జాతస్య హి ధ్రువో మృత్యు...
పుట్టిన వాడు గిట్టక తప్పదు! అందరికీ తెలిసిన సత్యం ఇది.కానీ బతికినన్ని రోజులూరోగాలు దరిచేరకుండా ఉంటే?కనీసం వాటితో వచ్చే నొప్పి, సమస్యలు తక్కువగా ఉంటే? ఎంతో బాగుంటుంది కదూ! అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ అద్భుతం సాకారం కానుంది.
సెనోలిటిక్స్...
ఈ పదం ఎప్పుడైనా విన్నారా? వయసు మీదపడ్డాక వచ్చే సమస్యలను తగ్గించే మందులను సెనోలిటిక్స్ అని పిలుస్తున్నారు. వయసును జయించేందుకు.. చిరాయువుగా ఉండేందుకు శతాబ్దాలుగా మనిషి ప్రయత్ని స్తున్నప్పటికీ ఈ విషయంలో సాధించింది కొంతే. కానీ 1961లో సెనెసెంట్ కణాలను గుర్తించాక ఈ పరిస్థితిలో మార్పొచ్చింది.
ఏమిటీ సెనెసెంట్ కణాలు?
సాధారణ పరిభాషలో చెప్పాలంటే సెనెసెంట్ కణాలను వయసైపోయిన కణాలు అనొచ్చు. ఏర్పడ్డ క్షణం నుంచి గిట్టేంత వరకూ శరీర కణాలు నిత్యం విభజితమవుతుంటాయి. అయితే ఒక దశ దాటాక కణాల శక్తి నశించి విడిపోకుండా ఉండిపోతాయి. కాలక్రమంలో ఈ కణాలు శరీరంలో ఎక్కువ అవుతుంటాయి. ప్రతి అవయవం, వ్యవస్థకు చెందిన సెనెసెంట్ కణాలు పోగుబడటం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాదు.. సెనెసెన్స్ దశకు చేరుకున్న కణం తనంతట తాను నశించిపోయే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. అప్టోసిస్ అని పిలిచే ఈ ప్రక్రియ సక్రమంగా పనిచేయకపోతే సమస్యలు వస్తాయి. ఈ రెండు సమస్యలను పరిష్కరించ గలిగితే.. అంటే సెనెసెంట్ కణాలు బయటకు వెళ్లిపోయేలా చేసినా.. అప్టోసిస్ సక్రమంగా పనిచేసేలా చేసినా.. వృద్ధాప్య సమస్యలను అధిగమించినట్లే!
కేన్సర్‌ను అడ్డుకునేందుకూ...
ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సెనొలిటిక్ మందులు శరీరంలోని సెనెసెంట్ కణాలను సులువుగా తొలగిస్తాయి. అయితే వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నందున వాటి విస్తృత వాడకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి సెనెసెంట్ కణాలతో ఎప్పుడూ నష్టమే జరగదు. విభజన చేతకానంత దెబ్బతిని ఉంటే కణం పెరగడం ఆగిపోతుంది. కొన్నిసార్లు కేన్సర్ కారక జన్యుమార్పులను కట్టడి చేసేందుకూ కణాలు సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అడ్డూఅదుపు లేకుండా కణాలు విభజితం కావడమే కేన్సర్ అన్నది తెలిసిందే.
గాయాల వల్ల దెబ్బతిన్న కణాలు కూడా సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అయితే ఈ క్రమంలో కణాలు తమ చుట్టూ ఉన్న ఇతర కణాలకు నష్టం కలిగించే ప్రొటీన్లు, పదార్థాలను విడుదల చేస్తుంటాయి. ఫలితంగా మంట/వాపు వంటివి ఏర్పడి చివరకు చుట్టూ ఉన్న కణాలు మరణిస్తాయి. కణాలు అప్టోసిస్‌ను నిరోధించినా, నష్టం కొనసాగినా ఆర్థరైటిస్, మధుమేహం, గుండె జబ్బుల్లాంటివి వస్తాయని అంచనా.
తొలగిస్తే ప్రయోజనాలు...
2004లో మేయో క్లినిక్‌కు చెందిన జేమ్స్ కిర్క్‌ల్యాండ్ సెనెసెంట్ కణాలపై కొన్ని పరిశోధనలు చేపట్టారు. ఆయుష్షును పెంచేందుకు జరిగిన ప్రయోగాల్లో ఎలుకల్లోని సెనెసెంట్ కణాలు మాయమవడాన్ని గుర్తించారు. ఇదే పనిని మందుల సాయంతో ఎలా చేయాలో తెలుసుకునేందుకు జరిపిన ప్రయోగాల కారణంగా డసాటినిబ్, క్యుర్‌సెటిన్ అనే రెండు మందుల గురించి తెలిసింది. డసాటనిబ్ కేన్సర్ మందు. క్యుర్‌సెటిన్ అనేది కొన్ని పండ్లు, కాయగూరల్లో సహజసిద్ధంగా లభిస్తుంది. ఈ రెండూ తొలి సెనోలిటిక్ మందులయ్యాయి! ఇవి సెనెసెంట్ కణాలు జీవించి ఉండేందుకు కారణమైన వాటిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయని, ఫలితంగా ఈ కణాలు నశించిపోతాయని తెలిసింది.
అయితే కొన్ని కణాలు ఈ రెండింటికీ లొంగని నేపథ్యంలో మరిన్ని సెనోలిటిక్ మందుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 2015లో నావిటోక్లాక్స్ అనే మందు రేడియోధార్మికత బారినపడ్డ ఎలుకల్లోనూ సెనెసెంట్ కణాలను నశింపజేస్తున్నట్లు స్పష్టమైంది. దాంతోపాటు సెనెసెంట్ దశకు చేరుకున్న మూలకణాలు మళ్లీ చైతన్యవంతమైనట్లు ఈ ప్రయోగాల తరువాత తెలిసింది. ప్రస్తుతం అల్జీమర్స్, కీళ్లనొప్పులు, మాస్కులర్ డీజనరేషన్, చిన్నతనంలోనే కేన్సర్‌ను ఎదుర్కొని శరీరంలో భారీ మొత్తంలో సెనెసెంట్ కణాలు కలిగి ఉన్న వారిపైనా నావిటోక్లాక్స్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంతేకాదు అంధత్వ నివారణతోపాటు వెన్నెముక గాయాలకు చికిత్సగా ఉపయోగపడే సెనోలిటిక్ మందులపైనా ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లీచెస్టర్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సెనెసెంట్ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేసే యాంటీబాడీలను తయారు చేసేందుకు ఈ నెలలోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆడుతూ పాడుతూ వయసును దాటేయవచ్చు. ఆ తరువాత ఏమిటన్నది మాత్రం తెలియకపోవడం కొసమెరుపు!
Comments
Please login to add a commentAdd a comment