కామన్వెల్త్‌ చీఫ్‌గా చార్లెస్‌ | Leaders approve Prince Charles to succeed Queen as Commonwealth head | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ చీఫ్‌గా చార్లెస్‌

Published Sat, Apr 21 2018 2:29 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Leaders approve Prince Charles to succeed Queen as Commonwealth head - Sakshi

లండన్‌లో ప్రిన్స్‌ చార్లెస్‌తో మోదీ కరచాలనం

లండన్‌: కామన్వెల్త్‌ చీఫ్‌గా ప్రిన్స్‌ చార్లెస్‌(69) నియామకానికి 53 కూటమి దేశాల అధినేతలు ఆమోద ముద్ర వేశారు.  కామన్వెల్త్‌ దేశాధినేతల (చోగమ్‌) సదస్సులో భాగంగా శుక్రవారం విండ్‌సర్‌ కోటలో రహస్యంగా జరిగిన భేటీలో చార్లెస్‌ను కామన్వెల్త్‌ చీఫ్‌గా నియమించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. చోగమ్‌ ముగింపు సందర్భంగా అధికారిక ప్రకటనలో ఈ విషయం చెప్పారు. చార్లెస్‌ తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌ నుంచి కామన్వెల్త్‌ బాధ్యతల్ని అధికారికంగా చేపట్టనున్నారు.

ప్రిన్స్‌ చార్లెస్‌ చీఫ్‌ కావాలన్నది తన ఆకాంక్షని, దీన్ని సభ్యులందరూ ఆమోదించాలని ప్రారంభ ఉపన్యాసంలో గురువారం ఎలిజబె™Œ కోరింది. ఎలాంటి ముందస్తు అజెండా లేకుండా విండ్‌సర్‌ కోటలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీసహా 52 దేశాల అధినేతలు పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోస భేటీకి హాజరుకాలేదు. తదుపరి కామన్వెల్త్‌ చీఫ్‌పై ఏకాభిప్రాయంతో పాటు, కూటమి భవిష్యత్‌ కార్యాచరణపై భేటీలో చర్చించారు.

ప్రిన్స్‌ చార్లెస్‌ ఎంపికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత్‌ ముందుగానే ప్రకటించింది. కాగా భారత్‌ మద్దతు కూడగట్టేందుకు ప్రిన్స్‌ చార్లెస్‌ గట్టిగానే కృషి చేశారు. గతేడాది భారత్‌ పర్యటన సందర్భంగా ప్రధానిని కలిసి లండన్‌ సదస్సుకు రావాలని వ్యక్తిగతంగా కోరారు.  మోదీ బ్రిటన్‌ పర్యటన సందర్భంగా లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద భారతదేశ జాతీయ జెండాను అపవిత్రం చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. ‘మేం చర్యలు ఆశిస్తున్నాం. ఈ ఘటనకు పాల్పడిన వారితో పాటు, రెచ్చగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలి’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు.  

కామన్వెల్త్‌ ఫండ్‌కు సాయం రెండింతలు
ప్రజాస్వామ్యం బలోపేతం, చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, వాతావరణం, కామన్వెల్త్‌ దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై చోగమ్‌ సదస్సులో చర్చించారు. అభివృద్ధి లక్ష్యాలు,  వాతావరణ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి(పశ్చిమ) ఘనశ్యామ్‌ తెలిపారు. కామన్వెల్త్‌లో భాగంగా ఉన్న చిన్న దేశాలు, ద్వీపాల్లో సామర్థ్యం పెంచాలని, సాంకేతిక సహకారం కోసం కామన్వెల్త్‌ ఫండ్‌కు సాయాన్ని రెండింతలు చేస్తామని మోదీ ప్రకటించారన్నారు.  

భారత్‌కు తిరుగుపయనం: బ్రిటన్‌ పర్యటన ముగించుకున్న  మోదీ శుక్రవారం రాత్రి జర్మనీ చేరుకున్నారు. రాజధాని బెర్లిన్‌లో కొద్ది గంటలు గడిపిన ఆయన జర్మనీ చాన్సలర్‌ మెర్కెల్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం ఐదురోజుల విదేశీ పర్యటన ముగించి భారత్‌కు బయల్దేరారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement