ముష్కరుడిని మట్టుపెట్టేందుకు పరోక్షంగా సాయపడిన బిస్కెట్లు
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్‌తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్‌లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్‌కౌంటర్ వివరాలను సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి.
మొరిగితే అసలుకే మోసం
కశ్మీర్‌లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్‌లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.
ఏకే47తో సిద్ధం
ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్‌తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్‌ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్‌కు ఈ ఎన్‌కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్‌ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment