Johns Hopkins
-
COVID-19: కరోనాను అడ్డుకునే స్ప్రే
వాషింగ్టన్: కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. సన్నగా, పోగుల మాదిరిగా ఉండే వీటిని సుప్రా మాలిక్యులార్ ఫిలమెంట్స్‌గా (ఎస్ఎంఎఫ్) పిలుస్తున్నారు. వీటిని ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా కరోనాతో పాటు సార్స్ తదితర వైరస్‌లను కూడా సమర్థంగా అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘కరోనా శ్వాస ద్వారానే సోకుతుందన్నది తెలిసిందే. ఎస్ఎంఎఫ్ స్పాంజ్ మాదిరిగా కరోనా వంటి వైరస్‌లను పీల్చుకుంటుంది. తద్వారా అవి ఊపిరితిత్తుల్లోని కణాలతో కలిసిపోయి వ్యాధి కారకాలుగా మారకుండా చూస్తుంది’’ అని వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హాంగాంగ్ కుయ్ వివరించారు. వీటిని ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారట. కరోనా వైరస్ సాధారణంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఉండే ఏస్2గా పిలిచే రిసెప్టర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. తద్వారా కణంలోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎఫ్‌ల్లో ఫిలమెంట్లలోనూ ఇలాంటి సూడో రిసెప్టర్లుంటాయి. కరోనా వైరస్ లోనికి తమవైపు ఆకర్షించి అక్కడే నిలువరిస్తాయి. కరోనా తాలూకు అన్ని వేరియంట్లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. -
యూఎస్‌లో కోవిడ్ దడ! దాదాపు 9 లక్షలకు చేరుకున్న కోవిడ్ మరణాల సంఖ్య!!
న్యూయార్క్: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం కోవిడ్-19 మరణాల సంఖ్య దాదాపు 9 లక్షలకు పైనే చేరుకుందని పేర్కొంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇన్ఫ్క్షన్లు, ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరింగిందని తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం ఈ కరోనా కొత్త వేరియంట్ కారణంగా యూఎస్‌లో మరణాల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అత్యధికం అని వెల్లడించింది. అంతేకాదు ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్ బయోఎన్‌టెక్ రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్లు ఫ్రిబ్రవరి నాటికి అందుబాటులో ఉంటాయని తెలపింది. (చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!) -
ప్రపంచంలో కోవిడ్ మరణాలు 40 లక్షలు
వాషింగ్టన్: భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియెంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 మరణాలు 40 లక్షలు దాటడం ఆందోళన పెంచుతోంది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షలు దాటింది. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. 1982 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మరణించిన వారితో ఈ మృతుల సంఖ్య సరిసమానమని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ యూనివర్సిటీ అంచనా వేసింది. జనవరి నెలలో రోజుకి ప్రపంచ దేశాల్లో 18 వేలుగా ఉన్న కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరమైన తర్వాత 7,900కి తగ్గింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఉధృతంగా జరిగి కరోనా నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో డెల్టా వేరియెంట్ మళ్లీ ఆయా దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనే కోవిడ్–19 మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రతీ ఏడుగురు కరోనా రోగుల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్థానం బ్రెజిల్‌ది. ఆ దేశంలో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఆ దేశం మరణాల సంఖ్యని దాస్తోందన్న ఆరోపణలైతే ఉన్నాయి. కరోనాతో 40 లక్షల మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ లెక్కల్లోకి రాని వి మరిన్ని ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ అన్నారు. వ్యాక్సినేషన్ పెరిగితే మరణాల సంఖ్యని అరికట్టవచ్చునని చెప్పారు. వివిధ దేశాలు లాక్డౌన్ ఎత్తేస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నిరుపేద దేశాలకు అండగా ధనిక దేశాలు నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?
సింగపూర్: విస్తీర్ణ పరంగా చూస్తే భారత్ రాజధాని ఢిల్లీ అంత కూడా లేని చిన్న దేశం సింగపూర్. 55 ఏళ్ల క్రితం ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చాలామంది ప్రజలు మురికివాడల్లోనే జీవించేవారు. అలాంటిది పూరి గుడిసెల నుంచి ధగధగలాడే ఆకాశ మేడల దేశంగా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే శక్తిమంతమైన, సంపన్న దేశంగా సింగపూర్ ఎదగడానికి అక్కడి పౌరులు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రవాణా, భద్రత, ఉత్పాదకత, ఆరోగ్యం లాంటి అనేక అంశాల్లో సింగపూర్ ముందు వరసలో ఉంది. అక్కడి నేతలు, అధికారులు అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి చాలా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది. సింగపూర్‌లో సగటు ఆదాయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది విదేశీ ధనవంతులు అక్కడ స్థిరనివాసాలు ఏర్పరుచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారితో వచ్చిన మార్పు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం...చైనా, ఇండోనేషియా ,మలేషియా నుంచి చాలా మంది ధనవంతులు షాపింగ్ చేయడానికి, క్యాసినోలో బాకరట్ ఆడటానికి లేదా ప్రపంచ స్థాయి క్లినిక్‌లలో వైద్య పరీక్షలు పొందటానికి సింగపూర్ వస్తుంటారు. కరోనా మహమ్మారి అన్నింటినీ మార్చింది. ఎంతో మంది వ్యాపారవేత్తలు తమ కుటుంబంతో సహా వచ్చి నెలల తరబడి సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో తుపాను నుంచి బయటపడటానికి వసతిని కోరుతున్నారు. అంతే కాకుండా తలసరి ప్రాతిపదికన మలేషియా, ఇండోనేషియాలో మరణాల రేటు సింగపూర్ కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సింగపూర్ కఠినమైన ఆంక్షలను అవలంబిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో 30శాతం మందికి వ్యాక్సిన్లను అందించారు. ఇది చైనా, మలేషయా, ఇండేనేషియా దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ. (చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’) -
అమెరికాలో రికార్డుస్థాయి మరణాలు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,936 మంది కరోనా బాధితులు కన్నుమూశారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కరోనా సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 2,54,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో ఇప్పటివరకు మొత్తం మరణాలు 3,66,662కు, పాజిటివ్ కేసులు 2.16కోట్లకుపైగా చేరుకున్నాయి. ప్రస్తుతం 1,31,000 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో నవంబర్ నెలాఖరు తర్వాత కోవిడ్–10 ఉధృతి భారీగా పెరిగింది. వరుసగా సెలవులు రావడం, జనం పెద్ద యెత్తున గుంపులుగా చేరుతుండడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీలో 31 దాకా లాక్డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా జర్మనీలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించేందుకు చాన్స్‌లర్ యాంజెలా మెర్కెల్ అంగీకరించారు. అలాగే జన సంచారంపై మరికొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు ఆమె తెలిపారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. జర్మనీలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటివరకు 37,744 కరోనా మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో 8.3 కోట్ల జనాభా ఉండగా, సోమవారం నాటికి 2.65 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో గత ఏడాది నవంబర్ 2 నుంచి పాక్షిక లాక్డౌన్, డిసెంబర్ 16 నుంచి కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరి 10న లాక్డౌన్ ముగించాల్సి ఉండగా పొడిగించారు. బ్రిటన్‌లో 62 వేల కేసులు లండన్: గత ఏప్రిల్ తర్వాత తొలిసారి బుధవారం బ్రిటన్‌లో కోవిడ్ కారక రోజూవారీ మరణాల సంఖ్య 1000దాటింది. బుధవారం కరోనాతో 1041 మరణాలు సంభవించాయని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇలా రోజూ వేయి దాటడం పదోసారి. బుధవారం 62322 కేసులు నమోదయినట్లు గణాంకాలు తెలిపాయి. ఒకపక్క దేశవ్యాప్త లాక్డౌన్ విధించి, మరోపక్క వ్యాక్సినేషన్ ఆరంభించినా కరోనా కలకలం ఆగకపోవడం ఆందోళన సృష్టిస్తోంది. అయితే యూరప్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌లో ఎక్కువమందికి టీకా అందిందని ప్రధాని జాన్సన్ చెప్పారు. ప్రతిపక్షాలు లాక్డౌన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తప్పవని జాన్సన్ చెప్పారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేస్తామన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగితే లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యమవుతుందన్నారు. -
వైద్య సేవల్లో జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ భాగస్వామ్యం
సాక్షి, అమరావతి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో భాగస్వామ్యం వహించేందుకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ముందుకు వచి్చందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సుమారు రూ.2 లక్షల కోట్లు వెచ్చించి రానున్న మూడేళ్లలో ప్రాథమిక వైద్య కేంద్రాలు సహా ఏపీలోని అన్ని ఆస్పత్రులను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జాన్స్ హాప్కిన్స్ ప్రతినిధులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటితో సమావేశమయ్యారు. విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటులో ముందడుగు దిశగా ఈ యూనివర్శిటీ ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తోన్న ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆ సేవల్లో తామూ భాగస్వామ్యమవుతామని యూనివర్శిటీ ప్రత్యేక ఆసక్తి కనబరచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, జాన్స్ హాప్కిన్స్ వర్శిటీకి చెందిన అంతర్జాతీయ ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
పారిస్‌లో 700 కి.మీ. ట్రాఫిక్ జామ్
పారిస్: గత కొంతకాలంగా యూరప్‌లో కోవిడ్ విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్‌లో రెండోసారి లాక్డౌన్ ప్రకటించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గురువారం నుంచే లక్షలాది మంది జనం సొంతూళ్ళకు పయనమయ్యారు. దీంతో గురువారం రాత్రి నుంచి పారిస్ చుట్టూ 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఏడు నెలల కాలంలో రెండోసారి లాక్‌డౌన్‌కి డిక్రీ జారీచేయగా దీన్ని పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. కోవిడ్ ఆంక్షలు డిసెంబర్ 1 వరకు అమలులో ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి, ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. ఫ్రాన్స్‌కి చెందిన 6.7 కోట్ల మంది ప్రజలు పూర్తిగా ఇళ్ళకే పరిమితం కావాలనీ, ఒకరిళ్ళకు ఒకరు వెళ్ళకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిత్యావసర సరుకుల కోసం, మందుల కోసం, వ్యాయామం కోసం ఒక గంట మాత్రమే బయటకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆహారం ఇతర సరుకుల కోసం జనమంతా సూపర్మార్కెట్లకు ఎగబడ్డారు. లక్షలాది మంది సొంతూళ్ళకు పయనమయ్యారు. జనమంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయాయి. -
రిమోట్ వర్క్‌పై తర్వలోనే ఎంవోయూలు
సాక్షి, అమరావతి: పారిశ్రామిక పరివర్తన దిశగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దడానికి ఐఎస్బీ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని క్యాంప్ కార్యలయం నుంచి గురువారం గౌతమ్ రెడ్డి ఐఎస్బీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. 'రిమోట్ వర్క్'పై త్వరలో ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా ఫార్మా సహా పలు రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్ కిన్స్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని తెలిపారు. (చదవండి: ఏపీలో ‘లంబోర్గిని’) -
24 గంటల్లో 2.6 లక్షల మందికి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే 2,60,000 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని పేర్కొంది. ఈ కేసుల్లో అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా దేశాల నుంచేనని తెలిపింది. అదేవిధంగా, మే 10వ తేదీ తర్వాత ఒక్క రోజులోనే అత్యధికంగా 7,360 మంది కోవిడ్‌తో చనిపోయారని పేర్కొంది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 1.45 కోట్లు కాగా, మరణాలు 6.06 లక్షలని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. -
బ్రెజిల్ బేజార్
కరోనాతో కొంపలేం మునిగిపోవని అనుకున్నారు అదో ఫ్లూ లాంటి జ్వరమేనని ప్రకటనలూ జారీ చేశారు లాక్డౌన్, భౌతికదూరం అవసరమే లేదన్నారు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా వైరస్ తీవ్రతను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. కోవిడ్ కేసులు 10 లక్షలు దాటిపోతే, మృతులు 50 వేలకు చేరువలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత కరోనా కోరల్లో చిక్కుకొని బ్రెజిల్ విలవిలలాడుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనోరా ఏకపక్ష ధోరణితో వైరస్‌ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన సావో పాలో గవర్నర్ జాయ్ డోరియా ‘దేశాన్ని పట్టిపీడిస్తున్నది కరోనా వైరస్ కాదు. బోల్సనోరా వైరస్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లాక్డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బోల్సనోరా కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అమలు చేసినా వారు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ వైరస్ తీవ్రతని తగ్గించి చూపించే ప్రయత్నాలు చేశారు. జూన్ మొదటి వారం నుంచి ప్రతీరోజూ సగటున రోజుకి 30వేల కొత్త కేసులతో మొత్తం కేసులు 10 లక్షలు దాటేశాయి. మృతుల సంఖ్య 50వేలకు చేరువలో ఉంది. అయినప్పటికీ అధ్యక్షుడు బోల్సనోరా వైరస్ కంటే లాక్డౌన్ అనేదే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం ఇకనైనా బ్రెజిల్ ప్రభుత్వం పకడ్బందీగా కోవిడ్ కట్టడి చర్యలు చేపట్టకపోతే దేశ ప్రజలు అసహనంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. వైరస్ వ్యాప్తికి కారణాలివీ ► బ్రెజిల్లో ప్రతీ ఏటా ఫిబ్రవరిలో జరిగే కార్నివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం. అప్పటికే దేశంలో కరోనా జాడలున్నప్పటికీ ఉత్స వాల్ని ఘనంగా జరుపుకున్నారు. భారీగా ప్రజలు గుమికూడి సంబరాలు చేసుకున్నారు. కార్నివాల్ జరిగిన మర్నాడే ఫిబ్రవరి 26న దేశంలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగు వారాల్లోనే కేసుల సంఖ్య లక్షకి చేరుకుంది. ► కరోనా సంక్షోభ పరిస్థితిని తట్టుకునే వైద్య సదుపాయాలు దేశంలో లేవు. ఐసీయూలు, ఆక్సిజన్ సిలండర్లకు తీవ్ర కొరత నెలకొని ఉంది. కొన్నేళ్లుగా ఆరోగ్యరంగానికి కేటాయింపులు సరిగా జరగడం లేదు. దేశంలో ఏకంగా 40 వేల మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. ఆరోగ్య రంగంలో మరో లక్ష మందికి కరోనా సోకుతుందనే అంచనాలున్నాయి. వీటన్నింటితో ప్రభుత్వ ఆస్పత్రులే పడకేశాయి. బోల్సనోరా ధోరణితో విసిగిపోయి మూడు నెలల్లోనే ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేశారు. ► దేశంలో కోవిడ్ పరీక్షలు సరిగా జరగడం లేదు. కరోనా కట్టడికి అన్ని దేశాలు అనుసరిస్తున్న ప్రధాన సూత్రం ‘ట్రేస్, టెస్ట్, ట్రీట్’ను బ్రెజిల్ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీ లక్ష మందికి సగటున రోజుకు కేవలం 14 పరీక్షలు జరుగుతున్నాయి. ► దేశంలో నెలకొన్న భారీ ఆర్థిక అసమానతలు కరోనా కేసులను పెంచేస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా కరోనా విస్తరించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొనే స్థోమత కలిగిన వారు దేశ జనాభాలో 20 శాతం మాత్రమే ఉన్నారు. వారు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గణాంకాలన్నీ తప్పుడు తడకలు! బ్రెజిల్ కరోనా గణాంకాలన్నీ దాస్తోందన్న అనుమానాలున్నాయి. కోవిడ్ కేసుల్ని ట్రాక్ చేసే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధికారిక లెక్కల కంటే కేసులు 7 రెట్లు ఎక్కువగా నమోదై ఉండవచ్చునని చెబుతోంది. దీంతో జూన్ తొలివారంలో బ్రెజిల్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు అధికారిక గణాంకాలను విడుదల చేయడం మానేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఇవ్వడం ప్రారంభించింది. -
‘క్యాల్షియం’తో తస్మాత్ జాగ్రత్త
శరీరంలోని క్యాల్షియం లోటును భర్తీ చేసేందుకు చాలామంది క్యాల్షియం మాత్రలు వాడుతుంటారు. అయితే ఇలా ట్యాబ్లెట్లల రూపంలో క్యాల్షియంను ఎక్కువగా తీసుకుంటే గుండె రక్తనాళాల్లో ప్లేక్ పేరుకుపోయే ప్రమాదం ఎక్కువవుతుందని, తద్వారా గుండె దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని జాన్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 2,700 మంది పదేళ్ల వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం వారు ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు. ఎముకలు బలహీనపడడాన్ని నివారిస్తుందన్న అపోహతో చాలామంది వైద్యుల సలహా లేకుండానే క్యాల్షియం ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారని, కానీ దీనివల్ల గుండెకు చేటన్నది చాలా మందికి తెలియదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న ఎర్నిన్ మిచోస్ అంటున్నారు. శరీరంలో అవసరానికి మించి ఉండే క్యాల్షియం మృదు కణజాలంలో పేరుకుపోతుందని ఇప్పటికే తెలిసిన విషయమే కానీ దీంతోపాటు గుండె రక్తనాళాల్లో ఎక్కువగా ప్లేక్ పేరుకుపోతున్నట్లుగా కూడా గుర్తించామని ఎర్నిన్ వివరిస్తున్నారు.