Alphabet
-
ప్రపంచంలో తొలి వర్ణమాల ఇదే!
సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది. దాదాపు 4,400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాల పరిశోధకుల బృందం ప్రకటించింది. క్రీస్తుపూర్వం 2,400 సంవత్సరంలో పశ్చిమ సిరియాలోని ప్రాచీన పట్టణ ప్రాంతం టెల్ ఉమ్–ఎల్ మర్రా వద్ద జరిపిన తవ్వకాల్లో చేతి వేళ్ల ఆకృతిలో ఉన్న చిన్న మట్టి వస్తువులపై ఈ వర్ణమాలను గుర్తించారు. ఒక సమాధిని తవ్వితీయగా ఇవి లభించాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ నిర్ధారించిన దాని కంటే ఈ లిపి మరో 500 ఏళ్ల క్రితంనాటిదని అంచనావేస్తున్నారు. ఆమ్స్టర్ డ్యామ్ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా జాన్ హాప్కిన్స్ వర్సిటీలో పురాతత్వవేత్త, ప్రొఫెసర్ గ్లెన్ స్వార్జ్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో 16 ఏళ్ల క్రితమే తొలిసారిగా తవ్వకాలు జరిగాయి. తొలి కంచు యుగంనాటి ఈ సమాధిలో ఆరు అస్తిపంజరాలు, బంగారు, వెండి ఆభరణాలు, వంట పాత్రలు, ఒక బాణం, మృణ్యయ పాత్రలను కనుగొన్నారు. తొలి తరం నాగరికతలు తమలో తాము సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కొత్త తరహాలో అనుసంధాన విధానాలను అనుసరించేవని ఈ మట్టి వస్తువులపై ఉన్న రాతలను బట్టి అర్థమవుతోందని పరిశోధకులు చెప్పారు. ‘‘ నాటి సమాజాల్లో రాజరికం, అత్యున్నత స్థాయి వర్గాలే కాదు సామాన్యులూ వర్ణమాల ద్వారా రాయగలిగే సామర్థ్యాలను సంతరించుకునే ప్రయత్నాలు చేశారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు’’ అని స్వార్జ్ అన్నారు. ‘‘ వీటిపై ఉన్న లిపి లాంటి అక్షరాలను చూస్తుంటే వేర్వేరు పాత్రల్లో ఏమేం నిల్వచేశారో తెలిసేందుకు ఒక్కో పాత్రపై ‘లేబుల్’లాగా ఈ లిపిని వాడి ఉంటారని అర్థమవుతోంది. ఈ అక్షరాలను మనం తర్జుమా చేయకుండా అసలు ఇవేంటో ఒక నిర్ధారణకు రావడం చాలా కష్టం. కార్భన్–14 డేటింగ్ ద్వారా తెలిసిందేమంటే ఈ రాతలు చరిత్రలో ఇప్పటిదాకా కనుగొన్న వర్ణమాల కంటే పురాతనమైనవని తేలింది. క్రీస్తుపూర్వం 1900 సమీపకాలంలో ఈజిప్ట్, పరిసర ప్రాంతాల్లో తొలిసారిగా వర్ణమాల రూపొందినట్టు ఇన్నాళ్లూ భావించాం. కానీ సిరియాలో వెలుగుచూసిన అక్షరాలను చూస్తుంటే ఎన్నడూ ఊహించని ప్రదేశాల్లోనూ వర్ణమాలకు మూలాలున్నాయని అర్థమవుతోంది’’ అని స్వార్జ్ వ్యాఖ్యానించారు. నవంబర్ 21న జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఓవర్సీస్ రీసెర్చ్ వార్షిక సమావేశంలో స్వార్జ్ తన పరిశోధన వివరాలను బహిర్గతంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉద్యోగులకు షాక్: గూగుల్‌లో మళ్లీ తొలగింపుల పర్వం
Google layoffs: దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్‌లో సిబ్బంది కోతలను అమలు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దాదాపు వందలమందిని ఉద్యోగులను తొలగించనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, క్లిష్టమైన స్థానాలను భర్తీ చేయడంపై దృష్టి పెట్టడానికి ఆల్ఫాబెట్ జట్టులోని మెజారిటీని నిలుపుకోవాలని భావిస్తోంది. (వాట్సాప్ కొత్త ఫీచర్ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను) జనవరిలో, ఆల్ఫాబెట్, సుమారు 12,000 ఉద్యోగాలను తొలగించింది. తద్వారా మొత్తం సిబ్బందిలో 6శాతం తగ్గించుకుంది.తాజాగా నియామకాల్లో కొనసాగుతున్న మంద గమనంలో భాగంగా మరికొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. విస్తృత స్థాయి తొలగింపులు కానప్పటికీ కొన్ని కీలక ఉద్యోగాల ఎంపిక కోసం కొన్ని వందల మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్న బిగ్ టెక్ సంస్థగా ఆల్ఫాబెట్ నిలిచింది. మెటా, మైక్రోసాఫ్ట్ , అమెజాన్‌తో సహా ఇతర టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. (రూ.2000 నోటు: అమెజాన్ షాకింగ్ అప్డేట్, తెలుసుకోండి!) ఉపాధి సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ నివేదికలు జూలైతో పోలిస్తే ఆగస్టులో యునైటెడ్ స్టేట్స్లో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని సూచిస్తున్నాయి. రాయిటర్స్ ఆర్థికవేత్తల సర్వేలో సెప్టెంబరు 9తో ముగిసే వారానికి రాష్ట్ర నిరుద్యోగ ప్రయోజనాల కొత్త క్లెయిమ్స్ సుమారుగా 8 శాతం పెరుగుదలను అంచనా వేశారు. -
గూగుల్ కీలక నిర్ణయం: మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన!
సెర్చ్ జెయింట్ గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మ్యాపింగ్ సర్వీస్ వేజ్లో ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తోంది. ఆదాయం క్షీణిస్తున్న నేపథ్యంలో సామర్థ్యం తగ్గించుకునేందుకు యోచిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అలాగే వేజ్ను అడ్వర్టైజింగ్ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ యాడ్స్ టెక్నాలజీ కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. అయితే తాజా నిర్ణయంలో ఎంత మందిని తొలగిస్తుందనేది స్పష్టత లేదు. పూర్తి స్పష్టత రావాలంటే గూగుల్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. రాయిటల్స్ నివేదిక ప్రకారం ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, అనలిటిక్స్ విభాగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వేజ్ను గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO)కి మార్చడంతోపాటు గూగుల్ మ్యాప్స్‌తో కలపాలని కంపెనీ యోచిస్తోంది. ప్రకటనదారులకు మరింత మెరుగైన దీర్ఘకాలిక అనుభవాన్ని అందించాలనే లక్ష్యంలో భాగంగా వేజ్ ప్రస్తుత అడ్వర్టైజింగ్ సిస్టంను గూగుల్ యాడ్స్ టెక్నాలజీకి మార్చనుంది. ఫలితంగా వేజ్ ప్రకటనల మానిటైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల్లో తొలగింపులుంటాయని గూగుల్ జియో యూనిట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ ఫిలిప్స్ ఉద్యోగులకు తెలిపారు. కాగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ లాంటి సేవలందింస్తే గూగుల్ జియో డివిజన్లో వేజ్ను విలీనం చేయబోతున్నట్టు గత ఏడాది చివర్లోనే గూగుల్ ప్రకటించింది. అలాగే ఆదాయానికి కీలకమైన డిజిటల్ అడ్వర్టైజింగ్కు గత సంవత్సరం డిమాండ్ మందగించిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగాలను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగానే జనవరిలో గ్లోబల్‌గా ఉద్యోగులను 6శాతానికి మించి దాదాపు 12వేల ఉద్యోగులను తీసివేసింది. కాగా ఏప్రిల్‌లో కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాల్లో యూట్యూబ్ ద్వారా ఊహించిన దానికంటే బలమైన ప్రకటనల అమ్మకాలపై అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదించింది. -
సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గ్లోబల్ టాప్ సీఈవోలలో ఒకరిగా చాలా మందికి ఆయన రోల్ మోడల్. తమిళనాడుకు చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్ చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న పూర్వీకుల భవనాన్ని ఇటీవల విక్రయించిన సుందర్ పిచాయ్ నివాసముంటున్న ఇల్లు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఐటీ నిపుణుల్లో,బిలియన్ల మందికి రోల్ మోడల్ సుందర్ పిచాయ్ ఉంటున్న ఇల్లు ఖరీదు రూ. 10వేల కోట్లు అంటే నమ్ముతారా. సుందర్ పిచాయ్ అద్భుతమైన భవనం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లాస్ ఆల్టోస్‌లోని కొండపై 31.17 ఎకరాల్లో ఉంది. సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారట.. కొన్నేళ్ల క్రితం ఈ భవనాన్ని సుందర్ పిచాయ్ 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) విశాలమైన బెడ్ రూమ్స్ ఇన్ఫినిటీ పూల్, జిమ్నాసియం, స్పా, వైన్ సెల్లార్ సోలార్ ప్యానెల్స్ , లిఫ్టులు , నానీ క్వార్టర్ లాంటి హంగులతో ఉన్న అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ హోమ్ విలువ ఇపుడు రూ. 10,000 కోట్లకు పైమాటే. 2022లో రూ.1852 కోట్లు జీతం అందుకున్న సుందర్ పిచాయ్ నికర విలువ 1,310 మిలియన్ల డాలర్లుగా ఉంది. సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా, 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈవోగా ఎంపికయ్యారు. జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో జన్మించారు.1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ఇం జనీరింగ్ పట్టాపొందారు. (అలియా హాలీవుడ్ ఎంట్రీ:ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలుసా?) స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో మెటీరియల్ సైన్స్ లో ఎంఎస్చేశారు. ఈ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్‌గా చేరారు. కాలేజీ ఫ్రెండ్‌ను అంజలి పిచాయ్ని వివాహం చేసుకున్న పిచాయ్‌కు కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. 2022నలో ఇండియా మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. -
లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలోనే ఆయన ఏకంగా 226 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,854 కోట్లు) పారితోషికం తీసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు) ఆల్ఫాబెట్ శుక్రవారం రెగ్యులేటరీకి వెల్లడించిన ప్రకారం సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నట్టు తెలిపింది. దీని ప్రకారం గతేడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే దాదాపు 800 రెట్లు పెరిగింది. కాగా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా పరిస్థితుల నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది. ఇది కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతానికి సమానం. అలాగే ఈ నెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. -
కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్ సీఈఓ సుందర్
వాషింగ్టన్: కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. -
సుందర్‌పిచాయ్‌పై మీమ్స్ జోరు, బార్డ్ విడుదలపై వెనక్కి తగ్గిన గూగుల్!
గూగుల్ బార్డ్ టూల్ విడుదలలో మరింత ఆలస్యం కానుంది. యూజర్లు వినియోగించేలా సన్నంద్ధం చేయలేదని, కాబట్టే ఇంకా విడుదలకు నోచుకోలేదని ఆల్ఫా బెట్ చైర్మన్ జాన్ హెన్నెస్సీ అన్నారు. మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీకి పోటీగా ఏఐ ఆధారిత ‘బార్డ్’ చాట్‌బాట్ టూల్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ముందుగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే గూగుల్ బార్డ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ విడుదల కోసం రూపొందించిన ప్రమోషనల్ వీడియోలో తప్పిందం జరిగింది. ఆ తప్పిదం కారణంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్లు ఆవిరైంది. దీంతో కంపెనీలోని ఉద్యోగులు సీఈవో సుందర్ పిచాయ్ తీరును తప్పుబడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆల్ఫాబెట్ ఛైర్మన్ బాట్ విడుదలపై స్పందించారు. పెట్టుబడుల సంస్థ సెలెస్టా కేపిటల్ కాల్ఫిపోర్నియా వేదికగా సమ్మిట్‌ను నిర్వహించింది. ఆ సమ్మిట్‌లో జాన్ హెన్నెస్సీ బార్డ్‌పై స్పందించారు. బార్డ్ అద్భుతమైన టెక్నాలజీ. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఒకటి నుండి రెండు సంవత్సరాల సమయం పడుతుందని అన్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుగా సమాధానం ఇవ్వడంపై ఆల్ఫాబెట్ షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఈ సమ్మిట్‌లో మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ కంటే ముందుగా బార్డ్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో గూగుల్ తొందర పడిందనే విషయాన్ని హెన్నెస్సీ అంగీకరించారు. బార్డ్ ఇప్పటికీ తప్పుడు సమాధానాలను ఇస్తున్నందున బార్డ్ విడుదలలో గూగుల్ నిధానంగా వ్యవహరిస్తుందని హెన్నెస్సీ పేర్కొన్నారు. -
అయ్యయ్యో గూగుల్ బార్డ్ ఎంత పనిచేసింది: 100 బిలియన్ డాలర్లు మటాష్!
సాక్షి,ముంబై: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు చిన్న పొరపాటుకు బిలియన్ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’కి పోటీగా ‘బార్డ్’ను రంగంలోకి దింపిన గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రకటించిన చాట్‌బాట్ బార్డ్‌కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో భారీ తప్పిదం కారణంగా గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ షేర్ ధర బుధవారం భారీ ఒడిదుడుకులకు లోనైంది. అమెరికా ఎక్స్ఛేంజీలలో ఆల్ఫాబెట్ షేర్లు 8 శాతం కుప్పకూలింది. ఫలితంగా గూగుల్ ఒక్క రోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మేర మార్కెట్ విలువను కోల్పోయింది. రాయిటర్స్ తొలుత ‘బార్డ్’ యాడ్‌లోని తప్పిదాన్ని గుర్తించింది. సౌరవ్యవస్థ వెలుపలి గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏశాటిలైట్ తీసిందన్న ప్రశ్నకు బార్డ్ సరైన సమాధానం ఇవ్వడంలో తప్పులో కాలేసింది. "జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని సమాధానం చెప్పింది. కానీ నాసా ధృవీకరించినట్లుగా, 2004లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT) ద్వారా ఎక్సోప్లానెట్ల తొలి చిత్రాలను తీసింది. బార్డ్‌కు సంబంధించి గూగుల్ ట్విటర్లో పోస్ట్ చేసిన చిన్న GIF వీడియోను "లాంచ్‌ప్యాడ్"గా అభివర్ణించింది. ఈ షార్ట్ వీడియోలోనే ఈ పొరపాటు దొర్లింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీతో దూసుకు రావడంతో గూగుల్ బార్డ్ వైపు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, మార్కెట్ గూగుల్‌కు భారీ శిక్ష విదించిందని ట్రిపుల్ డి ట్రేడింగ్ మార్కెట్ నిర్మాణ విశ్లేషకుడు డెన్నిస్ డిక్ వ్యాఖ్యానించారు. గూగుల్ గత కొన్నివారాలుగా సెర్చ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హడావిడిగా ఇచ్చిన డెమో సమయంలో తప్పు సమాధానాన్ని పోస్ట్ చేయడం ఇబ్బందికరమైన గందరగోళానికి తీసిందని సీనియర్ సాఫ్ట్వేర్ విశ్లేషకుడు గిల్ లూరియా అన్నారు. -
మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం
సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిస్తోంది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలను తగ్గించనుంది ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ 10వేల మంది కార్మికులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్ దిగ్గజ సంస్థల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్యోగాల తొలంపులు ఐటీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 6 శాతం మేర తగ్గించుకోనుంది. ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఆల్ఫాబెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉంది. ఇష్టంతో కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పటికే ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాం అని పిచాయ్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలోఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం గతంలో ఎన్నడూ లేదని టెక్ వర్గాలు భాస్తున్నాయి. కాగా గత ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభం 27 శాతం క్షీణించి 13.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
గూగుల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!
న్యూఢిల్లీ: ట్విటర్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజాల తరువాత ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ కంపెనీల జాబితాలో తాజాగా గూగుల్ చేరింది. టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ పనితీరు సరిగాలేని 10 వేలమంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. త్వరలోనే ఈ తొలగింపు ప్రక్రియ షురూ కానుంది. గూగుల్ తన ఉద్యోగులలో 6 శాతం మందిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే దాదాపు 10 వేల మందిని పనితీరు సాకుతో ఇంటికి పంపించనుంది. గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా త్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించాలని భావిస్తోంది. ఉద్యోగులను విశ్లేషించి, ర్యాంక్ ఇవ్వాల్సిందిగా సంస్థ మేనేజర్లను కోరినట్లు సమాచార నివేదిక పేర్కొంది. ఆల్ఫాబెట్ కొత్త పనితీరు సిస్టం బోనస్‌లు ,స్టాక్ గ్రాంట్లను చెల్లించకుండా ఉండేందుకు ఈ రేటింగ్స్నుపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే దీనిపై ఆల్ఫాబెట్ ఇంకా స్పందించ లేదు. (ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) కాగా ఆల్ఫాబెట్ కింద దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఫైలింగ్ ప్రకారం, ఆల్ఫాబెట్ ఉద్యోగికి గత సంవత్సరం మధ్యస్థ పరిహారం సుమారు 295,884 డాలర్లుగా ఉంది. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) -
సత్తా చాటిన యాపిల్: మూడు దిగ్గజాలకు దిమ్మతిరిగింది అంతే!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ టాప్‌లోకి దూసుకొచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో దిగ్గజ కంపెనీలు మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ మూడింటినీ బీట్ చేసింది. నవంబరు 3 ముగింపు నాటికి యాపిల్ 2.307 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెజాన్, ఆల్ఫాబెట్ మెటాల మొత్తం మార్కెట్ క్యాప్ 2.306 ట్రిలియన్లకు మాత్రమే కావడం గమనార్హం. బిజినెస్ ఇన్సైడర్ అందించిన వివరాల ప్రకారం గత రెండు సెషన్లలో, యాపిల్ షేర్లు 0.16 శాతం పెరిగాయి. మరోవైపు టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్, మెటా , అమెజాన్ షేర్లు పడిపోయాయి. మెటా 7.6 శాతం పడిపోగా, అమెజాన్ 17 శాతం ఆల్ఫాబెట్ షేర్లు 5.7 శాతం క్షీణతనునమోదు చేశాయి.(Elon Musk షాక్‌ల మీద షాక్‌లు: కాస్ట్ కటింగ్‌పై భారీ టార్గెట్) ఫలితంగా అమెజాన్ మార్కెట్ క్యాప్ 939.78 బిలియన్ డాలర్లుగా ఉందని నివేదించింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 240.07 బిలియన్ డాలర్లు.అయితే, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్1.126 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.ఇదిలా ఉంటే చైనీస్ న్యూఇయర్‌కు ముందే ఇండియాలో అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభించాలని యాపిల్ యోచిస్తున్నట్టు సమాచారం. -
సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ భారీ షాక్!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరి సాధారణ సంస్థల్లో పరిస్థితిలు ఇలా ఉంటే..దిగ్గజ టెక్ కంపెనీలు అందుకు విభిన్నంగా వ్యవహరించాయి. ప్రపంచ దేశాలకు చెందిన టాప్-10 టెక్ కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలకు 2020-2021 మధ్య కాలంలో భారీగా బోనస్‌లు అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అనూహ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ షాకిచ్చింది. కోవిడ్ సమయంలో టెక్ కంపెనీలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయి. దీంతో టెక్ కంపెనీలు వారి సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న వారికి ఊహించని విధంగా బోనస్‌లు పెంచాయి. కానీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ సంస్థ 14శాతం బోనస్‌ను తగ్గించిందని ఫైన్‌బోల్డ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇదే అంశాన్ని జాతీయ మీడియా సంస్థ న్యూస్-18 ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. టాప్-5 సీఈఓల బోనస్‌లు భారీగా బోనస్‌లు పెరిగిన సీఈఓల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్‌కామ్ సీఈఓ తాన్ హాక్ ఎంగ్ ఉన్నారు. ఆయన అత్యధికంగా ఏకంగా 1586శాతం బోనస్ పొందాడు. ఇది 3.6 అమెరికన్ మిలియన్ డాలర్ల నుంచి 60.7మిలియన్ డాలర్లుగా ఉంది. తాన్ హాక్ ఎంగ్ తర్వాత ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ (Safra Ada Catz), ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్పీ ఉన్నారు. ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ అత్యధికంగా బోనస్‌లు పొందిన సీఈఓల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. 999శాతంతో భారీగా బోనస్ పొందారు. ప్యాండమిక్‌లో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున లాభాల్లో గడించాయి. దీంతో సంస్థలు సైతం అందుకు కారణమైన సీఈఓలకు కళ్లు చెదిరేలా బోనస్‌లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్ 713.64శాతంతో 22 మిలియన్ల నుంచి 179 మిలియన్ డారల్లను పొందారు. అదే సమయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం 571.63శాతం బోనస్‌తో 35.8 మిలియన్ల నుంచి 211.9మిలియన్లు, అమెజాన్ సీఈఓ అండీ జాస్సీ 491.9 శాతంతో 35.8 మిలియన్ల నుంచి 211.9 మిలియన్లను సొంతం చేసుకొని.. అత్యధికంగా బోనస్‌లు పొందిన టాప్-5 టెక్ కంపెనీల సీఈఓల జాబితాలో ఒకరిగా నిలిచారు. సుందర్ పిచాయ్‌కు భారీ షాక్! మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ 52.17 శాతం బోనస్‌ను, సిస్కో సీఈఓ చుక్ రాబిన్సన్ 9.48శాతం బోనస్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందగా..నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతంతో 43.2 మిలియన్ డాలర్ల నుంచి 34.7 మిలియన్ డాలర్లు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు 14శాతం బోనస్ కట్ చేసి భారీ షాక్ ఇచ్చింది. అయితే సుందర్ పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారు. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం (సంవత్సరం) రూ.14కోట్లు ఉండగా..అదనంగా 2020, 2021ఈ రెండేళ్ల కాలంలో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ సంస్థ రూ.1707కోట్లు అందించినట్లు ఫైన్‌బోల్డ్ నివేదిక తెలిపింది. చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్’.. ఇంతకూ ఆ పేరే ఎందుకు?
జెనీవా: కరోనా వైరస్‌లో కొత్త రకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లనే పెడుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ వరసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్న డబ్ల్యూహెచ్ఓ హఠాత్తుగా కొన్ని అక్షరాలను వదిలేసి ఒమిక్రాన్‌ని ఎంపిక చేసుకుంది. వాస్తవానికి లాంబ్డా తర్వాత ‘‘న్యూ’’ అక్షరం రావాలి. ఆ తర్వాత గ్రీకు వర్ణమాల ప్రకారం ‘‘గీఐ’ వస్తుంది. న్యూ అంటే ఆంగ్లంలో కొత్త అనే అర్థం ఉంది కాబట్టి గందరగోళానికి తావు లేకుండా దానిని విడిచిపెడితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేరులో ‘XI’ (షి జిన్‌పింగ్) ఉండడంతో దానిని కూడా డబ్ల్యూహెచ్ఓ విడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని వదిలేసి గ్రీకు వర్ణమాలలోని పదిహేనో అక్షరమైన ‘ఒమిక్రాన్’గా కొత్త వేరియెంట్‌కు నామకరణం చేసింది. (చదవండి: ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా..వందల కోట్లు కట్టాల్సిందే…!) -
మరో మైలురాయిని దాటిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్!
సుందర్ పిచాయ్ సీఈఓగా పనిచేస్తున్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఎట్టకేలకు 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని దాటింది. టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ నవంబర్ 8న $2 ట్రిలియన్ మార్క్ ను దాటింది. ప్రస్తుతం ప్రతి షేర్ ధర $2,987.03 వద్ద ముగిసింది. ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్($1 ట్రిలియన్) జనవరి 2020 నుంచి రెట్టింపు అయింది. గూగుల్ సెర్చ్ 37.9 బిలియన్ డాలర్లు, యూట్యూబ్ 7.2 బిలియన్ డాలర్లు సంపాదించాయి. $2 ట్రిలియన్ క్లబ్లో ఉన్న యాపిల్, మైక్రోసాఫ్ట్ సరసన ఇప్పుడు ఆల్ఫాబెట్ చేరింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో $61.9 బిలియన్ల ఆల్-టైమ్ రికార్డ్ ఆదాయాన్ని ఆర్జించింది. అదే స్థాయిలో రికార్డు లాభాలు $18.9 బిలియన్లుకు పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో యాపిల్ ఈ మార్కును తాకగా, మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది జూన్ నెలలో 2 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ గల కంపెనీగా అక్టోబర్ 29న అవతరించింది. అమెజాన్ కూడా 2 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు యాపిల్ కంటే ఎక్కువ విలువైనది. సత్య నాదెళ్ల నేతృత్వంలోని క్లౌడ్ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ కంపెనీలు ఇప్పుడు సమిష్టిగా దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల విలువైనవి. ఈ మొత్తం ఎస్ అండ్ పీ 500 మొత్తం $41.8 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో దాదాపు పావు వంతు అని సీఎన్ఎన్ నివేదించింది. (చదవండి: యాపిల్‌పై పిడుగు..! ఇప్పట్లో ఐఫోన్ 13లేనట్లే..!) -
ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్
సాక్షి, న్యూడిల్లీ: అల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్ (47) మరోసారి రికార్డుల కెక్కారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న టాప్ అధికారిగా నిలిచారు. సుందర్ పిచాయ్‌కు గత ఏడాది 281 మిలియన డాలర్ల ( రూ. 21,44,53,58,000) వేతనం లభించిందని, దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఎగ్జిక్యూటివ్లల ఒకరుగా నిలిచారని గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది అల్ఫా బెట్ ఉద్యోగుల సగటు వేతనానికి 1,085 రెట్లు అని కంపెనీ తెలిపింది. ప్యాకేజీలో ఎక్కువ భాగం స్టాక్ అవార్డులు, వీటిలో కొన్ని ఎస్ అండ్ పీ 100 సూచికలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ స్టాక్ రిటర్న్ ఆధారంగా చెల్లించనున్నామని తెలిపింది. 2015 సంవత్సరం నుంచి గూగుల్ కంపెనీకి సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ గత ఏడాది చివర్లో ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సంస్థ నుండి వైదొలగడంతో అల్ఫాబెట్‌కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరానికి వేతనం దాదాపుగా 2 మిలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గతంలో కూడా భారీ ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు. సుందర్ 2016 లో 200 మిలియన్ డాలర్లను స్టాక్ అవార్డు రూపంలో పొందారు. 2018లో మొత్తం వేతనం 1.9 మిలియన్ డాలర్లు. చెన్నై అతి సాధారణమైన కుటుంబం నుంచి వెళ్లి అత్యధిక జీతంతో పాటు గొప్ప పేరుని సంపాదించుకున్న సుందర్ పిచాయ్ ప్రపంచం టెక్ దిగ్గజంగా నిలిచిన సంగతి తెలిసిందే. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్) -
సరిలేరు ‘సుందర్’కెవ్వరు..!
హోదాల బదలాయింపుతో అల్ఫాబెట్ సంస్థాగత స్వరూపంలో గానీ రోజువారీ కార్యకలాపాల్లో గానీ పెద్ద మార్పులేమీ ఉండబోవు. ఎప్పట్లాగే ఇకపైనా గూగుల్‌ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తా. కంప్యూటింగ్ హద్దులు చెరిపేసేందుకు, అందరికీ మరింత ఉపయోగకరంగా ఉండేలా గూగుల్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయి. పెను సవాళ్లను టెక్నాలజీతో పరిష్కరించే దిశగా అల్ఫాబెట్ దీర్ఘకాలిక వ్యూహాల అమలు కూడా కొనసాగుతుంది. – సుందర్ పిచాయ్ వాషింగ్టన్: టెక్నాలజీ ప్రపంచంలో మనోళ్ల హవా కొనసాగుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్ (47)... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ లేఖ రాశారు. అల్ఫాబెట్ ప్రస్తుతం గట్టిగా నిలదొక్కుకుందని, గూగుల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలూ స్వతంత్రంగా రాణిస్తున్నాయని... మేనేజ్మెంట్ వ్యవస్థను సరళీకరించేందుకు ఇదే సరైన తరుణమని వారు పేర్కొన్నారు. ‘కంపెనీని మరింత మెరుగ్గా నడిపించగలిగే మార్గాలున్నప్పుడు.. మేము మేనేజ్మెంట్ హోదాలకు అతుక్కుని ఉండదల్చుకోలేదు. అల్ఫాబెట్, గూగుల్ సంస్థలకిక ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్ అవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందరే సీఈవోగా ఉంటారు. గూగుల్‌కు సారథ్యం వహించడంతో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో అల్ఫాబెట్ పెట్టుబడులన్నింటినీ ఆయనే చూస్తారు‘ అని పేజ్, బ్రిన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ–వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ‘దాదాపు 15 సంవత్సరాలుగా.. అల్ఫాబెట్ ఏర్పాటులోనూ, గూగుల్ సీఈవోగా, అల్ఫాబెట్ డైరెక్టరుగా సుందర్ పిచాయ్ మాతో కలిసి నడిచారు. అల్ఫాబెట్ భవిష్యత్తుపైన, సవాళ్లను టెక్నాలజీ సాయంతో అధిగమించేలా చేయగలిగే సంస్థ సామర్థ్యంపైనా మాకున్నంత నమ్మకం ఆయనకూ ఉంది‘ అని పేజ్, బ్రిన్ తెలిపారు. సెర్చికి పర్యాయపదంగా గూగుల్... ఒకప్పటి దిగ్గజం యాహూను పక్కకు నెట్టేసి.. ఇంటర్నెట్లో సెర్చికి పర్యాయపదంగా మారిన గూగుల్‌ను సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్ 1998లో ఆరంభించారు. పేజ్ తొలి సీఈవో కాగా... తర్వాత 2001 నుంచి 2011 దాకా ఎరిక్ ష్మిట్ ఆ హోదాలో కొనసాగారు. తర్వాత పేజ్ మళ్లీ కొన్నాళ్ల పాటు సీఈవోగా వచ్చారు. 2015లో హోల్డింగ్ కంపెనీగా అల్ఫాబెట్‌ను ఏర్పాటు చేసినప్పట్నుంచీ బ్రిన్, పేజ్.. గూగుల్‌లో కీలక పాత్ర పోషించడాన్ని తగ్గించుకున్నారు. సింపుల్.. సుందర్ ఐఐటీలో చదివేటప్పుడు తనకు ఒక దశలో సీ గ్రేడ్ రావడం.. మళ్లీ మెరుగుపడటానికి తాను కిందా మీదా పడటం లాంటి ఆసక్తికరమైన విషయాలను కొన్నాళ్ల కిందట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా పిచాయ్ చెప్పారు. చిన్నప్పటి సాదా సీదా జీవితాన్ని ఒక పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇప్పటితో పోలిస్తే అప్పట్లో మా జీవితం సింపుల్‌గా, హాయిగా ఉండేది. ఒక మోస్తరు అద్దింట్లో ఉంటూ లివింగ్ రూమ్‌లో హాయిగా కింద పడుకునేవాళ్లం. ఒకసారి తీవ్ర కరువొచ్చింది. అదెంత భయపెట్టిందంటే.. ఇప్పటికీ నేను పడుకునేటప్పుడు మంచం పక్కన మంచినీటి బాటిల్ పెట్టుకుంటాను. మేం ఫ్రిజ్ కొనుక్కోవడం అప్పట్లో మాకో