తమ పిల్లలపై జరిగిన మారణ హోమం పట్ల అక్కడి జనాలు రగిలిపోతున్నారు. సంబురంగా జరపాల్సిన పూర్తి స్వాతంత్రోత్సవ వేడుకల్ని.. నిరసన దినంగా పాటించారు. వలస పాలనతో ఆ మారణహోమాలకు కారకులంటూ రాణుల విగ్రహాలను కూల్చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై యావత్ ప్రపంచం నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఒట్టావా: నారింజ దుస్తుల్లో రోడ్డెక్కిన నిరసనకారులు.. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం, కూలిన రాణుల విగ్రహాలు.. ఇది కెనడా డే నాడు కనిపించిన దృశ్యాలు. జులై 1న కెనడా డే వేడుకలపై ‘కరోనా’ ప్రభావం కనిపించింది. సంబురాలు భారీగా జరుపలేదు అక్కడి జనం. పైగా ఈ మధ్యకాలంలో స్కూళ్ల నుంచి వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాల అవశేషాలు భారీగా బయటపడడం వాళ్లలో తీవ్ర విషాదం నింపింది. అందుకే నిరసన దినం పాటించారు. అయితే బ్రిటిష్ పాలనలో జరిగిన ఆ మారణహోమాలను గుర్తు చేసుకుంటూ.. కనిపించిన రాణుల విగ్రహాలను కూల్చేశారు.
తాళ్లతో లాగేసి మరీ..
కెనడా వ్యాప్తంగా ఆరెంజ్ దుస్తుల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. విన్నిపెగ్‌లో క్వీన్ విక్టోరియా విగ్రహం దగ్గర తొలుత ప్రదర్శనలు నిర్వహించారు. బ్రిటిష్ రాచరికపు గుర్తులు కెనడా గడ్డపై ఉండకూడదని అరుస్తూ ఆపై విగ్రహాన్ని కూల్చిపడేశారు. విగ్రహంపైకి ఎక్కి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆపై అక్కడున్న శిలాఫలకంపై ఎర్ర చేతి గుర్తులు వేశారు. ఇక ఆ దగ్గర్లోనే ఉన్న క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని కూడా తాళ్లతో లాగి కిందపడేశారు. రాణి కాదు.. రాక్షసి అంటూ అభ్యంతరకర నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఒట్టవాలో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇక ఈ ఘటనలను బ్రిటన్ ఖండించిది. ‘‘కెనడాలో జరిగిన విషాదాలకు మేం బాధపడుతున్నాం.ఈ వ్యవహారంలో కెనడాతో విచారణకు మేం సహకరిస్తాం. కానీ, విగ్రహాలు కూల్చేయడం సరికాదు’’ అని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆరువేల మందికిపైనే..
బ్రిటీష్ కొలంబియా, సస్కట్చేవాన్ లో క్యాథలిక్ చర్చల ద్వారా నడిచే స్కూళ్లలో భారీగా పిల్లల అస్థిపంజరాలు బయటపడడం తెలిసిందే. కెనడా దాదాపు 165 ఏళ్లపాటు బ్రిటిష్ కాలనీ పాలనలో ఉంది. ఆ టైంలో సంప్రదాయ మారణహోమం పెద్ద ఎత్తున్న జరిగిందని 2015లో ఓ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బలవంతపు మతమార్పిళ్లు.. వినని వాళ్లపై వేధింపులు జరిగేవని తెలుస్తోంది. సుమారు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు ఆరువేల మంది పిల్లలు చనిపోగా.. వాళ్లను అక్కడే ఖననం చేశారు. ఆ అస్థిపంజరాలే ఇప్పుడు బయటపడుతున్నాయి.
చదవండి: మూసేసిన స్కూల్‌లో వందల అస్థిపంజరాలు
మతం, మాతృభాష ఆ పిల్లల పాలిట శాపం!
Comments
Please login to add a commentAdd a comment