‘డియర్ రాణిగారు.. మీతో చాలా మాట్లాడాలి’
లండన్: ప్రియమైన రాణిగారు, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా గుర్రాలు, విమానాలు, పేద చిన్నారుల గురించి’ ..ఇదేదో రాయబారి రాసిన దౌత్యసంబంధాలకు సంబంధించిన లేఖ కాదు. నాలుగేళ్ల బాలుడి ఆకాంక్ష. తన పుట్టిన రోజుకు ఏకంగా బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2ను ఆహ్వానిస్తూ భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల బాలుడు ఈ లేఖ రాశాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడి లేఖను చూసిన రాణిగారు ప్రత్యుత్తరాన్ని పంపించారు.
నాలుగేళ్ల షాన్ దులే అనే భారతీయ సంతతి బాలుడు జూన్ 25న తన పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ వేడుకలకు రాణిని పిలవాలని తన తల్లి బలిజిందర్‌కు చెప్పగా ఆమె బహుశా లండన్‌లో చాలా బిజీగా ఉంటారని చెప్పింది. ఏమో రావచ్చేమో అని ఆశాభావంతో ఆ బాలుడు బ్రిటన్ రాణికి లేఖ రాశారు. అందులో ఏం పేర్కొన్నాడంటే..
ప్రియమైన రాణి ఎలిజెబెత్.. ప్రపంచంలో మీరే ఉత్తమ రాణి అని నేను అనుకుంటున్నాను. మీ కిరీటం, మీరు దరించే రోడ్ క్లాక్ నాకు చాలా ఇష్టం. అది సూపర్ హీరోలా ఉంటుంది. నేను మీతో గుర్రాలు, విమానాలు, పేద బాలల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను’ అంటూ మార్చి 13న లేఖ రాశాడు. అయితే, తన లేఖకు బదులు రాదని ఆశ వదులుకున్నాడు.
కానీ, మే 3న బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అతడి లేఖ వచ్చింది. అందులో బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా అతడి ఆహ్వానం ప్రకారం రాలేకపోతున్నారని, వారిని ఆహ్వానించిందుకు రాజు, రాణి చాలా సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జూన్ 25న అతడి పుట్టిన రోజు వేడుకను చాలా ఘనంగా జరుపుకోవాలని వారు ఆశించినట్లు అందులో పేర్కొన్నారు. ఆ లేఖ చూసి ఆ బాలుడు ఇప్పుడు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నట్లు అతడి తల్లి చెప్పింది.