గొప్ప విశేషం‘ అని ఆయన చెప్పుకొచ్చారు. గూగుల్‌లో టీమ్‌ను ముందుండి నడిపించగలిగే సత్తాతో టాప్ మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డారు. మృదు భాషిగా, ఎవర్నీ నొప్పించకుండా సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తిగా సుందర్ గురించి ఆయన సన్ని హితులు చెబుతారు. విభిన్న ఉత్పత్తులపై, టెక్నాలజీపై పరిజ్ఞానంతో పాటు ఈ సామర్థ్యాలే ఆయన్ను గూగుల్‌లో కీలక వ్యక్తిగా నిలిపాయి. మదురై టు సిలికాన్ వ్యాలీ... సుందర్ పిచాయ్ తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరు కాగా తల్లి స్టెనోగ్రాఫర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తూ అక్కడే తన జీవిత భాగస్వామి అంజలిని కలిశారు. తరవాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు. దాంతోనే పలు అల్ఫాబెట్ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగుల నిరసనల్లాంటి వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు.. అల్ఫాబెట్ సీఈవో పీఠానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి. భార్య అంజలితో సుందర్ పిచాయ్ -
సుందర్ పిచాయ్‌కు కీలక బాధ్యతలు
న్యూయార్క్ : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అత్యున్నత బాధ్యతలను చేపట్టారు. గూగుల్ వ్యవస్ధాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ మాతృసంస్థ అల్ఫాబెట్ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 21 సంవత్సరాల కిందట గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను స్ధాపించిన పేజ్, బ్రిన్లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. సుదీర్ఘకాలంగా కంపెనీ రోజువారీ నిర్వహణ కార్యకలాపాల్లో తలమునకలైన తాము ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని, సంస్థకు తమ సలహాలు సూచనలు అందిస్తామని పేజ్, బ్రిన్లు బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. వెబ్ సెర్చింగ్, ఇతర టాస్క్‌లను వేగవంతం చేసేందుకు కృత్రిమ మేథ సాఫ్ట్వేర్ అభివృద్ధిపై జరుగుతున్న కసరత్తును ఇక సుందర్ పిచాయ్ మున్ముందుకు తీసుకువెళ్లనున్నారు. మేనేజ్మెంట్లో ప్రక్షాళన నేపథ్యంలో సవాళ్లను ఎదుర్కొని లాభాలపై దృష్టిసారించేందుకు అల్ఫాబెట్‌కు ఇది మంచి అవకాశమని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. -
గూగుల్‌ను బీట్ చేసిన అమెజాన్
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బీట్ చేసింది. గూగుల్ బీట్ చేసిన ఈ కంపెనీ అమెరికా లిస్టెడ్ కంపెనీల్లో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. అమెజాన్, ఆల్ఫాబెట్ గూగుల్‌ను బీట్ చేయడం ఇదే తొలిసారి. అమెజాన్ షేర్లు 2.69 శాతం పెరగడంతో, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 768 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అయితే ఇదే సమయంలో ఆల్ఫాబెట్ షేర్లు 0.39 శాతం నష్టపోయాయి. దీంతో ఆల్ఫాబెట్ గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 762 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాదిగా అమెజాన్ స్టాక్ 81 శాతం పెరిగింది. తన కంప్యూటింగ్ ఆపరేషన్లను క్లౌడ్‌లోకి మార్చడంతో, ఈ కంపెనీ వేగంగా రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు కూడా మార్కెట్లో ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. కాగ, ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా 889 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఆపిల్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీ షేర్లు 25 శాతం పెరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఆపిల్ స్టాక్ పెరిగితే, ఆపిల్ మార్కెట్ క్యాప్ తొలిసారి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకనుంది. -
గూగుల్ సీఈవో మరో ఘనత
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) మరో ఘనతను సాధించారు. చెన్నైకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు తన ఖాతాలో మరో విశిఫ్టతను చేర్చుకున్నారు. గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు తెలిపింది. అలాగే యూరోపియన్ యూనియన్ విధించిన యాంటీ ట్రస్ట్ ఫైన్ (2.7 బిలియన్ డాలర్లు)లేకపోతే రికార్డ్ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పేర్కొంది. ఆల్ఫాబెట్ ఇంక్. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంస్థ డిజిటల్ యాడ్ రెవెన్యూ 73.75 బిలియన్ డాలర్లుగా నమోదుకానుందని అంచనా. ఫేస్బుక్ 36.29 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని పరిశోధనా సంస్థ ఇమార్కెటర్ తెలిపింది. మొత్తం మార్కెట్లో ఇరు కంపెనీలు 49 శాతం వాటా ఉంటుందని తెలిపింది. కాగా సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు -
మోస్ట్ పాపులర్ సీఈవో ఎవరో తెలుసా?
గూగుల్ తల్లి పుట్టుకకు కృషిచేసిన వారిలో ఒకరైన, దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న లారీ పేజ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన సీఈవోల జాబితా- 2016లో ఆయన మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లారీ పేజ్ తర్వాతి స్థానంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఆన్లైన్ షాపింగ్ రిటైలర్‌గా పేరుగాంచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని పొందారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు నాలుగో స్థానం, ఆయన తర్వాత జేపీ మోర్గాన్ చేస్ సీఈవో, చైర్మన్ జామీ డిమోన్ ఉన్నారు. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఇతర ఉన్నత సీఈవో స్థానంలో ఉన్న ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్, జనరల్ మోటార్స్ చీఫ్ మేరీ బర్రాలు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. -
ఫోర్బ్స్ లిస్టులో 'యాపిల్' హవా
ఓ వైపు యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తిరోగమనంలో ఉండగా.. మరోవైపు పట్టువిడవకుండా యాపిల్ తన స్థానాన్ని బలపర్చుకుంటోంది. యాపిల్ కు మంచి రోజులు పోయాయని చాలామంది మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేసినా.... ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలో యాపిల్ ముందంజలోనే ఉంది. ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన పబ్లిక్ కంపెనీల 2000 జాబితాల్లో యాపిల్ టాప్-10లో నిలిచింది. అన్ని టెక్ దిగ్గజాల కంటే రెవెన్యూలోను(23300కోట్ల డాలర్లు), లాభాలోను(5300కోట్ల డాలర్లు), ఆస్తులోను(23900 కోట్ల డాలర్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్ లోను(58600కోట్ల డాలర్లు) యాపిలే అగ్రస్థానంలో ఉందని ఫోర్బ్స్ జాబితాలో తేలింది. ఫోర్బ్స్ లిస్టు లో అత్యధిక కంపెనీల జాబితాతో మొదటిస్థానాన్ని దక్కించుకున్న అమెరికా దేశంలో, యాపిల్ నాలుగో స్థానంలో ఉంది. రెవెన్యూ, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ప్రకారం ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదలచేసింది. 63 దేశాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలు 25లో 14 అమెరికాకు చెందినవేనని ఫోర్బ్స్ ప్రకటించింది. టాప్-10లో ఉన్న అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఏడు కూడా అమెరికా కంపెనీలు యాపిల్, మైక్రోసాప్ట్, ఆల్పాబెట్, ఇంటెల్, ఐబీఎమ్, సిస్కో సిస్టమ్స్, ఒరాకిల్ లే ఉన్నాయని ఫోర్బ్స్ తెలిపింది. అయితే స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ముందంజలో ఉన్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్ సంగ్ యాపిల్ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. -
నిమిషానికి రూ 3,36,420 లాభం
న్యూయార్క్: ఒకప్పుడు చమురు కంపెనీలు సంపాదించిన లాభాల కన్నా ఇప్పుడు ఐటి దిగ్గజాలు ఎక్కువగా సంపాదిస్తున్నాయి. ఆపిల్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్...నాలుగు సంస్థలు కలసి క్షణానికి 1,26,000 రూపాయలను, నిమిషానికి 88,20,000 రూపాయలను ఆర్జిస్తున్నాయి. లాభాల్లో వీటిలో అన్నింటికన్నా ముందున్నది ఆపిల్ సంస్థ. గతేడాదిలో ఈ సంస్థ 3,36,420 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం వల్లనే సంస్థకు ఎక్కువ లాభాలు వచ్చాయి. గతేడాది చివరి త్రైమాసికంలో ఆపిల్ సంస్థకు 10,85,400 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అదే మైక్రోసాఫ్ట్‌కు గతేడాది డెసెంబర్ 31వ తేదీ నాటికి 31,000 కోట్ల రూపాయల లాభాలను గడించింది. ఫేస్బుక్ గతేడాదిలో 6,300 కోట్ల రూపాయల లాభాలను సంపాదించింది. అల్ఫాబెట్, ఆపిల్ మార్కెట్‌ను అధిగమించి ముందుకు దూసుకెళుతోంది. ఈ వారంలో దాని రెవెన్యూ 547.1 బిలియన్ డాలర్లకు చేరుకొంది. ఏడాది మొత్తంగా లాభాల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పెన్నీ స్టాక్స్ ల్యాబ్ ఓ చార్ట్‌ను రూపొందించింది. టెక్నాలజీ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తూ ముందుకు దూసుకెళ్లడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగిపోవడం సమాజంలో అసహన పరిస్థితులకు దారితీయవచ్చని వారు భావిస్తున్నారు.