తప్పంతా మేఘన్‌ మీదకు నెడుతున్నారు.. | Prince Harry And Meghan Says Bye To Royal Palace | Sakshi
Sakshi News home page

బై..గ్రానీ

Published Fri, Jan 10 2020 1:37 AM | Last Updated on Fri, Jan 10 2020 4:50 PM

Prince Harry And Meghan Says Bye To Royal Palace - Sakshi

ఎలిజబెత్‌ మహారాణి

ఇరాన్‌లో యుద్ధ మేఘాలు. ఇండియాలో పౌరసత్వ నిరసనలు. అగ్రరాజ్యాల్లో పర్యావరణ ఉద్యమాలు. ఒక్కోదేశం ఒక్కో సమస్యతో సతమతమౌతోందిప్పుడు. బ్రిటన్‌ ప్రజలు మాత్రం వీటన్నిటికీ భిన్నమైన ఒక హటాత్పరిణామంతో నివ్వెర పోయి రెండు రోజులుగా రాజప్రాసాదం వైపే చూస్తున్నారు. మనవడు ప్రిన్స్‌ హ్యారీ తన నానమ్మ క్వీన్‌ ఎలిజబెత్‌తో  ఓ మాటైనా చెప్పకుండా భార్యతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. స్వాతంత్య్రం కోసం ఎన్నో దేశాలు బ్రిటన్‌పై పోరాడి స్వేచ్ఛను సాధించుకు న్నట్లే..  స్వతంత్రంగా జీవించడం కోసం ప్రిన్స్‌ హ్యారీ.. రాయల్‌ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నారా?!

ఊరంతా తెలిశాక మనకు తెలిసే విషయం ఒకటి ఉంటుంది. మన ఇంటి విషయం! అబ్బాయి బయటేదో ఘనకార్యం చేసి ఉంటాడు. కాలనీ అంతా తెలిశాకే మనకు తెలుస్తుంది. అమ్మాయి ఎవర్నో ప్రేమిస్తుంటుంది. పొరుగూళ్లో బంధువులందరికీ తెలిశాకే, ఆ కబురు మన ఊళ్లో బస్‌ దిగి, మన ఇంటికి వస్తుంది. నమ్మకం మనకు మన అబ్బాయి మీద, అమ్మాయి మీద. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి కావచ్చు.. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు విషయాన్ని దాచి ఉంచీ ఉంచీ ఇక చెప్పకపోతే నమ్మకద్రోహం చేసినట్లవుతుందని మనకు చెప్పేస్తుంటారు.

ఇళ్లన్నీ ఒక్కటే. రాజుగారి ఇల్లయినా, పేదవాడి ఇల్లయినా! మనుషులంతా ఒక్కటే. గ్రేట్‌ బ్రిటన్‌లో ఉన్నా, పూర్‌ కంట్రీలో ఉన్నా! అందుకే.. మనవడు హ్యారీ, అతడి భార్య.. ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ తెలిశాక ఆఖర్న గానీ ఎలిజబెత్‌ రాణిగారికి తెలియలేదు. అప్పట్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. నేనేం తక్కువ చేశాను అని ఆమె విలపిస్తున్నారు తప్పితే, వాళ్లేం ఎక్కువ కోరుకుంటున్నారోనని ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. వెళ్లిపోతున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఇదే ఆమె హృదయాన్ని పిండేస్తోంది.

బుధవారం సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. క్రిస్మస్‌ వేడుకల కోసం వారం ముందే శాండ్రింగ్‌ హామ్‌ ఎస్టేట్‌కి వెళ్లిన రాణిగారు మూడు వారాలు గడిచిపోతున్నా అక్కడే ఉండిపోడానికి కారణాలు ఏమైనా.. ఇప్పుడామె హుటాహుటిన బకింగ్‌హామ్‌ రాజప్రాసాదానికి తిరిగి వచ్చే ఏర్పాట్లలో ఉన్నారు. రాయల్‌ ఫ్యామిలీలోంచి వెళ్లిపోవాలని మనవడు హ్యారీ, అతడి భార్య కలిసి తీసుకున్న నిర్ణయంగా బ్రిటన్‌ పత్రికల్లో వస్తున్న వార్తలు.. తిరుగు ముఖానికి ఆమెను తొందర పెడుతున్నాయి. ‘కనీసం వాళ్లు రాణిగారికి చెప్పనైనా లేదు’ (దే డిడిన్ట్‌ ఈవెన్‌ టెల్‌ ద క్వీన్‌) అని ‘డైలీ మిర్రర్‌’ తన మొదటి పేజీ నిండా పెట్టిన హెడ్డింగ్‌ ఆమెను మరింతగా బాధిస్తుండవచ్చు.

ప్యాలెస్‌ తలుపులు తెరుచుకోగానే గుమ్మం ముందు పడి కనిపించే అనేక తుంటరి పత్రికల్లో అదీ ఒకటి. ఈ భార్యాభర్తలిద్దరూ తాము ఇల్లొదిలి వెళ్లిపోతున్నట్లు రాణిగారికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం నిజమే. పైగా ఆ విషయాన్ని వాళ్లు తామిద్దరూ కొత్తగా ప్రారంభించిన వెబ్‌సైట్ లో బహిరంగ పరచడం ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత అలసటకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ‘హ్యారీ మొన్న క్రిస్మస్‌కి కూడా పొడిపొడిగానే మాట్లాడాడు. అది కూడా ఫోన్‌లో. అప్పుడైనా నేను అతడి అంతరంగాన్ని గ్రహించ వలసింది’’ అని రాణిగారు పొడి బారుతున్న గొంతుతో అన్నట్లు.. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత సంరక్షకులు ఒకరు.. తనను పట్టి పీడిస్తున్న మీడియా ప్రతినిధులకు తప్పనిసరై వెల్లడించారు.

భార్య మేఘన్‌ మార్కెల్‌తో ప్రిన్స్‌ హ్యారీ

‘‘మా కాళ్లపై మేము నిలబడాలని భావిస్తున్నాం. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నాం. మాకొక గుర్తింపు కోసం ఆశపడుతున్నాం. మేము బయటికి రావడం వల్ల రాచ కుటుంబం నుంచి వారసత్వంగా మాకు సంక్రమించవలసిన వాటన్నిటినీ కోల్పోతామని తెలుసు. అయినా అందుకు సిద్ధపడుతున్నాం’’ అని ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ కలసి చేసిన ఆ ప్రకటన ఎలిజబెత్‌ రాణి మనసులోనే కాదు, బ్రిటన్‌ ప్రజల్లోనూ కలవరం రేపుతోంది. ‘కలిసి ఉన్న ఒక గొప్ప కుటుంబం ముక్కలు కాబోతోందే! ఈ విలయాన్ని, విపత్తును నివారించలేకపోతున్నామే.. ఎలా దేవుడా..’ అని ఆ కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే వారు విలవిలలాడుతున్నారు. వారిలో కొందరైతే తమ మనసులో ఉన్న దానిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ‘‘ఈ దుస్థితికి మూల కారణం హ్యారీ భార్య మేఘన్‌. ఆ మహాతల్లి వల్లే ఇదంతా జరుగుతోంది. హ్యారీ భార్యా విధేయుడైపోయి, కుటుంబాన్ని కాదనుకున్నాడు. కనీసం రాణి గారికి కూడా చెప్పి చేయడం లేదంటే ఏమనుకోవాలి?’’ అని తప్పంతా మేఘన్‌ మీదకు నెడుతున్నారు.

ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం తప్పయినా ఒప్పయినా.. ఇంటికి పెద్దయిన రాణిగారికి చెప్పకపోవడం మాత్రం తప్పే. ప్రస్తుతం రాణిగారు, రాణిగారి భర్త; రాణిగారి కొడుకు, కూతురు; కొడుకు సంతానం, కూతురి సంతానం; వారి జీవిత భాగస్వాములు; వారి సంతానంలో కొందరు.. మొత్తం 24 మంది ‘రాయల్‌’ టైటిల్‌ ఉన్నవాళ్లున్నారు. మిగతా ఇంకా ఉన్నారు కానీ, వాళ్లంతా టైటిల్స్‌ లేనివాళ్లు. ఇప్పుడు బయటికి వెళ్లిపోతున్న హ్యారీ, మేఘన్‌ సొంతంగా బతకడం కోసం రాయల్‌ టైటిల్‌ని కూడా వదులుకోబోతున్నారు. బ్రిటన్‌లోని విండ్సర్‌లో ఫ్రాగ్‌మోర్‌ కాటేజ్‌ హ్యారీ పేరు మీద ఉంది. దాన్ని మాత్రం ఉంచుకుంటారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి పోతుండటానికి. ఇకనుంచీ ఈ దంపతులు ఉండటమైతే బ్రిటన్‌ కాదు. కెనడా. 

2018 మే లో హ్యారీ, మేఘన్‌ల వివాహం జరిగింది. వారికిప్పుడు ఎనిమిది నెలల కొడుకు. పేరు మౌంట్‌బ్యాటన్‌. సింహాసనాన్ని అధిష్టించే వారసత్వపు వరసలో అతడిది ఏడవ స్థానం. అంతఃపురంలో తమ స్థానాలన్నిటినీ వదులుకుని వెళ్తున్న ప్రిన్స్‌ హ్యారీ దంపతులకు ఆ కుటుంబ సభ్యుల హృదయాలలో మాత్రం స్థానం ఎప్పటికీ ఉంటుంది. అది కాదనుకున్నా పోయేది కాదు. కాదని వెళ్లిపోయినా విడిచి పెట్టేదీ కాదు.

గతంలో!
కింగ్‌ ఎడ్వర్డ్‌ VIII

వాలిస్‌ సింప్సన్‌తో ఎనిమిదవ ఎడ్వర్డ్‌
ఇప్పుడు ప్రిన్స్‌ హ్యారీ బయటికి వెళ్తున్నట్లే.. బ్రిటన్‌ రాజ కుటుంబపు పూర్వీకుడైన ఎనిమిదవ ఎడ్వర్డ్‌ మహారాజు కూడా తను ప్రేమించిన యువతి కోసం ప్యాలెస్‌ను వదులుకున్నవారే! ప్యాలెస్‌తో పాటు తన సింహాసనాన్ని కూడా! అమెరికన్‌ వితంతువు అయిన వాలిస్‌ సింప్సన్‌ను ప్రేమించిన ఎడ్వర్డ్‌.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నందుకు కిరీటాన్ని సైతం కాదనుకున్నారు. ‘‘నేనీ భారాన్ని మోయలేకపోతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి సహాయం, సహకారం లేకుండా ఈ రాజ్యాధికారానికి న్యాయం చేకూర్చలేను’’ అని రాజైన కొద్ది నెలలకే బహిరంగంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నారు. ఆ మర్నాడే ఎడ్వర్డ్‌ తమ్ముడు ప్రిన్స్‌ ఆల్బర్ట్‌ బ్రిటన్‌కు రాజయ్యాడు. 

ప్రిన్స్‌ ఫిలిప్‌

ఎలిజబెత్‌ (ప్రస్తుత రాణి)తో ప్రిన్స్‌ ఫిలిప్‌

రెండవ ఎలిజబెత్‌ రాణి (హ్యారీ నానమ్మ) భర్త ఫిలిప్‌ది కూడా ఇలాంటి పరిత్యాగ ప్రేమ కథే. అయితే రివర్స్‌లో. అతడిది గ్రీసు, డెన్మార్క్‌ల రాచ కుటుంబం. ఎలిజబెత్‌ను చేసుకోవడం కోసం తన సొంత రాజ్యాన్ని వదులుకుని బ్రిటన్‌ కుటుంబంలో సభ్యుడు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement