ఫోర్బ్స్ లిస్టులో 'యాపిల్' హవా
ఓ వైపు యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తిరోగమనంలో ఉండగా.. మరోవైపు పట్టువిడవకుండా యాపిల్ తన స్థానాన్ని బలపర్చుకుంటోంది. యాపిల్ కు మంచి రోజులు పోయాయని చాలామంది మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేసినా.... ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలో యాపిల్ ముందంజలోనే ఉంది. ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన పబ్లిక్ కంపెనీల 2000 జాబితాల్లో యాపిల్ టాప్-10లో నిలిచింది. అన్ని టెక్ దిగ్గజాల కంటే రెవెన్యూలోను(23300కోట్ల డాలర్లు), లాభాలోను(5300కోట్ల డాలర్లు), ఆస్తులోను(23900 కోట్ల డాలర్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్ లోను(58600కోట్ల డాలర్లు) యాపిలే అగ్రస్థానంలో ఉందని ఫోర్బ్స్ జాబితాలో తేలింది.
ఫోర్బ్స్ లిస్టు లో అత్యధిక కంపెనీల జాబితాతో మొదటిస్థానాన్ని దక్కించుకున్న అమెరికా దేశంలో, యాపిల్ నాలుగో స్థానంలో ఉంది. రెవెన్యూ, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ప్రకారం ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదలచేసింది. 63 దేశాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలు 25లో 14 అమెరికాకు చెందినవేనని ఫోర్బ్స్ ప్రకటించింది. టాప్-10లో ఉన్న అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఏడు కూడా అమెరికా కంపెనీలు యాపిల్, మైక్రోసాప్ట్, ఆల్పాబెట్, ఇంటెల్, ఐబీఎమ్, సిస్కో సిస్టమ్స్, ఒరాకిల్ లే ఉన్నాయని ఫోర్బ్స్ తెలిపింది. అయితే స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ముందంజలో ఉన్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్ సంగ్ యాపిల్ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.