ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్
జీసస్! ప్రిన్స్ ఫిలిప్ (99) ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. ఆయన్ని లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవన్ హాస్పిటల్ నుంచి అత్యవసరంగా లండన్ లోనే ఉన్న సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి తరలించారు. ‘తాత గారికి గుడ్ బై చెప్పడం కోసం స్టార్ట్ ఇమీడియట్‌లీ‘ అని యూఎస్‌లో ఉంటున్న ప్రిన్స్ హ్యారీకి కబురు వెళ్లింది. అయ్యో దేవుడా.. బ్రిటన్ రాచకుటుంబం కోసం పొంచి ఉన్న విపత్తు ఇదొక్కటే కాదు. ఈ నెల 7 న ప్రిన్స్ హ్యారీ (36), మేఘన్ (39) దంపతుల తొంభై నిముషాల ఓప్రా విన్ ఫ్రే ‘టెల్–ఆల్’ ఇంటర్వ్యూ అమెరికన్ టీవీ ఛానెల్ సి.బి.ఎస్.లో ప్రసారం కాబోతోంది! ఆ ప్రసారాన్ని రద్దు చేయించమని, కనీసం వాయిదా వేయించమని రాయల్ ఫ్యామిలీ హ్యారిస్ ను కోరుతోంది. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం..’ అని ఏడాది క్రితం రాణిప్రాసాదం వీడి వెళ్లిన హ్యారీ.. తాతగారిని చూడ్డానికి భార్య సహా వస్తారా? ఓప్రా ఇంటర్వ్యూ ఆగిపోతుందా? అందులో ఈ దంపతులు ఏం చెప్పి ఉంటారు? తన భార్యను సరిగా ట్రీట్ చేయనందుకే హ్యారీ తనకా రాచరికం, రాజసౌధం వద్దనుకున్నారా?
పెద్దాయన ప్రిన్స్ ఫిలిప్ పరిస్థితి ఏమీ బాగోలేదు! 99 ఏళ్ల వయసులో ఇంకేం బాగుంటుంది అనుకోడానికి మనసు రానంతగా బ్రిటన్ ప్రజలు వారసత్వంగా ఆ కుటుంబంతో బలమైన ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పచురచుకుని ఉన్నారు కనక ఆసుపత్రి నుంచి ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో అంతర్లయగా మరొక ప్రార్థన కూడా కలిసి ఉంది! కొన్ని నెలల క్రితం బ్రిటన్ రాజ ప్రాసాదాన్ని శాశ్వతంగా వీడి వదిలిపోయిన ప్రిన్స్ హ్యారీ.. దాదాపుగా మరణశయ్యపై ఉన్న తన తాతగారు ప్రిన్స్ ఫిలిప్‌ను ఆఖరి చూపైనా చూసేందుకు వచ్చేవిధంగా ఆయన మనసు మార్చాలని రాజసౌధంతోపాటు, దేశ ప్రజలూ దేవుణ్ని కోరుకుంటున్నారు. వస్తే ఆయన ఒక్కరే రారు. తన భార్య మేఘన్ మార్కెల్‌ను వెంటపెట్టుకుని రావలసిందే. ఆమె రాక కనుక క్వీన్ ఎలిజబెత్‌కు అసహనాన్ని కలిగించే అవకాశం ఉందని తెలిస్తే కనుక ప్రిన్స్ హ్యారీ బ్రిటన్‌కు రాకపోవచ్చు. అయితే ఆయన భార్య పేరెత్తకుండా బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆంతరంగిక కార్యదర్శులు ‘వెంటనే వచ్చి తాతగారిని చూసి వెళ్లండి’ అని ప్రిన్స్ హ్యారీకి వర్తమానం పంపించారు. అది ఏమాత్రం అస్పష్టంగా లేని వర్తమానం! ‘లండన్ వచ్చి ప్రిన్స్ ఫిలిప్‌కి ‘గుడ్‌బై’ చెప్పవలసిందిగా సూచిస్తున్నాం’ అని వారు తెలియజేశారు.
ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎలిజబెత్ (94) భర్త. ఫిబ్రవరి 16న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆసుపత్రికి మార్చారు. ఆరోగ్యంలో కనీసస్థాయి మెరుగుదల కూడా కనిపించకపోవడంతో మార్చి 1న లండన్‌లోనే మరొకటైన సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడే ఆయనలోని ఇన్‌ఫెక్షన్‌లకు చికిత్స జరుగుతోంది. అక్కడే ఆయన్ని వైద్య నిపుణుల పరిశీలనలో ఉంచారు. ఈలోపే ప్రిన్స్ హ్యారీ రమ్మని కబురు వెళ్లడంతో.. ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై అనుమానాలు బ్రిటన్‌ని కమ్మేశాయి. మొన్నటి వరకు ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన రాజకుటుంబం ఇప్పుడు.. తాతగారిని చూడ్డానికి ప్రిన్స్ హ్యారీ వస్తారా రారా అని ఆందోళ చెందుతోందని బ్రిటన్ టాబ్లాయిడ్‌లు అదే పనిగా ముఖచిత్ర కథనాలను రాస్తున్నాయి.
ఆ టాబ్లాయిడ్‌లే తమను బ్రిటన్ నుంచి తరిమికొట్టాయిని అమెరికాకు మారిన కొత్తలో ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆరోపించినప్పటికీ.. రాణిగారి కుటుంబంలో తన సతీమణికి గౌరవ మర్యాదలు లభించడం లేదన్న ఆవేదనతోనే ప్రిన్స్ హ్యారీ తన వంశవృక్షంతో తెగతెంపులు చేసుకున్నారని ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరి నోటి ద్వారా ఏనాడో బహిర్గతం అయింది. క్వీన్ ఎలిజబెత్, మనవడు ప్రిన్స్ హ్యారీ ముఖాముఖి మాట్లాడుకుని కూడా నెలలు అవుతోంది. గతంలో క్రిస్మస్‌లకు కలుసుకున్న సందర్భంలోనూ ఒకరితో ఒకరు ముభావంగానే ఉండిపోయినట్లు పత్రికలు రాశాయి. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ తన తాతగారిని చూసేందుకు బ్రిటన్‌కు వస్తారా రారా అనే ఆలోచన కంటే కూడా.. మార్చి 7న అమెరికన్ టీవీ ఛానెల్ సీబీఎస్ ప్రసారం చేయబోతున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా చేయడం ఎలాగన్న దాని గురించే రాణిగారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయమై ఇప్పటికే రాణిగారి ప్రత్యేక ప్రతినిధి ఒకరు హ్యారీతో మాట్లాడి, ఇంటర్వ్యూను అసలే ప్రసారం కాకుండా చేసేందుకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగిన కారణమే ఉంది.
సీబీఎస్ ఛానల్ కోసం ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్‌లను ఇంటర్వ్యూ చేసినవారు ఓప్రా విన్ ఫ్రే. ఆమె ఇంటర్వ్యూ చేయడం మామూలుగా ఉండదు. అంతరంగాల్లోకి వెళతారు. ఒకలాటి హృదయోద్వేగ స్థితిని కల్పించి లోపలిదంతా బయటికి లాగేస్తారు. అసలే ఇప్పుడు హ్యారీ, మార్కెల్ తమకు ఏ మాత్రం అలవాటు లేని ఒంటరి జీవితాన్ని కలిసికట్టుగా గడుపుతున్నారు. పైగా మార్కెల్ ఇప్పుడు గర్భిణి. రెండో బిడ్డ కోసం ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ ఫిబ్రవరి 14న వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. ఈ స్థితిలో ఓప్రా ఇంటర్వ్యూలో రాజసౌధ అహంకార రహస్యాలు ఏవైనా బయట పెడితే కనుక ఆ వృద్ధ ప్రాణం.. ప్రిన్స్ ఫిలిప్.. ఆవేదన చెందే ప్రమాదం ఉందని క్వీన్ ఆందోళన పడుతున్నారు. అందుకోసమే ఇంటర్వ్యూను ఆపించమని విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఆ విజ్ఞప్తిని సీబీఎస్ టీవీ మన్నిస్తుందా, ఒకవేళ సీబీఎస్ మన్నించినా.. ప్రిన్స్ హ్యారీ.. గో ఎహెడ్ అంటారా అన్నది మరొక సందేహం.
బ్రిటన్‌లో ప్రిన్స్ హ్యారీపై కోపగిస్తున్నవారూ ఉన్నారు. పరదేశీ పిల్లను (అమెరికా) చేసుకోవడమే కాకుండా, రాజకుటుంబ నియమాలను గౌరవించని భార్యను ఆయన వెనకేసుకొస్తున్నారని వారి విమర్శ. మరోవైపు బకింగ్‌హామ్ ప్యాలెస్, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ‘ది రాయల్ అబ్జర్వర్’ పత్రిక రాసింది. మంచిని ఆలోచిస్తున్న పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. తాతగారి ఆఖరిశ్వాసకు ముందరే వచ్చి ప్రిన్స్ హ్యారీ ఆయన్ని సంతోషపరుస్తారనీ, ఓప్రా విన్‌ఫ్రే కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే మనిషి కనుక తాత్కాలికంగానే అయినా ఇంటర్వ్యూను ఆపేస్తారని ఆ పత్రికలు ఆశిస్తున్నాయి. ఎవరైనా కోరుకునేది మంచే జరగాలని, ఆ కుటుంబానికి కాస్త ఎక్కువ మంచి జరగాలని. బకింగ్‌హామ్ ప్యాలెస్ నిర్మాణమై ఉన్నది లండన్‌లోనే అయినా, మూడు వందల ఏళ్లకు పైగా ఆ భవంతిలో ఉంటున్న రాజ కుటుంబాలు ఉంటూ వస్తున్నది మాత్రం బ్రిటన్ ప్రజల గుండెల్లోనే.
ప్రిన్స్ ఫిలిప్
ఎవరీయన?!
ప్రస్తుత బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ భర్తే ప్రిన్స్ ఫిలిప్ అన్న సంగతి తెలిసిందే. అదొక్కటే ఆయన గుర్తింపు కాదు. ఎడిన్‌బరో సామంత రాజు (డ్యూక్). యూకె అధీనంలో ఉన్న స్కాట్‌లాండ్ దేశపు రాజధానే ఎడిన్‌బరో. క్వీన్ ఎలిజబెత్‌తో ఆయనకు 1947లో వివాహం అయింది. ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్ యాన్, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ వీరి సంతానం. ఈ నలుగురిలోకీ పెద్దవారైన ప్రిన్స్ చార్ల్స్ కొడుకే ప్రిన్స్ హ్యారీ. ప్రిన్స్ ఫిలిప్ గ్రీసు, డెన్మార్క్‌ల రాచకుటుంబీకుడు. క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ దేశస్థురాలు. ప్రిన్స్ ఫిలిప్ బ్రిటిష్ రాయల్ నేవీలో చేరేనాటికే ఉమ్మడి బంధుత్వాల ద్వారా ఒకరికొకరు పరిచయం. క్వీన్‌కి 13 ఏళ్ల వయసులో ఆయనపై ప్రేమ అంకురించినట్లు, ఆ ప్రేమ.. వివాహానికి దారి తీసినట్లు ఈ దంపతులపై వచ్చిన అనేక డాక్యుమెంటరీ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత రాణి గారు కూడా ప్రిన్స్ ఫిలిప్‌పై తన ప్రేమ విషయాన్ని నిర్థారించారు.
Comments
Please login to add a commentAdd a comment