సిరియాలో కనుగొన్న శాస్త్రవేత్తలు
సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది. దాదాపు 4,400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాల పరిశోధకుల బృందం ప్రకటించింది. క్రీస్తుపూర్వం 2,400 సంవత్సరంలో పశ్చిమ సిరియాలోని ప్రాచీన పట్టణ ప్రాంతం టెల్ ఉమ్–ఎల్ మర్రా వద్ద జరిపిన తవ్వకాల్లో చేతి వేళ్ల ఆకృతిలో ఉన్న చిన్న మట్టి వస్తువులపై ఈ వర్ణమాలను గుర్తించారు.
ఒక సమాధిని తవ్వితీయగా ఇవి లభించాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ నిర్ధారించిన దాని కంటే ఈ లిపి మరో 500 ఏళ్ల క్రితంనాటిదని అంచనావేస్తున్నారు. ఆమ్‌స్టర్ డ్యామ్ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా జాన్ హాప్కిన్స్ వర్సిటీలో పురాతత్వవేత్త, ప్రొఫెసర్ గ్లెన్ స్వార్జ్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో 16 ఏళ్ల క్రితమే తొలిసారిగా తవ్వకాలు జరిగాయి.
తొలి కంచు యుగంనాటి ఈ సమాధిలో ఆరు అస్తిపంజరాలు, బంగారు, వెండి ఆభరణాలు, వంట పాత్రలు, ఒక బాణం, మృణ్యయ పాత్రలను కనుగొన్నారు. తొలి తరం నాగరికతలు తమలో తాము సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కొత్త తరహాలో అనుసంధాన విధానాలను అనుసరించేవని ఈ మట్టి వస్తువులపై ఉన్న రాతలను బట్టి అర్థమవుతోందని పరిశోధకులు చెప్పారు.
‘‘ నాటి సమాజాల్లో రాజరికం, అత్యున్నత స్థాయి వర్గాలే కాదు సామాన్యులూ వర్ణమాల ద్వారా రాయగలిగే సామర్థ్యాలను సంతరించుకునే ప్రయత్నాలు చేశారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు’’ అని స్వార్జ్ అన్నారు. ‘‘ వీటిపై ఉన్న లిపి లాంటి అక్షరాలను చూస్తుంటే వేర్వేరు పాత్రల్లో ఏమేం నిల్వచేశారో తెలిసేందుకు ఒక్కో పాత్రపై ‘లేబుల్’లాగా ఈ లిపిని వాడి ఉంటారని అర్థమవుతోంది. ఈ అక్షరాలను మనం తర్జుమా చేయకుండా అసలు ఇవేంటో ఒక నిర్ధారణకు రావడం చాలా కష్టం.
కార్భన్–14 డేటింగ్ ద్వారా తెలిసిందేమంటే ఈ రాతలు చరిత్రలో ఇప్పటిదాకా కనుగొన్న వర్ణమాల కంటే పురాతనమైనవని తేలింది. క్రీస్తుపూర్వం 1900 సమీపకాలంలో ఈజిప్ట్, పరిసర ప్రాంతాల్లో తొలిసారిగా వర్ణమాల రూపొందినట్టు ఇన్నాళ్లూ భావించాం. కానీ సిరియాలో వెలుగుచూసిన అక్షరాలను చూస్తుంటే ఎన్నడూ ఊహించని ప్రదేశాల్లోనూ వర్ణమాలకు మూలాలున్నాయని అర్థమవుతోంది’’ అని స్వార్జ్ వ్యాఖ్యానించారు. నవంబర్ 21న జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఓవర్‌సీస్ రీసెర్చ్ వార్షిక సమావేశంలో స్వార్జ్ తన పరిశోధన వివరాలను బహిర్గతంచేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment