2009లో లండన్లో నాటి భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో...
లండన్: భారత్ అంటే రాణి ఎలిజబెత్–2కు ప్రత్యేకాభిమానం. బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం వచ్చాక బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తు్తరాలైన తొలి పాలకురాలు ఆమే. 1952లో రాణిగా బాధ్యతలు స్వీకరించారు. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకొనేందుకు అమితాసక్తి చూపేవారు. 1961, 1983, 1997ల్లో మూడుసార్లు భారత్‌ను సందర్శించారు.
‘జలియన్‌వాలాబాగ్’పై విచారం..
1961లో క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ దంపతులు తొలిసారిగా ఇండియా వచ్చారు. నాటి బాంబే, మద్రాస్, కలకత్తాలను సందర్శించారు. తాజ్‌మహల్‌నూ తిలకించారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాదరక్షలు విప్పి గౌరవం చాటుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో రాంలీలా మైదానంలో నాటి ప్రధాని నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ భవనాన్ని ప్రారంభించారు.
కామన్‌వెల్త్ దేశాధినేతల భేటీలో పాల్గొనేందుకు 1983లో ఎలిజబెత్ రెండోసారి భారత్ వచ్చారు. మదర్ థెరిసాకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ప్రదానం చేశారు. ఇక భారత 50వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 1997లో భర్తతో కలిసి మూడోసారి భారత్ వచ్చారు. వలస పాలన నాటి చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ జలియన్‌వాలా బాగ్ ఉదంతం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లో జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించారు. కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు. ముగ్గురు భారత రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ప్రతిభా పాటిల్‌కు ఇంగ్లండ్‌లో రాణి ఆతిథ్యమిచ్చారు.
1983లో భారత్ పర్యటన సందర్భంగా ఇందిరాగాంధీతో...
Comments
Please login to add a commentAdd a comment