University of Leicester
-
సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!
జాతస్య హి ధ్రువో మృత్యు... పుట్టిన వాడు గిట్టక తప్పదు! అందరికీ తెలిసిన సత్యం ఇది.కానీ బతికినన్ని రోజులూరోగాలు దరిచేరకుండా ఉంటే?కనీసం వాటితో వచ్చే నొప్పి, సమస్యలు తక్కువగా ఉంటే? ఎంతో బాగుంటుంది కదూ! అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ అద్భుతం సాకారం కానుంది. సెనోలిటిక్స్... ఈ పదం ఎప్పుడైనా విన్నారా? వయసు మీదపడ్డాక వచ్చే సమస్యలను తగ్గించే మందులను సెనోలిటిక్స్ అని పిలుస్తున్నారు. వయసును జయించేందుకు.. చిరాయువుగా ఉండేందుకు శతాబ్దాలుగా మనిషి ప్రయత్ని స్తున్నప్పటికీ ఈ విషయంలో సాధించింది కొంతే. కానీ 1961లో సెనెసెంట్ కణాలను గుర్తించాక ఈ పరిస్థితిలో మార్పొచ్చింది. ఏమిటీ సెనెసెంట్ కణాలు? సాధారణ పరిభాషలో చెప్పాలంటే సెనెసెంట్ కణాలను వయసైపోయిన కణాలు అనొచ్చు. ఏర్పడ్డ క్షణం నుంచి గిట్టేంత వరకూ శరీర కణాలు నిత్యం విభజితమవుతుంటాయి. అయితే ఒక దశ దాటాక కణాల శక్తి నశించి విడిపోకుండా ఉండిపోతాయి. కాలక్రమంలో ఈ కణాలు శరీరంలో ఎక్కువ అవుతుంటాయి. ప్రతి అవయవం, వ్యవస్థకు చెందిన సెనెసెంట్ కణాలు పోగుబడటం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. సెనెసెన్స్ దశకు చేరుకున్న కణం తనంతట తాను నశించిపోయే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. అప్టోసిస్ అని పిలిచే ఈ ప్రక్రియ సక్రమంగా పనిచేయకపోతే సమస్యలు వస్తాయి. ఈ రెండు సమస్యలను పరిష్కరించ గలిగితే.. అంటే సెనెసెంట్ కణాలు బయటకు వెళ్లిపోయేలా చేసినా.. అప్టోసిస్ సక్రమంగా పనిచేసేలా చేసినా.. వృద్ధాప్య సమస్యలను అధిగమించినట్లే! కేన్సర్‌ను అడ్డుకునేందుకూ... ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సెనొలిటిక్ మందులు శరీరంలోని సెనెసెంట్ కణాలను సులువుగా తొలగిస్తాయి. అయితే వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నందున వాటి విస్తృత వాడకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి సెనెసెంట్ కణాలతో ఎప్పుడూ నష్టమే జరగదు. విభజన చేతకానంత దెబ్బతిని ఉంటే కణం పెరగడం ఆగిపోతుంది. కొన్నిసార్లు కేన్సర్ కారక జన్యుమార్పులను కట్టడి చేసేందుకూ కణాలు సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అడ్డూఅదుపు లేకుండా కణాలు విభజితం కావడమే కేన్సర్ అన్నది తెలిసిందే. గాయాల వల్ల దెబ్బతిన్న కణాలు కూడా సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అయితే ఈ క్రమంలో కణాలు తమ చుట్టూ ఉన్న ఇతర కణాలకు నష్టం కలిగించే ప్రొటీన్లు, పదార్థాలను విడుదల చేస్తుంటాయి. ఫలితంగా మంట/వాపు వంటివి ఏర్పడి చివరకు చుట్టూ ఉన్న కణాలు మరణిస్తాయి. కణాలు అప్టోసిస్ను నిరోధించినా, నష్టం కొనసాగినా ఆర్థరైటిస్, మధుమేహం, గుండె జబ్బుల్లాంటివి వస్తాయని అంచనా. తొలగిస్తే ప్రయోజనాలు... 2004లో మేయో క్లినిక్‌కు చెందిన జేమ్స్ కిర్క్ల్యాండ్ సెనెసెంట్ కణాలపై కొన్ని పరిశోధనలు చేపట్టారు. ఆయుష్షును పెంచేందుకు జరిగిన ప్రయోగాల్లో ఎలుకల్లోని సెనెసెంట్ కణాలు మాయమవడాన్ని గుర్తించారు. ఇదే పనిని మందుల సాయంతో ఎలా చేయాలో తెలుసుకునేందుకు జరిపిన ప్రయోగాల కారణంగా డసాటినిబ్, క్యుర్సెటిన్ అనే రెండు మందుల గురించి తెలిసింది. డసాటనిబ్ కేన్సర్ మందు. క్యుర్సెటిన్ అనేది కొన్ని పండ్లు, కాయగూరల్లో సహజసిద్ధంగా లభిస్తుంది. ఈ రెండూ తొలి సెనోలిటిక్ మందులయ్యాయి! ఇవి సెనెసెంట్ కణాలు జీవించి ఉండేందుకు కారణమైన వాటిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయని, ఫలితంగా ఈ కణాలు నశించిపోతాయని తెలిసింది. అయితే కొన్ని కణాలు ఈ రెండింటికీ లొంగని నేపథ్యంలో మరిన్ని సెనోలిటిక్ మందుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 2015లో నావిటోక్లాక్స్ అనే మందు రేడియోధార్మికత బారినపడ్డ ఎలుకల్లోనూ సెనెసెంట్ కణాలను నశింపజేస్తున్నట్లు స్పష్టమైంది. దాంతోపాటు సెనెసెంట్ దశకు చేరుకున్న మూలకణాలు మళ్లీ చైతన్యవంతమైనట్లు ఈ ప్రయోగాల తరువాత తెలిసింది. ప్రస్తుతం అల్జీమర్స్, కీళ్లనొప్పులు, మాస్కులర్ డీజనరేషన్, చిన్నతనంలోనే కేన్సర్‌ను ఎదుర్కొని శరీరంలో భారీ మొత్తంలో సెనెసెంట్ కణాలు కలిగి ఉన్న వారిపైనా నావిటోక్లాక్స్ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు అంధత్వ నివారణతోపాటు వెన్నెముక గాయాలకు చికిత్సగా ఉపయోగపడే సెనోలిటిక్ మందులపైనా ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లీచెస్టర్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సెనెసెంట్ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేసే యాంటీబాడీలను తయారు చేసేందుకు ఈ నెలలోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆడుతూ పాడుతూ వయసును దాటేయవచ్చు. ఆ తరువాత ఏమిటన్నది మాత్రం తెలియకపోవడం కొసమెరుపు! -
క్వారంటైన్ ఎన్నాళ్లు..?
వాషింగ్టన్: కరోనా వైరస్ గురించి మాట్లాడకుండా ఎవరికీ ఒక గంట కూడా గడవడం లేదు. ఒకప్పుడు కరోనా సోకిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నా సరిపోయేది కాదు. వారికి పరీక్ష చేసినా పాజిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. అంతగా లక్షణాలు కనిపించడం లేదు. మూడు రోజులకే నెగెటివ్ వస్తోంది. వైరస్ బలహీన పడుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అలాంటప్పుడు ఎన్నాళ్లు క్వారంటైన్లో ఉండాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా ఇంటికే పరిమితం కావడం చాలా మందికి దుర్భరంగా మారింది. మరోవైపు లక్షణాలున్న వారు తాము బయటకి వస్తే, మిగిలిన వారికి ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్(సీడీసీ) తాను గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించింది. (వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..) లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చినవారు వారికి పరీక్ష నిర్వహించిన దగ్గర్నుంచి 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. అంతకు ముందు వరకు రెండు సార్లు నెగెటివ్ వచ్చాక కోవిడ్ రోగులకి స్వేచ్ఛ లభించేది. అయితే ప్రపంచ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో ఎవరి శరీరంలోనూ తొమ్మిది నుంచి 11 రోజులకు మించి వైరస్ జీవించి ఉండదని తేలింది. దీంతో సీడీసీ తన నిబంధనల్ని మార్చి 10 రోజులు ఇంటిపట్టున ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఎవరు ఏం చెప్పారంటే... ► డబ్ల్యూహెచ్ఓ జూన్‌లో సిఫారసు చేసిన మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు, స్వల్ప లక్షణాలుంటే 13 రోజులు, తీవ్రత ఎక్కువగా ఉండి ఆస్పత్రి పాలైతే డిశ్చార్జ్ అయిన దగ్గర్నుంచి రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండాలి. ► యూకేలో లిసెస్టర్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ జూలియాన్ తాంగ్ కరోనా రోగులు 10 రోజుల ఐసలేషన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. పది రోజుల తర్వాత వారి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ అది బలహీనపడిపోయి వ్యాప్తి చెందదని తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో తేలిందన్నారు. ► నేచర్ పత్రిక చేసిన అధ్యయనంలో కరోనా శరీరంలోకి ప్రవేశించాక ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు అయిదో రోజు నుంచి వైరస్‌ను నిర్వీర్యం చేయడం మొదలు పెడతాయని తేలింది. ఎనిమిది లేదా తొమ్మిదో రోజూ ఎవరి శరీరంలోనూ వైరస్ జీవించి ఉండదు. మరొకరికి సంక్రమించే అవకాశం లేదని ఆ పత్రిక వెల్లడించింది. ► సింగపూర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షసియల్ వేయబుల్ నిర్వహించిన అధ్యయనంలో 11 రోజుల తర్వాత వైరస్ బలహీనపడుతుందని తేలింది. ► మన దేశంలో నిబంధనల ప్రకారం వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే కోవిడ్ రోగుల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. అది ముగిశాక ఇంట్లో వారితో కలిసిమెలిసి ఉండొచ్చు కానీ మరో ఏడు రోజులు ఇంటికే పరిమితం కావాలి. మొత్తంగా 17 రోజుల తర్వాత వారు బయటకి రావచ్చు. ► కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యాలో కరోనా రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత పరీక్షలో నెగిటివ్ వచ్చాక ఇల్లు దాటి బయటకి అడుగుపెట్టొచ్చు. -
హృద్రోగాలను తెలుసుకునేందుకు కొత్త పరికరం
లండన్: జన్యు సంబంధ హృద్రోగ వ్యాధులపై అంచనా వేసేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తతో కూడిన పరిశోధకుల బృందం ఓ పరికరాన్ని కనిపెట్టింది. దీంతో ముందుగానే గుర్తించి, రాకుండా చూడొచ్చని లేదా సకాలంలో సరైన చికిత్స అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. గుండె సంబంధ వ్యాధులు రావడంలో పలు జన్యు కారకాలు దోహదపడుతాయని చాలా కాలంగా తెలిసిన విషయమే. డీఎన్ఏలో అతి తక్కువ తేడా ఉండటాన్ని సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజం (ఎస్ఎన్పీ) అంటారు. ఇది వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. ఇలాంటి దాదాపు 49 వేల ఎస్ఎన్పీలను పరిశోధకులు గుర్తించి ఓ స్కోర్‌ను రూపొందించారు. దీన్ని జీనోమిక్ రిస్క్ స్కోర్ (జీఆర్ఎస్) అంటారు. ఈ జీఆర్ఎస్ స్కోర్ ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ శాతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు గుర్తించారు. -
ఆస్తమాకు సరికొత్త ఔషధం
లండన్: ఆస్తమా బాధితులకు ఒక తీపి కబురు.. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా ఉబ్బసం తీవ్రతను గణనీయంగా తగ్గించే సరికొత్త ట్యాబ్లెట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఈ ట్యాబ్లెట్ ఉబ్బసం లక్షణాలను తగ్గించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుందని, ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించి, వాయు నాళాలను శుభ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉబ్బసం చికిత్సలో ఈ ఔషధం కొత్త ఒరవడిని సృష్టించనుందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ కు చెందిన పరిశోధకుడు క్రిస్టోఫర్ బ్రైట్లింగ్ అన్నారు. ప్రస్తుతం ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉంది.