సముద్రపు నాచును పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ జనాభా పెరుగుదల, పరిమిత భూమి, విలువైన సహజ వనరుల ప్రాముఖ్యత దీనిపై పరిశోధనలకు కారణమైంది.
జపాన్, చైనా వంటి కొన్ని దేశాల్లో వీటి పెంపకం పరిశ్రమ స్థాయికి చేరుకుంది. జపాన్, చైనా, కొరియా, మెక్సికో, అమెరికన్ దేశాల్లో శతాబ్దాలుగా దాదాపు 66 శాతం ఆల్గే (సముద్రపు నాచు) జాతులను రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని గుర్తించారు.
ఏపీకి అందివచ్చిన అవకాశం
సువిశాల సముద్ర తీరం గల ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ఇప్పుడు మెగా మిషన్‌ను ప్రారంభించింది. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు శ్రీకాకుళం జిల్లా బారువ, విశాఖపట్నం భీమిలి బీచ్‌కు వెళ్లే దారిలో మంగమారిపేట, బాపట్ల జిల్లా సూర్యలంక, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పైలట్ ప్రాతిపదికన సీవీడ్ సాగును ప్రారంభించారు. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో 49 ప్రదేశాలు దీని సాగుకు అనువైనవిగా గుర్తించారు.
మన దేశంలో సముద్రపు నాచును మందులు, వస్త్రాలు, ఎరువులు, పశువుల దాణా, జీవ ఇంధన పరిశ్రమల్లోనూ వినియోగిస్తున్నారు. సీవీడ్ ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఉంటుంది. అత్యధికంగా సాగు చేస్తున్న సీవీడ్ రకాలు కప్పాఫైకస్ ఆల్వారెజి, గ్రాసిలేరియా, సాచరినా జపోనికా, ఫైరోపియా, సర్గస్సమ్ ప్యూసిఫార్మ్.
ప్రభుత్వ ప్రోత్సాహం
సీవీడ్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి సాగును ప్రోత్సహిస్తోంది. ఏపీలో 10 వేల సీవీడ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. మత్స్యకారులు, మత్స్యకార మహిళా సొసైటీలు, ఎస్సీ, ఎస్టీ కో–ఆపరేటివ్ సొసైటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు.
15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడిలో 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రానికి ఈ ఏడాది 7,200 యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.12 కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా రూ.74.40 లక్షలు లబ్ధిదారులు భరిస్తారు.
♦ సీవీడ్ సాగుకు అయ్యే వ్యయం అత్యల్పం. శ్రమశక్తి వినియోగం కూడా స్వల్పమే.
♦ ఒకసారి విత్తనాలు కొని తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పునరుత్పత్తి అయ్యే విత్తనాలే వాడుకోవచ్చు.
♦ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వేయాల్సిన అవసరం లేదు.
♦కొద్దిపాటి శిక్షణతో మహిళలు, నిరక్షరాస్యులు సైతం పెద్దఎత్తున సాగు చేయవచ్చు.
♦రెండు నెలల వ్యవధిలోనే ఉత్పత్తులు చేతికి వచ్చే అవకాశం ఉంది.
♦దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో పాటు ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది.
♦ సముద్రపు నాచులో అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతుంది.
♦ రొయ్యలు, చేపల పెంపకంలో నాణ్యమైన ఫీడ్‌గా, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది.
♦అధిక పోషకాలు ఉన్నందున ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
♦ నీటిని శుభ్రపరిచే గుణం దీనికి ఉంది. సముద్రంలో చేరే మురుగు, ఇతర వ్యర్థాలను శోషించుకుని నీటిని స్వచ్ఛంగా ఉంచేందుకు నాచు సహాయ పడుతుంది.
సాగు ఇలా..
సముద్రంలో అలలు తక్కువగా ఉండే ప్రదేశాలు, బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతాల్లో సీవీడ్ సాగు చేసుకోవచ్చు. అలల ఉధృతి అధికంగా ఉంటే నాచు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదముంది. ఏడాదిలో ఏడెనిమిది నెలలు దీని సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సీవీడ్ విత్తనాలను కిలో రూ.50 చొప్పున తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది.
అధిక సాంద్రత కలిగిన పాలీవినైల్ పైప్స్ లేదా ట్యూబ్ నెట్ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. సీఎంఎఫ్‌ఆర్‌ఐ, పీఎంఎంఎస్‌వై ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తాయి. విత్తనాలను వలల్లో అమర్చి ఆ వలలను కర్రలు లేదా పైపులకు కడతారు. కెరటాల అలజడి లేని తీర ప్రాంతాల్లో వాటిని తెప్పల్లా అమర్చుతారు. 2 రోజులకోసారి వాటిని పరిశీలిస్తుంటారు. 45–60 రోజుల్లో మొక్కలు పెరుగుతాయి. వాటిని ఎండబెట్టి విక్రయిస్తారు.
– సురేష్, మత్స్యశాఖ జేడీ, బాపట్ల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment