రాచరిక విధులకు ఫిలిప్ స్వస్తి
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ (95) రాచరిక విధులకు దూరమవుతున్నారు. వచ్చే నవంబర్ నుంచి ఆయన ప్రిన్స్ హోదాలో బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొనబోరు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం అధికారిక ప్రకటన చేసింది. అయితే అంతకుముందే నిర్ణయించిన కార్యక్రమాల్లో ఈ ఏడాది ఆగస్టు వరకు పాల్గొంటారని.. ఇకపై కొత్త ఆహ్వానాలను మాత్రం స్వీకరించరని ఆ ప్రకటన వెల్లడించింది.
అలాగే 780కి పైగా సంస్థలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తారని.. కాకుంటే ఆయా సంస్థల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనరని తెలిపింది. రాణి మాత్రం యథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఇప్పటివరకు సేవలు అందించినందుకు ఫిలిప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె ఆకాంక్షించారు. అంతకుముందు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారన్న వార్త కలకలం సృష్టించింది. దీంతో బ్రిటన్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగాయి.