వాషింగ్టన్: భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియెంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 మరణాలు 40 లక్షలు దాటడం ఆందోళన పెంచుతోంది. అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షలు దాటింది. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. 1982 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మరణించిన వారితో ఈ మృతుల సంఖ్య సరిసమానమని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ యూనివర్సిటీ అంచనా వేసింది. జనవరి నెలలో రోజుకి ప్రపంచ దేశాల్లో 18 వేలుగా ఉన్న కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరమైన తర్వాత 7,900కి తగ్గింది.
అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఉధృతంగా జరిగి కరోనా నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో డెల్టా వేరియెంట్ మళ్లీ ఆయా దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనే కోవిడ్–19 మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రతీ ఏడుగురు కరోనా రోగుల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్థానం బ్రెజిల్‌ది. ఆ దేశంలో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఆ దేశం మరణాల సంఖ్యని దాస్తోందన్న ఆరోపణలైతే ఉన్నాయి. కరోనాతో 40 లక్షల మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ లెక్కల్లోకి రాని వి మరిన్ని ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ అన్నారు. వ్యాక్సినేషన్ పెరిగితే మరణాల సంఖ్యని అరికట్టవచ్చునని చెప్పారు. వివిధ దేశాలు లాక్‌డౌన్ ఎత్తేస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నిరుపేద దేశాలకు అండగా ధనిక దేశాలు నిలవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment