సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్–19 బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఇటు రాష్ట్రంలో రోజుకు సగటున వెయ్యికి మించి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మందికి లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రుల్లో చేరుస్తుండగా.. లక్షణాలు లేని వారు, అతి తక్కువ లక్షణాలున్న వారందర్నీ హోం ఐసోలేషన్‌కే పరిమితం కావాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దీంతో ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడంతో పాటు పేషెంట్ సైతం ఇంట్లో మరింత స్వేచ్ఛగా ఉండే అవకాశముంటుంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు తప్పకుండా పది రోజుల పాటు ఇంట్లో ప్రత్యేక గదిలో ఒంటరిగా (కుటుంబ సభ్యులకూ దూరంగా) ఉండాల్సిందే. హోం ఐసోలేషన్‌లో నిర్దేశించిన జాగ్రత్తలు పాటించకుంటే ఈ వైరస్ కుటుంబ సభ్యులకు సైతం వ్యాప్తి చెందే అవకాశముంటుంది.
ఇదే సందర్భంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న పేషెంట్ భయాందోళన చెంది పూర్తి ఏకాంతంగా గడిపితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్) చెబుతోంది. కరోనా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురి కావడంతో పాటు తన ఆరోగ్యంపై సందేహాల వెల్లువ, కుటుంబ సభ్యుల ఆలోచనలు, ఉద్యోగం, తదితర అంశాలను తీవ్రంగా ఆలోచించడంతో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశముంటుంది. ఈక్రమంలో హోం ఐసోలేషన్ జాగ్రత్తలు పాటించడంతో పాటుగా ఒంటరితనాన్ని అనుభవించకుండా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అనువైన ఇతర కార్యకలాపాలతో గడిపితే కరోనాను విజయవంతంగా జయించవచ్చని చెబుతోంది. ఈ మేరకు ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆందోళనకు చెక్ పెడితే..
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ముందుగా ఆందోళనను వీడాలని ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ చెబుతోంది. ఏ విషయంలో కూడా తొందర పాటు, గాబరా పడకుండా ఏకాగ్రతతో ఆలోచించాలి. అందుకు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలని చెబుతోంది. రోజువారీ పనుల్లో బిజీగా ఉండే వారికి హోం ఐసోలేషన్ కాస్త ఇబ్బందే.. ఈ సమయంలో తమ ఉద్యోగం, ఇతర విధులు ఎలా జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి తలెత్తి ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ఈ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ లేదా ఇంటర్నెట్ ఆధారంగా పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు శారీరక వ్యాయామంపైనా దృష్టి పెట్టాలి.
హోం ఐసోలేషన్ సమయంలో క్రమపద్ధతిలో భోజనం, అందుబాటులో ఉన్న పరిధిలో శారీరక శ్రమ చేయడం, ఇతర వ్యాపకాలున్న వారు వాటికి సమయం వెచ్చించడంతో రిలీఫ్ దొరుకుతుందని చెబుతోంది. మానసిక ఆరోగ్యంతో రోగ నిరోధక శక్తి వేగంగా పెరుగుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలని ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ సూచిస్తోంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ.. కొందరికి వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలుంటుంది. అలాంటి వారు తమ పనులను యథావిధిగా చక్కబెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అవగాహన అవసరం..
కోవిడ్ బారిన పడిన వాళ్లలో ఎక్కువగా ఆందోళన పడుతున్నవారున్నారు. ఈ వ్యాధి వల్ల తన పరిస్థితి ఏంటనే దానిపైనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. దీంతోనే ఇతర మానసిక సమస్యలొస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమిస్తేనే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. అందుకు సరైన అవగాహన పెంచుకోవాలి.అలాగే కోవిడ్ బాధితుల పట్ల వివక్ష చూపిస్తే వారు మరింత డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదముంది. ఫోన్‌లో మాట్లాడటంతో వారికి రిలీఫ్ దొరుకుతుంది. పేషెంట్ల పట్ల పాటించాల్సిన పద్ధతులపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
–డాక్టర్ అజయ్‌కుమార్ జూపాక, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రి విభాగం, గాంధీ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment