లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్‌ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు.
రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment