
క్వీన్ ఎలిజబెత్‌కు ‘వెంకీస్’ విందు
లండన్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ బ్లాక్‌బర్న్ రోవర్స్ యజమానులు వెంకటేష్ రావు, బాలాజీ రావు... ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2కు ఆతిథ్యం ఇచ్చారు. ‘హోలీ థర్స్‌డే’ను పురస్కరించుకుని ఎలిజబెత్... బ్లాక్‌బర్న్ రోవర్స్ ప్రధాన కేంద్రం ఉన్న ఎవుడ్ పార్క్‌కు వచ్చారు. స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మతాధికారులు, రాజకీయ నాయకులు హాజరు కాగా... క్వీన్, ఆమె భర్త ది డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌ను వెంకీ సోదరులు కలిశారు.
ఈ సందర్భంగా వెంకీస్ ఆమెను విందుకు ఆహ్వానించారు. ఇందులో క్వీన్‌తో పాటు 98 మంది అతిథులు పాల్గొన్నారు. ‘క్వీన్ ఎలిజబెత్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లను బ్లాక్‌బర్న్ రోవర్స్‌కు ఆహ్వానించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని బాలాజీ రావు సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఈవెంట్‌లో తాము భాగస్వామ్యం కావడం తమ కుటుంబానికి, పట్టణానికి, దేశానికే గర్వకారణంగా భావిస్తున్నామని వెంకటేష్ రావు తెలిపారు.