భారత్‌లో అపార అవకాశాలు | Enormous opportunities in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో అపార అవకాశాలు

Published Sat, Nov 14 2015 2:32 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

భారత్‌లో అపార అవకాశాలు - Sakshi

భారత్‌లో అపార అవకాశాలు

♦ పెట్టుబడులు పెడితే ఇరు దేశాలకూ మేలు  
♦ భారత్-యూకే సీఈఓల ఫోరం భేటీలో ప్రధాని మోదీ
 
 లండన్:  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇన్‌ఫ్రా, పునరుత్పాదక విద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, భారత్‌లో బ్రిటన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఇరు దేశాలకూ ప్రయోజనాలు చేకూరగలవని  పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారమిక్కడ పునర్‌వ్యవస్థీకరించిన భారత్-యూకే సీఈవోల ఫోరం తొలి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడుల రాకకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పన్నులు, అనుమతులపరంగా చేపట్టిన సంస్కరణలను తెలిపారు. కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని కామెరాన్ ప్రసంగిస్తూ.. వాణిజ్య బంధాల పటిష్టతకు, పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇరు దేశాలు సహకరించుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.

 విధానాలు నిలకడగా ఉండాలి: సీఈఓలు
 ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, విధానాలు నిలకడగా ఉండేలా చూడాలని మోదీని బ్రిటన్, భారత్ దిగ్గజ కంపెనీల సీఈవోలు కోరారు. భారత్‌లో ఇన్వెస్ట్ చేసే విదేశీ సంస్థలన్నింటినీ సమానంగా చూడాలన్నారు. వ్యాపారాలు, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించడం, నిబంధనల సరళీకరణ, నిర్ణయాల్లో పారదర్శకతను కోరుకుంటున్నట్లు ఫోరమ్‌కు కో-చెయిర్‌గా వ్యవహరించిన టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు.  

 ఇరు దేశాల మధ్య ఒప్పందాలు..: మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 9.2 బిలియన్ పౌండ్ల విలువ చేసే ఒప్పందాలు కుదిరాయి.  20 మిలియన్ పౌండ్ల విలువ చేసే అపోలో హాస్పిటల్స్-హోలాండ్ అండ్ బారెట్ ఇంటర్నేషనల్ డీల్ ఇందులో ఒకటి. ఈ ఒప్పందం కింద ఐదేళ్లలో వెయ్యి హోలాండ్ అండ్ బారెట్ అవుట్‌లెట్స్‌ను భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు.    
 
 రూ. 10 వేల కోట్లతో ఆస్పత్రులు
 భారత్, బ్రిటన్ ప్రొమోటర్లకు చెందిన ఇండో-యూకే హెల్త్‌కేర్ కన్సార్షియం.. భారత్‌లో రూ. 10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సమ్మతించింది. ఇంగ్లండ్‌లో ఎన్‌హెచ్‌ఎస్ ఆస్పత్రులతో పాటు.. ఇతర బ్రిటన్ విద్యా సంస్థలను భారత్‌కు తీసుకువస్తామంది. 11 ఆస్పత్రులను భారత్‌లోని 11 రాష్ట్రాల్లో నెలకొల్పేలా ఒప్పందం కుదిరింది. తొలుత ఇంగ్లండ్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌ను చండీగఢ్‌లో ఏర్పాటు చేయనున్నారు. బ్రిటిష్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంకుక్తంగా నిర్వహించనున్న.. భారత్‌లో తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధి నిధి (నీవ్ ఫండ్)ని మోదీ లండన్‌లో ప్రారంభించారు. కామెరాన్ కూడా హాజరయ్యారు.
 
