వాషింగ్టన్: కరోనా వైరస్ గురించి మాట్లాడకుండా ఎవరికీ ఒక గంట కూడా గడవడం లేదు. ఒకప్పుడు కరోనా సోకిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నా సరిపోయేది కాదు. వారికి పరీక్ష చేసినా పాజిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. అంతగా లక్షణాలు కనిపించడం లేదు. మూడు రోజులకే నెగెటివ్ వస్తోంది. వైరస్ బలహీన పడుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అలాంటప్పుడు ఎన్నాళ్లు క్వారంటైన్‌లో ఉండాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా ఇంటికే పరిమితం కావడం చాలా మందికి దుర్భరంగా మారింది. మరోవైపు లక్షణాలున్న వారు తాము బయటకి వస్తే, మిగిలిన వారికి ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్(సీడీసీ) తాను గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించింది. (వాడిన మాస్క్లను ఎలా పడేయాలంటే..)
లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చినవారు వారికి పరీక్ష నిర్వహించిన దగ్గర్నుంచి 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. అంతకు ముందు వరకు రెండు సార్లు నెగెటివ్ వచ్చాక కోవిడ్ రోగులకి స్వేచ్ఛ లభించేది. అయితే ప్రపంచ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో ఎవరి శరీరంలోనూ తొమ్మిది నుంచి 11 రోజులకు మించి వైరస్ జీవించి ఉండదని తేలింది. దీంతో సీడీసీ తన నిబంధనల్ని మార్చి 10 రోజులు ఇంటిపట్టున ఉంటే సరిపోతుందని పేర్కొంది.
ఎవరు ఏం చెప్పారంటే...
► డబ్ల్యూహెచ్‌ఓ జూన్‌లో సిఫారసు చేసిన మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు, స్వల్ప లక్షణాలుంటే 13 రోజులు, తీవ్రత ఎక్కువగా ఉండి ఆస్పత్రి పాలైతే డిశ్చార్జ్ అయిన దగ్గర్నుంచి రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండాలి.
► యూకేలో లిసెస్టర్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ జూలియాన్ తాంగ్ కరోనా రోగులు 10 రోజుల ఐసలేషన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. పది రోజుల తర్వాత వారి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ అది బలహీనపడిపోయి వ్యాప్తి చెందదని తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో తేలిందన్నారు.
► నేచర్ పత్రిక చేసిన అధ్యయనంలో కరోనా శరీరంలోకి ప్రవేశించాక ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు అయిదో రోజు నుంచి వైరస్‌ను నిర్వీర్యం చేయడం మొదలు పెడతాయని తేలింది. ఎనిమిది లేదా తొమ్మిదో రోజూ ఎవరి శరీరంలోనూ వైరస్ జీవించి ఉండదు. మరొకరికి సంక్రమించే అవకాశం లేదని ఆ పత్రిక వెల్లడించింది.
► సింగపూర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షసియల్ వేయబుల్ నిర్వహించిన అధ్యయనంలో 11 రోజుల తర్వాత వైరస్ బలహీనపడుతుందని తేలింది.
► మన దేశంలో నిబంధనల ప్రకారం వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే కోవిడ్ రోగుల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. అది ముగిశాక ఇంట్లో వారితో కలిసిమెలిసి ఉండొచ్చు కానీ మరో ఏడు రోజులు ఇంటికే పరిమితం కావాలి. మొత్తంగా 17 రోజుల తర్వాత వారు బయటకి రావచ్చు.
► కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యాలో కరోనా రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత పరీక్షలో నెగిటివ్ వచ్చాక ఇల్లు దాటి బయటకి అడుగుపెట్టొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment