ప్రిన్సెస్‌ గౌరమ్మ | Indian Princess Gouramma and History of Royal Racism | Sakshi
Sakshi News home page

ప్రిన్సెస్‌ గౌరమ్మ

Published Fri, Mar 12 2021 12:48 AM | Last Updated on Fri, Mar 12 2021 2:09 AM

Indian Princess Gouramma and History of Royal Racism - Sakshi

ప్రిన్స్‌ గౌరమ్మ తైలవర్ణ చిత్రం, క్వీన్‌ విక్టోరియా

స్వేచ్ఛను కోరుకునే మనసు ప్రేమలోనైనా బందీగా ఉండలేదు. బ్రిటన్‌ కుటుంబంలో రాణిలానూ ఉండిపోలేదు. భర్త నుంచి డయానా, బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ నుంచి మేఘన్‌.. ఇద్దరూ  స్వేచ్ఛను కోరుకున్న వాళ్లే.
ఆ స్వేచ్ఛ కోసమే వాళ్లు తమ రెక్కల్ని తెంపుకున్నారు! వాళ్లిద్దరికంటే ముందు ఆ అంతఃపురంలో గౌరమ్మ అనే బాలిక.. ‘ప్రిన్సెస్‌’ గా స్వేచ్ఛ కోసం పెనుగులాడింది. తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన భర్తలోని తండ్రి ప్రేమను భరించలేక, క్వీన్‌ విక్టోరియా కనురెప్పల కింద భద్రంగా జీవించలేక పారిపోవాలని అనుకుంది. సాధ్యం కాలేదు. ప్రేమకు, భద్రతకు బందీగా 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది! ఎవరీ ప్రిన్సెస్‌ గౌరమ్మ? ప్యాలెస్‌లోకి ఎలా దారి తప్పింది? మేఘన్‌ రాణివాస జీవితానికి పూర్వఛాయలా అనిపిస్తున్న గౌరమ్మ అసలు ఏ ఊరి చిన్నారి?! ఎవరి పొన్నారి?


అన్నమూ నీళ్లూ లేకున్నా మనుషులు కొన్నాళ్లు జీవించి ఉండగలరు. ప్రేమ లేని చోట ఒక్కక్షణం కూడా ఉండలేరు. అది పూరిల్లు అయినా, అంతఃపురం అయినా! లేడీ డయానాకు బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌లో ప్రేమ లభించలేదు. ఆమె కోరుకున్న ప్రేమ.. ప్యాలెస్‌ నుంచి కాదు. భర్త నుంచి. చివరికి మానసికంగా భర్తకు, ప్యాలెస్‌కు కూడా దూరం అయ్యారు డయానా. ప్రేమ లేని జీవితం భారమై, దుర్భరమై ప్రేమ కోసం పరుగులు తీస్తూ బతుకునే పోగొట్టుకున్నారు. 1997 ఆగస్టు 31న ప్యారిస్‌ లో ఆమె ప్రయాణిస్తున్న కారు టన్నెల్‌ రోడ్డుకు ఢీకొని మరణించారు. బ్రిటన్‌ ప్యాలెస్‌ ఎన్నటికీ మరువలేని విషాదం అది. విషాదం కన్నా కూడా విపత్తు. రాజవంశానికి అప్రతిష్టగా మాత్రమే ఆ దుర్ఘటనను ప్యాలెస్‌ ఆనాడు పరిగణించింది!
∙∙
బ్రిటన్‌ రాజప్రాసాదం దృష్టిలో అలాంటి అప్రతిష్టనే ఇప్పుడు మేఘన్‌ మార్కెల్‌ తెచ్చిపెట్టారు. క్వీన్‌  ఎలిజబెత్‌ మనవడు ప్రిన్స్‌ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెరికన్‌ యువతి మేఘన్‌. భర్త నుంచి దొరికిన ప్రేమ ఆమెకు అతడి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం లభించలేదు. ఉన్నన్నాళ్లు గుట్టుగా ఉన్నారు. ఇంక ఉండలేను అనుకోగానే ప్యాలెస్‌ నుంచి బయటికి వచ్చేశారు. ప్రిన్స్‌ హ్యారీ ఆమె వైపు గట్టిగా నిలబడ్డారు కనుకే ఆమె స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలిగారు. ప్యాలñ స్‌ నుంచి మేఘన్‌ వెళ్లిపోవడాన్ని పెద్ద విషయంగా లెక్కలోకి తీసుకోని రాణిగారు, తామెందుకని రాచకుటుంబంతో తెగతెంపులు చేసుకుని బయటికి వచ్చారో ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో ఆమె చెప్పడాన్ని మాత్రం తలవంపులుగా భావించారు.

ఇప్పుడిక ప్రిన్సెస్‌ గౌరమ్మ వార్తల్లోకి వచ్చారు. అయితే బ్రిటన్‌ వార్తల్లోకి కాదు. భారతీయ పత్రికల్లోకి. ‘‘పెళ్లితో ఆ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టి నిరాదరణకు గురైన మహిళల్లో డయానా, మేఘన్‌ మాత్రమే తొలి వ్యక్తులు కారు. పందొమ్మిదో శతాబ్దంలోనే క్వీన్‌ విక్టోరియా హయాంలో గౌరమ్మ అనే బాలిక ‘ప్రిన్సెస్‌’గా ఆ బంగారు పంజరంలో చిక్కుకుని బయటికి వచ్చే దారిలేక పారిపోయేందుకు ఆలోచనలు చేసిందని చరిత్రకారులు నాటి సంగతుల్ని మళ్లీ తవ్వి తీస్తున్నారు. ప్రిన్సెస్‌ గౌరమ్మతో ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ని పోల్చి చూస్తున్నారు. ఎవరీ గౌరమ్మ?! నిజంగానే బ్రిటన్‌ రాచ కుటుంబం గౌరమ్మ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందా? అది దయలేకపోవడమా లేక కట్టుబాట్లను శిరసావహించమని ఆదేశించడమా?
∙∙
డయానాను పక్కన పెడితే.. బ్రిటన్‌ రాజకుటుంబంలో వివక్షకు గురైన గోధుమవర్ణ చర్మం గల రెండో మహిళ మేఘన్‌ మార్కెల్‌. మొదటి మహిళ ప్రిన్స్‌ గౌరమ్మ. పదేళ్ల వయసు లో గౌరమ్మ అంతఃపురానికి వచ్చేనాటికి బ్రిటన్‌ ను క్వీన్‌ విక్టోరియా పరిపాలిస్తూ ఉన్నారు. గౌరమ్మ తండ్రి కూర్గ్‌ రాజు చిక్కా వీర రాజేంద్ర. ఈస్ట్‌ ఇండియా కంపెనీవాళ్లు అతడిని పదవీచ్యుతుడిని చేసి, సంపదను కొల్లగొట్టారు. అందులో కొంత భాగాన్నయినా తిరిగి తనకు దక్కులా చేయమని విన్నవించుకోడానికీ, తన ముద్దుల కూతురు గౌరమ్మను ఆమె రక్షణ కోసం రాణిగారికి దత్తత ఇవ్వడానికి.. ఆ రెండు కారణాలతో.. ఆయన గౌరమ్మను వెంటబెట్టుకుని వెళ్లి రాణిగారిని కలిశారు. అది 1852వ సంవత్సర ఆరం¿¶  కాలం. మొదటి పని కాలేదు. రెండో పని అయింది. విక్టోరియా రాణి గౌరమ్మను దత్తత తీసుకున్నారు.

‘‘నా తల్లి ఇక మీది. తనని మీలో కలిపేసుకున్నా (బాప్తిజం) అభ్యంతరం లేదు’’ అని కూతుర్ని రాణిగారి చేతుల్లో పెట్టి వెనుదిరిగారు వీర రాజేంద్ర. గౌరమ్మ అందంగా ఉంది. ఇకపై మరింత అందంగా మారబోతోంది. అందం మాత్రమే కాదు అలవాట్లు, ఆచారాలు కూడా. 1852 జూన్‌లో విండ్సర్‌ క్యాజిల్‌లో (మరొక రాజసౌధం) గౌరమ్మకు రాచ కుటుంబం బాప్తిజం ఇప్పించడం ఆనాటి పత్రికల్లో విశేష ప్రచారానికి నోచుకుంది. రాణిగారితో కలిసి ఉన్న గౌరమ్మ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆనాటి నుంచి గౌరమ్మ ‘ప్రిన్సెస్‌ గౌరమ్మ’ అయింది. అయితే అది రాణిగారి సంతోషమే కానీ గౌరవ సంతోషం కాదు. ఆ చిన్నారి తన కొత్త పాత్రలో, కొత్త మనుషుల మధ్య, కొత్త ఆచారాల వ్యవహారాలలో ఇమడలేకపోయింది.

క్వీన్‌ విక్టోరియా ఆమెను అమితంగా ఇష్టపడేవారు. అదే ఆ పసిదానికి కష్టాలను తెచ్చిపెట్టింది. చుట్టూ పరిచారకులు ఉండేవారు. తన ఇష్టానుసారం కాలూ చెయ్యి ఆడనిచ్చేవారు కాదు. రాణిగారితో మాటొస్తుందని వారి భయం. అసలు కష్టం ప్రిన్స్‌ గౌరమ్మకు తన 16వ యేట వచ్చింది. గౌరమ్మను మహారాజా దులీప్‌ సింగ్‌కు ఇచ్చి చేయాలని రాణి గారు తలపోయడమే ఆ కష్టం. గౌరమ్మ కన్నా పదహారేళ్లు పెద్దవాడు దులీప్‌సింగ్‌. గౌరమ్మకూ పెళ్లంటే ఇష్టం లేదు. ఎప్పుడు ఆ బంధనాల్లోంచి పారిపోదామా అన్నట్లు ఉండేదా అమ్మాయి. అది గమనించాడు దులీప్‌సింగ్‌. తనకు ఆమెతో పెళ్లి ఇష్టం లేదన్నాడు. అలా ఆ కష్టాన్ని అతడే తప్పించాడు.

అయితే గౌరమ్మకు నిజమైన కష్టం తండ్రిని కలవనివ్వకుండా కట్టడి చెయ్యడం! కలిస్తే మళ్లీ పాతబుద్ధులే వస్తాయని రాణిగారు ఆందోళన చెందేవారట. ‘‘ఎక్కడికైనా పారిపోయి, పనిమనిషిగానైనా బతికేందుకు గౌరమ్మ సిద్ధపడింది’’ అని క్వీన్‌ విక్టోరియా ఆంతరంగిక కార్యదర్శి ఆ తర్వాతి కాలంలో బహిర్గతం చేసినట్లు చరిత్రకారులు రాశారు. మొత్తానికి ఇప్పుడు మేఘన్‌కు అయినట్లే, అప్పుడు గౌరమ్మ కు అయింది. ఒక్కరైనా ఆమెను పట్టించుకోలేదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఆ మనసును తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి కల్నల్‌ జాన్‌ కాంప్‌బెల్‌. ప్రిన్స్‌ గౌరమ్మ కొత్త పరిచారిక లేడీ లోజిన్‌ సోదరుడే జాన్‌ కాంప్‌బెల్‌.
∙∙
కాంప్‌బెల్‌.. గౌరమ్మ కన్నా 30 ఏళ్లు పెద్ద. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు అక్కడికి రాకపోకలు సాగిస్తుండే దులీప్‌ సింగ్‌ గమనించి, రాణిగారికి ఆ విషయాన్ని చేరవేయడంతో క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇద్దరికీ వివాహం జరిపించారు. లేడీ లోజిన్‌ నిర్ఘాంతపోయారు. గౌరమ్మ తమ ఆడపడుచు అవడం లోజిన్‌కు ఇష్టం లేదు. కానీ రాణిగారి నిర్ణయం! 1861లో ప్రిన్స్‌ గౌరమ్మకు ఇరవై ఏళ్ల వయసులో ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు ఎడిత్‌ విక్టోరియా కాంప్‌బెల్‌ అని పేరు పెట్టారు. తర్వాత మూడేళ్లకు ప్రిన్స్‌ గౌరమ్మ 1864లో తన ఇరవై మూడవ యేట చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది మాత్రం చరిత్రలో నమోదు అవలేదు! కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పెనుగులాడిన లేడీ డయానా, మేఘన్‌ మార్కెల్‌ల జీవితంలోనూ నమోదు కానీ, నమోదు అయ్యే అవకాశం లేని వ్యక్తిగత విషయాలు ఉంటే ఉండొచ్చు.
 

ఓప్రా విన్‌ ఫ్రేకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్‌ మార్కెల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement