లండన్ : బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్(97) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పు ఇంగ్లండ్‌లోని సాండ్రిన్‌గామ్ వద్ద ఫిలిప్ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రిన్స్ ఫిలిప్‌నకు ఎటువంటి గాయాలు కాలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ప్యాలెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘ ప్రిన్స్ ఫిలిప్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించడంతో నార్‌ఫోక్ కంట్రీలోని క్వీన్ ఎలిజబెత్ నివాసంలో వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
కాగా క్వీన్ ఎలిజబెత్, మాజీ నేవీ అధికారి ప్రిన్స్ ఫిలిప్‌ల వివాహం 1947లో జరిగింది. ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్’ ఫిలిప్ 2017లో అధికారిక రాజ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. గతేడాది జరిగిన మేజర్ సర్జరీ(హిప్ రీప్లేస్‌మెంట్) తర్వాత కూడా రాజ కుటుంబం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక డ్రైవింగ్‌ను ఎంతగానో ఇష్టపడే ప్రిన్స్ ఫిలిప్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా బ్రిటన్ పర్యటనకు వచ్చిన సమయంలో స్వయంగా కారు నడుపుతూ వారిని లంచ్‌కు తీసుకువెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆయనే స్వయంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌కు పరిమిత వయస్సు ఏమీ ఉండదు గానీ, 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ప్రతీ మూడేళ్లకొకసారి లైసెన్స్‌ను రిన్యువల్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment