బంగ్లా ప్రధాని హసీనాతో మోదీ కరచాలనం
లండన్: కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్)సదస్సులో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడిపారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అయితే చోగమ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీతో మోదీ భేటీ కారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘ఈ సదస్సు కారణంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు అవకాశం దొరికింది’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియేడ్స్‌లతో మోదీ సమావేశమయ్యారు. అనంతరం జమైకా, జాంబియా, ఉగాండా, సీషెల్స్, ఫిజీ, సెయింట్ లూసియా, సోలొమాన్ ఐలాండ్స్, కిరిబాతి, అంటింగ్వా–బార్బుడా తదితర దేశాధినేతలతో ప్రధాని చర్చలు జరిపారు. మారిషస్ ప్రధాని జుగ్‌నౌత్‌తో ద్వైపాక్షిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్రతీర సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మనమంతా ఒక్కటే: థెరిసా మే
బ్రిటన్ ప్రధాని థెరిసా మే చోగమ్ తొలి సెషన్ (గురువారం నాటి కార్యక్రమాలు) ప్రారంభోపన్యాసం చేశారు. ‘కూటమిలోని దేశాలన్నింటికీ సమానమైన హోదా ఉండటం, ప్రతి ఒక్కరి వాణిని గౌరవించటమే కామన్వెల్త్ బలం. అందుకే అందరికీ మాట్లాడే అవకాశం దక్కుతుంది. నేటి ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోంది. వీటి పరిష్కారం కోసం మనమంతా ఆలోచన చేయాలి. కామన్వెల్త్ కూటమిగా మన దేశాల్లోని 240 కోట్ల మంది ప్రజలకు.. మేలు చేసేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment