వాషింగ్టన్: కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. సన్నగా, పోగుల మాదిరిగా ఉండే వీటిని సుప్రా మాలిక్యులార్ ఫిలమెంట్స్‌గా (ఎస్‌ఎంఎఫ్) పిలుస్తున్నారు. వీటిని ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా కరోనాతో పాటు సార్స్ తదితర వైరస్‌లను కూడా సమర్థంగా అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘కరోనా శ్వాస ద్వారానే సోకుతుందన్నది తెలిసిందే. ఎస్‌ఎంఎఫ్ స్పాంజ్ మాదిరిగా కరోనా వంటి వైరస్‌లను పీల్చుకుంటుంది.
తద్వారా అవి ఊపిరితిత్తుల్లోని కణాలతో కలిసిపోయి వ్యాధి కారకాలుగా మారకుండా చూస్తుంది’’ అని వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హాంగాంగ్ కుయ్ వివరించారు. వీటిని ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారట. కరోనా వైరస్ సాధారణంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఉండే ఏస్2గా పిలిచే రిసెప్టర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. తద్వారా కణంలోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎఫ్‌ల్లో ఫిలమెంట్లలోనూ ఇలాంటి సూడో రిసెప్టర్లుంటాయి. కరోనా వైరస్ లోనికి తమవైపు ఆకర్షించి అక్కడే నిలువరిస్తాయి. కరోనా తాలూకు అన్ని వేరియంట్లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment