సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ దేశానికి సంబంధించి ఐదు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అవి అందరికి తెలియక పోవచ్చు. పాకిస్థాన్‌కు మొదటి రాణి క్వీన్ ఎలిజబెత్. ఆమె 1956 వరకు పాక్‌కు రాణిగా ఉన్నారు.
1. భారత్, పాక్‌కు స్వాతంత్య్రానికి ముందు నుంచి ఎలిజబెత్ రాణి తండ్రి జార్జి–6 ఇరు దేశాలకు రాజుగా ఉన్నారు. 1950లో భారత్ రిపబ్లిక్‌గా మారడంతో ఆయన రాజరికం భారత్‌లో అంతరించింది. కానీ పాకిస్థాన్‌లో కొనసాగింది. 1952లో రాజు జార్జి–6 మరణించారు. ఆయన స్థానంలో బ్రిటీష్ రాణిగా పట్టాభిషక్తులైన ఆయన కూతురు రెండో ఎలిజబెత్ పాకిస్థాన్‌కు రాణిగా 1956 వరకు కొనసాగారు. అయితే రాణి పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా లాంఛనంగా మాత్రమే ఆ దేశపు రాణిగా కూడా కొనసాగారు. 1956లో పాకిస్థాన్ కూడా రిపబ్లిక్ అవడంతో ఆమె రాచరికం అక్కడ కూడా రద్దయింది.
2. పాకిస్థాన్ జాతీయ పానీయం చెరకు రసం. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఈ పానీయం అత్యంత ఇష్టం. ముఖ్యంగా వేసవిలో ఈ చెరకు రసం లేకుండా ఆయన ఉండలేరు.
3. హరప్ప నాగరికతగా ప్రసిద్ధి చెందిన సింధూ నాగరికతకు పాకిస్థాన్ పుట్టినిల్లు. ఈశాన్య అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా ఆగ్నేయ భారత్ ప్రాంతానికి ఈ నాగరికత విస్తరించి ఉంది.
4. ప్రపంచంలో సగం ఫుట్‌బాల్స్ ఇక్కడే తయారయితాయి. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ అందుకు ప్రసిద్ధి. అన్ని ప్రపంచకప్ సాకర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వీటినే ఎక్కువగా వాడుతారు. చేతితో తయారుచేసే ఈ ఫుట్‌బాల్స్‌ను ఏటా ఆరు కోట్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి.
5. ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలో గ్రౌండ్, ఎత్తయిన అంతర్జాతీయ రహదారి పాక్‌లోనే ఉన్నాయి. ‘రూఫ్ ఆఫ్ ది వరల్డ్’గా ప్రసిద్ధి చెందిన గిల్గిట్ పర్వతాల్లో షాండూర్ టాప్ ఉంది. 12,200 అడుగులు (3,700 మీటర్ల) ఎత్తులో ఉండే షాండూర్ టాప్‌లో 1936 నుంచి ఫ్రీ సై్టల్ పోలో ఆడుతున్నారు. ఇక పాకిస్థాన్‌ను చైనాను కలిపే అంటే కారకోరం పర్వత శ్రేణి నుంచి చైనాలోని కుంజేరబ్ పాస్‌ను కలిపే కారకోరం అంతర్జాతీయ రహదారి 15,397 అడుగులు (4,693 అడుగులు) ఎత్తులో ఈ రహదారి వెళుతుంది. దీని పొడువు 800 మైళ్లు.
Comments
Please login to add a commentAdd a comment