Prince Philip
-
రాణి ఎలిజబెత్–2కు భారత్ అంటే అభిమానం
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. ‘జలియన్‌వాలాబాగ్’పై విచారం.. 1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్మహల్నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు. కామన్వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్‌వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్‌కు ఇంగ్లండ్‌లో రాణి ఆతిథ్యమిచ్చారు. 1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో... -
‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’
లండన్: బ్రిటీష్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు చెందిన వీలునామాను మరో 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలంటూ గురువారం లండన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్వీన్ ఎలిజబెత్ హుందాతనానికి సూచకంగా ఆ వీలునామాను తెరవరాదు అని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 99 ఏళ్ల వయసులో ప్రిన్స్ ఫిలిప్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాచరిక కుటుంబంలో ఎవరైనా సీనియర్ సభ్యులు మరణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శతాబ్ధాల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నది. (చదవండి: ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు) ప్రస్తుతం ఫ్యామిలీ డివిజన్ కోర్టు అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆండ్రూ మెక్ ఫార్లేన్ .. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాపై తీర్పును ప్రకటించారు. ఫిలిప్ వీలునామాను సీలు చేసి, 90 ఏళ్లు తర్వాత దాన్ని తెరవాలంటూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. అంతేకాక కోర్టు ఫైల్లో ఉంచే నిమిత్తం వీలునామా కాపీని కూడా తీయడానికి వీలులేదని తెలిపారు. ఇక ప్రిన్స్ ఫిలిప్ తన వీలునామాలో ఏం రాశారో ఎవరికీ తెలియదని జడ్జి తెలిపారు. చదవండి: బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...! -
ప్రిన్స్ ఫిలిప్‌కు గన్ సెల్యూట్
లండన్: విండ్సర్ కోటలో శుక్రవారం కన్నుమూసిన రాణి ఎలిజెబెత్–2 భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్(99)కు సంతాప సూచికంగా గన్ సెల్యూట్ చేశారు. 8 రోజుల సంతాప ప్రారంభ సూచికగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని రాజధానులు లండన్, కార్డిఫ్, బెల్ఫాస్ట్, ఎడిన్బరోలలో శనివారం మధ్యాహ్నం నిమిషానికి ఒక రౌండ్ చొప్పున 41 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దేశవ్యాప్తంగా ఇలా గన్ సెల్యూట్ చేసే జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ కార్యక్రమం 18వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తోందని రాయల్ వెబ్సైట్ తెలిపింది. ఇలాంటి గన్ సెల్యూట్ రాణి విక్టోరియా చనిపోయిన సమయంలో 1901లోనూ పాటించారని వివరించింది. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరోకు రాయల్ నేవీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గన్ సెల్యూట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. గన్ సెల్యూట్ కార్యక్రమాలు ఆన్‌లైన్‌తోపాటు టీవీల్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పార్లమెంట్ కొత్తగా ఎలాంటి చట్టాలు చేయదు. సంప్రదాయం ప్రకారం, రాణి ఎలిజెబెత్ ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరు. కొత్తగా ఎలాంటి చట్టాలను ప్రభుత్వం ఆమె ఆమోదం కోసం పంపించదు. డ్యూక్ జీవిత కాలాన్ని ప్రతిబింబిస్తూ అబ్బేలోని టెనోర్ బెల్‌ను శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని నిమిషానికి ఒకసారి చొప్పున 99 పర్యాయాలు మోగించనున్నారు. రాయల్ సెరిమోనియల్ ఫ్యూనె రల్ పూర్తి వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి. -
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
-
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నూరవ పుట్టిన రోజు వేడుకని మరో రెండు నెలల్లో చేసుకోవాల్సిన డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ రాణితో 73 ఏళ్ల సహచర్యాన్ని వీడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్çహామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘విండ్సర్ కేజల్‌లో శుక్రవారం ఉదయం డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ ప్రశాంతంగా కన్ను మూశారు. బాధాతప్తమైన హృదయంతో రాణి తన భర్త మరణవార్తని ప్రపంచానికి వెల్లడించారు’’అని ఆ ప్రకటన పేర్కొంది. జూన్ 10న ఫిలిప్ శతవసంత వేడుకల్ని వైభవంగా నిర్వహించడానికి రాజకుటుంబం ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో ఆయన మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిలిప్ మరణవార్త తెలుసుకోగానే ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాల వారి ప్రేమాభిమానాలను ఆయన చూరగొన్నారని కొనియాడారు. ప్రిన్స్ మరణవార్త విని విండ్సర్ కేజల్‌కి జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గేటు బయటే పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఫిలిప్, ఎలిజెబెత్ దంపతులకు ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ నలుగురు పిల్లలు. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు, 10 మంది మునిమనవలు ఉన్నారు. మోదీ సంతాపం ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మిలటరీలో అద్భుతమైన కెరీర్‌తో పాటు, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. భారత్ పర్యటన వివాదాస్పదం రాణి ఎలిజెబెత్‌తో కలిసి ఫిలిప్ మూడుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్‌ని సందర్శించారు. 1961లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్ పులిని వేటాడడం వివాదాస్పదమైంది. జైపూర్ రాజ దంపతులతో కలిసి రాణి ఎలిజెబెత్, ఫిలిప్ వారి దగ్గర చనిపోయి పడి ఉన్న పులి ఫోటో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. పర్యావరణ, జంతు ప్రేమికుడిగా అప్పటికే ఆయనకు ఒక గుర్తింపు ఉంది. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ యూకే అధ్యక్షుడిగా ఆయన ఆ ఏడాది నియమితులు కావడంతో పులిని కాల్చడం వివాదాన్ని రేపింది. అయితే ఆ తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. రాణికి కొండంత అండ గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఆమె బ్రిటన్ సింహాసనం ఎక్కాక నీడలా వెన్నంటే ఉంటూ పాలనలో పూర్తిగా సహకరించారు. బ్రిటన్‌లో రాజ్యాంగబద్ధమైన హోదా ఏమీ లేకపోయినా రాణి పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో రాణి వెనకాలే అడుగులో అడుగులు వేసుకుంటూ నడిచినప్పటికీ బ్రిటన్ రాచకుటుంబంలో ప్రతీ చోటా ఆయన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. రాజకుటుంబంలో ఆయన మాటే శాసనంగా మారింది. అందుకే రాణి ఎలిజెబెత్ తమ 50వ వివాహ వేడుకల్లో ‘‘నా భర్తే నాకు కొండంత బలం’’అంటూ తన ప్రేమని బహిరంగంగానే చాటుకున్నారు. భార్య చాటు భర్తలా మిగిలిపోకూడదని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సామాజిక సేవలోనే ఎక్కువ భాగం గడిపారు. ఎన్నో చారిటీలను నడిపారు. యువతరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుందని నమ్మిన ఫిలిప్ వారిని అన్ని విధాలుగా సంస్కరించాలని చూసేవారు. రాజకుటుంబంలో బూజుపట్టిన సంప్రదాయాల్ని విడనాడి ఆధునీకరణ విధానాలను ప్రవేశపెట్టాలని చూశారు కానీ అవి కుదరలేదు. ప్రిన్స్ ఫిలిప్ గొప్ప సాహసి. బ్రిటన్ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు. ఫిలిప్‌ది ముక్కు సూటి మనస్తత్వం. మనసులో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఆ మనస్తత్వమే ఆయనను చాలా సార్లు ఇబ్బందుల్లో పడేసింది. గ్రీకు వీరుడు, ఎలిజెబెత్ రాకుమారుడు ► జూన్ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం ► 1939: బ్రిటిష్ రాయల్ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం ► 1942: మొదటి లెఫ్ట్‌నెంట్‌గా అపాయింట్మెంట్ ► 1947: యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడం కోసం గ్రీక్ డానిష్ రాయల్ టైటిల్స్‌ని వదులుకున్నారు ► నవంబర్ 20, 1947: ఎలిజెబెత్‌తో వివాహం ► 1951: నేవీ కెరీర్‌ను వదులుకొని ఎలిజెబెత్‌కు అండదండలు ► 2017: ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ ► 2019: కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్‌ను వదిలేశారు, ఇదే ఏడాది ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ► ఫిబ్రవరి 17 2021: ఆస్పత్రిలో చేరిక ► మార్చి 4 2021 : గుండెకు విజయవంతంగా చికిత్స ► మార్చి 16 2021 : ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కి ► ఏప్రిల్ 9: ప్రశాంతంగా తుది శ్వాస -
ప్రిన్స్ ఫిలిప్ బర్త్‌డేకి మామిడి పండ్లు
జైపుర్ మహారాణి గాయత్రీదేవి యేటా ప్రిన్స్ ఫిలిప్ పుట్టినరోజుకు బుట్టెడు ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లు పంపేవారని, వాటిని ఆయన ఇష్టంగా స్వీకరించేవారని గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్ : ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. మరొక ఆసక్తికరమైన విశేషం.. క్వీన్ ఎలిజబెత్, గాయత్రీదేవి దంపతుల ప్రేమ కథలకు, జీవిత విధానాలకు దగ్గరి పోలికలు ఉండటం!! క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌ల జంటకు; మన జైపుర్ మహారాణి గాయత్రీదేవి, మాన్సింగ్ల జంటకు మధ్య ఆసక్తికరమైన పోలికలు కొన్ని కనిపిస్తాయి. క్వీన్ ఎలిజబెత్‌తో డెబ్బై నాలుగేళ్ల దాంపత్య బాంధవ్యాన్ని గడిపి, తన నిండు నూరేళ్లకు దగ్గరి వయసులో నిన్న శుక్రవారం ఆమె చెయ్యి వదలి వెళ్లిన ప్రిన్స్ ఫిలిప్.. క్వీన్‌ని చూసింది ఆమె 13 ఏళ్ల వయసులో. మాన్సింగ్ గాయత్రీదేవిని మొదట చూసింది కూడా ఆమెకు 13 ఏళ్ల వయసులోనే. ఏడేళ్లపాటు మాన్సింగ్ గాయత్రిని ప్రేమించాడు. ఆమెకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. ఒడ్డు పొడుగు కన్నా ‘పోలో’ ఆటలో అతడి ‘ఒడుపు’ చూసి మనసిచ్చేసింది గాయత్రి. అక్కడ బ్రిటన్ లో ఆ జంటదీ ఇదే కథ. ఫిలిప్ క్రికెట్ ఆడతాడు. ఎవరిదో పెళ్లిలో ఎలిజబెత్‌ని తొలిసారి చూశాడు. తర్వాత ఏడేళ్లపాటు ప్రేమలేఖలు నడిచాయి. ఆరో యేట (ప్రేమకు ఆరో యేట) ఎలిజబెత్ తండ్రిని కలిసి, ‘నేను మీ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగాడు. ఒక్క ఏడాది ఆగమన్నారు ఆయన! ఆగడం ఎందుకంటే అప్పటికి ఎలిజబెత్‌కి 21 ఏళ్లు వస్తాయి. అలా ఇక్కడ గాయత్రీ దేవికి, అక్కడ క్వీన్ ఎలిజ బెత్కి వారి ఇరవై ఒకటో యేటే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడేళ్లకు అక్కడ ఎలిజబెత్‌కి క్వీన్‌గా పట్టాభిషేకం జరిగితే, ఇక్కడ జైపుర్‌లో గాయత్రీదేవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ క్వీన్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ అయితే, ఇక్కడ గాయత్రి భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం జరిగిన ఏడాదే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. జైపుర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రానికే మాన్సింగ్ గవర్నర్ అయ్యారు. గాయత్రి దేవి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ జంటలో భార్య, ఈ జంటలో భార్య ప్రత్యక్ష పాలనలో ఉంటే, ఆ జంటలో భర్త, ఈ జంటలో భర్త పరోక్ష విధులకు పరిమితం అయ్యారు. గాయత్రీదేవి పుట్టింది కూడా క్వీన్ ఎలిజబెత్ పుట్టిన లండన్‌లోనే. క్వీన్ కన్నా గాయత్రి ఏడేళ్లు పెద్ద. 1950, 60 లలో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్; గాయత్రిదేవి, మాన్సింగ్ దంపతులు ప్రపంచానికి ‘గోల్డెన్ కపుల్’. వీరి రెండు ప్రేమ కథలకు పోలికలు ఉండటం మాత్రమే కాదు, రెండు జంటలూ మంచి ఫ్రెండ్స్ కూడా! ప్రిన్స్ ఫిలిప్ వేసవిలో పుట్టారు. ఏటా జూన్ 10 న ఆయన పుట్టినరోజు జరుగుతున్నా అసలు పుట్టిన రోజు మాత్రం మే 28. నూరేళ్ల క్రితం 1921లో ఆయన పుట్టే సమయానికి గ్రెగోరియన్ క్యాలెండర్ పుట్టలేదు. ఆ ముందువరకు ఉన్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఆయన ‘మే’ నెలలోనే పుట్టినట్లు. మే అయినా, జూన్ అయినా.. ఇండియాలో అది మామిడి పండ్ల కాలం. ఏటా ఆయన పుట్టిన రోజుకు గాయత్రీదేవి బుట్టెడు ఆల్ఫోన్సో మామిడి పండ్లను కానుకగా పంపేవారు. ఆ పండ్లను ప్రిన్స్ ఫిలిప్ ఎంతో ప్రీతిగా స్వీకరించేవారని గాయత్రీ దేవి ఆంతరంగిక సలహాదారు ఒకరు తనతో చెప్పినట్లు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ జైపుర్: ది ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిక్సీ రాశారు. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ దంపతులతో గాయత్రీదేవి, మాన్సింగ్ -
ప్రిన్స్ ఫిలిప్ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్ ఫిలిప్ మనవడు ప్రిన్స్ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే టాక్ షోలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్ ఫిలిప్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్‌హామ్ ప్యాలేస్ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్ జనాలను తొలచివేస్తుంది. అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్ అజ్బర్వర్ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్ మార్కెల్లు అమెరికాలో నివాసం ఉంటున్నారు. చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ -
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విండ్సర్ కాజిల్ లో శుక్రవారం ఫిలిప్ తుదిశ్వాస విడిచారని తెలిపింది. ఈ విషయాన్ని గురించి రాయల్ ఫ్యామిలీలోని ఇతర సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయాలని ప్రకటించింది. కాగా ప్రిన్స్ ఫిలిప్ 1921, జూన్ 10న కార్ఫు ద్వీపంలో జన్మించారు. 1947 లో యువరాణి ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. ప్రిన్స్ ఫిలిప్,రాణి దంపతులకు నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవరాళ్ళు 10 మంది మునిమనవళ్లు ఉన్నారు. -
ప్రిన్స్ ఫిలిప్ ఆఖరి చూపుకైనా వస్తారా..?
జీసస్! ప్రిన్స్ ఫిలిప్ (99) ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. ఆయన్ని లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవన్ హాస్పిటల్ నుంచి అత్యవసరంగా లండన్ లోనే ఉన్న సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి తరలించారు. ‘తాత గారికి గుడ్ బై చెప్పడం కోసం స్టార్ట్ ఇమీడియట్లీ‘ అని యూఎస్‌లో ఉంటున్న ప్రిన్స్ హ్యారీకి కబురు వెళ్లింది. అయ్యో దేవుడా.. బ్రిటన్ రాచకుటుంబం కోసం పొంచి ఉన్న విపత్తు ఇదొక్కటే కాదు. ఈ నెల 7 న ప్రిన్స్ హ్యారీ (36), మేఘన్ (39) దంపతుల తొంభై నిముషాల ఓప్రా విన్ ఫ్రే ‘టెల్–ఆల్’ ఇంటర్వ్యూ అమెరికన్ టీవీ ఛానెల్ సి.బి.ఎస్.లో ప్రసారం కాబోతోంది! ఆ ప్రసారాన్ని రద్దు చేయించమని, కనీసం వాయిదా వేయించమని రాయల్ ఫ్యామిలీ హ్యారిస్ ను కోరుతోంది. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం..’ అని ఏడాది క్రితం రాణిప్రాసాదం వీడి వెళ్లిన హ్యారీ.. తాతగారిని చూడ్డానికి భార్య సహా వస్తారా? ఓప్రా ఇంటర్వ్యూ ఆగిపోతుందా? అందులో ఈ దంపతులు ఏం చెప్పి ఉంటారు? తన భార్యను సరిగా ట్రీట్ చేయనందుకే హ్యారీ తనకా రాచరికం, రాజసౌధం వద్దనుకున్నారా? పెద్దాయన ప్రిన్స్ ఫిలిప్ పరిస్థితి ఏమీ బాగోలేదు! 99 ఏళ్ల వయసులో ఇంకేం బాగుంటుంది అనుకోడానికి మనసు రానంతగా బ్రిటన్ ప్రజలు వారసత్వంగా ఆ కుటుంబంతో బలమైన ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పచురచుకుని ఉన్నారు కనక ఆసుపత్రి నుంచి ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో అంతర్లయగా మరొక ప్రార్థన కూడా కలిసి ఉంది! కొన్ని నెలల క్రితం బ్రిటన్ రాజ ప్రాసాదాన్ని శాశ్వతంగా వీడి వదిలిపోయిన ప్రిన్స్ హ్యారీ.. దాదాపుగా మరణశయ్యపై ఉన్న తన తాతగారు ప్రిన్స్ ఫిలిప్‌ను ఆఖరి చూపైనా చూసేందుకు వచ్చేవిధంగా ఆయన మనసు మార్చాలని రాజసౌధంతోపాటు, దేశ ప్రజలూ దేవుణ్ని కోరుకుంటున్నారు. వస్తే ఆయన ఒక్కరే రారు. తన భార్య మేఘన్ మార్కెల్‌ను వెంటపెట్టుకుని రావలసిందే. ఆమె రాక కనుక క్వీన్ ఎలిజబెత్‌కు అసహనాన్ని కలిగించే అవకాశం ఉందని తెలిస్తే కనుక ప్రిన్స్ హ్యారీ బ్రిటన్‌కు రాకపోవచ్చు. అయితే ఆయన భార్య పేరెత్తకుండా బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆంతరంగిక కార్యదర్శులు ‘వెంటనే వచ్చి తాతగారిని చూసి వెళ్లండి’ అని ప్రిన్స్ హ్యారీకి వర్తమానం పంపించారు. అది ఏమాత్రం అస్పష్టంగా లేని వర్తమానం! ‘లండన్ వచ్చి ప్రిన్స్ ఫిలిప్‌కి ‘గుడ్‌బై’ చెప్పవలసిందిగా సూచిస్తున్నాం’ అని వారు తెలియజేశారు. ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎలిజబెత్ (94) భర్త. ఫిబ్రవరి 16న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆసుపత్రికి మార్చారు. ఆరోగ్యంలో కనీసస్థాయి మెరుగుదల కూడా కనిపించకపోవడంతో మార్చి 1న లండన్‌లోనే మరొకటైన సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడే ఆయనలోని ఇన్ఫెక్షన్లకు చికిత్స జరుగుతోంది. అక్కడే ఆయన్ని వైద్య నిపుణుల పరిశీలనలో ఉంచారు. ఈలోపే ప్రిన్స్ హ్యారీ రమ్మని కబురు వెళ్లడంతో.. ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై అనుమానాలు బ్రిటన్‌ని కమ్మేశాయి. మొన్నటి వరకు ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన రాజకుటుంబం ఇప్పుడు.. తాతగారిని చూడ్డానికి ప్రిన్స్ హ్యారీ వస్తారా రారా అని ఆందోళ చెందుతోందని బ్రిటన్ టాబ్లాయిడ్లు అదే పనిగా ముఖచిత్ర కథనాలను రాస్తున్నాయి. ఆ టాబ్లాయిడ్లే తమను బ్రిటన్ నుంచి తరిమికొట్టాయిని అమెరికాకు మారిన కొత్తలో ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆరోపించినప్పటికీ.. రాణిగారి కుటుంబంలో తన సతీమణికి గౌరవ మర్యాదలు లభించడం లేదన్న ఆవేదనతోనే ప్రిన్స్ హ్యారీ తన వంశవృక్షంతో తెగతెంపులు చేసుకున్నారని ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరి నోటి ద్వారా ఏనాడో బహిర్గతం అయింది. క్వీన్ ఎలిజబెత్, మనవడు ప్రిన్స్ హ్యారీ ముఖాముఖి మాట్లాడుకుని కూడా నెలలు అవుతోంది. గతంలో క్రిస్మస్లకు కలుసుకున్న సందర్భంలోనూ ఒకరితో ఒకరు ముభావంగానే ఉండిపోయినట్లు పత్రికలు రాశాయి. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ తన తాతగారిని చూసేందుకు బ్రిటన్‌కు వస్తారా రారా అనే ఆలోచన కంటే కూడా.. మార్చి 7న అమెరికన్ టీవీ ఛానెల్ సీబీఎస్ ప్రసారం చేయబోతున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా చేయడం ఎలాగన్న దాని గురించే రాణిగారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయమై ఇప్పటికే రాణిగారి ప్రత్యేక ప్రతినిధి ఒకరు హ్యారీతో మాట్లాడి, ఇంటర్వ్యూను అసలే ప్రసారం కాకుండా చేసేందుకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగిన కారణమే ఉంది. సీబీఎస్ ఛానల్ కోసం ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్లను ఇంటర్వ్యూ చేసినవారు ఓప్రా విన్ ఫ్రే. ఆమె ఇంటర్వ్యూ చేయడం మామూలుగా ఉండదు. అంతరంగాల్లోకి వెళతారు. ఒకలాటి హృదయోద్వేగ స్థితిని కల్పించి లోపలిదంతా బయటికి లాగేస్తారు. అసలే ఇప్పుడు హ్యారీ, మార్కెల్ తమకు ఏ మాత్రం అలవాటు లేని ఒంటరి జీవితాన్ని కలిసికట్టుగా గడుపుతున్నారు. పైగా మార్కెల్ ఇప్పుడు గర్భిణి. రెండో బిడ్డ కోసం ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ ఫిబ్రవరి 14న వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. ఈ స్థితిలో ఓప్రా ఇంటర్వ్యూలో రాజసౌధ అహంకార రహస్యాలు ఏవైనా బయట పెడితే కనుక ఆ వృద్ధ ప్రాణం.. ప్రిన్స్ ఫిలిప్.. ఆవేదన చెందే ప్రమాదం ఉందని క్వీన్ ఆందోళన పడుతున్నారు. అందుకోసమే ఇంటర్వ్యూను ఆపించమని విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఆ విజ్ఞప్తిని సీబీఎస్ టీవీ మన్నిస్తుందా, ఒకవేళ సీబీఎస్ మన్నించినా.. ప్రిన్స్ హ్యారీ.. గో ఎహెడ్ అంటారా అన్నది మరొక సందేహం. బ్రిటన్‌లో ప్రిన్స్ హ్యారీపై కోపగిస్తున్నవారూ ఉన్నారు. పరదేశీ పిల్లను (అమెరికా) చేసుకోవడమే కాకుండా, రాజకుటుంబ నియమాలను గౌరవించని భార్యను ఆయన వెనకేసుకొస్తున్నారని వారి విమర్శ. మరోవైపు బకింగ్‌హామ్ ప్యాలెస్, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ‘ది రాయల్ అబ్జర్వర్’ పత్రిక రాసింది. మంచిని ఆలోచిస్తున్న పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. తాతగారి ఆఖరిశ్వాసకు ముందరే వచ్చి ప్రిన్స్ హ్యారీ ఆయన్ని సంతోషపరుస్తారనీ, ఓప్రా విన్ఫ్రే కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే మనిషి కనుక తాత్కాలికంగానే అయినా ఇంటర్వ్యూను ఆపేస్తారని ఆ పత్రికలు ఆశిస్తున్నాయి. ఎవరైనా కోరుకునేది మంచే జరగాలని, ఆ కుటుంబానికి కాస్త ఎక్కువ మంచి జరగాలని. బకింగ్‌హామ్ ప్యాలెస్ నిర్మాణమై ఉన్నది లండన్‌లోనే అయినా, మూడు వందల ఏళ్లకు పైగా ఆ భవంతిలో ఉంటున్న రాజ కుటుంబాలు ఉంటూ వస్తున్నది మాత్రం బ్రిటన్ ప్రజల గుండెల్లోనే. ప్రిన్స్ ఫిలిప్ ఎవరీయన?! ప్రస్తుత బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ భర్తే ప్రిన్స్ ఫిలిప్ అన్న సంగతి తెలిసిందే. అదొక్కటే ఆయన గుర్తింపు కాదు. ఎడిన్‌బరో సామంత రాజు (డ్యూక్). యూకె అధీనంలో ఉన్న స్కాట్లాండ్ దేశపు రాజధానే ఎడిన్‌బరో. క్వీన్ ఎలిజబెత్‌తో ఆయనకు 1947లో వివాహం అయింది. ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్ యాన్, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ వీరి సంతానం. ఈ నలుగురిలోకీ పెద్దవారైన ప్రిన్స్ చార్ల్స్ కొడుకే ప్రిన్స్ హ్యారీ. ప్రిన్స్ ఫిలిప్ గ్రీసు, డెన్మార్క్‌ల రాచకుటుంబీకుడు. క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ దేశస్థురాలు. ప్రిన్స్ ఫిలిప్ బ్రిటిష్ రాయల్ నేవీలో చేరేనాటికే ఉమ్మడి బంధుత్వాల ద్వారా ఒకరికొకరు పరిచయం. క్వీన్‌కి 13 ఏళ్ల వయసులో ఆయనపై ప్రేమ అంకురించినట్లు, ఆ ప్రేమ.. వివాహానికి దారి తీసినట్లు ఈ దంపతులపై వచ్చిన అనేక డాక్యుమెంటరీ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత రాణి గారు కూడా ప్రిన్స్ ఫిలిప్పై తన ప్రేమ విషయాన్ని నిర్థారించారు. -
బ్రిటన్ రాణి దంపతులకు కోవిడ్ టీకా
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చారు. విండ్సర్ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్టుగా బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్ద్దరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా మహారాణియే స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్ వయసు 94 కాగా, ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చారు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చారో తెలియలేదు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు. -
డ్రైవింగ్ లైసెన్సు వదులుకున్న యువరాజు
లండన్: బ్రిటన్ యువరాజు ఫిలిప్(97) తన డ్రైవింగ్ లైసెన్సును స్వచ్ఛందంగా నోర్‌ఫోల్క్ పోలీసులకు సరెండర్ చేశారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. గత నెల 17న శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిలిప్ నడుపుతున్న కారు, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే సీటు బెల్టు లేకుండా డ్రైవ్ చేస్తూ ఆయన మీడియాకు చిక్కారు. కాగా, తాజా నిర్ణయం నేపథ్యంలో కారు ప్రమాదం విచారణ నుంచి ఫిలిప్ తప్పించుకునే అవకాశముందని భావిస్తున్నారు. అన్నట్లు బ్రిటన్‌లో డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు గరిష్ట వయోపరిమితి లేదు. లైసెన్సు వదులుకున్న్పటికీ ప్రైవేటు రహదారులపై తన డ్రైవింగ్ చేయొచ్చని న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఏడవడం తప్పా ఏమీచేయలేను ఇక నుంచి రోడ్లు భద్రంగా ఉంటాయని ప్రమాదంలో గాయపడిన ఎమ్మా ఫెయిర్‌వెదర్(46) అనే మహిళ వ్యాఖ్యానించారు. యువరాజు ఫిలిప్ ఇంత ఆలస్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అప్పగించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏడవడం తప్పా యువరాజును తానేమి చేయలేనని ఆవేదన చెందారు. ప్రమాదంలో ఆమె చేతికి గాయమైంది. -
క్వీన్ ఎలిజబెత్ భర్తకు తప్పిన ప్రమాదం
లండన్ : బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్(97) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పు ఇంగ్లండ్‌లోని సాండ్రిన్గామ్ వద్ద ఫిలిప్ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రిన్స్ ఫిలిప్నకు ఎటువంటి గాయాలు కాలేదని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి ప్యాలెస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘ ప్రిన్స్ ఫిలిప్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించడంతో నార్ఫోక్ కంట్రీలోని క్వీన్ ఎలిజబెత్ నివాసంలో వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కాగా క్వీన్ ఎలిజబెత్, మాజీ నేవీ అధికారి ప్రిన్స్ ఫిలిప్‌ల వివాహం 1947లో జరిగింది. ‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్’ ఫిలిప్ 2017లో అధికారిక రాజ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. గతేడాది జరిగిన మేజర్ సర్జరీ(హిప్ రీప్లేస్మెంట్) తర్వాత కూడా రాజ కుటుంబం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక డ్రైవింగ్‌ను ఎంతగానో ఇష్టపడే ప్రిన్స్ ఫిలిప్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా బ్రిటన్ పర్యటనకు వచ్చిన సమయంలో స్వయంగా కారు నడుపుతూ వారిని లంచ్‌కు తీసుకువెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆయనే స్వయంగా కారు నడిపినట్లు తెలుస్తోంది. కాగా బ్రిటన్ నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌కు పరిమిత వయస్సు ఏమీ ఉండదు గానీ, 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ప్రతీ మూడేళ్లకొకసారి లైసెన్స్‌ను రిన్యువల్ చేసుకోవాలి. -
రాగల 48 గంటల్లో రాయల్ వెడ్డింగ్!
‘ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా.. బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్ తన చిన్న మనవడు ప్రిన్స్ హ్యారీ వివాహానికి సమ్మతించారహో..’ బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి మొన్న శనివారమే ప్రకటన వెలువడింది. దీనర్థం మే 19 శనివారం జరగబోతున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల వివాహం లాంఛనంగా ఖాయమైపోయిందని! ఇక దీన్నెవరూ లాస్ట్ మినిట్‌లో వచ్చి ‘ఆపండి’ అని ఆపలేరని! ‘ఎలిజబెత్ ది సెకండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్’ అనే శీర్షికతో ప్రారంభమైన ఈ సమ్మతి ప్రకటన ‘బై ద క్వీన్ హర్సెల్ఫ్ సైన్డ్ విత్ హర్ ఓ హ్యాండ్’ అనే పెద్ద అక్షరాల ముగింపు వాక్యంతో పూర్తయింది. అన్నిటికన్నా పైన ప్రకటన పత్రంపై కుడివైపున రాణి గారి స్వహస్తాల సంతకం ఉంది. బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని సంకేత పరిచే సింహం, వేల్స్ రెడ్ డ్రాగెన్‌తో పాటు ఇంగ్లండ్ రోజా పూలు, స్కాట్లాండ్ థిసిల్ పూలు, ఐర్లాండ్ షామ్రాక్ (పూలాకు) బొమ్మలు ఈ పత్రంపై నలుమూలలా ముద్రించి ఉన్నాయి. తొలి ఆరుగురికి మస్ట్ బ్రిటన్ చట్టం ప్రకారం సింహాసనానికి తొలి ఆరుగురు వారసుల వివాహాలకు రాణిగారి ఆమోదం తప్పనిసరి. ఆమోదం లేకుండా పెళ్లి చేసుకునేవారు చేసుకోవచ్చు కానీ, వారు సింహాసనాన్ని అధిష్టించే వారసత్వ హక్కును కోల్పోతారు.ఇంకో 48 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న ప్రిన్స్ హ్యారీ ఈ వారసత్వ సంక్రమణ క్రమంలో మొదట ఐదవ స్థానంలో ఉండేవారు. అయితే అన్నగారైన ప్రిన్స్ విలియమ్స్‌కు గత నెలలో కొడుకు పుట్టడంతో హ్యారీ ఆరవ స్థానంలోకి జరిగిపోయారు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఆమె మొదటి సంతానం ప్రిన్స్ చార్ల్స్ (1), ప్రిన్స్ చార్ల్స్ తర్వాత అతని మొదటి సంతానం ప్రిన్స్ విలియం (2), ప్రిన్స్ విలియం తర్వాత అతని మొదటి సంతానం ప్రిన్స్ జార్జి (3) రెండో సంతానం ప్రిన్సెస్ చార్లెట్ (4), మూడో సంతానం ప్రిన్స్ లూయీ (5).. వీళ్ల తర్వాత ప్రిన్స్ విలియమ్స్ తమ్ముడు ప్రిన్స్ హ్యారీ (6) సింహాసనాన్ని అధిష్టించడానికి అర్హులవుతారు. ఇప్పుడున్న మహారాణి రెండవ ఎలిజబెత్‌కు ఆమె తండ్రి ఆరవ జార్జి అనంతరం రాజ్యం సంక్రమించింది. ఆరవ జార్జికి ఇద్దరూ కూతుళ్లే. ఎలిజబెత్–2 పెద్ద కూతురు. రెండో కూతురు మార్గరెట్. ఆమె తన 71 ఏళ్ల వయసులో 2002లో చనిపోయారు. ఒకవేళ ఆమె బతికి ఉంటే, నిబంధనల మేరకు అన్ని అర్హతలూ ఉంటే అక్క తర్వాత వారసత్వంగా చెల్లే రాణిగారు అయ్యేవారు. అయితే ఈ వారసత్వ స్థానాలు ఎప్పుడూ ఒకేలా ఉండిపోవు. రాజప్రాసాదంలో పుట్టేవాళ్లను బట్టి, పోయేవాళ్లను బట్టి మారుతుంటాయి. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ పెళ్లికి ప్రిన్స్ హ్యారీ మామగారు (ప్రిన్స్ పెళ్లి చేసుకోబోతున్న మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్) రావడం లేదు. ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ 73 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్యం పైకి కనిపించే కారణం ఒకటైతే.. కనిపించకుండా వినిపిస్తున్న కారణం మరొకటి. థామస్ ఒకప్పుడు టెలివిజన్ లైటింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో సుప్రసిద్ధులను వెంటాడి వారి అంతరంగిక వ్యవహారాలను ఫొటోలు తీసే ‘పాపరాజీ’లకు హెల్ప్ చేసి నాలుగు రాళ్లు సంపాదించేవాడన్న చెడ్డపేరు ఆయనకు ఉంది. ఆ చెడ్డపేరుతో.. పెళ్లి ప్రాంగణంలో ఆహ్వానితుల ముందు కూతురి చెయ్యి పట్టి నడిపించే సంప్రదాయానికి ఏ ముఖం పెట్టుకుని రావాలని ఆయన వెనుకంజ వేస్తున్నారట! పెళ్లి జరిగే విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జి చాపెల్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందితే తప్ప ఆయన తన కూతురు పెళ్లికి హాజరుకాకపోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి తంతు మొదలౌతుంది. క్వీన్ ఎలిజబెత్ ఐదు నిముషాల ముందే వచ్చి కూర్చుంటారట. సింహాసనానికి వారసులు ఇప్పుడున్నది క్వీన్ జెలిజబెత్ 2 క్వీన్‌కు ముందున్నది ఆమె తండ్రి ఆరవ జార్జి క్వీన్ తర్వాత తొలి ఆరుగురు (వరుస క్రమంలో) (1) ప్రిన్స్ చార్ల్స్ (2) ప్రిన్స్ విలియం (3) ప్రిన్స్ జార్జి (4) ప్రిన్సెస్ చార్లెట్ (5) ప్రిన్స్ లూయీ (6) ప్రిన్స్ హ్యారీ -
రాచరిక విధులకు ఫిలిప్ స్వస్తి
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ (95) రాచరిక విధులకు దూరమవుతున్నారు. వచ్చే నవంబర్ నుంచి ఆయన ప్రిన్స్ హోదాలో బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొనబోరు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకుముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో ఈ ఏడాది ఆగస్టు వరకు పాల్గొంటారని.. ఇకపై కొత్త ఆహ్వానాలను మాత్రం స్వీకరించరని ఆ ప్రకటన వెల్లడించింది. అలాగే 780కి పైగా సంస్థలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తారని.. కాకుంటే ఆయా సంస్థల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనరని తెలిపింది. రాణి మాత్రం యథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఇప్పటివరకు సేవలు అందించినందుకు ఫిలిప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారన్న వార్త కలకలం సృష్టించింది. దీంతో బ్రిటన్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగాయి.