The House of Jaipur: India's Most Glamorous Royal Family | ప్రిన్స్‌ ఫిలిప్‌ బర్త్‌డేకి మామిడి పండ్లు - Sakshi
Sakshi News home page

ప్రిన్స్‌ ఫిలిప్‌ బర్త్‌డేకి మామిడి పండ్లు

Published Sat, Apr 10 2021 12:31 AM | Last Updated on Sat, Apr 10 2021 11:36 AM

Queen Gayatri Devi sent Alphonso mangoes for Prince Philip - Sakshi

ప్రిన్స్‌ ఫిలిప్, క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులు

జైపుర్‌ మహారాణి గాయత్రీదేవి యేటా ప్రిన్స్‌ ఫిలిప్‌ పుట్టినరోజుకు బుట్టెడు ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లు పంపేవారని, వాటిని ఆయన ఇష్టంగా స్వీకరించేవారని గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్‌ ఆఫ్‌ జైపుర్‌ : ది ఇన్‌సైడ్‌ స్టోరీ ఆఫ్‌ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్‌ జుబ్రిక్సీ రాశారు. మరొక ఆసక్తికరమైన విశేషం.. క్వీన్‌ ఎలిజబెత్, గాయత్రీదేవి దంపతుల ప్రేమ కథలకు, జీవిత విధానాలకు
దగ్గరి పోలికలు ఉండటం!!  

క్వీన్‌ ఎలిజబెత్, ప్రిన్స్‌ ఫిలిప్‌ల జంటకు; మన జైపుర్‌ మహారాణి గాయత్రీదేవి, మాన్‌సింగ్‌ల జంటకు మధ్య ఆసక్తికరమైన పోలికలు కొన్ని కనిపిస్తాయి. క్వీన్‌ ఎలిజబెత్‌తో డెబ్బై నాలుగేళ్ల దాంపత్య బాంధవ్యాన్ని గడిపి, తన నిండు నూరేళ్లకు దగ్గరి వయసులో నిన్న శుక్రవారం ఆమె చెయ్యి వదలి వెళ్లిన ప్రిన్స్‌ ఫిలిప్‌.. క్వీన్‌ని చూసింది ఆమె 13 ఏళ్ల వయసులో. మాన్‌సింగ్‌ గాయత్రీదేవిని మొదట చూసింది కూడా ఆమెకు 13 ఏళ్ల వయసులోనే. ఏడేళ్లపాటు మాన్‌సింగ్‌ గాయత్రిని ప్రేమించాడు. ఆమెకు 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకున్నాడు. ఒడ్డు పొడుగు కన్నా ‘పోలో’ ఆటలో అతడి ‘ఒడుపు’ చూసి మనసిచ్చేసింది గాయత్రి. అక్కడ బ్రిటన్‌ లో ఆ జంటదీ ఇదే కథ.

ఫిలిప్‌ క్రికెట్‌ ఆడతాడు. ఎవరిదో పెళ్లిలో ఎలిజబెత్‌ని తొలిసారి చూశాడు. తర్వాత ఏడేళ్లపాటు ప్రేమలేఖలు నడిచాయి. ఆరో యేట (ప్రేమకు ఆరో యేట) ఎలిజబెత్‌ తండ్రిని కలిసి, ‘నేను మీ అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాను’ అని అడిగాడు. ఒక్క ఏడాది ఆగమన్నారు ఆయన! ఆగడం ఎందుకంటే అప్పటికి ఎలిజబెత్‌కి 21 ఏళ్లు వస్తాయి. అలా ఇక్కడ గాయత్రీ దేవికి, అక్కడ క్వీన్‌ ఎలిజ బెత్‌కి వారి ఇరవై ఒకటో యేటే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఏడేళ్లకు అక్కడ ఎలిజబెత్‌కి క్వీన్‌గా పట్టాభిషేకం జరిగితే, ఇక్కడ జైపుర్‌లో గాయత్రీదేవి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

అక్కడ క్వీన్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ ‘డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌’ అయితే, ఇక్కడ గాయత్రి భర్త రాష్ట్ర గవర్నర్‌ అయ్యారు. ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం జరిగిన ఏడాదే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. జైపుర్, మరో 18 సంస్థానాలు కలిసి రాజస్థాన్‌ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రానికే మాన్‌సింగ్‌ గవర్నర్‌ అయ్యారు. గాయత్రి దేవి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ జంటలో భార్య, ఈ జంటలో భార్య ప్రత్యక్ష పాలనలో ఉంటే, ఆ జంటలో భర్త, ఈ జంటలో భర్త పరోక్ష విధులకు పరిమితం అయ్యారు. గాయత్రీదేవి పుట్టింది కూడా క్వీన్‌ ఎలిజబెత్‌ పుట్టిన లండన్‌లోనే. క్వీన్‌ కన్నా గాయత్రి ఏడేళ్లు పెద్ద. 1950, 60 లలో క్వీన్‌ ఎలిజబెత్, ప్రిన్స్‌ ఫిలిప్‌; గాయత్రిదేవి, మాన్‌సింగ్‌ దంపతులు ప్రపంచానికి ‘గోల్డెన్‌ కపుల్‌’.

వీరి రెండు ప్రేమ కథలకు పోలికలు ఉండటం మాత్రమే కాదు, రెండు జంటలూ మంచి ఫ్రెండ్స్‌ కూడా! ప్రిన్స్‌ ఫిలిప్‌ వేసవిలో పుట్టారు. ఏటా జూన్‌ 10 న ఆయన పుట్టినరోజు జరుగుతున్నా అసలు పుట్టిన రోజు మాత్రం మే 28. నూరేళ్ల క్రితం 1921లో ఆయన పుట్టే సమయానికి గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ పుట్టలేదు. ఆ ముందువరకు ఉన్న జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం అయితే ఆయన ‘మే’ నెలలోనే పుట్టినట్లు. మే అయినా, జూన్‌ అయినా.. ఇండియాలో అది మామిడి పండ్ల కాలం. ఏటా ఆయన పుట్టిన రోజుకు గాయత్రీదేవి బుట్టెడు ఆల్ఫోన్సో మామిడి పండ్లను కానుకగా పంపేవారు. ఆ పండ్లను ప్రిన్స్‌ ఫిలిప్‌ ఎంతో ప్రీతిగా స్వీకరించేవారని గాయత్రీ దేవి ఆంతరంగిక సలహాదారు ఒకరు తనతో చెప్పినట్లు గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ది హౌస్‌ ఆఫ్‌ జైపుర్‌: ది ఇన్‌సైడ్‌ స్టోరీ ఆఫ్‌ ఇండియా’ అనే పుస్తకంలో ఆస్ట్రేలియా రచయిత జాన్‌ జుబ్రిక్సీ రాశారు.

ప్రిన్స్‌ ఫిలిప్, క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులతో గాయత్రీదేవి, మాన్‌సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement