
ఒకే రోజు ఏకంగా 60,000 మందికి కరోనా సోకడంతో రోగుల సంఖ్య 30 లక్షలకు చేరినప్పటికీ బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలోనే సాగాయి. ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలవడంతో నాస్‌డాక్ 149 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 10,492 వద్ద ముగిసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది.ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 25 పాయింట్లు(0.8 శాతం) బలపడి 3170 వద్ద నిలవగా.. డోజోన్స్ 177 పాయింట్లు(0.7 శాతం) బలపడి 26,067 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌కు ప్రధానంగా టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ దన్నునిచ్చాయి. ఈకామర్స్‌లో వాల్‌మార్ట్ పోటీకి తెరతీసినప్పటికీ అమెజాన్ మరోసారి సరికొత్త గరిష్టాన్ని తాకగా.. ఎస్‌అండ్‌పీ మార్చి కనిష్టం నుంచి 40 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
షేర్ల తీరిలా
ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 0.5 శాతం పుంజుకుని 383 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. అమెజాన్ 0.5 శాతం బలపడి 3095 డాలర్లను తాకింది. ఇక మైక్రోసాఫ్ట్ 0.3 శాతం లాభంతో 213 డాలర్ల వద్ద, అల్ఫాబెట్ 1500 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్జెమీర్స్(మతిమరుపు వ్యాధి)కి ప్రయోగాత్మక చికిత్సను అందించేందుకు దరఖాస్తు చేసిన వార్తలతో ఫార్మా కంపెనీ బయోజెన్ ఇంక్ 4.4 శాతం జంప్‌చేసింది. నేషనల్ జనరల్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో బీమా సంస్థ ఆల్‌స్టేట్ కార్ప్ 5 శాతం పతనమైంది. నేషనల్ జనరల్ మాత్రం 66 శాతం దూసుకెళ్లింది. క్రూయిజర్, ఎయిర్‌లైన్స్ కౌంటర్లు నీరసిస్తున్నప్పటికీ ఫాంగ్ స్టాక్స్ అండగా నిలవడంతో మార్కెట్లు బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.