 స్టూడెంట్ వీసాలు తగ్గడంపై ఆందోళన
 బ్రిటన్ ప్రధాని కామెరాన్‌తో చర్చల్లో యూకే వీసా పొందేందుకు భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మోదీ ప్రస్తావించారు. గత మూడేళ్లలో యూకేలో చదువుకునేందుకు భారతీయులకు జారీ చేసే వీసాలు సగానికి సగం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత విద్యార్థులకు స్టడీ వీసాలను జారీ చేయడం ద్వారా వారికి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి నైపుణ్యాలను బ్రిటన్ ఉపయోగించుకోవచ్చని వివరించారు. 2010-11లో 18వలే మంది భారత విద్యార్థులు యూకే వీసా పొందగా, 2012-13 నాటికి ఆ సంఖ్య 10,235కి పడిపోయింది. కాగా, వాతావరణ మార్పుపై కలసికట్టుగా పోరాడాలని మోదీ, కామెరాన్ నిర్ణయించారు. ఇంధన రంగంలో సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. స్వచ్ఛఇంధన పరిశోధనలకు ఉమ్మడిగా కోటి పౌండ్ల(రూ. 100.64 కోట్లు) నిధులను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఐదేళ్లలో ఇంధన రంగంలో సంస్కరణలకు అవసరమైన సాంకేతిక సాయం కోసం భారత్‌కు కోటి పౌండ్ల(రూ. 100 కోట్లు) నిధులను అందజేస్తామన్నారు.
 
 ఢిల్లీలో మేడం టుస్సాడ్స్ మ్యూజియం
 ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మైనపు మ్యూజియం శాఖను 2017 ప్రారంభంలో ఢిల్లీలో నెలకొల్పనున్నట్లు బ్రిటన్ ప్రధాని కామెరాన్ తెలిపారు. మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా  ఈమేరకు ప్రకటన చేశారు.
 
 మోదీ గతం తవ్విన బ్రిటిష్ మీడియా
 ప్రధాని మోదీ పర్యటనకు మంచి కవరేజ్ ఇచ్చిన బ్రిటిష్ మీడియా.. మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించి మోదీ గత చరిత్రనూ ప్రస్తావించింది. ది గార్డియన్, ది టైమ్స్, ది ఇండిపెండెంట్ తదితర పత్రికలు మోదీ 2002లో సీఎంగా ఉండగా గుజరాత్‌లో జరిగిన మతోన్మాద అల్లర్లను, 2012 వరకు మోదీపై బ్రిటన్ ప్రభుత్వ వైఖరిని గుర్తు చేశాయి. ‘ఆల్ ఈజ్ ఫర్‌గివెన్.. మిస్టర్ మోదీ’ అని డైలీ టె లిగ్రాఫ్ వార్తను ప్రచురించింది. ‘విద్వేషపూరిత  మోదీ బ్రిటన్ విలువలను పంచుకునే వ్యక్తి కాద’ని అంటూ కాలమిస్ట్ ఫిలిప్ కాలిన్స్ ది టైమ్స్‌లో వ్యాసం రాశారు.
 
 హక్కులపై ప్రశ్నించండి: ఆమ్నెస్టీ
 లండన్: మోదీకి ఎర్రతివాచీ పరచడమే కాదు.. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై హెచ్చరించడం కూడా చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు విజ్ఞప్తి చేసింది. భారత్‌లో ఎన్జీఓలు, వహక్కుల కార్యకర్తలపై నిర్బంధం, నిధుల సేకరణకు అడ్డంకులపై మోదీని ప్రశ్నించాల ఆమ్నెస్టీ యూకే అధ్యక్షుడు అలన్ హోగర్త్ కోరారు.  

 రచయితల లేఖపై మోదీతో చర్చించా: కామెరాన్
 200 మందికి పైగా భారత రచయితలు తనకు రాసిన బహిరంగ లేఖలో లేవనెత్తిన భావప్రకటనా స్వేచ్ఛపై ఆందోళనల అంశాన్ని మోదీతో భేటీలో చర్చించినట్లు కామెరాన్ పీటీఐకి చెప్పారు.  

 అసహనంపై మోదీవి రెండు నాల్కలు: కాంగ్రెస్
 న్యూఢిల్లీ: భారత్‌లోని ఎక్కడా అసహన ఘటనలను సహించబోమంటూ లండన్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఒకవైపు దేశంలో అసహన ఘటనలకు మౌనంగా మద్దతిస్తూ, మరోవైపు వాటిని  సహించబోమనడం మోదీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమమంది.
 
 మోదీకి ఎలిజబెత్ రాణి విందు
 లండన్: అధికారిక పర్యటనలో భాగంగా యూకే వచ్చిన భారత ప్రధాని మోదీకి బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 శుక్రవారం మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. జాగ్వార్ ల్యాండ్‌రోవర్ కార్లో వచ్చిన మోదీకి రాజప్రసాద గ్రాండ్ ఎంట్రన్స్‌లోనే రాజసౌధ ప్రతినిధి స్వాగతం పలికారు. అనంతరం మోదీ, ఎలిజబెత్‌తో కలిసి తన సందర్శన సందర్భంగా ప్రత్యేకంగా తెప్పించిన రాయల్ కలెక్షన్‌ను వీక్షించారు. సాధారణంగా దేశాధినేతల పర్యటన సందర్భంగా రాణితో కలిసి ప్రత్యేక రథంపై పర్యటించే సంప్రదాయాన్ని మోదీ పర్యటనలో పాటించలేదు. రాణికి మోదీ డార్జిలింగ్ టీ పొడిని, జమ్మూకశ్మీర్ తేనె, వారణాసి తాంచోయి శాలువాలను అందించారు. అలాగే, 1961లో క్వీన్ గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా భారతకు వచ్చినప్పటి అరుదైన ఫొటోలనూ బహూకరించారు. రాజసౌధ వంట నిపుణులు మోదీ కోసం ప్రత్యేకంగా శాకాహార వంటకాలను తయారు చేశారు.   కాగా, యువరాజు విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్‌టన్ దంపతులు వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో భారత్ పర్యటనకు రానున్నారు. భారత్‌కు రావడం వారికి ఇదే ప్రథమం.

 పుట్టగొడుగుల పులావ్..: మోదీకి గురువారం రాత్రి బ్రిటన్ ప్రధాని కామెరాన్ పుట్టగొడుగుల పులావ్, పప్పుతో  విందునిచ్చారు. బకింగ్‌హామ్‌షైర్‌లోని తనింట్లో ఇచ్చిన విందులో ప్రముఖ చెఫ్‌లతో వండించిన  పులావ్, పప్పుతో పాటు బీట్స్ అండ్ రూట్స్ సలాడ్, కచుంబ సలాడ్, మామిడిపండుతో చేసిన స్వీట్‌లను వడ్డించారు. గురువారం రాత్రి మోదీ అక్కడే విశ్రమించారు.

 కామెరాన్ దంపతులకూ కానుకలు..: కామెరాన్‌కు మోదీ ప్రత్యేకంగా రూపొందించిన అందమైన బుకెండ్స్‌ను బహూకరించారు. ఆ బుకెండ్స్(రేక్స్‌లో పుస్తకాల వరుస చివరలో ఉంచేవి)పై వెండి గంట, దానిపై భగవద్గీత శ్లోకాలను సంస్కృతంలోనూ, ఇంగ్లీష్‌లోనూ చెక్కించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో విధుల్లో ఉన్న భారతీయ సైనికులు రాసిన ఉత్తరాలతో కూడిన పుస్తకం ‘ఇండియన్ వాయిసెస్ ఆఫ్ ద గ్రేట్ వార్’నూ బహూకరించారు.  కామెరాన్ భార్య సమంతాకు కేరళ హస్తకళాకారులు ప్రత్యేకంగా రూపొందించిన అద్దాన్ని, కొన్ని పాష్మినా స్టోల్స్(భుజాల మీదుగా వేసుకునే శాలువా తరహా వస్త్రాలు)ను అందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement